koodali

Friday, December 22, 2017

అమరావతి అందంగా , ఆహ్లాదంగా...



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం మరియు కొన్ని నిర్మాణాలు మొదలవుతాయంటున్నారు. 

అమరావతి   అందంగా , ఆహ్లాదంగా  రూపుదిద్దుకుంటుందని ఆశిద్దాము. 

 

Wednesday, December 20, 2017

మంచి భవిష్యత్తు అంటే....మరియు..

ఈ రోజుల్లో చాలామంది  తల్లితండ్రి  ఏమంటున్నారంటే, 

 పిల్లలకు  మంచి భవిష్యత్తు కోసమే మేం బోలెడు  డబ్బు సంపాదిస్తున్నాం.. వాళ్లను చిన్నతనం నుంచి బాగా చదివిస్తున్నాం.. అంటారు. 

మంచి భవిష్యత్తు అంటే ఏమిటి?  


చిన్నతనంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ బండ చదువులు ..తరువాత ఉద్యోగం కోసం ఎదురుచూపులు..

ఉద్యోగంలో టార్గెట్లతో అలసట.. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ? ఎప్పుడు పోతుందో ? తెలియక టెన్షన్.. 


పెద్ద వయస్సులో జబ్బులతో పోరాటం.. ఇదేనా  మంచి భవిష్యత్తు అంటే?

 పిల్లలకు చిన్నతనంలో ఆటపాటలు లేవు. పెద్దయిన తరువాత సాయంకాలం తీరికగా గడపటమూ  లేదు, ఎప్పుడూ బిజీబిజీ ..


 మళ్ళీ పనిచేయటం కొరకు..కొంత విశ్రాంతి ..ఇలాంటి జీవితం కోసమా అంత ఆరాటం?

 ఇలాంటి జీవితాల వల్లే కుటుంబాలలో భార్యాభర్త మధ్య గొడవలు వస్తున్నాయి. 


పిల్లలు తమ బాధలు పట్టించుకునే వారు లేక మత్తుమందులకు అలవాటు పడటం, ఆత్మహత్యలు వంటి వాటికి పాల్పడుతున్నారు.

జీవితంలో ఏదైనా సాధించాలంటే కొంత శ్రమపడాలి. 


అయితే, ఆ శ్రమ మరీ ఎక్కువయితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. 

ఉదా..శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు పడాలని చెబుతారు....  అయితే, శిల్పాన్ని చెక్కేటప్పుడు  సున్నితంగా, జాగ్రత్తగా చెక్కాలి. 


 బండగా ఉలి దెబ్బలు పడితే శిల రూపు మారి, శిల్పం ఆకారం చెడిపోయే ప్రమాదం ఉంది.


చెక్కతో  బొమ్మ చేయాలన్నా సున్నితంగానే చెక్కాల...బండగా కత్తి గాటు పడితే చెక్క బొమ్మ విరిగిపోయే ప్రమాదం ఉంది. 


జీవితంలో పైకి రావాలంటూ పిల్లల్ని  చిన్నతనం నుంచే  విపరీతమైన శ్రమకు గురిచేస్తే,  పిల్లల శారీరిక,  మానసిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే ప్రమాదమూ ఉంది. 


పిల్లలు జీవితంలో ఉన్నతస్థితికి రావాలంటే  వారికి  ఒక పద్దతి ప్రకారం చక్కగా నేర్పించాలి.


అంతేకాని, బండగా, విపరీతంగా కష్టపెట్టినంత మాత్రానా ఉన్నతస్థితికి వస్తారనుకోవటం సరైనది కాదు.


*************
చక్కగా జీవించడానికి బోలెడు డబ్బు అవసరం లేదు. 

 అంతులేని కోరికలు, అత్యాశ..వంటివి  తగ్గించుకుంటే  సమాజం బాగుంటుంది. 

అత్యాశ వంటివి లేనప్పుడు  అధికధరలు, సంపద కొందరి దగ్గరే ప్రోగుపడటం వంటివి తగ్గుతాయి. అప్పుడు ఆర్ధిక అసమానతలూ తగ్గుతాయి. 


ఈ రోజుల్లో వస్తువ్యామోహం బాగా పెరిగింది.  


 కొత్త వస్తువులను  సంపాదించటం కొరకు విపరీతంగా కష్టపడుతున్నారు. జీవితం అంతా ధారపోస్తున్నారు.

మోక్షాన్ని పొందటం కోసం కొంత కష్టపడ్డారంటే అర్ధం ఉంది.

 అశాశ్వతమైన  వస్తువులు  వంటి  వాటికోసం  జీవితమంతా విపరీతంగా  కష్టపడటం మాత్రం అవివేకం.


*************
మరి కొన్ని విషయాలు ....  

ఎవరైనా క్రూరమైన పనులు చేస్తే అలాంటివాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలని అనిపిస్తుంది. 

అయితే ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళకు శిక్షలు పడాలని అనుకోవటం కన్నా, వాళ్ళకు చెడు బుద్ది పోయి మంచి బుద్ధి కలగాలని కోరుకోవటం మరింత బాగుంటుంది..ఎందుకంటే,పాపాలు చేసినవాళ్లు శిక్షలు అనుభవించేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు కదా!

అయితే, సమాజంలో కఠినశిక్షలు లేకపోతే ప్రజలకు భయమనేది లేకుండా పోతుంది. అప్పుడు ప్రజలు ఎక్కువగా పాపాలు చేసే అవకాశముంది.

