koodali

Wednesday, May 30, 2018

నిజంగా జరిగిన విషయాలే. ....


ఊరు వెళ్ళి ఈ మధ్యే వచ్చాము.
.................................

ఈ రోజుల్లో పిల్లలకు ఎన్నో వత్తిడులు ఉన్నాయి.  కాలేజీలలో, హాస్టల్స్లో ర్యాగింగులు, చదువుల వత్తిడి, మరెన్నో సమస్యలు   తట్టుకోలేని కొందరు పిల్లలు డిప్రెషన్ కు గురవుతున్నారు. 


 కొందరు పిల్లలు తమకు డిప్రెషన్ గా అనిపించినా ఆ సమస్యలు చెప్పుకుంటే పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదని, అందువల్ల తమ బాధలను తల్లితండ్రితో చెప్పడం మానేసామని అనడం జరిగింది.


ఇలాంటి పరిస్థితి తట్టుకోలేని కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


ఈ రోజుల్లో చాలామంది  పెద్దవాళ్ళు   పిల్లల్ని చదువుపేరుతో ఎన్నోగంటలు శ్రమపెడుతున్నారు.

అదేమిటంటే, ఈ రోజుల్లో అలా కష్టపడక తప్పదని సమర్ధించుకుంటున్నారు.


పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగినప్పుడు  కొంతకాలం చానల్స్లో చర్చలు జరగటం, నిట్టూర్చటం తప్ప  విధానాలలో మార్పులు  జరగటం లేదు.  ఇదంతా చాలా దారుణం.

పెద్దవాళ్లు  పిల్లల సమస్యలను, వారి అభిప్రాయాలనూ అర్ధం చేసుకోవాలి. అంతేకానీ,  మేము చెప్పినట్లే పిల్లలు వినితీరాలని అనుకోవటం సరైనది కాదు. 


పెద్దరికం పేరుతో పెద్దవాళ్ళు తమ అభిప్రాయాలను పిల్లల నెత్తిన రుద్దటం మనదేశంలో కొంచెం ఎక్కువే.

 ఈ రోజుల్లో చాలామంది పెద్దవాళ్ళకు పిల్లల్ని కనటమే కానీ,  పిల్లలను పెంచడానికి , వారి కష్టసుఖాలను పంచుకోవటానికి సమయం  ఉండటం లేదంటున్నారు.


 నాకు తెలిసి  ఉన్నత చదువులు చదువుతున్న కొందరు పిల్లలు మద్యం త్రాగటం ఈ మధ్యే జరిగిన సంఘటన. అలా మద్యం తీసుకున్న వారిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు.

 పోటీ చదువులు చదవలేక, తమ బాధలు వినేవారు లేక  డిప్రెషన్ తో జీవితం అంటే విరక్తిగా ఉందని చెప్పిన పిల్లల గురించి పైన నేను వ్రాసిన విషయాలు  కల్పితం కాదు, నిజంగా జరిగిన విషయాలే.

ఇలాంటి పరిస్థితిలో సమాజం ఎటుపోతుందో?




Monday, May 14, 2018

రెండు సినిమాలు.....



రోజుల్లో సమాజంలోని కొన్ని పోకడలను పాశ్చాత్య సంస్కృతి .. అని కొందరు అంటారు కానీ,  పాశ్చాత్యులకు కూడా  కుటుంబవిలువలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. 



రోజుల్లో సమాజంలోని  కొన్ని పోకడలను  పాశ్చాత్య సంస్కృతి  అనడం కన్నా ..  ఆధునిక సంస్కృతి,   ఆధునిక పోకడ అనటం  సరైనది.


పాతకాలం మరియు ఆధునిక కాలానికి సంబంధించిన  కధలతో కూడిన  రెండు సినిమాల  గురించి ఇక్కడ ఇస్తున్నాను


Pride & Prejudice (2005 film) - Wikipedia



The Intern (2015 film) – Wikipedia





Friday, May 11, 2018

ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..


ఈ విషయాలను 1999 నాటి ఆంధ్రభూమి పత్రికలో చదివి, ఈ విషయాన్ని మరింతమందికి తెలిపితే బాగుంటుందనిపించి పోస్ట్ చేసాను. 

ఒకరు అడిగిన సందేహానికి .. కె.ఎస్.ఎన్. శమంతకమణి అనేవారు  ఈ  విధంగా రిప్లై ఇవ్వటం జరిగింది.



సందేహం.. దేవతల్లో చాలామందికి ఇద్దరు భార్యలున్నారు ఎందుకు?


సమాధానం .. దేవత అనేది ప్రతీకాత్మకమైన ఒక తేజస్సు. నిర్దేశించబడినట్టి కొన్ని శక్తులకు సంకేతమే దేవత.



ఆయా దేవతలు వారి భార్యలు , అలంకారాలు, ఆయుధాలు అన్నీ కూడా ప్రతీకలే ( సింబాలిక్ అన్నమాట.) 



