koodali

Friday, October 31, 2014

దేశంలోని సంపద నల్లధనంగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం ఎంతో అవసరం..


విదేశాలకు  తరలిపోయిన  నల్లధనాన్ని తిరిగి  స్వదేశానికి  తీసుకురావటం  అనేది  ఆచరణలో  ఎంతవరకూ   నెరవేరుతుందో  తెలియదు  కానీ, 


నల్లధనాన్ని  కూడబెట్టే  వారి పట్ల  కఠినంగా  వ్యవహరిస్తూనే....దేశంలోని  సంపద  నల్లధనంగా మారకుండా  ముందస్తు  చర్యలు  తీసుకోవటం  కూడా  ఎంతో  అవసరం.


అధికపన్నుల  ద్వారా  ప్రభుత్వానికి  వచ్చే  ఆదాయం  కంటే ,  పన్నుఎగవేతల  ద్వారా  ప్రభుత్వానికి  వచ్చే  నష్టమే  ఎక్కువ.


దేశంలో  పన్నుల  విధానాన్ని  సడలించి , పన్నులను  కొద్దిగా  తగ్గిస్తే  పన్నుఎగవేతలు  కొద్దిగానైనా  తగ్గి  నల్లధనం  ఎక్కువకాకుండా  ఉంటుందనిపిస్తోంది..


ఇలాంటి  చర్యల  వలన  దేశంలో  డబ్బు  విదేశాలకు  తరలటం  తగ్గి,  విదేశాలలో  దాచుకున్న  డబ్బు  తిరిగి  ఇండియాలో  పెట్టుబడిగా  మారే  అవకాశం  ఉందనిపిస్తోంది..


...................


నల్లడబ్బు  సమస్య  పరిష్కారానికి  సామరస్యపూర్వక   చర్యలు   చేపడుతూనే..   ఎంత చెప్పినా  మాట  విననివారిపట్ల  కఠినంగానూ  వ్యవహరించాలి. 


 స్వచ్చ  భారత్  పిలుపు  ఇచ్చినట్లే  దేశాభివృద్ధిలో  భాగం  కావాలని  ధనవంతులకూ  పిలుపునిస్తే  బాగుంటుందేమో..

...............

మనదేశంలో  పెట్టుబడులు  పెట్టాలని ... మనవాళ్ళు  విదేశాలకు  వెళ్ళి మరీ   అక్కడి వాళ్ళను  ప్రాధేయపడుతుంటారు.


విదేశాల  వాళ్ళు  వచ్చి  ఇండియాలో  పెట్టుబడులు  పెట్టినా  లాభాలను  వాళ్ళ దేశాలకు  తీసుకు  వెళ్ళిపోతారు.


అలా  కాకుండా,  భారతీయుల  వద్ద  అపారంగా  ఉన్న పెట్టుబడులతో  దేశంలో  అభివృద్ధి  కార్యక్రమాలను  చేపట్టి ,  సంపద దేశంలోనే  ఉండేటట్లు  చర్యలు  తీసుకోవాలి.

....................

 దేశంలో ఎందరో  పేదప్రజలున్నారు. పరిస్థితి  ఇలా  ఉండగా..


మరి  కొందరు  ప్రజలు  దేశాన్ని  దోచి   తమ తరతరాలకూ  సరిపడా   సంపదను  కూడబెట్టడం  అనేది  ద్రోహం....ప్రజలలో నైతికవిలువలు  నశించినప్పుడు  ఇలాంటివి  జరుగుతాయి.


 చిన్నతనం  నుంచి  పెల్లలకు  నైతికవిలువలతో  కూడిన  విద్యను  అందించటం  ద్వారా.. చక్కటి  పౌరులు  తయారయినప్పుడు  మాత్రమే  దేశంలోని  ఎన్నో  సమస్యలు  తగ్గుతాయి.





Wednesday, October 29, 2014

రాజధాని........


ఉమ్మడిరాష్ట్రంలో  ఉన్నప్పుడు  హైదరాబాద్లో  మాత్రమే  ఎక్కువగా   ఉపాధి  అవకాశాలు  ఉండేలా  జరిగింది  కాబట్టి ,  మా  హైదరాబాద్  ..మా   రాజధాని  హైదరాబాద్...అంటూ   ఎక్కువమంది  యువత  ఉపాధి  కోసం   హైదరాబాద్ కే  వెళ్ళేవారు. 
.................................. 

ఇక  ఇప్పటి  ఆంధ్రప్రదేశ్ కు  రాజధానిని  అభివృద్ధి  చేసుకునే  విషయంలో   ఇంతకుముందు  జరిగిన  పొరపాటును  మళ్ళీ  జరగకుండా  జాగ్రత్త  తీసుకోవాలి.


అభివృద్ధి  రాష్ట్రమంతటా  జరగాలి.  ఉపాధి  కోసం  రాజధానిపై  ఎక్కువగా  ఆధారపడే  అవసరం  లేకుండా  ఎక్కడికక్కడ  ఉపాధి  అవకాశాలు  ఉండేలా  అభివృద్ధి  జరగాలి.


ఆంధ్రప్రదేశ్లో  కోస్తా,  ఉత్తరాంధ్రా,  రాయలసీమ  అంటూ  తేడాలు  ఉన్నాయి. 


 ఇలాంటి  తేడాలున్నప్పుడు ,  వేలకోట్లు  ఖర్చుపెట్టి  రాజధానిని  అద్భుతంగా  అభివృద్ధి  చేసుకోవటం  కన్నా....  తక్కువ  ఖర్చుతో  రాజధానిని  అభివృద్ధి  చేసుకుని ... మిగతా  డబ్బులతో  రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలను  బాగా  అభివృద్ధి  చేసుకుంటే  బాగుంటుంది.


రాయలసీమ,  ఉత్తరాంధ్ర,  కోస్తా ..మూడు  ప్రాంతాలలోనూ  అభివృద్ధి  చక్కగా  జరగాలి .


   రాజధాని  అభివృద్ధి  కన్నా ,  మొత్తం  రాష్ట్రాభివృద్ధి  జరిగితే  ప్రాంతాల  మధ్య  వైషమ్యాలు  ఉండవు.

.......................... 