 ఇవన్నీ గమనిస్తే, సామాన్య పాపాలు చేసేవారికి సామాన్య శిక్షలు ఉంటాయి. 

ఇక, క్రూరమైనపాపాలు  చేసిన వారి విషయంలో కఠినశిక్షలు విధించే విషయాన్ని దైవం చూసుకుంటారు.

అందరికీ సద్భుద్ది కలగాలని కోరుకోవటం మంచిది. 

ఇతరులను హింసించేవారికి కఠిన శిక్షలు పడకుండా, వారి బుద్ధి మంచిగా మారాలని కోరుకోవటం కొన్నిసార్లు అంత తేలికైన పనికాదు.

 అయినా, ఎవరికి.. ఎప్పుడు.. ఏమివ్వాలో.. దైవానికి తెలుసు.




Monday, December 18, 2017

ఓం ....

ధనుర్మాసం ఆరంభమయింది. 

 చాలామంది  తిరుప్పావై  వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.


  కొంతకాలం క్రిందట  మేము  శ్రీ విల్లిపుత్తూర్  మరియు కొన్ని దేవాలయాలకు వెళ్ళి  వచ్చాము . 

శ్రీ  ఆండాళ్  అమ్మవారు మరియు  శ్రీ రంగనాధుని  దర్శించుకునే అదృష్టం  కలిగింది.  అంతా దైవం దయ.

 

Thursday, December 14, 2017

గత యాభై ఏళ్ళలో...ఆరోగ్య పరిస్థితి లోమార్పులు..


 స్త్రీ విమానం నడిపితేనో లేక  ఇంకేదో  నడిపితేనో అబ్బో ! చూసారా!  ఎంత గొప్ప పనో ? స్త్రీలు కూడా చేయగలరు.  అంటూ ప్రశంసిస్తారు.

నిజమే, విమానాలు నడపటం  వగైరా పనులు చేయటం గొప్పే కావచ్చు. 


అయితే పిల్లల్ని శారీరికంగా, మానసికంగా చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే  పని ఎంతో గొప్ప పని.

 ఇంటి పని, పిల్లల్ని పెంచటం..వంటి పనులను స్త్రీలవలె పురుషులు సమర్ధవంతంగా నిర్వహించలేరు. 


.......................
ఇంటిపని అంటే కేవలం వంట, పిల్లల్ని   చూడటం మాత్రమే కాదు. కుటుంబ ఆరోగ్యానికి అవసరమైనవి తయారుచేసుకోవటం  వంటి చాలా పనులుంటాయి. 

పాతకాలంలో స్త్రీలు  ఇంట్లోనే ఎన్నో  తయారుచేసేవారు....అప్పట్లో ఇప్పటిలా బయటకెళ్లి కల్తీ సరుకులు తెచ్చుకునే అవసరం ఉండేది కాదు. 


ఇప్పుడు  బిజీ అంటూ  అల్లంవెల్లుల్లి  పేస్ట్ వంటివి కూడా బయటే కొనే పరిస్థితి ఉంది.  తద్వారా అనారోగ్యాలు ఎక్కువయ్యాయి. 

.............

ఈ రోజుల్లో చాలామంది స్త్రీల ఆరోగ్య పరిస్థితి లో కూడా  ఆశ్చర్యకరమైన మార్పులు వస్తున్నాయి. 


చిన్నతనం నుంచి మగవారిలా  జీవించాలనే  విధంగా అమ్మాయిల ఆలోచనా ధోరణి  మారటం  వల్లనో ఏమో ? ...


చాలామంది  అమ్మాయిలకు  టీనేజ్ వయస్సు నుంచే  గడ్డం వద్ద  మగవారిలా  వెంట్రుకలు పెరగటం,  నెలసరి సవ్యంగా రాకపోవటం..జరుగుతోంది. 


PCOD
..అనేది  సాధారణం అయింది. ఇలాంటప్పుడు సంతానంపొందే విషయంలో కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది.  

 హార్మోన్ సమస్యలు పెరిగితే మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 మరి కొందరు స్త్రీలేమో ఇంటా బయటా పనిచేసి  కొంతకాలానికి  అనారోగ్యం  పాలవుతున్నారు.

....................
యాభై ఏళ్ల క్రితం స్త్రీలు ఎక్కువగా ఉద్యోగాలు చేసేవారు కాదు. 

ఇంటిపట్టున ఉండి చక్కటి ఆహారం వండటం, కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు.

అప్పట్లో కిడ్నీ, కాన్సర్, లివర్..వంటి జబ్బులు ఇప్పుడున్నంతగా లేవు. 


గత యాభై ఏళ్ళలో బయట ఆహారం తినడం ఎక్కువయ్యింది.  గత యాభై ఏళ్ళలో కిడ్నీ, కాన్సర్, లివర్..వంటి జబ్బులు  కూడా  ఎక్కువయ్యాయి. 


ఎక్కువ  ఉద్యోగాల కోసం.. ఎక్కువ పరిశ్రమలు పెట్టి .. ఎక్కువ కాలుష్యాన్ని పెంచుతున్నారు.


పర్యావరణ కాలుష్యానికి తోడు ,  ఇంటి  ఆహారం లభించకపోవడం కూడా వ్యాధులు పెరగడానికి కారణం.




స్త్రీలు...కొన్ని విషయాలు..


