koodali

Wednesday, November 29, 2017

ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత ..




 
శ్లో|| యత్ర యేగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
 
తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ||



పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.






Tuesday, November 28, 2017

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..


ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది. 
 
అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. 
 
 ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.

అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు. 

ఇంకో సంఘటన. ........మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ కు వెళ్ళాలని మా
  ఇంట్లోవారి కోరిక. నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.

నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ?......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో అందరూ సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. 


నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే,  కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని. 
 
కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం  కాదు. 

 ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 
Saturday, September 18, 2010

 

Monday, November 27, 2017

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.

 
నేను ఇంతకుముందు ఒకోసారి చాలా చాదస్తముగా ప్రవర్తించటం జరిగేదండి.

ఉదా.......ఒకోసారి మా ఇంట్లోని వాళ్ళని ప్రొద్దున్నే గుడికి వెళ్తే మంచిదని చెప్పి తీసుకువెళ్ళటం జరిగేది. 


 నా అభిప్రాయమేమిటంటే,  గుడికి సాయంత్రం వెళ్తే అప్పటికి ఏదోఒకటి తినటం జరుగుతుంది కదా అని .

.ఇక్కడ ఏమి జరిగేది అంటే,  ఉదయం  పిల్లల స్కూల్ కు సమయము మించిపోతుండేది.


గుడిలో ఒకోసారి అభిషేకం తరువాత .. అలంకరణ చేసే సమయములలో దేవుని ముందు తెర వేసి ఉంటుంది.

ఒకోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు దర్శనం ఆలస్యమవుతుంది.

ఇలాంటప్పుడు పిల్లలు స్కూల్ టైం అయిపోతోందని కంగారు పడతారు. 


 వాళ్ళ అభిప్రాయం సరి అయినదే. గుడికి వెళ్ళటం వల్ల ఆలస్యమయిందని చెబితే టీచర్ ఊరుకోరుగదా !

ఏదిఏమైనా నేను వాళ్ళను వదలక ఇంకొంచెము సేపట్లో దర్శనం అయిపోతుందిలే.. అని సర్దిచెబుతాను. 


నాకు మనస్సులో అయ్యో స్కూల్ సమయం మించిపోతోదని కంగారుగానే ఉంటుంది.

కానీ దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏమిజరుగుతుందో అని శంక... ఇలా నేను ఇంట్లో వాళ్ళను చాలా సతాయించాను పాపం.

ఇప్పుడు కొద్దికొద్దిగా అలాచేయటం మానివేసి నాకు ఎంత వీలయితే అంతే చేయడానికి ప్రయత్నిస్తున్నాను.  వాళ్ళకి  దేవుడంటే భక్తి  ఉంది. 



నేను గనక ఇలా చాదస్తముగా కంటిన్యూ చేస్తే వాళ్ళు నాస్తికులవుతారేమోనని ఒక భయం వచ్చింది.

ఇంకా నాకు ఏమని అనిపించిందంటేనండీ , నాలో కోపము, చిరాకు, నెగెటివ్ ఆలోచనలు ఇలా ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి.  ఇలాంటివి భగవంతునికి అస్సలు నచ్చవు.  



ఇలాంటివాటి విషయములో నా మనస్సును అదుపులో ఉంచుకోవటం  చేతకాక , పూజవిధివిధానాల పేరిట ఇంట్లో వాళ్ళని సతాయించటం ఏమి న్యాయం.. అని అనిపించింది.


ఇలా విధివిధానాల వెంపర్లాటలో పడి..  భగవంతుని యందు ధ్యాస, ప్రేమ, భక్తి కి దూరమవుతున్నానేమో..  అని కూడా సందేహమొచ్చిందండి.


అందుకే పూజలో లోటుపాట్లకు దైవాన్ని క్షమించమని కోరుకుంటూ ...భగవంతుని యందు ప్రేమ భక్తికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిదని అనిపిస్తోదండి.

 

ఇప్పుడు స్కూల్ కు వెళ్ళే తొందరలో గుడికి వెళ్ళటం లేదు... వెళ్ళినా ఒకవేళ దర్శనం కాకపోతే అసంతౄప్తి చెందక బయటనుంచి నమస్కరించి వచ్చేయటం మంచిపద్దతి అని అనిపిస్తోంది.