రాష్ట్రంలో  అభివృద్ధికి  అపారమైన  అవకాశాలున్నాయి.. .
ఇంతకుముందు  ఇవన్నీ   నిరాదరణకు  గురయ్యాయి.  అభివృద్ధి  చేయబడలేదు.

 వేసవిలో  చల్లదనం  కోసం  ఊటీ  వెళ్తారు  కొందరు. అయితే  ఆంధ్రప్రదేశ్లో  కూడా  అరకు,  తలకోన  వంటి  చక్కటి  ప్రదేశాలున్నాయి.  వీటిని  అభివృద్ధి  చేసుకోవాలి .


ఆంధ్రప్రదేశ్లో  ఎంతో  తీరప్రాంతం  ఉంది.  నదీ  తీరాలున్నాయి.  కాలువలూ  ఉన్నాయి....రాష్ట్రంలో  ఎన్నో  బీచ్ లు  ఉన్నాయి.  పర్యాటక  రంగానికి  అద్భుతమైన  అవకాశాలున్నాయి.


కోస్తా  ప్రాంతంలో  ఎన్నో  కాలువలున్నాయి. ఆ  కాలువలకు  చక్కటి   గట్లు,  మెట్లు  కట్టి , ఒడ్దున  కొబ్బరిచెట్లను  పెంచి  బోటింగ్  ఏర్పాటు  చేస్తే ఎంతో  బాగుంటుంది.(కేరళలోలా..) 


  కాలుష్యాన్ని  కలిగించే  పరిశ్రమలను  ఎక్కువగా  నిర్మించి  ఉపాధి  అవకాశాలు  కల్పించటం  కన్నా  సేవారంగం,  పర్యాటకం  వంటివి  అభివృద్ధి  చేస్తే  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  కల్పించవచ్చు.


ఉపాధి  కోసం  పరిశ్రమలూ   అవసరమే  కానీ,   కాలుష్యం  తక్కువగా   ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి . వ్యవసాధారిత   పరిశ్రమలనూ   ఏర్పాటు  చేయవచ్చు. 


రాష్ట్రమంతటా  అపారమైన  సహజవనరులున్నాయి.  వీటిని  విచ్చలవిడిగా   వాడెయ్యకుండా  తగుమాత్రం  వాడుకుంటూ  చక్కటి  అభివృద్ధిని  సాధించవచ్చు.
...............................  

 రాజధాని  బాగా  పెరిగినా  ప్రమాదమే.  హైదరాబాదును  చూస్తున్నాము  కదా ! అభివృద్ధి  పెరిగే  కొద్దీ  అసాంఘిక  శక్తులూ  పెరుగుతున్నాయి.  కాలుష్యమూ  పెరుగుతోంది. ఇవన్నీ  తలుచుకుంటే  బాబోయ్ ! ఎందుకొచ్చిన  అభివృద్ధి .. అనిపిస్తుంది.


రాజధాని  అంటే  భూముల  రేట్లు  పెరిగి  తమ  ఆస్తి  విలువ  పెరిగిపోతుందని  కొందరు  చంకలు  గుద్దుకుంటున్నారు  కానీ,  భూముల  రేట్లతో  పాటు  ఇళ్ళ  అద్దెలూ  పెరుగుతాయి.  సరుకుల  రేట్లూ  పెరుగుతాయి.


 రాజధానిలో  బాగా డబ్బున్న  వాళ్ళకు  తప్ప..  పేద,  మధ్యతరగతి  ప్రజలకు  జీవనం  కష్టంగా  ఉంటుంది.  దీనిని  అభివృద్ధి  అని ఎలా  అనగలము ? ఇలాంటి  అభివృద్ధి  అవసరమా ? అనిపిస్తుంది.


హైదరాబాద్లో  ఎంతో  కాలుష్యం  పెరిగింది.  వేడీ  పెరిగింది, రేవ్  పార్టీలూ,  డ్రగ్స్  వాడకం   గురించీ  వింటున్నాము.  ఇవన్నీ  గమనిస్తే ,  ఆంధ్ర  కొత్త రాజధాని  ప్రస్తుతానికి  మధ్యరకంగా  ఉంటేనే  మంచిదనిపిస్తుంది. 


ఆడంబరమైన  రాజధాని  కన్నా ఆహ్లాదకరమైన  రాజధానే  ముద్దు. రాజధాని  అభివృద్ధి  మాత్రమే  వద్దు..రాష్ట్రమంతటి  అభివృద్ధే  ముద్దు.


.......................... 

ప్రస్తుత  ఆంధ్రప్రదేశ్   ప్రభుత్వం ...  రాష్ట్రంలో  మొక్కలు  విస్తారంగా  పెంచటానికి  శ్రద్ధ  కనబరచటం  ఎంతో  సంతోషకరమైన విషయం. ఈ మధ్య  వచ్చిన  విశాఖ గాలివాన సమయంలో  ప్రభుత్వం  చక్కటి చర్యలు  తీసుకుంది. 


Monday, October 27, 2014

మురుగునీటిని నదులలో, సముద్రాలలో కలపకుండా.....మురుగునీటితో విద్యుత్ తయారుచేయవచ్చేమో..


నదులలోను,  సముద్రాలలోనూ  ...డ్రైనేజీ  నీటిని  లేక  పరిశ్రమల  నుంచి  వెలువడే  రసాయనిక  వ్యర్ధాలను  వదలటం  ఎంతో  ఘోరం. 

 నదుల పరీవాహక  ప్రాంతం  వెంబడి ఉన్న  నగరాల  నుంచి  వచ్చే మురుగును  అక్కడి నదులలో  వదిలేస్తున్నారట.  


నదులలో  డ్రైనేజీ  నీటిని  వదలటమంటే ....మన  ఇంట్లోని  మంచినీటి  బిందెలో  డ్రైనేజీ  నీటిని  తెచ్చి  కలుపుకుంటే  ఎంత  ఘోరంగా  ఉంటుందో  అంత  ఘోరం. 


జీవుల  మనుగడకు   నీరు  ఎంతో  ముఖ్యం.  అలాంటి  నీటిలో  పనిగట్టుకుని  మురికినీటిని  కలుపుకోవటం విచారించవలసిన విషయం . 

  ................................ 

జీవుల  మనుగడలో  నదులు, సముద్రాల  యొక్క  పాత్ర    ఎంతో  ముఖ్యమైనది. 


