koodali

Friday, March 10, 2017

డబ్బు సంపాదన, కెరీర్.. .ఉంటే సరిపోతుందా ?


ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. డబ్బు వల్లే అన్ని సంతోషాలనూ పొందలేము కదా !


కొందరు వ్యక్తులు దేశం మీద పడి ఇతరుల సొమ్మును కాజెయ్యటం, బలహీనులను హింసించటం..వంటి పనులను చేస్తుంటారు. ఇలాంటి పౌరుల సంఖ్య ఎక్కువవటం వల్లనే ఇప్పుడు దేశం పరిస్థితి అద్వాన్నంగా తయారయింది.


ఇలా కాకుండా చక్కటి నైతికవిలువలతో కూడిన మంచి పౌరులు ఉంటే దేశంలో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది... అయితే చక్కటి నైతికవిలువలతో కూడిన పౌరులు తయారవాలంటే ఎలా ?


చిన్నతనం నుంచీ పిల్లలను కంటికి రెప్పగా కాపాడుకుంటూ చక్కటి ఆహారాన్ని అందిస్తూ, నైతిక విలువలతో పెరిగేలా పెద్దవాళ్ళు  శ్రద్ధ తీసుకోవాలి.


తల్లితండ్రి పొద్దస్తమానం ఉద్యోగమో, వ్యాపారమో చేయటంలోనే తమ టాలెంటును చూపిస్తే ....పిల్లలను చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యం తో, నైతిక విలువలు కలిగిన పౌరులుగా తయారుచేసే బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు ?

ఇప్పుడు చాలా విద్యాసంస్థలు కూడా డబ్బు సంపాదించటమే లక్ష్యంగా విద్యను ఉపదేశిస్తున్నాయి.

అందరికన్నా, పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రి బాధ్యత ఎంతో ఉంటుంది.

తండ్రి ఉద్యోగం లేక వ్యాపార బాధ్యతలలో ఉంటే కనీసం తల్లి అయినా ఇంటి బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది.


తల్లి బిడ్దకు తొలి గురువు అంటారు. ఇప్పుడు చాలామంది తల్లులు దగ్గరుండి బిడ్డలను పెంచుకోవటానికి  కూడా సమయం లేక  బయటివారి వద్ద వదిలి ఉద్యోగాలకు పరిగెడుతున్నారు.

ఇక తొలి గురువైన తల్లి బిడ్డలకు జీవితపాఠాలను ఎప్పుడు నేర్పిస్తుంది.

తండ్రికి ఉన్న చెడ్డ అలవాట్లు కూడా కుటుంబముపై ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

డబ్బు సంపాదించటం జీవితంలో ముఖ్యమే కానీ, అది మాత్రమే కుటుంబానికీ, దేశానికి ముఖ్యం కాదు.
...............

భావితరాలు శారీరికంగా, మానసికంగా ధృఢమైన వ్యక్తులు తయారవాలంటే, పిల్లలకు టీనేజ్ వయసు వచ్చే వరకూ చక్కటి పుష్టికరమైన ఆహారాన్ని అందించాలి.

మన పాతతరాల వాళ్ళు సునాయాసంగా కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళగలిగేవారు. ఇప్పటి తరం వాళ్ళలో ఎందరికి ఆ శక్తి ఉంది ?


పిల్లలకు చిన్నతనం నుంచే నీతికధలు వంటివి చెబుతూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో పెద్దవాళ్ళు చెబుతూ ఉండాలి. అలాగని వాళ్ళకు అసలే ఫ్రీ లేకుండా చేయకూడదు.

ఇప్పుడు చాలామంది పిల్లలు మీడియా ద్వారా ఎలాంటి అశ్లీల దృశ్యాలను చూస్తూ పెరుగుతున్నారో మనకు తెలుసు.

గత కొన్ని ఏళ్ళుగా స్త్రీలు, పురుషులు విపరీతంగా పనిచేస్తున్నారు.

దేశంలో పేదరికం ఎంతవరకూ తగ్గింది ? నిరుద్యోగం మరింత పెరిగింది. ఇతర సామాజిక సమస్యలూ పెరిగినట్లు అనిపిస్తోంది.

 నిర్భయ వంటి ఘటనలు , చిన్నపిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఎందుకు జరిగాయో అర్ధం కావటం లేదు.

ఇవన్నీ గమనిస్తే , ఇప్పటి సమాజానికి  ఆర్ధికాభివృద్ధి కన్నా ......నైతికాభివృద్ధి ఎక్కువగా అవసరం అనిపిస్తోంది.

ఈ దేశానికి ఎన్నో సహజవనరులైన సంపదలున్నాయి. అయినా దేశంలో పేదరికం ఉన్నదన్నా, ఎన్నో నేరాలు, జరుగుతున్నాయన్నా... మనుషుల్లో నైతికవిలువలు లోపించటం వల్లే.



1 comment:

  1. కొందరు ఏమనుకుంటారంటే , భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేసినా ఇద్దరూ కలిసి ఇంటిపని, పిల్లలపని చూసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇది ఆచరణలో సరిగ్గా పనిచేయదు.

    తల్లితండ్రి ఇద్దరూ ఆఫీసు నుండి అలసిపోయి రాత్రి ఇంటికి వస్తే అప్పటివరకూ పిల్లలపని, ఇంటిపని ఎవరుచూసుకుంటారు? ఇక అప్పుడు ఆదరాబాదరాగా ఏదో ఒకటి తిని పడుకుంటారు.

    కుటుంబాన్ని చూసుకోవటం అంటే పార్ట్ టైం పని కాదు. అందుకు చాలాసమయం కేటాయించవలసి వస్తుంది.

    ................

    ఇప్పుడు కొందరు స్త్రీలు కెరీర్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.

    మరికొందరు ఏమంటున్నారంటే, ధరలు బాగా పెరిగాయి కాబట్టి, కుటుంబంలో ఖర్చులు కోసం అంటూ బయట పనిచేస్తున్నారు.

    ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా విపరీతమైన ఖర్చులు తగ్గించుకోవాలి.

    సమాజంలో ఎన్నో సమస్యలకు కారణం నైతికవిలువలు లేని పౌరులే.

    పెద్దవాళ్ళు పిల్లలకు చక్కటి నైతిక విలువలను నేర్పిస్తే సమాజంలో అవినీతి, అధిక ధరలతో దోచుకోవటం, నేరాలు..వంటివి తగ్గుతాయి.

    ReplyDelete