*స్త్రీలు సంపాదనా బాధ్యతను తీసుకోవటం  కొరకు బయటకు వెళ్ళటం వల్ల ఆర్ధికాభివృద్ధి అనే లాభం ఉన్నమాట నిజమే కానీ, చాలా నష్టాలు కూడా ఉన్నాయి.

*స్త్రీల పట్ల లైంగిక వేధింపుల సమస్య.


*ఇంటాబయట  అధిక శ్రమ వల్ల స్త్రీలకు అనారోగ్యాలు.

* ఇంటిపని, పిల్లల పెంపకానికి సమయం చాలకపోవటం వల్ల రాబోయే తరాలు శారీరికంగా, మానసికంగా బలహీనమయే ప్రమాదం ఉంది..


(ఆరోగ్యకరమైన, పుష్టికరమైన సమతులాహారం అందిస్తూ పిల్లలను పెంచుకుంటే రాబోయే తరాలు శారీరికంగా దృఢంగా ఉంటాయి.


సంతానాన్ని చక్కటి ఆదర్శాలతో  నైతికవిలువలను నేర్పుతూ పెంచితే సమాజమే బాగుంటుంది.  నేరాలుఘోరాలు ఉండవు.)


*ఉద్యోగరీత్యా భార్యాభర్తకు తగినంత  సమయం లేకపోవటం వల్ల గొడవలు రావటం..


*పరాయి స్త్రీ పురుషులు కలిసి పనిచేయటం వల్ల,  భార్యభర్త మధ్య అనుమానాలు కలగటం, గొడవలు రావటం.


* నిరుద్యోగ సమస్య... అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో ఉద్యోగాలు లభించటం కష్టంగా ఉంది.  నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు అందరూ ఉద్యోగాల కోసం పోటీ పడితే నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది. 


.......................
*స్త్రీలు  ఆర్ధికంగా ఆలంబన కొరకు అంటూ అదనపు పనులు నెత్తినేసుకోవటం తెలివితక్కువతనం అవుతుంది.

*అయితే,  భార్యాభర్త మధ్య.. కలిసి జీవించలేని విధంగా  బలమైన కారణాలతో విభేధాలు  వచ్చినప్పుడు... స్త్రీకి న్యాయంగా రావలసిన వాటా ఇవ్వాలి.  


*పురుషులు బయట ఉద్యోగం చేస్తుంటే,  ఇంటి పని లో స్త్రీలు కూడా కష్టపడతారు కదా! పురుషుల సంపాదనలో స్త్రీలకూ హక్కు ఉంటుంది.  


* కొందరు స్త్రీలు తమ స్వార్ధంతో అత్తింటి వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.


* ఇలాంటి స్త్రీల వల్ల , అత్తవారి వల్ల నిజంగా ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు నష్టం కలుగుతోంది.
......................


  *  ప్రాచీనులు , స్త్రీలకు ఆర్ధిక ఆలంబనగా ఆభరణాలను ధరించడాన్ని ఏర్పాటు చేసారు.


  స్త్రీ ధనం, ఆభరణాలు .. వంటి  వాటి విషయంలో స్త్రీలకు హక్కు ఉండేది.  ఇలాంటివి  ఎప్పుడైనా అవసరంలో స్త్రీలకు  ఆసరాగా ఉపయోగపడేవి. 

* సనాతన ధర్మం స్త్రీలకు ఎంతో గౌరవాన్ని ఇవ్వటం జరిగింది.  స్త్రీలు దేవతా స్వరూపులని తెలియజేసారు. స్త్రీ  కంట కన్నీరు వలికిన చోట సంపద నిలవదని చెప్పారు. 


* ప్రాచీనులు  చెప్పినట్లు  , ఇంట్లో స్త్రీలను  సంతోషంగా  చూసుకుంటే .. స్త్రీలు బయటకొచ్చి కష్టపడవలసిన అవసరమేముంటుంది ?


*పెద్దలు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా స్త్రీలను చిన్నచూపు చూస్తున్న వారిది తప్పు కానీ, ప్రాచీనుల తప్పు ఏమీ లేదు.


*చాలా సంఘటనలలో  స్త్రీలే స్త్రీలను  కష్టపెట్టడం  తెలుస్తుంది.


*ఈ రోజుల్లో కొందరు స్త్రీల ప్రవర్తన ఎంతో ఘోరంగా  ఉంటోంది.

* కొందరు పెద్దవాళ్ళు తాము తమ పెద్దవాళ్ళను వృద్ధాప్యంలో సరిగ్గా చూడకుండా గెంటేసి కూడా, తమ పిల్లలు మాత్రం తమ మాటే వినాలని, తమను బాగా చూసుకోవాలని డిమాండ్ చేసే విధంగా ప్రవర్తిస్తారు.

 అంటే, అటు పెద్దవాళ్ళను, ఇటు తమ పిల్లల్ని తమ ప్రవర్తనతో బాధ పెడతారు. 

ఉదా.. ఒకామె తన అత్తగారిని వృద్ధాప్యంలో సరిగ్గా  చూడకుండా గెంటేసి,  కోడలిని కూడా తన ప్రవర్తనతో బాధపెడుతుంది. 



Wednesday, December 13, 2017

స్త్రీ స్వేచ్ఛ .....

ఆధునిక కాలంలో  స్త్రీ స్వేచ్ఛ  పేరుతో స్త్రీలపై ఎన్నో అదనపు బాధ్యతలు పడ్దాయి.

ఈ రోజులలో స్త్రీల కష్టాలు కూడా మరింత పెరిగాయనిపిస్తుంది. 

