koodali

Monday, June 27, 2016

ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మూఢమి పాటిస్తారు కానీ,


  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలిరావటం మంచి విషయమే


అయితే  మూఢమి   వెళ్లి మంచి రోజులు వచ్చిన తరువాత నూతన   కార్యాలయాలు ప్రారంభిస్తే  మరింత బాగుండేదేమో .. 


అయితే ఇప్పుడు ప్రారంభిస్తున్నవి తాత్కాలిక కార్యాలయాలే కదా!


 ఆలస్యమైనా బదిలీలపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు  పాఠశాలలో సీట్లు ఇస్తారు కదా!  


 ఆంధ్రప్రదేశ్  వాళ్ళు మూఢమి   పాటిస్తారు కానీ, 


నాకు తెలిసినంతలో  తమిళనాడుకర్నాటక వాళ్ళు మూఢమి  పాటించరనుకుంటాను. 


ఎందుకో తెలియదు. 











సహజవనరులు ఉన్నట్లు తెలియటం వల్ల కూడా బాధలే..అన్నట్లు..

రెండు సంవత్సరాల క్రితం  నగరం వద్ద జరిగిన దుర్ఘటన ఎంతో బాధాకరమైనది.  

పచ్చటి పొలాలతో ఉండే కోస్తాలో పెట్రోల్ , గాస్ తవ్వకాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంభయంగా బ్రతుకుతున్నారు.. 

ఇప్పటికీ  అప్పుడప్పుడు గాస్ లీక్  సంఘటనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇవన్నీ గమనిస్తే బాబోయ్.. రాష్ట్రంలో ఏ విధమైన సహజవనరులు లభించవద్దు. అనిపిస్తోంది. 

అభివృద్ధి పేరుతో ఎక్కడెక్కడెక్కడి వాళ్ళో వచ్చి తవ్వుకుపోవటం ....    స్థానికులకు  మిగిలేది పొల్యూషన్  బాధలు అన్నట్లు ఉంది పరిస్థితి . 

. ఇవన్నీ  ఇలా ఉండగా కొత్తగా ఉత్తరాంధ్రాలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్నారు.

  ఇతర రాష్ట్రాల వాళ్లు వ్యతిరేకించగా దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెడతామంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మెతకమనుషులు ... ఏం చేసినా సహిస్తారు..  అని అందరికీ తెలిసిపోయినట్లుంది.

ఆంధ్రప్రదేశ్ అంటే చిన్నచూపు చూ స్తున్నారు. 




Saturday, June 25, 2016

మా బంధువులు, ఫ్రెండ్స్ నాతో ఏమనేవారంటే..


  నా భర్తది బదిలీలు ఉన్న ఉద్యోగమే. అయితే  ప్రమోషన్లు తీసుకోకుంటే ఎక్కువ బదిలీలు ఉండవు. ప్రమోషన్ తీసుకుంటే మాత్రం బదిలీ ఉంటుంది.

 కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉన్నా కూడా బదిలీ వస్తే కష్టమని భావించి చాలాకాలం ప్రమోషన్ తీసుకోకుండానే పనిచేసారు. 

 ప్రమోషన్ వస్తే ఎక్కడకు బదిలీ చేస్తారో తెలియదు కదా! 

 అయితే ఆఫీస్ వాళ్ళు.. నువ్వు బాగా కష్టపడి పనిచేస్తావు ప్రమోషన్ పరీక్ష రాయవచ్చు కదా! అని ఎప్పుడూ అంటుండేవారట.

ఒక కేడర్ తరువాత  ప్రమోషన్ కోరుకోకపోయినా...    ఒకే ఊరిలో కొన్ని సంవత్సరాలు ఉంటే బదిలీ చేస్తారు.

ఇక, కొంతకాలం తరువాత  బదిలీ తప్పదని తెలిసి ప్రమోషన్ తో బదిలీ తీసుకోవటం జరిగింది.

  అలా  నా భర్త వేరే ఊరిలో ఉద్యోగంలో  చేరటం జరిగింది .