ఉదాహరణకు -స్థితికారకుడై సర్వసృష్టి పాలన పోషణలను నిర్వహించే విష్ణుమూర్తి భార్యలు  శ్రీదేవి, భూదేవి  .  సర్వసంపత్సమృద్ధియే లక్ష్మీ దేవి.   భూదేవి అనగా  భూమి, భూసంబంధమైన సర్వ భూ, జల, వనాది సహజ సంపదా,   లక్ష్మీదేవి- అనగా సర్వ ఐశ్వర్యమూ , సర్వ వస్తు, ధనసంపదా-   విష్ణువు అధీనంలో ఉన్నాయనే విషయానికి  సంకేతమే -   లక్ష్మీదేవి, భూదేవి  విష్ణుమూర్తి భార్యలని చెప్పడంలో అంతరార్ధం.



ఆ విధంగానే  విఘ్నేశ్వరుని భార్యలు సిద్ధి, బుద్ధి. ఆ వినాయకుని పుత్రులు క్షేముడు, లాభుడు. అనగా విఘ్ననాయకుడైన గణపతి విఘ్నాలను అదుపు చేసేవాడనీ, బుద్ధి కుశలతనూ , ధనసిద్ధి, విద్యాసిద్ధి, కార్యసిద్ధి ఇటువంటి సర్వసిద్ధులనూ, క్షేమలాభాలనూ కలిగించే దైవం అని సాంకేతికంగా తెలియజేయటమే.



దైవాలకు సంబంధించిన అంశాలను ఇదే విధంగా  అర్ధం చేసుకోవాలి.


............

  ఇలాంటి సందేహాలు చాలామందికి కలుగుతాయి.


 సందేహం అడిగిన వారికి, చక్కటి సమాధానం ఇచ్చిన కె.ఎస్.ఎన్. శమంతకమణి గారికి  మరియు అందించిన  పత్రిక వారికి  ధన్యవాదాలు.

 

Monday, May 7, 2018

ఓం..కొన్ని సందేహాలు..



శ్రీ శనీశ్వరునికి సమర్పించే నూనె విషయంలో కొన్ని సందేహాలు కలిగాయి. 



నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలలో శనిదేవునికి సంబందించినవి నువ్వులు . నాకు తెలిసినంతవరకూ శనిదేవునికి నువ్వులనూనెతో అభిషేకం చేస్తారు. 



  అయితే, శనీశ్వరుని దివ్యచరిత్ర అనే సీరియల్లో,  ఒక సందర్భంలో శ్రీ ఆంజనేయుల వారు ..   శ్రీ శనీశ్వరుని   కొరకు  ఆవాలనూనెను ఉపయోగించినట్లు చూపించారు. 



 ఈ సీరియల్  హిందీ  లో    కలర్స్ చానల్ ద్వారా ప్రసారం అయింది.  



నెట్ లో కొందరు,  శనిదేవునికి ఆవాలనూనెతో అయినా నువ్వులనూనెతో అయినా అభిషేకం చేయవచ్చని వ్రాసారు. 




Tuesday, May 1, 2018

జీవితంలో చివరికి ఏం మిగులుతోంది ?



మే డే గురించి చాలామందికి తెలుసు. కొన్ని సంవత్సరాల క్రిందట, శ్రమదోపిడి, సరైన విరామం లేని వరుస పనిగంటలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి కొన్ని హక్కులను సాధించుకున్నారు. 


అయితే, యంత్రాల వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో కూడా శ్రమదోపిడి, సరైన విరామం లేని వరుస పనిగంటల విధానాలు చాలా చోట్ల ఉంటూనే ఉన్నాయి.  

............................................

ఈ రోజుల్లో కూడా  చాలామందికి  పనిచేసే సమయం , ని వత్తిడి బాగా పెరిగింది . 


పిల్లలు చిన్నతనం నుంచి విపరీతంగా చదవవలసి వస్తోంది. ఉద్యోగం చేస్తున్నవారు విపరీతంగా పనిచేయవలసి వస్తోంది. 



ఐటీలో పనిచేసే ఉద్యోగస్తులు కొన్నిసార్లు  రాత్రి కూడా పనిచేయవలసి వస్తుంది. రాత్రి డ్యూటీకి వెళ్తే ఉదయం  ఇంటికి వచ్చి ఏదో  కొంత  తిని నిద్రపోవలసివస్తుంది. పగలంతా పడుకుని,  సాయంత్రం నిద్రలేచి మళ్లీ రాత్రి డ్యూటీకి  వెళ్ళాలి. 



 వీళ్ళు  కొన్నిసార్లు  ఒకటిన్నర రోజు వరసగా పనిచేయవలసి వస్తుంది. 


 వైద్య విద్యార్ధులలో పీజీ చేసే వాళ్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.


 నర్సులకు  కూడా వరసగా నెలరోజులు నైట్ డ్యూటీ ఉండే  పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ? కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు?