సూర్యరశ్మి  వల్ల  నీరు  ఆవిరి  కావటం..ఆ  ఆవిరి  తిరిగి  వర్షంలా  నేలపై  కురియటం .. ఈ  ప్రక్రియలో   సముద్రం  యొక్క  పాత్ర  ఎంతో  ముఖ్యమైనది.


సముద్రాలలో  వదులుతున్న  కాలుష్యం  వల్ల  సముద్రంలోని  ఎన్నో జీవుల  మనుగడకు  ముప్పు  వస్తోంది.  


...................


 మురుగునీటిని  నదులలో, సముద్రాలలో  కలపకుండా... ..కాలువలలో  నిల్వ  చేసి, ఆ మురుగునీటితో   విద్యుత్  తయారుచేయవచ్చేమో .. 


పేడ  ద్వారా  బయో గ్యాస్ ఉత్పత్తి  చేస్తున్నారు... చెత్తతో  కూడా  విద్యుత్  ఉత్పత్తి  చేస్తున్నారు.


మురుగునీటితో   విద్యుత్  తయారయితే  మురుగునీటి  సమస్య   తగ్గుతుంది .  అలాగే  విద్యుత్  సమస్యా  తగ్గుతుంది  

.........................

మురుగునీటిని  నదులలో,  సముద్రాలలో  కలపకుండా , ఆ మురుగునీటిని  కొంతవరకు  శుద్ధిచేసి  పంటలు పండించటానికి  వాడుకోవచ్చు.


అయితే , ఈ  రోజుల్లో  మురుగునీటిలో  అనేక  రసాయనాలు  కలుస్తున్నందువల్ల    హానికరమైన  రసాయనాలతో  కూడిన  మురుగునీటితో  పండించిన ఆహారపదార్ధాలను  తింటే  జబ్బులు  వచ్చే  అవకాశముంది.


ఆధునిక కాలంలో  రసాయనాల   వాడకం  విపరీతంగా  పెరిగింది.


 రసాయనాలు  ఉన్న  డిష్  వాషర్,  రసాయనాలతో  కూడిన  సబ్బులు,  షాంపూలు, డిటర్జెంట్లు, ఇంటి  శుభ్రతకు  వాడే  యాసిడ్లు...ఇలా  ఎన్నో  ప్రమాదకరమైన  గాఢమైన  రసాయనాలు  మురుగునీటితో  కలిసి  నదులలో  కలుస్తున్నాయి.


ఇక  పరిశ్రమల  నుంచి  విడుదలయ్యే  రసాయనాలు   మరింత  హానికరం.


ఇవన్నీ  భూమిలో  కూడా  కలుస్తున్నాయి.  ఇలా  భూమి,  నీరు,  గాలి..కలుషితం  అయిన  వాతావరణం  వల్ల  అనేక  జబ్బులు  పెరుగుతున్నాయి.

.................................. 

మన  పూర్వీకులు  నదులను,  సముద్రాలను  పూజించేవారు. 


పాతకాలం వాళ్ళు  శుభ్రత  కొరకు   మట్టి,  బూడిద, నిమ్మరసం,  శనగపిండి,  కుంకుడురసం...వంటి  సహజసిద్ధమైన  పదార్ధాలనే  వాడేవారు.వీటివల్ల  పొల్యూషన్  ఉండదు.

...............

మోడీ గారు  చెప్పినట్లు  త్రాగునీరు  స్వచ్చంగా  ఉంటే  ఎన్నో  రోగాలు  దరిచేరవు.


నదులలో ,  సముద్రాలలో .. మురుగునీటిని  వదలకుండా  ప్రభుత్వం,  ప్రజలూ జాగ్రత్తలు  తీసుకోవాలి.



Friday, October 24, 2014

స్వచ్చ భారత్ కల సాకారం కావాలంటే .


స్వచ్చ  భారత్  అంటే   వీధుల  శుభ్రత  మాత్రమే  కాదు. 

సమాజంలో  పెరుగుతున్న   అవినీతి..  అసభ్య  పోకడలు.. నైతికవిలువల  దిగజారుడుతనం  వంటి  విషయాలను  కూడా శుభ్రం  చేసుకోవాలి. 


వీధుల  పరిశుభ్రత  విషయాన్ని  గమనించితే...  


పరిశుభ్ర  భారత్  కోసం  ఈ మధ్య  చాలామంది  చీపుర్లు  పట్టుకుని  రోడ్లను  ఊడ్చేయటం  ఎంతో  సంతోషకరమైన  విషయం.


 సినిమా  వాళ్ళు,  రాజకీయనాయకులు,  మరికొందరు  సెలబ్రిటీలు  కూడా  రోడ్లను  ఊడుస్తున్న  దృశ్యాలను  వార్తలలో  చూస్తున్నాము. 


 అయితే  వీళ్ళు అప్పుడప్పుడు  రోడ్లను  ఊడ్చటం  వల్ల  మాత్రమే  పరిశుభ్ర  భారత్  ఎంతవరకు  వస్తుందో తెలియదు  ...  అయితే   ఈ  చర్యల  వల్ల ప్రజలలో  కొంత  చైతన్యం  వస్తుందన్నది  నిజమే . 


ఏ  సమస్యనైనా పరిష్కరించాలంటే  అప్పటికప్పుడు   కొన్ని తాత్కాలిక  చర్యలు  తీసుకుంటూనే  శాశ్వత  పరిష్కారానికి  కూడా  చర్యలను  చేపట్టాలి.  అప్పుడే  సమస్యలు  చక్కగా  పరిష్కారమవుతాయి. 


 శాశ్వత  పరిష్కారం  కావాలంటే  సమస్య  మూలం  నుంచి  శ్రద్ధ  తీసుకోవాలి.

.......................

స్వచ్చభారత్  సాధించే  విషయంలో  ప్రజలతో  పాటు   ప్రభుత్వానికీ  ఎంతో    బాధ్యత  ఉంది.


రోడ్లను  ఊడ్చటంతో  పాటు  అసలు  రోడ్లపైన  చెత్త  వేయకుండా  పటిష్టమైన  చర్యలను  చేపట్టాలి.  రోడ్లపై  చెత్త  వేసేవారి  పట్ల  అవసరమైతే  కఠినంగా  వ్యవహరించాలి.