 పిల్లలు చదవటానికి అక్కడ సరైన అవకాశాలు లేవు. 

 ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉండే స్త్రీ భర్తకు బదిలీ అయితే భర్తతో పాటు వెళ్ళే అవకాశం ఉంది.

 అయితే ఈ రోజుల్లో పిల్లల చదువులు ఉన్నాయి కదా !

  అబ్బాయిలను  హాస్టల్లో వేయాలి అనుకుంటే...ఈ రోజుల్లో ఆడపిల్లలూ చదివి ఉద్యోగాలు చేయాలంటున్నారు.

 ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా .. ఎవర్నీ హాస్టల్లో వేయాలన్నా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది.


 మా బంధువులు, ఫ్రెండ్స్  నాతో ఏమనేవారంటే..  నువ్వు పిల్లల్ని హాస్టల్లో వేసి భర్త వద్దకు వెళ్ళవచ్చు కదా ! అంటూ ఎన్నో సలహాలను ఇస్తుండేవారు.



నా అభిప్రాయం ఏమిటంటే .. పెద్దవాళ్ళు ఎలాగైనా ఉండగలరు...



 పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశముందని నా అభిప్రాయం.

 పిల్లలు ఎదిగే వయసులో సరైన పౌష్టికాహారం  తీసుకోవాలి . హాస్టల్లో సరిగ్గా ఆహారం తీసుకుంటారో లేదో తెలియదు.

 ఇక హాస్టల్స్లో  ర్యాగింగులు.. వంటి ఎన్నో సమస్యల గురించి వింటున్నాం.


 (హాస్టల్ బయట ఉన్నా కూడా ర్యాగింగులు ఉండే అవకాశం ఉంది కానీ.. హాస్టలో మరింత ఎక్కువ సమస్యలు ఉండే అవకాశం ఉంది కదా!).... 

ఇవన్నీ కూడా ఆలోచించి  ఉన్న ఊరిలోనే ఉండటం జరిగింది.


 ఇలా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు జరుగుతుండగా   .. దైవం దయ వల్ల  నా భర్తకు బదిలీ జరిగి మేము ఉన్న ఊరికి రావటం జరిగింది. ఇందుకు దైవానికి అనేక కృతజ్ఞతలు.


 ప్రస్తుతానికి ప్రమోషన్ తీసుకోవాలని అనుకోవటం లేదు. ఇబ్బందికరంగా బదిలీ వస్తే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది అని నా అభిప్రాయం.


  ఏమైనా ఈ రోజుల్లో మారిన  వ్యవస్థ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాతకాలంలో ఇన్ని సమస్యలు ఉండేవి కాదనిపిస్తుంది.


Friday, June 17, 2016

బదిలీ వ్యవస్థ వల్ల ఎన్నో ఇబ్బందులు...

ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో బదిలీల వ్యవస్థ ఉంది. ఉద్యోగస్తులను ఎన్నో ఊళ్లకు బదిలీలు చేస్తుంటారు.

 ఉదా.. బ్యాకింగ్ రంగాన్ని గమనిస్తే ..వాళ్ళను  దేశవ్యాప్తంగా బదిలీ చేసే అవకాశముంది. మారుమూల పల్లెటూళ్ళలో కూడా బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. 

అలాంటప్పుడు ఉద్యోగస్తులు వసతులు సరిగ్గా లేని ఊళ్ళకూ వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మా కుటుంబానికి సరైన సౌకర్యాలు లేవు.. మేము వెళ్ళము.. అంటే  పై అధికారులు ఊరుకోరు. 

మారుమూల ఊరికి వెళ్తే అక్కడ పిల్లలు చదువుకోవటానికి సరైన అవకాశాలు ఉండవు. ఇవన్నీ ఆలోచించి కుటుంబాన్ని వదిలి ఉద్యోగం చేసే వ్యక్తి ఒక్కరే వచ్చి ఉద్యోగం చేస్తుంటారు.