ఆర్ధికాభివృద్ధి అంటూ .. ఇంటాబయటా పనిచేస్తూ స్త్రీలు ఎంతో కష్టపడవలసి వస్తోంది. 

ఈ రోజులలో,  స్త్రీలు ఇంటాబయట పని నెత్తినేసుకుని పనిచేయటం గమనిస్తే..ఇది స్త్రీల  విజయం కాదు ... ఇది పురుషుల గెలుపుగా అనిపిస్తోంది. 

 
పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండేకాలంలో పురుషులకు  పరాయి స్త్రీలతో మాట్లాడాలన్నా కష్టంగా ఉండేది. 


ఆధునిక కాలంలో అతివలను  మోసం చేయడానికి మగవారికి  ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయి. 

ఈ రోజులలో, కొందరు  వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవటం..వంటివీ  జరుగుతున్నాయి. 


పనిచేసేచోట లైంగిక వేధింపులు  జరుగుతున్నా బైటకు చెప్పని వారెందరో ఉన్నారు.


 బయటకు చెప్తే తమనే తప్పుపడతారేమో ? అనే భయం వల్ల కొందరు,

 చదువు .. ఉద్యోగం మానివేస్తే ఎలా ? అనే సందేహాలతో కొందరు ..వేధింపులను మౌనంగా భరించే పరిస్థితీ  ఉంది. 

 ప్రేమపేరుతో టీనేజ్ అమ్మాయిలను మోసం చేయటం గురించిన కొన్ని కేసులు ...

మరి కొందరు స్త్రీలు ఎన్నో కారణాలతో మోసపోయి వ్యభిచార గృహాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ  విషయాలను గమనిస్తే .. ఈ రోజులలో  స్త్రీలను మోసగించటం మగవారికి మరింత తేలికయ్యింది ..అనిపిస్తుంది. 

నిర్భయ వంటి కేసులు  పెరిగాయి. చిన్నపిల్లల పట్లా లైంగిక వేధింపులు  పెరిగాయని  తెలుస్తోంది.

 చదువుకునే పాఠశాలలోనూ లైంగిక వేధింపులు, కార్యాలయాలలోనూ వేధింపులు, బయటకు తెలుస్తున్నవి కొన్నే. తెలియనివి ఎన్ని ఉన్నాయో?


బయటకొస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే  , ప్రాచీనులు  స్త్రీలకు సంపాదనా బాధ్యతలను అప్పగించలేదు.


 ఎంత టెక్నాలజీ పెరిగినా మనుషులలో నైతిక విలువల పట్ల గౌరవం పెరగనంతవరకూ ఈ వేధింపులు  జరగకుండా ఆపటం చాలా కష్టం . 
.......... 
 
చిన్నపిల్లలు ఆటోలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మాయిలపట్ల అఘాయిత్యం జరిగిన సంఘటనలు  గురించి వార్తలు విన్నాము. అమ్మాయిలను స్త్రీ ఆటోడ్రైవర్లు ఉండే ఆటోల్లో స్కూలుకు పంపిస్తే బాగుంటుంది. 
 
పాతకాలంలో అమ్మాయిలకు ప్రత్యేకంగా స్కూల్స్, కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుంటుంది.

..............
స్త్రీలు సంపాదనా బాధ్యతలను తీసుకోవటంతో స్త్రీలకే కాదు , పిల్లలకీ కష్టాలు మొదలయ్యాయి.


చంటిపిల్లలు కూడా పగలు ఇంటిపట్టున తల్లి వద్ద కాకుండా.. బయట  కేర్ సెంటర్లలో ఉండవలసి వస్తోంది.


పాతకాలంలో స్త్రీధనం..ఆభరణాలను అత్తింటి వారు వాడుకోవటం అంతగా  జరిగేది కాదు. స్త్రీలకు కష్టకాలంలో ఆ సొమ్ము ఆసరాగా ఉండేది.
..............

ఆర్ధిక ఆలంబన కోసం ,  స్త్రీలు కొందరు కలిసి తమకు అనుకూలమైన సమయాల  ప్రకారం పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు.


పనిచేసే చోట  మగవారు లేనప్పుడు లైంగిక వేధింపుల సమస్య ఉండదు కదా! 


******************  
కష్టాలలో ఉన్న స్త్రీలు  సమస్య పరిష్కారాల కోసం ఎవరైనా మగవారి సాయం కోరితే.. ఆ మగవారు కూడా నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. 

అలా కాకుండా,  కష్టాలలో ఉన్న స్త్రీలను  ఆదుకోవటానికి, వారి   సమస్యల పరిష్కారం కోసం మహిళామండలులు సహాయం చేస్తే బాగుంటుంది.

  కష్టాలలో ఉన్న స్త్రీలు ఒంటరిగా ఉండేకంటే, అపార్ట్మెంట్స్ వంటివి   తీసుకుని  ఒకే చోట ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండవచ్చు.

కుటీరపరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవచ్చు. 

 
మహిళామండలులు..  స్త్రీ నిధి ఏర్పాటు చేసి , నా అన్నవారు లేని స్త్రీలను ఆదుకోవచ్చు.



ఈ రోజుల్లో, మానవ సంబంధాల విషయంలో ఏవేవో జరుగుతున్నాయి. ...


ఈ రోజుల్లో స్త్రీపురుష సంబంధాల విషయంలో ఏవేవో జరుగుతున్నాయి.