 అదే  సమయంలో  చెత్త  వేయటానికి  సరిపడినన్ని డస్ట్ బిన్లను  కూడా  ప్రభుత్వం  ఏర్పాటు  చేయాలి. 


ప్లాస్టిక్  వేస్ట్  వేయటానికి  విడిగా  డస్ట్ బిన్లను   ఏర్పాటు  చేసి,   ప్లాస్టిక్  వ్యర్ధాలను  వాటికి  కేటాయించిన  డస్ట్ బిన్లలోనే  వేసేటట్లు  బాగా  ప్రచారం  చేయాలి. 


తిరుమలలో  ఇలాంటి  ఏర్పాట్లు  ఉన్నాయి.  రోజూ  వేల  మంది  భక్తులు  వస్తున్నా  కూడా  తిరుమల  చాలా  వరకూ  శుభ్రంగానే  ఉంటుంది.

................

చట్టాన్ని  పకడ్బందీగా  అమలుపరిచే  విధానం  ఉన్నప్పుడు  ప్రజలూ  సరైన  దారిలోకి  వస్తారు.


 చట్టాన్ని  సరిగ్గా  లక్ష్యపెట్టని  ప్రజలు  ఉన్నప్పుడు  కఠినమైన  శిక్షలు, వాటిని  సక్రమంగా  అమలుచేసే  వ్యవస్థ   కూడా   ఉండవలసిందే.


  ఉదా..ఇండియాలో  ఎక్కడపడితే  అక్కడ  చెత్త  పడేసే  ప్రజలు  కూడా  విదేశాలకు  వెళ్తే      ఎక్కడపడితే  అక్కడ  చెత్తను  వేయరు కదా ! ( అక్కడి  కఠినమైన  శిక్షలకు  భయపడి..)



కొన్ని  దేశాలలో  అయితే,  రోడ్లపై  చెత్త  వేసిన  వారికి  జరిమానా  విధించటంతో   పాటూ వారితోనే  రోడ్లను  శుభ్రం  చేయిస్తారట.( ఈ  పద్ధతి చాలా  బాగుంది. ) 

................

  ప్లాస్టిక్  వ్యర్ధాలను,  ఎలెక్ట్రానిక్  వ్యర్ధాలను ,  వంటింటి  నుంచి  వచ్చే  వ్యర్ధాలను  వేయటానికి  విడివిడిగా  డస్ట్ బిన్లను   ఏర్పాటు  చేయాలి. 


ప్రతి  వీధిలోనూ   ఈ  మూడురకాల  డస్ట్ బిన్లూ  ఉండాలి.


 ఇలాంటి  ఏర్పాట్లు  ఉన్నప్పుడు  ప్రజలు  కూడా  త్వరగానే  మారుతారు.

.....................

వీధులలో  ఉండే  ఆరుబయట  టాయిలెట్లు  గబ్బుకొట్టకుండా   ఉండాలంటే  టాయిలెట్లులో  నీటి  సౌకర్యం  ఏర్పరచాలి. పంపులలో  వచ్చే  నీరు  వృధా  పోకుండా  ఎప్పటికప్పుడు  వాల్వులను  పరిక్షిస్తూ  ఉండాలి.

వీధులలో  సులభ్ టాయిలెట్స్   తరహా  టాయిలెట్స్  మరిన్ని  ఏర్పాటు  చేయాలి.

..................
స్వచ్చ  భారతాన్ని   సాధించటానికి  మన  ప్రాచీనులు  ఎన్నో  చక్కటి  విధానాలను   అందించారు.

   ఉదా..పాతకాలంలో  ఎవరి  ఇంటిముందు వీధిని  వారే  శుభ్రం  చేసుకునేవారు.  ఆడవాళ్ళు  ఉదయాన్నే లేచి   ఇంటిముందు  ఊడ్చి,  కళ్ళాపి  చల్లి,  ముగ్గులు  వేసుకునేవారు.  


ఎవరి  ఇంటిముందు వీధిని  వారే  శుభ్రం  చేసుకుంటే  వీధులన్నీ  వాటికవే శుభ్రంగా  ఉంటాయి  కదా!

.....................

ప్రపంచం  పొల్యూట్  కావటానికి  ఆధునిక  టెక్నాలజీ  కూడా  కారణమే. 


 పరిశ్రమల  నుంచి  వచ్చే  రసాయన  వ్యర్ధాలను   నదులలో,  సముద్రాలలో  కలుపుతున్నారు.


ఇంకా, ఈ రోజుల్లో ప్లాస్టిక్ వంటి  త్వరగా  శిధిలం  కాని  వ్యర్ధాలు  ఎక్కువయ్యాయి.


 ప్లాస్టిక్  మరియు  ఎలక్ట్రానిక్   వ్యర్ధాలు   శిధిలం  కావటానికి  చాలా  కాలం  తీసుకుంటాయి. కుప్పలుగా  పేరుకున్న  ప్లాస్టిక్  వ్యర్ధాలు  నీటిప్రవాహాలకు  అడ్డుపడి  వరదలకు  కారణమవుతున్నాయి.

.................

పాతకాలంలో  మార్కెట్  నుంచి  సరుకులను  తెచ్చుకోవటం  అనేది  తక్కువగా  ఉండేది. ఒకవేళ   బయట  నుంచి  సరుకులను  తెచ్చుకోవాలంటే    ఆకులతో  చేసిన  పొట్లాలలో  కట్టి  గానీ,  లేక  గిన్నెలలో  గానీ  పోసి ... గుడ్డ  సంచీలో  వేసి  ఇంటికి  తెచ్చుకునేవారు. 


 ఆకులు  ,  వస్త్రపు  సంచి  వంటివి  పర్యావరణంలో  సులభంగా  కలిసి  శిధిలమయిపోతాయి. అందువల్ల పాతకాలంలో  చెత్త  ఎక్కువగా  ఉండేది  కాదు.  

..............

ఈ  రోజుల్లో  సూపర్  మార్కెట్కు  వెళ్తే  ప్రతి  వస్తువూ   ప్లాస్టిక్  పాకెట్స్లోనే  పాక్  చేసి  ఉంటుంది.  ఒక్కొక్క  ఇంటినుంచి  నెలకు  వచ్చే  ప్లాస్టిక్  వ్యర్ధాలు   చాలానే   ఉంటాయి.