భోజనం చేసినా గుడికి ప్రశాంతముగా సాయంకాలం వెళ్ళటం మంచిదని అనిపిస్తోదండి..

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.


Monday, September 20, 2010

 

Friday, November 24, 2017

ఓం ..

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ( షష్ఠి ).. సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.  

నాగులచవితి , నాగపంచమి .. వంటి  పండుగల సందర్భాలలో పుట్టవద్ద   పూజ చేస్తారు. 

ఇలాంటప్పుడు కొందరు  పుట్ట వద్ద అగరుబత్తిలు, దీపాలు వెలిగించి పెడతారు. 

అలా కాకుండా పుట్టకు దూరంగా వెలిగించి ఉంచటం  మంచిది. 
*************

వ్రాసిన వాటిలో  అచ్చుతప్పులు   ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 







Wednesday, November 22, 2017

ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు...


కొందరు ఏం చేస్తారంటే , దైవ చిత్రాలను పడుకునే పరుపుల క్రింద ఉంచుతారు. ఇలా చేయటం మంచిదికాదని నా అభిప్రాయం. ఇలా చేసినవారికి కష్టాలు రావటం నేను గమనించాను.  

ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పద్ధతి వచ్చాక క్రింద పోర్షన్ వాళ్ళ దేవుని  మందిరం పైన.. పై పోర్షన్ వాళ్ళ బెడ్రూం లేక బాత్రూం వచ్చే  అవకాశముంది.  

క్రింద పొర్షన్లో  దైవ మందిరం , దైవ  విగ్రహాలు ఉంటే పైన నడవటం ...ఇవన్నీ ఆలోచిస్తే ఎలాగో ఉంటుంది. 

అపార్ట్మెంట్ల విషయంలో .. ప్రతి ఇంటి పూజా మందిరం..క్రింద పొర్షన్ నుంచి పై పోర్షన్  వరకు  ..  ఒకే వరుసలో  వచ్చే విధంగా ప్లాన్ చేసి కట్టుకుంటే  పూజామందిరం పైన బెడ్రూం రావటం వంటివి జరగకపోవచ్చు.

 ఇంట్లో ఉన్న దేవుని  విగ్రహాలు, క్యాలెండర్లు అన్నీ ఇల్లంతా  ఉంచటం  కాకుండా,  కేవలం పూజగదిలో మాత్రమే ఉండేటట్లు చూసుకోవచ్చు.

అపార్ట్మెంట్ కాకుండా డాబా ఇళ్లయినా క్రింద దేవుని గది ..పైన టెర్ర స్ ..పైన  నడుస్తారు. 

క్రింద దేవుని మందిరం ఉన్న దగ్గర.. టెర్రస్ పైన  కొంతభాగం నడవకుండా,  అక్కడ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు  లేదా  కొంత ఎత్తులో నాలుగు  ప్రక్కల గోడ కట్టవచ్చు.

పాతకాలంలో ఇలా అపార్ట్మెంట్ పద్ధతి లేదు .  డాబా పైకి ఎక్కే విధంగా ఇళ్లూ ఉండేవి కాదు.  

అంతస్తులు ఉండే  రాజభవనాలలో  దేవాలయం  కొంచెం దూరంగా ఉండేది కావచ్చు.  

 ఈ రోజుల్లో దైవ చిత్రాలను యంత్రాలతో  విరివిగా ముద్రించి తరువాత బయటపడేయటం కూడా జరుగుతోంది.

విదేశాల వాళ్లు చెప్పులపై  దైవ చిత్రాలను ముద్రించారని తెలిసి ఆందోళనకు గురయ్యినప్పుడు.. మనం ఇక్కడ దైవచిత్రాలను ముద్రించి  తరువాత చెత్తలో పడేయటం కూడా తప్పేకదా! 

దైవపూజ తరువాత వచ్చే నిర్మాల్యాన్నే ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.. నీటిలోనో, చెట్లపైనో  వేయాలని పెద్దలు తెలియజేసారు.  


పూజ చేయడానికి ఉపయోగించిన పువ్వులు, పత్రి వంటివి  పడేయటానికే అన్ని నియమాలు  ఉన్నప్పుడు... 


సాక్షాత్తూ దైవచిత్రాల విషయంలో ఎన్ని నియమాలు పాటించవలసి ఉంటుందో ఆలోచించండి. 