కొందరు  ఏమంటున్నారంటే, పురుషులు  ఇష్టం వచ్చినట్లు  తిరుగుతున్నప్పుడు స్త్రీలు  తిరిగితే తప్పేమిటని ?  ప్రశ్నిస్తున్నారు. 


అయితే,  అక్రమ సంబంధాల వల్ల  అందరికీ  కష్టాలు వస్తాయని ఇలా మాట్లాడే  వారికి  తెలియదా?


ఈ రోజు
ల్లో ,  స్త్రీపురుషులు కలసిమెలసి  తిరిగే పరిస్థితి వల్ల..  కొందరిలో అక్రమసంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి.

భార్యాభర్త కలసి ఉండే సమయం కన్నా,  పరాయివాళ్ళు కలసి ఉండే సమయం ఎక్కువయ్యింది. ఈ పరిస్థితి చాలా కుటుంబాల్లో కల్లోలాలను కలిగిస్తోంది. 


........................................
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, పురుషులు  స్వేచ్చగా కలిసి జీవించటాన్ని ఇష్టపడుతున్నారు. 


అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, సహజీవనం అంటూ..   ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి.


 మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ? 


బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు .. సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా?

సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ?


 కుటుంబ సంబంధాలు లేని ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ? స్వేచ్చ అంటే ఇదేనా ?

పెద్దవాళ్లే వివాహేతర సంబంధాలంటూ మాట్లాడుతుంటే ఇక  పిల్లలకు  ఏం విలువలను నేర్పుతారు ?

  .....................

స్త్రీలు బాధలు పడటంలో కొందరు మగవారి పాత్ర ఉన్నట్లే .... స్త్రీల బాధలకు కొందరు స్త్రీలు కూడా కారణమే.


కోడలిపై కిరోసిన్ పోసే అత్త స్త్రీనే కదా !


కాళ్ళు చేతులు పనిచేయని అత్తను కాలువ ప్రక్కన పడేసిన కోడలు స్త్రీనే కదా !


వివాహితుడైన పురుషుని వెంటపడి అతని భార్య, పిల్లల కష్టాలకు కారణమయ్యే స్త్రీ ....స్త్రీనే కదా ! 


***********


కొందరు ఏమంటారంటే, స్త్రీలను గౌరవించాలని అబ్బాయిలకు నేర్పండి అంటున్నారు.

పిల్లలను పెంచే విషయంలో తండ్రుల కన్నా తల్లుల పాత్రే ఎక్కువ.


తల్లులు పిల్లలను పెంచేటప్పుడు.... మగపిల్లలకు స్త్రీల పట్ల గౌరవం ఉండే విధంగా ...


ఆడపిల్లలకు పురుషుల పట్ల గౌరవం ఉండే విధంగా పెంచవచ్చు కదా! అలా  పెంచితే చాలా సమస్యలు తగ్గుతాయి.

***********************
ఇంకొక విషయం ఏమిటంటే, 

కొందరు తమకు వయస్సు పైబడిన తరువాత, తమ జీవితభాగస్వామి మరణించిన తరువాత..ఒంటరితనం భరించలేక తోడుకోసం అని మళ్ళీ వివాహం చేసుకోవటం జరుగుతోంది. ఇలా వృద్ధులకు వివాహాలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా వెలిసాయి.

నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే, కొంతకాలానికి వాళ్ళల్లో  ఒకరు చనిపోతే ఏం చేస్తారు? అప్పుడు జీవించి ఉన్నవాళ్ళు మళ్ళీ ఒంటరి వాళ్ళే కదా
 
 చనిపోయేవరకూ మళ్లీమళ్ళీ వివాహాలు చేసుకుంటూనే ఉంటారా?

మలివయస్సులో మళ్ళీపెళ్ళి వల్ల  కొత్త సమస్యలు వచ్చే అవకాశముంది. 



Monday, December 11, 2017

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...



ప్రజల మంచికోసం  ప్రాచీనులు  ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను  తెలియజేసారు.

అయితే , ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుంటున్నారు.



ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని  కూడా  సడలింపులను తెలియజేయటం జరిగింది.


 షిరిడి సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. ఇంకా,  భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.



 షిరిడి సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట.... .భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.


 శ్రీ హిరిడి సాయిబాబా జీవితచరిత్రము గ్రంధము లోని  కొన్ని విషయములు...

కృతయుగములో శమదమములు {అనగా నిశ్చల మనస్సు, శరీరము } త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలి యుగములో భగవన్మహిమలను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. అని తెలియజేసారు.

**************

ఆచారవ్యవహారాలలో ఏమైనా పొరపాట్లు వస్తే కష్టాలు వచ్చే అవకాశముందని కొందరు చెప్తుంటారు. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంటుంది.

ఇలాంటప్పుడు దైవంపై ధ్యాస కన్నా ...ఆచారవ్యవహారాలను పాటించటానికి ఎక్కువ దృష్టి పెట్టవల్సి వస్తుంది.


ఆచారవ్యవహారాలను పాటించటం అవసరమే కానీ , దైవంపై ధ్యాస ఎంతో ముఖ్యం కదా!

మూఢత్వం పెంచే విధంగా కాకుండా,  విచక్షణతో  పాటిస్తూ.. దైవం పై ధ్యాస పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలన్నది నా అభిప్రాయం.


  ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలో  పూజలు చేయవచ్చు.

***************

 పెద్దలు తెలియజేసిన ఒక కధ...

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. 



ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.

 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. 


ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.

 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. 


అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


Saturday, December 9, 2017

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ....మరియు..


విజయవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్టు వద్ద చాలా దీపాలు వెలిగించటం వల్ల విగ్రహానికి వేడి తగులుతోందని,   అలా జరగటం మంచిది కాదని పండితులు అంటున్నారు.


 మరి అలాంటప్పుడు  పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటే మంచిది కదా!  


అలా చర్యలు తీసుకోవటంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందో అర్ధం కావటం లేదు. 

ఇంత ముఖ్యమైన విషయంలో కూడా ఆలశ్యం జరగటం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  


 దేవాలయంలో  ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. 

**********************

ఇంకో విషయం ఏమిటంటే,

దేశంలో అనేకచోట్ల ప్రాచీన ఆలయాలు కొన్ని శిధిలావస్థలో ఉన్నాయి. 

ఇలాంటి ఆలయాలు శిధిలావస్థకు చేరకుండా పురావస్తు శాఖ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.  

**************
మార్గశిర మాసంలో అష్టమి న  ఎక్కువమంది  అనఘాష్టమి  వ్రతాన్ని ఆచరిస్తారు.




Friday, December 8, 2017

మన మనస్సు .....

మా ఇంటి ప్రక్క దేవాలయం  నుంచి  మైక్ లో దైవానికి సంబంధించిన  పాటలు,  స్తోత్రాలు వేస్తుంటారు.

  మైక్  సౌండ్ మామూలు  రోజులలో  మరీ పెద్దగా  పెట్టరు.  కొన్ని  పండుగ రోజుల్లో  మాత్రం  పెద్ద సౌండ్ పెడతారు.


ఈ మధ్య ఒకరోజు సడన్ గా  కొద్దిసేపు సౌండ్ పెద్దగా వినిపించింది. అప్పుడు నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. 


పుస్తకంలో చూడకుండా
పఠించడానికి ప్రయత్నిస్తున్నాను.

 దేవాలయం నుంచి  పాటలు  వినిపించేసరికి  నాకు  ధ్యాస  తగ్గి,   నేను పఠించే  వాటిలో తప్పులు  వస్తున్నట్లు అనిపించింది. 


ఎంత ప్రయత్నించినా  సరిగ్గా
పఠించడానికి కుదరటం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. 

నేను పూజ చేసేటప్పుడు అలవాటుగా దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో  అప్పుడప్పుడు వేరే విషయాల గురించి ఆలోచనలు వస్తుంటాయి. 


అంటే నోటితో దైవస్తోత్రాలు చదువుతుంటే..మనస్సు దాని ఇష్టానికి  అది వేరే ఆలోచనలు చేస్తుంది.


 అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతుంటాయి. ఈ విషయం గుర్తు వచ్చింది. 

  దేవాలయం నుంచి వచ్చే శబ్దాలు వినిపిస్తున్నా కూడా,   మనస్సును  నేను పఠించే విషయంపై పెట్టడానికి ప్రయత్నించవచ్చు కదా! అనిపించి అలా ప్రయత్నించాను. 


 కొంత వరకు బాగానే పఠించగలిగాను. అంతా దైవం దయ. 

ఇంకో విషయం ఏమిటంటే,  దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో   వేరే విషయాల గురించి ఆలోచనలు  చేయగలుగుతున్నప్పుడు.... 


.లౌకికజీవితంలో పనులు చేసుకుంటూనే ...మనస్సుతో  దైవారాధన చేయవచ్చు కదా ! అని కూడా అనిపిస్తుంది. .అయితే, ఇలా చేయడం  చాలా కష్టం.


మన మనస్సు అని మనం చెప్పుకోవడమే కానీ ,  మన మనస్సును మనం నియంత్రించటం చాలా కష్టం.

మన మనస్సు మన మాట వినాలన్నా దైవాన్ని ప్రార్ధించవలసిందే. 



Thursday, December 7, 2017

ఏది తప్పో ? ఏది ఒప్పో ?



కొందరు ఏం చేస్తారంటే, ఏదో అశుభ్రత అంటుకుందని పదేపదే స్నానాలు చేస్తారు.

 అలా పదేపదే స్నానాల వల్ల నీళ్లు వేస్ట్ అయిపోతాయి. పొదుపుగా వాడవలసిన నీటిని వృధా చేయటమూ పాపమేకదా!


 అశుచి అనుకుంటే పదేపదే స్నానాల బదులుగా  కాసిన్ని పసుపునీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. ఇదీ పెద్దలు చెప్పిన విధానమే కదా! 


*************
మరికొందరు ఎన్నో సందేహాలతో సతమతమవుతుంటారు.  ఉదా.. పూజ కోసం  దీపాన్ని ఏ దిక్కుగా వెలిగించాలి ? వంటి సందేహాలు.

దైవం ఏ దిక్కునైనా ఉంటారు. ఏ దిక్కుగా దీపాన్ని వెలిగించినా తప్పులేదు.


*************

మనవల్ల ఎవరికీ అన్యాయం జరిగితే తప్పు కానీ ...అలా కానప్పుడు  ప్రతి విషయానికి ఎక్కువ  సందేహాలు అవసరం లేదు.


. ఎవరి శక్తిని బట్టి , వీలునుబట్టి వారు పూజ చేసుకోవటం మంచిదని నాకు అనిపించింది. 