అందువల్ల,  ప్లాస్టిక్   వ్యర్ధాలను  పడెయ్యటానికి  ప్రత్యేకమైన  డస్ట్  బిన్లను  ఏర్పాటుచేసుకుంటే  మంచిది.

...................

ప్లాస్టిక్  పెట్రోల్ కు  సంబంధించిన పదార్ధమేనట..  అందువల్ల, ప్లాస్టిక్  వ్యర్ధాలతో  వాహనాలు  నడిచే  ఇంధనం  తయారీని  కనిపెట్టారు  కొందరు  ఔత్సాహికులు.  అలాంటి  వారిని  ప్రోత్సహించి  పెట్రోల్  నుంచి  ఇంధనం  తయారుచేస్తే  బాగుంటుంది.



 (  ప్లాస్టిక్ వ్యర్ధాల  నుంచీ తయారుచేసిన  ఇంధనం  వల్ల వాతావరణ  కాలుష్యం  పెరుగుతుంది  కానీ, ప్లాస్టిక్  వ్యర్ధాలను అలాగే  బయట పడేయటం  కన్నా  కొంతలో  కొంత  నయం  కదా !)

............

వీధులు  శుభ్రంగా  ఉండాలంటే,  పారిశుధ్య సంస్థలో ఎక్కువ  సంఖ్యలో   ఉద్యోగస్తులను నియమించాలి. ఇందువల్ల  కొంత  నిరుద్యోగ  సమస్యా  తీరుతుంది.


మనవాళ్ళు  ప్రతిదానికీ   డబ్బు  లేదు  అంటారు. కొత్తగా   ఉద్యోగాలు  ఇవ్వాలన్నా  డబ్బులేదు  అంటారు.


  దేశంలో  అవినీతికి  అడ్డుకట్టవేయాలి. నల్లధనం   విషయంలోనూ  పటిష్టమైన  చర్యలు  తీసుకోవాలి. 


సంపద  కొందరి  వద్దే   ఉండిపోకుండా  అందరికీ  అందేలా  చర్యలు  తీసుకోవాలి.  ఇవన్నీ  చేస్తే  డబ్బు  అదే  వస్తుంది.

...........

 చిన్నతనం  నుంచి  నైతిక  విలువల  పట్ల  గౌరవాన్ని  పెంచే  విద్యను బోధించితే  చాలా  సమస్యలు  పరిష్కారమవుతాయి.

    
ఇవన్నీ  సక్రమంగా  అమలు  కావాలంటే..   చిత్తశుద్ధి,  పట్టుదలా  ఎంతో  అవసరం.  పాలకులలో , ప్రజలలో  గట్టి  పట్టుదల  ఉంటే  స్వచ్చభారత్  కల సాకారమవుతుంది.
...............
ఈ బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  ప్రతి  ఒక్కరికి  కృతజ్ఞతలండి.


Wednesday, October 22, 2014

మేము సోలార్ ఇన్వెర్టర్ ఏర్పాటుచేసాము..


కొంతకాలం  క్రితం  మేము  సోలార్ ఇన్వెర్టర్  తీసుకున్నాం.

   అంతకుముందు ,   మా  బంధువులు  మరియు  చుట్టుపక్కల  వాళ్ళు  సోలార్ ఇన్వెర్టర్   సరిగ్గా  పనిచేయదని  చెపుతూ , అది  కాకుండా  మామూలు  ఇన్వర్టర్  కొనమని  ఒత్తిడి  చేసారు. 

 సోలార్  ఇన్వెర్టెర్  మాత్రమే  వాడాలని  గట్టి పట్టుదలతో  ఉన్న  మాకు  ఈ సమాచారం  కొంత  ఆందోళనను  కలిగించింది.  

తీరా  కొన్నాక  అది  సరిగ్గా  పనిచేయకపోతే  ఎలా ? అని  సందిగ్ధంలో  పడ్డాము.

మరి  కొంతమందిని  కూడా  సోలార్  గురించి  వివరాలు  కనుక్కున్నాము.

కష్టేఫలే బ్లాగ్  శర్మ  గారు  కూడా  వారి  ఇంటికి  సోలార్  అమర్చినట్లు   వారి  బ్లాగులో  వ్రాసారు.  వారు  వ్రాసిన  విషయాలను  చదివిన  తరువాత  ధైర్యం  వచ్చింది. 

ఎలాగైతేనేం ,  మేము    సోలార్  ఇన్వెర్టెరే  ఏర్పాటుచేసాము.  ఇప్పటివరకూ  అది   చక్కగా  పనిచేస్తూంది.  ఎటువంటి  సమస్యా  రాలేదు.

........................

 సోలార్  విద్యుత్  వల్ల  విద్యుత్  కొరత  తీరటం  సంతోషకరమైన విషయమే.   అయితే , ఈ  విషయాన్ని  ఇంకో  కోణం  నుంచి  ఆలోచిస్తే  విద్యుత్  ఎక్కువగా  లభిస్తే  కొన్ని  నష్టాలూ  ఉన్నాయనిపిస్తుంది. 

ఉదా..  సోలార్  విద్యుత్ ఎక్కువగా  ఉంది  కదా  అని  విపరీతంగా  పరిశ్రమలను  నెలకొల్పితే ,  పర్యావరణ  కాలుష్యం  పెరిగిపోతుంది,  ఖనిజవనరులు  కూడా త్వరగా  అయిపోతాయి.


 ఖనిజవనరులు  ఎంతో   అమూల్యమైనవి. ప్రకృతిలో  ఖనిజవనరులు  ఏర్పడాలంటే  ఎన్నో  వేల , లక్షల   సంవత్సరాలు  పడుతుందట. 

 ఖనిజాలను  త్రవ్వి  వాడేయటానికి  మాత్రం  కొద్ది  సంవత్సరాలు  చాలు.


 కొందరు  ఇతరదేశాల  వాళ్ళు  తమకు  భవిష్యత్తులో  ఖనిజవనరుల  కొరత  రాకుండా ,  ముందుచూపుతో  తమ  దేశంలోని  గనులను  త్రవ్వకుండా ,  పొరుగుదేశాల  నుంచి  ఖనిజాలను  దిగుమతి  చేసుకుంటున్నారట. 

మనమేమో  విచ్చలవిడిగా  గనులను  త్రవ్వి  ఖనిజాలను  వెలికి తీసేస్తున్నాము. 
...................