అలాగని ఈ రోజుల్లో ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిత్రాలను, లేని చిత్రాలను అన్నింటినీ  నీటిలో వేస్తే నీటిలో పెద్ద ఎత్తున పూడిక పెరిగే అవకాశముంది. 


  ఇలా ఆలోచించటం  కొందరికి అతిగా  అనిపించవచ్చు... అయితే, ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు.

కొన్ని ఆచారవ్యవహారాల విషయంలో   ఎక్కువగా  ఆలోచించటం అవసరం లేదేమో కానీ,  దైవ చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

దైవ చిత్రాన్ని దైవానికి ప్రతిరూపంగా భావిస్తాము.  దైవచిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ మధ్య ఒకరు మాకు వారి పిల్లల  వివాహ ఆహ్వానపత్రికను  ఇచ్చారు.

 ఆ పత్రికను పెద్దగా ముద్రించి ఎందరో దేవతల చిత్రాలను ముద్రించారు. 

ప్లాస్టిక్ కోటింగ్ తో ఆ పత్రిక చాలా దృఢంగా ఉంది. దాన్ని ఎక్కడ పడేయాలో తెలియటం లేదు. ఇంకేం చేస్తాం బయటే వేస్తాం.

ఇలా వచ్చిన ఆహ్వాన పత్రికలను, దైవ చిత్రాలున్న స్వీట్ ప్యాకెట్లను, విజిటింగ్ కార్డులను, వార్తాపత్రికలను ..ఇలాంటివన్నీ  ఇంట్లోనే అట్టిపెట్టుకోవాలంటే కష్టం కదా!

ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి.. మేమేం చేయగలం?

 దైవచిత్రాలను చెత్త వద్ద పడేసిన  పాపం .. దైవ చిత్రాలను అలా ముద్రించిన వారికి వస్తుంది.


 

Monday, November 20, 2017

పోలాల అమావాస్య నోము కధ క్లుప్తంగా ..



పోలాల అమావాస్య నోము కధ క్లుప్తంగా ..( మా ఇంటి వద్ద ఉన్న స్త్రీల  వ్రత కధలు..అనే  పుస్తకం నుంచి తెలుసుకున్నవి..)

ఒక ఊరిలో పోలి అనే ఆమె  మరియు  ఆమె  ఆరుగురు  తోటికోడళ్ళు ఉండేవారు. 


మొత్తం  యేడుగురు తోటికోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకొనుటకు ప్రయత్నం  చేయగా  ,   పోలి యొక్క సంతానం మరణించటం జరిగింది.  ఇలా ఆరు సంవత్సరములు జరిగింది.  

  పూజ చేసుకోవటం కుదరటంలేదని  తోటికోడళ్ళు  పోలిని  తిట్టడం  జరిగేది.    

ఏడో సంవత్సరం పూజ సమయం రాగానే  పోలి యొక్క  ఏడో సంతానం మరణించగా, 

ఈ విషయం తోటికోడళ్ళకు  చెప్పడానికి భయపడిన పోలి తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి,  తోటికోడళ్ళతో కలసి పూజ చేసుకుని వస్తుంది. 

రాత్రి అయినతరువాత బిడ్డ శవాన్ని తీసుకెళ్లి  ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్ద కూర్చుని ఏడుస్తుండగా ,

 పోలేరమ్మ జాలిపడి... పోలికి కొన్ని అక్షతలను ఇచ్చి , వాటిని ఇంతకుముందు మరణించిన సంతానాన్ని పూడ్చిన చోట  చల్లి,  మరణించిన  వారిని వారివారి పేర్లతో పిలువవలసిందిగా జెప్పి వెడలిపోయెను. 

 అమ్మవారు చెప్పినట్లుగా  చేయగా.. మరణించిన పిల్లలు సజీవులయి  వస్తారు.  అందరూ ఇంటికి వెళ్తారు. 

తెల్లవారుసరికి  వీరిని చూసిన వారు ఆశ్చర్యపడి వివరాలు అడుగగా ...పోలి జరిగిన విషయాలను చెబుతుంది.  

ఈ నోమును నోచుట వలన , సంతానము లేని వారికి సంతతి కలుగును. సంతతి వున్నవారికి కడుపు చలువ కలుగును. 