 అప్పుడప్పుడు వెళ్లి కుటుంబాన్ని చూసి రావటం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒంటరిగా ఉంటున్న వ్యక్తికీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.

 కొన్ని సంవత్సరాలు అలా ఉద్యోగం చేసినా సరే కుటుంబం ఉన్న ఊరికి  బదిలీ అడిగితే పై అధికారులు ఇస్తారో లేదో తెలియదు.

 మాకు తెలిసిన ఒక కుటుంబంలో భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పనిచేస్తున్నారు. భార్యకు కిడ్నీ జబ్బు వచ్చింది. భర్త బదిలీ అడిగినా పై అధికారులు బదిలీ చేయలేదు. 

కొన్నాళ్లకు భార్య చనిపోవటం జరిగింది. వేళకు వండుకుని సరిగ్గా భోజనం చేయకపోవటం వల్ల భర్త కూడా కొన్నాళ్ళకు చనిపోవటం జరిగింది. పిల్లలు అమ్మమ్మ వారి వద్ద ఉన్నారు. 

బదిలీల వల్ల ఎందరో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక టీనేజ్ పిల్లలకు వేరే ఊళ్లో కాలేజ్ సీట్ వస్తే ఇక వాళ్ళను హాస్టల్లో వేయటమో లేక తల్లి  గానీ తండ్రి గానీ  దగ్గర ఉండి చదివించటమో చేస్తున్నారు.

 ఈ రోజుల్లో విద్యావ్యవస్థ, ఉద్యోగవ్యవస్థ వల్ల చాలా కుటుంబాలలో కుటుంబసభ్యులు కలిసి జీవించే పరిస్థితి తగ్గిపోయింది.

 ఇక సైనికుల కుటుంబాలు అయితే పరిస్థితి మరీ కష్టం.

 ఇవన్నీ ఇలా ఉండగా మన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అమరావతి  ఇప్పుడే రాలేము..అక్కడ సరైన సౌకర్యాలు లేవంటున్నారు. 

నాకు తెలిసినంతలో సెక్రటేరియట్ ఉద్యోగస్తులకు  తరచూ బదిలీలు ఉండవనుకుంటున్నాను. సచివాలయ ఉద్యోగస్తులను అమరావతి తీసుకురావటానికి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామంటోంది. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్లకు జీతాలు పెంచటం జరిగింది.


హైదరాబాద్లో ఆఫీసులు ఉంటే ప్రజలు తమ పనుల కోసం అక్కడివరకూ రావలసి ఉంటుంది. ఆంధ్రా ఆఫీసులు హైదరాబాద్ నుంచి పనిచేస్తే కొన్నికోట్ల సొమ్ము తెలంగాణా రాష్ట్రానికి వెళ్తుందంటున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. 

 అయితే, అమరావతిలో భవనాలు వీలయినంత త్వరగా నిర్మించటం అవసరమే కానీ , ఆ కట్టడాలు దృఢంగా ఉండేలా నిర్మించటమూ అవసరమే. అందువల్ల భవనాల నిర్మాణం కొద్దిగా ఆలస్యమయినా భవనాలు నాణ్యతాపరంగా బాగుండేలా నిర్మించాలి. 

అసలు బదిలీలు ఎందుకు చేస్తారో ? ఇందుకు అనేక కారణాలు ఉన్నాయంటారు. 

 ఉద్యోగస్తులు ఒకే దగ్గర ఉంటే అవినీతి జరిగే అవకాశముందని , అందువల్లే బదిలీలు చేస్తారని కొందరి అభిప్రాయం. 

నా అభిప్రాయం ఏమిటంటే అవినీతి ఉద్యోగులను ఎన్నిఊళ్లకు  బదిలీ చేసినా అవినీతి చేస్తారు. నీతిమంతులు ఒకే ఊరిలో పనిచేసినా అవినీతి పనులు చేయరు.