సోలార్  విద్యుత్  ఉంది  కదా  అని  నిరంతరాయంగా  వాడేస్తూ  ఉంటే  వాతావరణంలోకి  వెలువడే  రేడియేషన్  వల్ల  ఓజోన్  పొర  దెబ్బతింటుంది. 
................

ప్రపంచ  క్షేమం కోసం  విద్యుత్ ను ,  ఖనిజవనరులను  పొదుపుగా  వాడుకోవాలి. అప్పుడు  పర్యావరణం  కాలుష్యం ఎక్కువగా  జరగకుండా ఉంటుంది.  ఖనిజాలూ వెంటనే  తరిగిపోకుండా  ఉంటాయి. 
...............

ఇవన్నీ  వట్టి  భయాలు.   ఖనిజాలు  ఎందుకు  అయిపోతాయిలే ... అని  అనుకుంటే  భవిష్యత్తులో  ఇబ్బందులు  తప్పవు. 

గత  కొన్ని  సంవత్సరాల నుంచి  వాడుతూన్న  పెట్రోల్  వంటి  ఇంధనవనరులు  అయిపోతుండగా...  మరికొన్ని  సంవత్సరాలకు  ఖనిజవనరులు  మాత్రం  అయిపోవా  ఏమిటి. 

 ఖనిజవనరులు అయిపోయినా   ఫర్లేదు,  పర్యావరణం  కాలుష్యం  అయినా   పర్లేదు ..  అంటే  మాత్రం  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించ వలసి  వస్తుంది  మరి. 


Thursday, October 16, 2014

ఇలాంటి సంఘటనల నుంచి ...


ఇంతకు ముందు కర్నూల్ లో  వరదలు  వచ్చినప్పుడు  చాలా  నష్టం  జరిగింది.  ఊరిలో  చాలా  బురద  వచ్చింది. ఆ  బురదను  తీయటానికి  చాలా  రోజులు పట్టింది.... ప్రజలు  ఎన్నో  ఇబ్బందులను  అనుభవించారు.

 అలంపురం  దేవాలయం  వద్ద  బురద  చాలా  రోజుల  వరకు  ఉన్నది.  సుప్రసిద్ధమైన  దేవాలయము  వద్ద  శుభ్రం చేయటానికి  చాలా సమయం  తీసుకోవటమనేది  ఎంతో  బాధాకరమైన  విషయము.
............................. 

ఇప్పుడు  వైజాగ్లో  వచ్చిన  గాలివాన  వల్ల  కూడా  చాలా నష్టం  జరిగింది. చాలా  చెట్లు  పడిపోయాయంటున్నారు.  

వైజాగ్లో  కొన్ని  సంవత్సరాల  క్రితం  అంటే  సుమారు 1990  సమయంలో  నేషనల్  హైవేకు  ప్రక్కన  ఎన్నో  మొక్కలను  నాటారు.  అవన్నీ  పెరిగి   ఎంతో  పచ్చగా  ఉండేది  వైజాగ్.  

ఇప్పుడు  చాలా  చెట్లు  పడిపోయాయంటే  ఎంతో  బాధగా  ఉంది.  మళ్ళీ  అవన్నీ  పెరగాలంటే  కొన్ని  సంవత్సరాలు  పడుతుంది.
................ 

 చెట్లు  వేర్లతో  సహా  కూలిపోయిన ప్రదేశంలో  సహజంగానే  గొయ్యి  ఏర్పడుతుంది.  ఆ  చెట్టును  సగం  నరికి ,  వేళ్ళతో  సహా  తిరిగి  అక్కడే  నాటితే  కొంతకాలానికి  మళ్ళీ  చిగురించే  అవకాశం  ఉంది.  ముదురు  కాండం  కాబట్టి  త్వరగా  పెరిగి  పెద్దవవుతాయి.
........................ 

ఇలాంటి  ప్రకృతి  వైపరీత్యాలు  వచ్చినప్పుడు  ప్రభుత్వాలతో  పాటు  ప్రజలు  కూడా  సహాయకార్యక్రమాలలో  పాల్గొంటే  పరిస్థితులు  త్వరగా  కుదుటబడటానికి  అవకాశముంటుంది.

 కర్నూలులో,  వైజాగులో... ఎందరో  ప్రజలు  కూడా  సహాయకార్యక్రమాల్లో  పాల్గొనటం  సంతోషకరమైన  విషయం.
............................. 

అయితే,   కొందరు  ప్రజలు   కష్టాలలో  ఉన్న  ప్రజలకు  సహాయం  చేస్తే,  మరికొందరు  జనాలు   కష్టాలలో  ఉన్న  ప్రజలను  కూడా  దోచుకుంటారు. 

అసలే  సరుకులు  అందక  ప్రజలు  ఇబ్బందులు  పడుతుంటే  కొందరు  వర్తకులు  ఉన్న  సరుకును  దాచేసి  ఎక్కువ  ధరకు  సరుకులను  అమ్మటం  దారుణం. 

కష్టాలలో  ఉన్నవాళ్ళకు  అందే  సహాయంలో  కూడా  అవినీతి  పనులు  చేసే  వాళ్ళను  ఏమనాలో  అర్ధం  కావటం  లేదు. 

 ఎవరి  పాపపుణ్యాలు  వారికి  జమ  అవుతూనే   ఉంటాయి.  కష్టాలలో  ఉన్న  ప్రజలను  కూడా  మోసం  చేసే  వారు   తగిన  మూల్యాన్ని  చెల్లించుకుంటారు.

...................

ఇలాంటి  ప్రకృతి  వైపరీత్యాల  నుంచి  కొన్ని   ముందు  జాగ్రత్తలను  నేర్చుకోవచ్చు. 


ఉదా..తుఫాన్  వస్తుందని  ముందే  తెలిసినప్పుడు  ఉన్నత,  మధ్య  తరగతి  ఆదాయ  వర్గాల  ప్రజలు   నిత్యావసర  వస్తువులను ( సుమారు  వారానికి  సరిపడా.. బియ్యం,  పప్పులు,  కూరలు,  పాలపొడి  ..వంటివి..) ముందే  ఇంట్లో  తెచ్చిపెట్టుకుంటే  తుఫాన్  తరువాత  వెంటనే  రోడ్డుమీద  పడవలసిన  అవసరం  ఉండదు.