****************
పుస్తకంలోఉన్నట్లు .. ప్రతి అక్షరం ఉన్నదున్నట్లు ఇక్కడ వ్రాయలేదు. 

నాకు  తోచిన  కొన్ని  ఆలోచనలు.. 

ఈ కధలో పోలి తన బిడ్డ శవాన్ని దాచి పూజ చేసుకుంటుంది. అయినా, పోలేరమ్మ  ఆగ్రహించలేదు.

 (  పోలి తప్పనిపరిస్థితిలో  శవాన్ని ఇంట్లో ఉంచి  పూజ చేయవలసి వచ్చింది. కావాలని ఆమె అనాచారం చేయలేదు. )   

శవాన్ని ఇంట్లో  అట్టేపెట్టి  పూజ చేయటం ఏమిటని  దైవం ఆగ్రహించకపోగా...

 పోలి బాధను అర్ధం చేసుకుని ఆమెను అనుగ్రహిస్తుంది.  దైవం  కరుణామయులు. 

*********  
వ్రాసిన వాటిలో  పొరపాట్లు  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 
 

Friday, November 17, 2017

పోలి కధ ( క్లుప్తంగా ..) నాకు కలిగిన కొన్ని ఆలోచనలు..


ఒక ఊరిలో చాకలి కుటుంబానికి చెందిన  పోలి అనే పేరుగల ఆమె ఉండేది. ఆమెకు అత్తగారు, తోటికోడళ్ళు ఉండేవారు. 

కార్తికమాసంలో పోలి అత్తగారు మరియు తోటికోడళ్ళు మాత్రం  రోజూ  నదీ స్నానానికి వెళ్ళి దీపాలు వెలిగించేవారు. 

పోలికి  మాత్రం ఆ అవకాశం ఇచ్చేవారు కాదు.  పోలి ఇంట్లో బోలెడు పని చేస్తుండేది. 

  అయితే,  పోలి  ఇంట్లో కొద్దిపాటి వెన్నతో , పత్తితో వత్తి చేసి  దీపం వెలిగించుకుని   దైవప్రార్ధన చేసుకుని,  అత్తగారు చూస్తే తిడుతుందనే భయంతో దీపాన్ని  బాన క్రింద దాచేసింది.  

ఎంతో భక్తితో దైవాన్ని  ప్రార్ధించుకుంది.  దేవతలు పోలి భక్తికి మెచ్చి , ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి  పుష్పక విమానంలో  వచ్చారు. 


  దూరం నుంచి పుష్పకవిమానాన్ని చూసిన  పోలి అత్త,  తోటికోడళ్ళు  ఆ విమానం తమకోసమే గావన్ను ..అనుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు.  

అయితే,  పుష్పక విమానం రావటం  వారి కోసం కాదని   తెలుసుకున్నారు.   

 పోలి అత్త , తోటికోడళ్లు ..పుష్పక విమానం అంచులను పట్టుకునైనా స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. 
 
 పోలి..   తన  అత్తగారినీ,  తోటికోడళ్లను కూడా స్వర్గానికి తీసుకువెళ్ళమని దేవతలను కోరగా .. దేవతలు  ఒప్పుకోలేదు .   

పోలి మాత్రం స్వర్గానికి వెళ్ళటం జరిగింది.  

 ***********
ఈ కధ  వింటే  నాకు   కలిగిన కొన్ని ఆలోచనలు  ఏమిటంటే .. 

ఎన్నో  నియమాలను పాటిస్తూ పూజ చేయటం పోలికి కుదరకపోయినా , ఆమెకు ఉన్న భక్తి  మరియు సత్ప్రవర్తన వల్ల ఆమె స్వర్గానికి అర్హురాలయ్యింది.

 మరియు ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  స్వర్గానికి వెళ్లటానికి కులంతో సంబంధం లేదు,  భక్తి మరియు సత్ప్రవర్తన ఉంటే చాలని తెలుస్తుంది. 

ఇంకా, కొందరు స్త్రీలు ..సాటి స్త్రీలను ఎలా కష్టపెడతారో  కూడా  పోలి అత్తగారు, తోటికోడళ్ళ  పాత్రల ద్వారా తెలుస్తుంది. 