 పిల్లలను ఇంట్లోనో,  పొరుగింట్లోనో   వదిలి  తల్లులు రాత్రి డ్యూటీకి వచ్చేయాల్సి ఉంటుంది. ఇక, రాత్రంతా డ్యూటీ చేసి ఉదయం  ఇంటికి వెళ్ళి  పిల్లల బాగోగులు సరిగ్గా చూసుకోగలరా?


వైద్యవృత్తిలోకి  రావటానికి చాలామంది ఉత్సాహపడుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి బోలెడు డబ్బు ఖర్చు  చేసి కూడా చదువుకుంటున్నారు. అలాంటప్పుడు దేశంలోని  వైద్యకళాశాలల్లో సీట్లు పెంచవచ్చు కదా!


వైద్యులు, నర్సులు ఎక్కువసంఖ్యలో ఉంటే , ఉన్నవాళ్ళకు పనిభారం తగ్గుతుంది. వైద్యకళాశాలల్లో ఫీజులు కొంత పెంచినా కూడా ఫరవాలేదు.


ఇక , పారిశుధ్య కార్మికులు,  మేము ఆ మధ్య ఊరు వెళ్లి వస్తుంటే రాత్రి సమయంలో కొందరు మహిళా పారిశుధ్య ఉద్యోగులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు.  
 

 ( సైనికులు, పోలీసులు..వీళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు. అయితే, సైనికులు, పోలీసులు..వీళ్ళ పరిస్థితి  పాతకాలంలో కూడా కష్టమే. 


అయితే, ఆధునిక కాలంలో  సైనికుల సంఖ్యను  తగ్గించి, వారి స్థానంలో  రోబోట్లను నియమించే పరిస్థితి భవిష్యత్తులో వస్తుందని కొందరు అంటున్నారు.   )


 మైనింగ్, రవాణా రంగం..వంటి ఎన్నో రంగాలలో కూడా  ఎంతో పని ఉంటుంది. 


ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికన్నా పాతరోజులే నయమనిపిస్తోంది. అప్పట్లో జనాలు అందరూ ఇంతలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదు.


పాతకాలంలో కనీసం స్త్రీలన్నా ఇంటిపట్టున ఉండి ఇంటిబాధ్యత, పిల్లల బాధ్యత  వంటివి.. చూసుకునేవారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా సంపాదించవలసి వస్తోంది.


ఈ రోజుల్లో  ప్రజల ఆలోచనాధోరణిలో వచ్చిన మార్పులు, వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంవంటి ఎన్నో కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.



ఈ రోజుల్లో అనేక సంస్థలలో  ఇద్దరు పనిచేయవలసిన చోట ఒకరిని నియమించి సరిపెట్టేస్తున్నారు...ఎక్కువమంది ఉద్యోగస్తులను నియమించుకోవాలి.


 ఒకరికే 60 వేలు జీతం  ఇవ్వటం కన్నా , ఒక్కొక్కరికి 30 వేలు ఇచ్చి ఇద్దరిని నియమిస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, ఉద్యోగుల్లో పని వత్తిడి తగ్గి , పనిలో నాణ్యత పెరిగి,  సంస్థకు లాభాలు పెరుగుతాయి. 
 

ఇక, ధరలు తగ్గితే తక్కువ జీతమైనా సరిపోతుంది.  ధరలు తగ్గే విధంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


మరీ తక్కువ జీతాలు ఉన్నవాళ్ళకు జీతాలు పెంచాలి.


 ఉద్యోగస్తుల జీతాలు పెరిగాయని వ్యాపారస్తులు ధరలు పెంచటం, ధరలు పెరిగాయని చెప్పి ఉద్యోగస్తులు  మరల  జీతాలు పెంచమనటం,  ..ఇలాంటి పరిస్థితిలో పేదవారు అధిక ధరలతో ఎలా బతకాలి?
 

 ప్రజలు కూడా చాలామంది  డబ్బు సంపాదన లో పడి  తమ ఆరోగ్యాలను , కుటుంబసభ్యుల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు.


డబ్బుసంపాదనే జీవితం కాదు కదా! ప్రజలు కూడా ఎక్కువ వస్తువులు కొనాలనే  మోజు తగ్గించుకోవాలి.


పాతకాలంలో చాలామంది  జీవితాలు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేవి. సాయంత్రం అయితే పిల్లలు కలిసి ఆడుకోవటం జరిగేది. 


ఆరుబయట ఆడుకోవటం, రాత్రి పూట  ఆకాశంలో మబ్బుల వెనుక దోబూచులాడుతున్న చందమామను చూడటం, నక్షత్రాలను చూడటం... ఇలాంటివి ఇప్పటి పిల్లలకు తెలుసా? 


ఎంతసేపూ పోటీ తప్ప ఏమీ ఉండటం లేదు.  ఈ పోటీలను తట్టుకోలేని కొందరు పిల్లలు, పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 


ఎందుకో తెలియని పరుగు తప్ప జీవితంలో చివరికి ఏం మిగులుతోంది?