కొవ్వొత్తులు, సోలార్ దీపాలు, బ్యాటరీ లైట్స్ వంటివీ  దగ్గర  ఉంచుకోవాలి.


 తుఫాన్  రాకముందే  వాహనాలలో  టాంక్  నిండా ఇంధనం  నింపి  ఉంచుకుంటే  బాగుంటుంది. 


అలాగని  మరీ  ముందు  జాగ్రత్తగా  బోలెడు  వస్తువులను  కొని  నిల్వ  చేస్తే  మార్కెట్లో  సరుకుల  కొరత  ఏర్పడుతుంది. 


ఉన్నత, మధ్య  తరగతి  ఆదాయ  వర్గాల  వాళ్ళు  కొద్దిగా నిత్యావసర  వస్తువులను  నిల్వ  ఉంచుకుంటే.....   ఇళ్ళు  కొట్టుకుపోయి  నిత్యావసర  సరుకులకు  కూడా  డబ్బు  లేని  పేద  ప్రజలకు   సహాయం  చేయటం  ప్రభుత్వానికి  తేలిక  అవుతుంది. 
 ....................... 
 
ఇవన్నీ  చూస్తుంటే  భవిష్యత్తులో  ఎప్పుడైనా  కరెంట్  లేనప్పుడు  ప్రజలు  ఇబ్బందులు  పడకుండా  ఉండాలంటే....  నీటికోసం  చేతితో  కొట్టే  బోరుపంపులు,  నూతులు, ఉండవలసిన   అవసరం  ఉందనిపిస్తోంది. 

ఇంటి పైన  ఉండే  సోలార్  పేనల్స్  కూడా  గాలికి  ఎగిరిపోయే  ప్రమాదముంది  కాబట్టి   వాటి  చుట్టూ కూడా  కాంక్రీట్తో  గోడలు  కట్టుకోవాలేమో ? లేక  సోలార్  పేనల్స్ను  పైకప్పుకే  బిగించేయాలేమో? 




Monday, October 13, 2014

పర్యావరణ విధ్వంసం...విపరీత వాతావరణమార్పులు ..


క్టోబర్ 13 ప్రకృతి  విపత్తుల  నియంత్రణ  దినోత్సవం అంటున్నారు.

 ఎండాకాలంలో  విపరీతమైన ఎండలు ,అక్టోబర్లో  కూడా  ఎక్కువ  ఎండలు, సకాలంలో  సరిగ్గా  వానలు  పడకపోవటం,   అకాలంలో  అకస్మాత్తుగా  విపరీతమైన  వర్షాలు  వచ్చి  వరదలు  రావటం..ఇలా  వాతావరణం  చిత్రవిచిత్రంగా  మారటానికి  మానవుల  స్వయంకృతాపరాధాలు   చాలావరకు కారణం.

ప్రపంచవ్యాప్తంగా కూడా  ఇలాంటి  విపరీత  వాతావరణమార్పులు  వస్తున్నాయి.   

  మనదేశంలోనే  చూస్తే  ఆ మధ్య  వచ్చిన  సునామీ,  అకస్మాత్తుగా  వచ్చిన  ఉత్తరాఖండ్  విలయం,  ఈ  మధ్య అనూహ్యంగా  వచ్చిన  కశ్మీర్  వరదలు ,  నిన్న,మొన్న  జరిగిన  విశాఖ  తుఫాన్..  ఇవన్నీ  చిత్రంగానే ఉన్నాయి..

 ప్రకృతికి  విరుద్ధంగా   మానవాళి  చేస్తున్న  చర్యలకు   నిరసనగా  ప్రకృతి   హెచ్చరికలు  చేస్తూనే  ఉంది.  అయినా, మనుషులు  సరిగ్గా  పట్టించుకోవటం  లేదు. 

 ఇలాంటి  విపత్తులు  జరిగినప్పుడు  కొంతకాలం  బాధపడటం , తరువాత  అన్నీ  మర్చిపోయి  మళ్ళీ  ప్రకృతి  వ్యతిరేక  చర్యలు  కొనసాగించటం  జరుగుతోంది. 
...........................

 విశాఖలో  వచ్చిన  గాలివేగంవల్ల , కొన్ని  చోట్ల  మూసిఉన్న  కిటికీల  అద్దాలు  కూడా  పగిలిపోయాయంటున్నారు. గాలి  వేగానికి  అపార్ట్మెంట్స్  కూడా  ఊగినట్లు  అనిపించి  ఇంట్లో  ఉన్న  సామాను  కూడా  కదిలిపోయాయట.

 ఇంకా కొంచెం  ఎక్కువ  వేగంగా  గాలి  వీస్తే  చాలా  ఇళ్ళు  పునాదులతో  సహా  కూలిపోయేవట. భగవంతుని  దయ  వల్ల  మరింత  వేగంతో  గాలిరాలేదు.  అందుకు  దైవానికి  కృతజ్ఞతలు.

.....................

టెక్నాలజి  అవసరమే.  అయితే,  పర్యావరణాన్ని  విధ్వంసం  చేసేటంత  స్థాయిలో  దానిని  వాడకూడదు  కదా!

తుఫాన్  సందర్భంగా  ప్రజలకు  ఎంతో  సహాయసహకారాలను  అందిస్తోంది ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం. 
..............

  ఈ  మధ్య  చాలా  అపార్ట్మెంట్లు  కార్  పార్కింగ్  కోసం  బేస్మెంట్  వద్ద  ఖాళీ  జాగా  వదిలి  పైన  ఇళ్ళు  కడుతున్నారు.  అంటే , ఒంటి  స్థంభం  మేడలాగా  స్థంబాలపై  ఇళ్ళు  అన్నమాట.

 ఒక  మాదిరి  భూకంపాలు వచ్చినప్పుడు గానీ, మధ్య  స్థాయి తుఫాన్  గాలివేగానికి  గానీ  స్థంబాలపై  నిలిచిన  ఇలాంటి  ఇళ్ళు  ఊగిపోయే  అవకాశాలు  ఎక్కువ.

  కార్  పార్కింగ్  వదలకుండా, క్రింద  కూడా  గోడలు, ఇళ్ళు  ఉన్నట్లయితే  ఇలాంటి  కట్టడాలు  ఊగిపోకుండా  కొంతలోకొంత  బలంగా  ఉంటాయి. 