 ఎంత పద్ధతిగా  పూజ చేసినా,  పూజతో పాటు  భక్తి మరియు  సత్ప్రవర్తన కూడా  ఉంటే  చక్కటి ఫలితం లభిస్తుందని  అనిపించింది.

*************

వ్రాసిన వాటిలో  తప్పులు  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 


Wednesday, November 15, 2017

దేవుని చిత్రాలను అలా చేయటం

  పూజ చేసే విధానాల గురించి చాలామంది ఎన్నో సందేహాలను అడుగుతుంటారు.

ఉదా..దీపం వెలిగించి ఎటువైపు ఉంచాలి? పూజ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? ఇలాగ.. సందేహాలను అడగటంలో తప్పులేదు.

అయితే, మరికొన్ని విషయాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.

 దైవచిత్రాలకు, విగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దైవపటాలను దైవానికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.

అలాంటప్పుడు దైవచిత్రాలను  ఎక్కడబడితే అక్కడ  ముద్రించి ఆనక వాటిని రోడ్డుపై పారవేసే విధంగా పరిస్థితి ఉండటం మాత్రం దోషం కాదా?

కొన్ని విషయాలలో ఎన్నో  జాగ్రత్తలు  ఉన్నప్పుడు,  దేవుని చిత్రాలను రోడ్డుప్రక్కన పారవేసే విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదు?

 దేవుని చిత్రాలను అలా చేయటం దైవాన్ని అవమానించినట్లు కాదా ?

 ఆధునిక యంత్రాల వల్ల ఎన్నయినా ముద్రించటం తేలికయింది.

 అలాగని,  ఎక్కడబడితే అక్కడ దైవ చిత్రాలను ముద్రించితేనే దైవభక్తి ఉన్నట్లా?

స్వీట్ ప్యాకెట్లు, వివాహ పత్రికలు, క్యాలెండర్లు, హారతి పాకెట్లు, వార్తాపత్రికలు.... ఇలా అనేక చోట్ల దైవచిత్రాలను విరివిగా ముద్రిస్తున్నారు.

 తరువాత వాటిని ఎక్కడ పడవేయాలనేది అయోమయంగా ఉంటూంది.

 పాతకాలంలో అచ్చుయంత్రాలు లేవు కాబట్టి, పెద్దమొత్తంలో తయారీ ఉండేది కాదు. 

ఈ కాలంలో ప్లాస్టిక్ పై ముద్రించిన  చిత్రాలు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ నీటిలో వదలలేం. 

యంత్రాల ద్వారా పెద్దమొత్తంలో ముద్రించి తరువాత నీటిలో వదిలితే చెరువుల్లో పూడిక పెరిగిపోతుంది.
 
 చెత్తకుప్పలో  వేయాలంటే మనస్సు ఒప్పకపోయినా వేయకతప్పదు.

ఇలా చెత్తకుప్పలో వేసిన పాపం ..వాటిని ముద్రించిన వారికే వస్తుంది.

 ఈ విషయం గురించి కూడా ఆలోచించండి.


Monday, November 13, 2017

ఓం..


 త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.

***********
కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. 

ఏకశ్లోకి  భగవద్గీత

ఓం  యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః 
తత్ర  శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ.  


పార్ధాయ ప్రతి  బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్  
వ్యాసేన  గ్రధితాం  పురాణమునినా  మధ్యేమహాభారతమ్ 
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)

***********

శివపంచాక్షరీ స్తోత్రం....

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై నకారాయ నమశ్శివాయ.


మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

 తస్మై మకారాయ నమశ్శివాయ.


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

 తస్మై శికారాయ నమశ్శివాయ.


వశిష్ట కుంభోద్భవ  గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

 తస్మై వకారాయ నమశ్శివాయ.


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

 తస్మై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే ఛ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
......................................
 అచ్చుతప్పులను దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Saturday, November 11, 2017

ఇలాంటి నీరు , పాలు, పండ్లరసాలు తో ...


స్వచ్ఛంగా లేని  నీరు , పాలు, పండ్లరసాలు తో చేసే అభిషేకాల వల్ల..   శివలింగముల రూపు మారే ప్రమాదం ఉన్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.

 అభిషేకాలకు వాడే నీరు, పాలు, పండ్లరసాలు, పన్నీరు...ఇలా  ఎన్నో పదార్ధాలలో హానికారక రసాయనాలు కలిసే అవకాశం ఉంది.