 ఏది చేస్తే తప్పో? ఏది ఒప్పో ? అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవటం కంటే , వీలుకుదిరినంతలో దైవంపై ధ్యాస ఉంచి పూజ చేసుకోవటం మంచిది. 

...........
 
కొందరు కలల గురించి భయపడుతుంటారు.  కొన్నిసార్లు ఎక్కడైనా చదివినవో లేక ఎక్కడైనా విన్నవో విషయాలు మనస్సులో గుర్తుండి కలలుగా రావచ్చు. మనం చదివినట్లు, విన్నట్లు మర్చిపోయినా, మనస్సులోతుల్లో అవి గుర్తుండి కలలో రావచ్చు.
 
 కొన్నిసార్లు భ్రమలను నిజమని నమ్ముతారు కొందరు. అది భ్రమా? నిజమా? అని తెలుసుకోవాలి. 
 



Wednesday, December 6, 2017

ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో ?

మంగళవారం, శుక్ర వారం గోళ్లు కత్తిరించ  కూడదంటారు.

 అయితే  నా విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ,  గోళ్ళు పెరిగాయని, కత్తిరించుకోవాలని  కొన్నిసార్లు 
అదేంటో  సరిగ్గా మంగళవారం, శుక్రవారమే గుర్తు వస్తుంది.

గోళ్ళు పెరిగాయని గుర్తువచ్చాక  చిరాగ్గా అనిపిస్తుంది. 


పెరిగిన గోళ్ళలో మురికి ఉంటుంది  కాబట్టి , ఆ మురికి చేతులతో  వంట చేసి   దైవానికి నివేదించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.  గోళ్ళు కత్తిరించేస్తాను.


 మరీ ముఖ్యమైన పండుగల రోజులలో అయితే కత్తిరించను కానీ,  మామూలుగా మంగళవారం, శుక్రవారం అని తెలిసినా చేసేదేమీ లేక   కత్తిరించేస్తాను.  


నా అభిప్రాయం ఏమిటంటే,  మంగళ, శుక్ర వారాల్లో గోళ్లు కత్తిరిస్తే వచ్చే పాపం కంటే... మురికి చేతులతో వంట చేయటం వల్ల వచ్చే పాపం ఎక్కువ ..అనిపిస్తుంది. అందువల్ల అలా చేస్తాను. 


పండుగ రోజు అయినా గోళ్ళు కత్తిరించాలని అనిపిస్తుంది కానీ, అలా చేయటం మరింత ఎక్కువ పాపమేమో ? అని భయం వేసి ఊరుకుంటాను. 

 చేసేదేమీ లేక  అప్పటికి గోళ్ళను నీటితో కడిగి ,   పండుగ తరువాత రోజు కత్తిరిస్తాను.

ఇదంతా కాకుండా,  వారంలో ఒక రోజు తప్పనిసరిగా గోళ్లు కత్తిరింపు  ప్రోగ్రాం పెట్టుకుంటే సరిపోతుంది.  

***********

 కొన్ని ఆచారాలు పాటించటం కష్టంగా ఉంటుంది.

ఉదా..నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు.. పూజలు చేసే వద్దకు కూడా  వెళ్లకూడదంటారు. ఇలాంటివి పాటించటం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. 

ఉదా.. దగ్గరి బంధువుల ఇళ్ళలో వివాహం, గృహప్రవేశం..వంటి వాటికి వెళ్ళాలంటే  ఏం చేయాలో అర్ధం కాదు. 

అలాగని అతి దగ్గర బంధువుల శుభకార్యాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. 

వెళ్తే పూజా  కార్యక్రమానికి దూరంగా ఉండాలనే ఆంక్షలుంటాయి. 

శుభకార్యానికి వెళ్ళి అందరికీ దూరంగా కూర్చోవటం వల్ల  చుటుపక్కల వాళ్ళు వింతగా చూసే అవకాశముంది.

దూరంగా ఉంటే , ఎందుకు దూరంగా ఉన్నావని అడుగుతారు, విషయం అందరితో చెప్పవలసి ఉంటుంది. ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. 

అలాగని దగ్గరి బంధువుల వివాహాలకు వెళ్ళకుండా ఉండటమూ ఇబ్బందే. 

 ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉంటే, ఫంక్షన్ కు రాలేదని  కొందరు  బంధువులు  నిందిస్తారు. 

నిందిస్తారేమోనని మైల రోజులలో శుభకార్యానికి వెళ్తే ,తరువాత వాళ్ళింట్లో ఏమైనా కష్టాలు వస్తే,   మైల ఉన్న వాళ్ళు శుభకార్యానికి రావటం వల్లే కష్టాలు వచ్చాయని నిందించే వారూ ఉంటారు.

అలాగని  నెలసరి వాయిదా వేసే మందులు   ఎక్కువసార్లు  వేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
............... 
దూరపు బంధువులు మరణించిన సమయంలో కూడా మైల  వల్ల శుభకార్యాలకు వెళ్ళకూడదనే ఆంక్షల  వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
..........
  కొన్ని సార్లు ఇవన్నీ పాటించే విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి.

***************
పెద్దలు  మనకు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేశారు.  

అయితే  పెద్దలు తెలియజేసిన ఆచారవ్యవహారాలలోని అసలు అంతరార్ధాలను సరిగ్గా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

ప్రాచీనులైన వారు తెలియజేసిన విషయాలు కొన్నైతే,  మధ్యలో వచ్చిచేరినవి కొన్ని. 
 
ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి  మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో ? తెలియటం లేదు. 