 బదిలీలు చేయటం తప్పదు అనుకున్నప్పుడు దూరదూరాలకు కాకుండా ఒకే జోనులో లేక ఒకే జిల్లాలో మాత్రమే ఉన్న ఊళ్లకు బదిలీలు చేస్తే  కుటుంబం దగ్గరలో ఉండే అవకాశముంటుంది.

 ఈ బదిలీలు జరగటానికి ఇంకో కారణం ఏమిటంటే  మారుమూల పల్లెలలో కూడా ఆఫీసులు  ఉండటం వల్ల అక్కడ పనిచేయటానికి ఉద్యోగులు అవసరం. 

 అయితే పల్లెటూళ్ళలో పనిచేయటానికి ఉద్యోగస్తులు అంతగా ఇష్టపడరు. అందరూ సౌకర్యాలు ఎక్కువగా ఉండే నగరాలలో  ఉండటానికే ఇష్టపడుతున్నారు. 

సౌకర్యాలు తక్కువగా ఉండే చోట ఉద్యోగులు పనిచేయటం కోసం బదిలీల వ్యవస్థ వచ్చి ఉంటుందనిపిస్తోంది.

 బదిలీ వ్యవస్థ  వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు అనుభవిస్తున్నాయి.


బదిలీల కష్టాల గురించి ఇంతకు ముందు కూడా ఒక టపా రాసాను.  ఆసక్తి ఉన్నవారు చదవగలరు.  



Wednesday, June 15, 2016

అభివృద్ధి ఫలాలు స్థానికులకు లభించాలి.

 ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల స్థానికులు..వలసవాదులు మధ్య ఘర్షణ ఉన్న ధోరణి ఉన్నది.

 ఉపాధి కోసం వలస వచ్చే వారి వల్ల తమ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్న ధోరణి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది.. 

ఇలాంటి సమయంలో ఎక్కడి వాళ్లు అక్కడే తమతమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవటం మంచిది.

 పరాయి ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి ఉపాధి పొందటం బాగానే అనిపించినా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం. 


ఎవరి ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకుంటే పరాయి ప్రాంతానికి వలస వెళ్లే అవసరం ఉండదు.


ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఉపాధి విషయంలో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలి.


 అంతేకానీ రాష్ట్రం అభివృద్ధి చెందటం అంటే..పరాయి ప్రాంతాల వారు వచ్చి ఉపాధి పొందుతూ సుఖంగా ఉంటే ...స్థానికులకు ఉపాధి లభించక పరాయి ప్రాంతాలకు వలస వెళ్ళటం..అభివృద్ధి అనిపించుకోదు.


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ వారికే ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత లభించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్ళటాన్ని తగ్గించుకోవాలి .

 ఎక్కడైనా అభివృద్ధి జరిగితే ఇక ఎక్కడెక్కడినుంచో జనం వలసలు రావటం ప్రారంభిస్తారు. అప్పుడు స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. 

అందువల్ల ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలి. ప్రతి రాష్ట్రం వారు తమ సొంత రాష్ట్రంలోనే ఉపాధి పొందేలా ప్రభుత్వాలు పనిచేయాలి.


కొందరు యాజమాన్యం  ఏం చేస్తున్నారంటే, పరాయి రాష్ట్రం వాళ్ళు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని చెప్పి  ఇతరరాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల స్వరాష్ట్రం వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి కదా !

 ఒకసారి వలస వచ్చినవాళ్ళలో చాలామంది  వలస వచ్చిన దగ్గరే స్థిరపడిపోతారు. అలాంటప్పుడు తరువాత కాలంలో వలసవారికి స్థానికులకు మధ్య గొడవలు వచ్చే అవకాశముంది. 

ఇవన్నీ తగ్గాలంటే ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటం అవసరం.

  ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఉపాధి పొంది సుఖంగా ఉంటుంటే  స్థానికులు ఉపాధి లభించక వలస పోతుంటే ఇక అభివృద్ధి ఎవరికోసం ?