కొన్ని నెలలు నిల్వ ఉండే విధంగా తయారుచేసిన పాలప్యాకెట్లను కూడా అభిషేకాలకు వాడుతున్నారు.


అన్నాభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇందుకు వేడి అన్నం ఉపయోగిస్తారో లేక ఆరబెట్టిన తరువాత వాడతారో తెలియదు.


ఈ రోజుల్లో ఎన్నో పదార్ధాలు కల్తీకి గురవుతున్నాయి.
హానికారక రసాయనపదార్ధాలతో పెరుగుతున్న పంటల ఉత్పత్తుల వల్ల కూడా హాని కలుగుతుంది.


ఇవన్నీ గమనిస్తే,  గత కొద్దికాలంగా పర్యావరణం మరియు పదార్ధాలలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది. 


ఈ మధ్య  కాన్సర్, కిడ్నీ, లివర్..వంటి రోగాలు బాగా పెరిగాయి. కొంతకాలం క్రిందట  ఇన్ని రోగాలు లేవు. 


ఇప్పుడు ఊరూరా పార్కులలా కిడ్నీ సెంటర్లు  ఏర్పాటు చేయవలసి వస్తోంది.


ఇలాంటి ..నీరు, పాలు, పండ్లరసాలు..వంటి వాటివల్ల శివలింగాలు  రూపుమారే సూచనలు కనిపిస్తుంటే ...


ఇలాంటి  నీరు , పాలు, పండ్లరసాలు వాడే  మనుషుల్లో  కిడ్నీ వంటి అవయవాలు పాడైపోతున్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు.

 ఇప్పటికైనా అందరూ సీరియస్ గా ఆలోచించి పర్యావరణాన్ని బాగుచేసుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంది.


********************

ఆధునికకాలంలో  మనం వాడే అనేక 
హానికారక రసాయనాలు  గాలిలో, నీటిలో, భూమిలో  కలుస్తున్నాయి.

తద్వారా గాలి, నీరు, భూమిద్వారా పండే పంటలు అన్నింటిలో
హానికారక రసాయనాలు చేరిపోతున్నాయి.

 ఎన్నో జీవజాతులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. మనుషులకు  రోగాలు ఎక్కువయ్యాయి.


ఇప్పటికైనా మనుషులు తాము చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకుంటే... కనుమరుగయ్యే జీవజాతిలో మనుషులు కూడా చేరటం ఎంతో దూరంలో లేకపోవచ్చు.


పర్యావరణాన్ని కాపాడాలి. స్వచ్చమైన పదార్ధాలతో శివలింగాలకు అభిషేకాలు చేయాలి, జీవజాతులను కాపాడాలి, ఆరోగ్యాలను కాపాడుకోవాలి.


పర్యావరణాన్ని ఎంతగా పాడుచేస్తున్నామో  దైవం  హెచ్చరికలు చేస్తున్నారు. 


పర్యావరణానికి మేలు చేయటం అంటే..  దైవానికి పూజ చేయటము .

Wednesday, November 8, 2017

ఓం శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..

 
శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు. 

...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు . దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు. 

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.

దశరధుల వారు చేసిన శనిదేవుని స్తోత్రమును చదివినా, విన్నా మంచిది.
...............

శనిదేవుని గురించి మరి కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు.


SHANI DEV KI KATHA - YouTube



shani-6.wmv.flv - YouTube


*************


shani-6.wmv.flv అనే లింకును..


దయచేసి...

shani-6.wmv.flv -YouTube ....అని ఉన్న దగ్గర చూడగలరు.



దశరధుల వారు చేసిన శనిదేవుని స్తోత్రమును చదివినా, విన్నా మంచిది.


**********
వ్రాసిన వాటిలో అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Monday, November 6, 2017

ఓం ..


 త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా కొందరు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాన్ని జరుపుకుంటారు.
***********

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. 

శివపంచాక్షరీ స్తోత్రం....

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై నకారాయ నమశ్శివాయ.


మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

 తస్మై మకారాయ నమశ్శివాయ.


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

 తస్మై శికారాయ నమశ్శివాయ.