Monday, December 4, 2017

తరచూ తలస్నానాలు చేయటం..వంటి..


కొంతకాలం క్రిందట మా బంధువుల అమ్మాయి వివాహానికి వెళ్లాను. వాళ్ళను చూసి చాలాకాలమయ్యింది. 

పెండ్లికూతురు జడ సన్నగా ఉంది. 

ఇంతకుముందు నేను చూసినప్పుడు జడ ఒత్తుగా ఉన్నట్లు గుర్తు. ఇదేమిటి ఇలాగయింది. ..అనడగితే   ఒకామె  ఏమన్నదంటే , 

పూజలు  చేయటం కోసం  తరచూ  తలస్నానాలు చేయటం వల్ల జడ సన్నగా అయిందని చెప్పింది.  

జడ సన్నగా ఎందుకు అయిందో కానీ...  పూజలకోసం తలస్నానం చేయటం వల్ల అనేసారు. 

ఉదయాన్నే తలస్నానం చేసి పూజకు ఆలస్యం అవుతోందని హడావిడిగా తడితల సరిగ్గా తుడుచుకోకుంటే  జలుబు వంటివి వచ్చే అవకాశముంది.

చుండ్రు వచ్చే అవకాశం కూడా  ఉంది.  అలాంటప్పుడు  జుత్తు  ఊడిపోయే అవకాశముంది. 

అయితే, వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలస్నానం చేయటం వల్ల చుండ్రు వంటివి రావంటున్నారు.  తలస్నానం చేసినా కూడా, జుత్తు ఆరిన తరువాత,   అదే రోజు తలకు నూనె రాస్తే జుట్టు ఎండిపోదు.

*************
తల ఎక్కువగా తడితో  నానితే , తలకు  నీరు వెళ్లి  అనారోగ్యం వచ్చే అవకాశముందని కూడా కొందరు పెద్దవాళ్లు అంటారు.

పాతకాలంలో స్వచ్చమైన నీరు, వాతావరణం వల్ల ఎన్నిసార్లు తలస్నానం చేసినా ఆరోగ్యం బాగుండేది కావచ్చు.

 ఈ రోజుల్లో నీరు, గాలి,  వాతావరణం లో ..పొల్యూషన్ ఎక్కువయ్యింది.  నీటిలో పొల్యూషన్ తగ్గడానికి కూడా రసాయనాలు కలుపుతున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో  రసాయనాలు కలిసిన నీటితో, షాంపూలతో .. తరచూ తలస్నానం చేస్తే  సరిపడకపోవచ్చు.  

మనుషుల అంతులేని కోరికల వల్ల ..  స్వయంకృతాపరాధాల వల్ల ..  వాతావరణం కలుషితమయ్యింది. 

*******************

 పాతకాలంలో పుష్టికరమైన తిండి తినేవారు.

ఈ రోజుల్లో  లభించే ఆహారంలో ... సత్తువ ఉండటం లేదు... చాలామంది విషయంలో .. తినే తిండి వల్ల   లావు అవుతున్నారే కానీ ,  సరైన శక్తి లభించటం లేదు.

మా ఇంటి పొరుగున ఒకామెకు ( సుమారు 35 సంవత్సరాల వయస్సుంటుదేమో ?) ఆ మధ్య కడుపులో నొప్పి అంటూ హాస్పిటల్కు వెళ్ళి మందులు వాడింది.  

ఆమె ఏమన్నదంటే,  పని అయి ..  పూజ అయేసరికి మధ్యాహ్నం 12 అయేదట. అప్పటివరకూ   ఏమీ  తినేదికాదట.

 అందుకే  కడుపులో నొప్పి వచ్చిందేమోనంటూ సందేహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అలా  చేయకుండా ఉదయాన ఏదో ఒకటి తింటోందట. 

**************
  ఇలా సంశయం ఉన్నవాళ్ళు .. ఉదయం   కొంత పూజ చేసుకుని , ఏమైనా ఆహారం తీసుకుని ,  ఇంటి పని   తరువాత ..  మరల పూజ చేసుకోవచ్చు.

లేదంటే  సూర్యోదయానికి ముందే   లేచి పూజ చేసుకోవాలి.

 ************

  తరచూ తలస్నానం, ఉపవాసం ..చేయటం వంటివి ఎవరి పరిస్థితిని బట్టి  వారు చేసుకోవటం మంచిది.

 తరచూ తలస్నానాలు, కఠిక ఉపవాసాలు ఆచరించకపోయినా  పూజ చేసుకోవచ్చు.  దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

భక్తి, సత్ప్రవర్తన కలిగి  ఉంటే  దైవకృపను పొందవచ్చు ...  అని నాకు అనిపిస్తున్నది. 



Saturday, December 2, 2017

ఓం .


ఈ రోజు తిరువణ్ణామలై దీపోత్సవం  మరియు  మిలాదున్నబి .
 
రేపు .. దత్త జయంతి .. పూర్ణిమ.... 

 

Wednesday, November 29, 2017

ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత ..




 
శ్లో|| యత్ర యేగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
 
తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ||



పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.






Tuesday, November 28, 2017

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..


ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది. 
 
అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. 
 
 ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.

అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు. 

ఇంకో సంఘటన. ........మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ కు వెళ్ళాలని మా
  ఇంట్లోవారి కోరిక. నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.

నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ?......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో అందరూ సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. 


నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే,  కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని. 
 
కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం  కాదు. 

 ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 
Saturday, September 18, 2010