అక్కడి ప్రజలు ఇక్కడికీ..ఇక్కడి ప్రజలు అక్కడికీ వలసలు  జరగటం జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ వలసలు మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 ప్రతి రాష్ట్రము, ప్రతి దేశమూ కూడా చక్కగా అభివృద్ధి చెందాలి.   మనం సుఖంగా ఉండాలంటే మన ఇరుగుపొరుగూ కూడా బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే మనకూ ఇబ్బందులు ఉండవు.



Wednesday, June 8, 2016

రాష్ట్రం అభివృద్ధి...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అందరూ కృషిచేయవలసి ఉంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు.

 ఆంధ్రప్రదేశ్లో ఎంతో సముద్ర తీరం ఉన్నా,   పోర్టులు అంతగా అభివృద్ధి చేయబడలేదు. అరకు, తలకోన వంటి ఆహ్లాదకర ప్రాంతాలు ఉన్నా ఎవరూ అభివృద్ధి చేయలేదు.

 ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు , ప్రజలు కూడా  రాజధాని అనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే ఎక్కువగా తమ పెట్టుబడులను పెట్టారు. 

దురదృష్టం ఏమిటంటే విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరుగుతోంది.

 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చటం లేదు. 

  ఆర్ధికంగా మిగులు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పధకాలు ప్రకటించటంలో  గొప్పేం లేదు. 

 ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తే అది గొప్పవిషయం.  

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి రాజకీయపార్టీలు, అధికారులు, ప్రజలు అందరూ ఐకమత్యంగా కృషిచేయాలి.

 ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారే కానీ... వారిలో కొంత మందికి ఐకమత్యం, సొంత రాష్ట్రం అంటే అభిమానం అంతగా ఉన్నట్లు అనిపించదు.  

వ్యక్తిగతంగా ఆర్ధికాభివృద్ధి, సౌకర్యాలు ఉంటే చాలదు ..ఆత్మాభిమానం  కూడా ఉండటం అవసరం. 

 ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పెట్టుబడులను పెట్టాలి.

  ఆంధ్రప్రదేశ్ వాళ్ళు .....  ఆత్మాభిమానం, ఐకమత్యంతో    రాష్ట్ర అభివృద్ధి కొరకు  ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో కృషిచేయవలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి  చెందాలి. అందుకు  అందరూ పౌరుషంగా కృషిచేయాలి.

 పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ చిత్తశుద్ధితో కృషిచేస్తే త్వరలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.



Wednesday, June 1, 2016

ఎక్కడ చూసినా జనసమ్మర్దమే...



ఈ మధ్య ఊరు వెళ్లి వచ్చాము. ఎక్కడ చూసినా జనసమ్మర్దమే.

 మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అవుతాయని సామెత ఉంది కదా . జనాభా పెరిగేకొద్దీ వనరులు సరిపోవు.

 మన దేశ జనాభాకు తోడు ఇతరదేశాల నుండి కూడా జనం ఇక్కడకు  వస్తున్నారంటున్నారు.

 (అయితే, మన దేశం వాళ్లు కూడా ఇతరదేశాలకు వెళ్తున్నారు లెండి. )


ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...దేశం బాగా అభివృద్ధి చెందినా ప్రమాదమేనేమో అనిపిస్తోంది.

( అలాగని  పేదరికం ఉండటం  మంచిది కాదు.)


దేశం బాగా అభివృద్ధి చెందితే ఎక్కడెక్కడి వాళ్ళో వస్తారు. జనాభా బాగా పెరిగిపోతుంది. సమస్యలూ పెరుగుతాయి.

పాతకాలంలో భారతదేశపు సంపద చూసే కదా విదేశీయులు వచ్చి దాడులు చేశారు.

ఇంకా ఏమనిపిస్తోందంటే.. దేశంలో మరీ ఎక్కువ అభివృద్ధి జరగక పోయినా ఫర్వాలేదు.

 అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా ఉండాలి.

 అవసరమైనంత వరకు ఆధునిక టెక్నాలజీ ఏర్పరుచుకోవాలి.

   దేశ రక్షణ కొరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి..అనిపిస్తోంది.