వశిష్ట కుంభోద్భవ  గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

 తస్మై వకారాయ నమశ్శివాయ.


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

 తస్మై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే ఛ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

************
ఏకశ్లోకి  భగవద్గీత

ఓం  యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః 
తత్ర  శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ.  
.........................

పార్ధాయ ప్రతి  బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్  
వ్యాసేన  గ్రధితాం  పురాణమునినా  మధ్యేమహాభారతమ్ 
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)
......................................

 అచ్చుతప్పులను దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 



Wednesday, November 1, 2017

గోవులు..గోపూజ...

 
 గోవులు ఎప్పుడైనా పూజనీయమైనవి. అయితే, గృహప్రవేశాల వంటి శుభకార్యాల సందర్భాలలో మరింత ప్రత్యేకంగా గోవులను తీసుకొచ్చి పూజిస్తారు.

 కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే,  కొత్త పరిసరాలవల్ల,  కొత్తవారు కనిపించినప్పుడు.. ఆవులు బెదిరిపోతాయి. ముందుకు రావటానికి అడుగు వేయవు.  


అలాంటప్పుడు కొన్నిసార్లు, గోవుల యజమాని గోవులను బలవంతంగా లాక్కురావటం , వాటిని కొట్టడం..కూడా చేస్తారు. ఇలా చేయటం గోవులను హింసించటం అవుతుంది. 


ఈ రోజుల్లో  ఎన్నో  అంతస్తుల  ఎత్తున  ఇళ్ళు (అపార్ట్మెంట్స్)  ఉంటున్నాయి. అయినా  కొందరు  గోవును  మెట్లపై నుంచి  తీసుకెళ్ళి  మరీ  గృహప్రవేశం  చేయిస్తున్నారు.  

గోపూజ కొరకు గోవులను హింసిస్తూ తీసుకురావటం ఏ విధంగా సరైనది ?

 ఇలా చేయటం కంటే, గృహప్రవేశానికి ముందురోజు గోవులు ఉన్న ప్రదేశానికే వెళ్లి,  వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందించి, పూజించి , గోవుల చుట్టు ప్రక్కల మట్టిని (
గోవుల పాదధూళిని)  తీసుకొచ్చి గృహప్రవేశం సందర్భంగా ఇంట్లో చల్లుకోవచ్చు కదా.. అని నాకు అనిపించింది.

*****************

మరి కొందరు ఏం చేస్తారంటే,  గోవులకు ఆహారాన్ని తినిపిస్తే  .. మంచిదని వాటికి  ఆహారాన్ని అందిస్తారు. .


 అనారోగ్యం వంటివి వస్తే ఆవులు చెప్పలేవు కదా! 


 ఏదిపడితే అది తెచ్చి తినిపించటం కాకుండా, ఆవులు ఏం తింటాయో ?

 ఎంతవరకు తినిపించవచ్చో ? తెలుసుకుని తినిపించటం మంచిది. 

ఈ  విషయాలు వైద్యులకు, గోవులను పెంచేవాళ్లకు  అయితే బాగా తెలుస్తుంది.

మనకు పుణ్యం రావాలని వాటికి ఏదిపడితే అది తినిపించటం చేయకూడదని నాకు అనిపించింది. 


మేము చూసిన ఒక గోసంరక్షణ కేంద్రం వద్ద,  గోవులు తినే ఆహారం  గురించి బోర్డుపైన వ్రాసి, ఆ పదార్ధాలను తగుమాత్రం ధరకు భక్తులకు అందజేస్తున్నారు. ఆ పద్ధతి బాగుంది. 

************

మరికొన్ని ఆవుల పరిస్థితి ఏమిటంటే, రోడ్డుపైన తిరిగే కొన్ని ఆవులు ఆహారం కొరకు వెతుకుతూ ..


రోడ్ల ప్రక్కన చెత్తకుప్పలలో .. ప్లాస్టిక్ కవర్లలో మిగిలిపోయిన ఆహారాన్ని  కవర్లతో సహా తినటం వల్ల.. ఎన్నో ఆవులు అనారోగ్యం పాలవుతున్నాయని వార్తలు వచ్చాయి. 


ఇలా ఎన్నో రకాల పరిస్థితులున్నాయి.

గోవుల పరిస్థితి బాగుండాలని ఆశిద్దాము.