 అపార్ట్మెంట్స్  బేస్మెంట్  వద్ద కార్ పార్కింగ్ కు  స్థలం  వదలటం  తప్పనిసరి  అయితే , కనీసం  పార్కింగ్  వద్ద  గోడలు  కట్టుకోవాలి.   
 ..............

ఇక,  భారీ భూకంపాలు,  భారీ  ఈదురు  గాలులు  వస్తే  ఎలాంటి  కట్టడం  అయినా  తట్టుకోవటం  కష్టమే.. 

 అలాంటి  భారీ  విధ్వంసాలు  జరగకుండా  ఉండాలంటే  మానవులు  ప్రకృతికి  వ్యతిరేకమైన  చర్యలను, పర్యావరణానికి  హాని  కలిగించే  చర్యలను  చేయకూడదు..  
................

  (ఒక  విషయం  ఏమిటంటే,  ప్రకృతి  విపత్తులు  ఏర్పడే  సూచనలు  వచ్చినప్పుడు  ముందు  జాగ్రత్తగా  ఆ  ప్రాంతాలలోని  ప్రజలను  పునరావాస  కేంద్రాలకు  తరలిస్తారు. 

  పునరావాస  కేంద్రాలలో నెలసరి (పీరియడ్స్)తో  ఇబ్బంది పడే   ఆడవారూ ఉంటారు . వారికి ఎంతో  అవసరం  అయిన శానిటరీ  నేప్కిన్స్ అందుబాటులో  ఉంచాలి.
( ఇలాంటి  విషయాలు  పైకి చెప్పాలంటే చాలా ఇబ్బందికరం .)
...............

కొండలను  కొట్టివేయటం,  గనుల  పేరుతో  భూమిని  విచ్చలవిడిగా   తవ్వేయటం,  ఇష్టం  వచ్చినట్లు  నదులపై  విద్యుత్ ప్రాజెక్ట్స్  నిర్మించటం, టెక్నాలజీ  పేరుతో  వాతావరణంలోకి విచ్చలవిడిగా  కర్బన  ఉద్గారాలను  వదలటం..ఇలా  ఎన్నో  విధ్వంసక  చర్యలతో  వాతావరణాన్ని  కలుషితం  చేస్తూ ఎన్నో  మూగ  జీవజాతుల  కష్టాలకు  కారణమవుతున్నారు.


    తాను  కూర్చున్న  కొమ్మను  తానే  నరుక్కుంటూ  అదే  అభివృద్ధి  అనుకుంటూ  ఉంటే ,  భవిష్యత్తులో మరింత  మూల్యాన్ని  చెల్లించుకోవలసి  వస్తుంది.. ఇప్పటికైనా  మానవులు  తమ  అంతులేని  కోరికలను  తగ్గించుకుని  జీవించటం  నేర్చుకుంటే  మంచిది.




Saturday, October 11, 2014

అంగారక గ్రహానికి యాత్ర..


వరాహస్వరూపుడైన  విష్ణుమూర్తి భూగోళాధిదేవత అయిన వసుంధరల (భూదేవి ) యొక్క  కుమారుడు  మంగళుడు....అని  ప్రాచీన  గ్రంధముల  ద్వారా  తెలుస్తోంది. 

( లక్ష్మీదేవికి వసుంధర అనే పేరు కూడా ఉంది.)

భూదేవి  కుమారుడు  మంగళుడు  అనే  విషయాన్ని  గమనిస్తే,  భూమికి  అంగారక   ( మంగళ ) గ్రహానికి   పోలిక  ఉండే  అవకాశముందని  తెలుస్తోంది.
..............

మంగళ గ్రహానికి ఉపగ్రహాన్ని  పంపే  విషయంలో విజయాన్ని  సాధించినందుకు  అందరికి  అభినందనలండి.


అయితే,  ఇలాంటి  సందర్భాలలో  కొందరు  నాస్తికవాదులు  రంగప్రవేశం  చేసి,  చూసారా ..   ఇంత  శాస్త్రసాంకేతికత  పెరిగినా ...ఇంకా  గ్రహాల  ప్రభావం  మానవుల  మీద  ఉండటం, కుజదోషం  అనే  విషయాలను  నమ్మటం మానెయ్యాలి  అంటారు.

కుజగ్రహ కక్ష్యలోకి  ఉపగ్రహాన్ని  పంపినంత  మాత్రాన ,  గ్రహాల ప్రభావం  మానవుల  మీద  ఉండకుండా  ఉంటుందా...దానికి  దీనికీ  సంబంధం  ఏమిటి ?

...................................

  పూర్ణిమ,  అమావాస్య  రోజుల్లో  చంద్రుని  యొక్క  ప్రభావం  వల్ల    సముద్రం  యొక్క  ఆటుపోట్లు  పెరగటం,  తగ్గటం  ఉంటుందంటారు. 

పూర్ణిమ, అమావాస్య  రోజుల్లో  మానవుల  ప్రవర్తనలో  కూడా  కొంత  తేడా  ఉండే  అవకాశముందని  పరిశోధనల  ద్వారా  తెలిసిన  విషయం.

 చంద్రుని  వద్దకు   వెళ్ళివచ్చినా  కూడా  భూమిపై  చంద్రుని  ప్రభావం  ఎప్పటిలాగే  ఉంది..... చంద్రుని  యొక్క  ప్రభావం  వల్ల  సముద్రం  యొక్క  ఆటుపోట్లు  పెరగటం,  తగ్గటం  జరుగుతూనే  ఉంది. 

  అలాగే  , కుజగ్రహానికి  వెళ్ళివచ్చినా  సరే,  కుజగ్రహం  యొక్క  ప్రభావం   ఉంటూనే  ఉంటుంది.

...................
గ్రహాల ప్రభావం  మానవుల  మీద  ఉంటుందని  ప్రాచీనులు  తెలియజేసారు.  ప్రాచీనులు  తెలియజేసిన   విషయాలు  నిజమేనని  ఆధునిక   పరిశోధనల  ద్వారా   కూడా  క్రమంగా  నిరూపించబడుతున్నాయి.  


జ్యోతిష్యం  కూడా  శాస్త్రమే. అందుకు  ఒక  చక్కని  ఉదాహరణ .. పంచాంగకర్తలు  పంచాంగం  ప్రకారం  లెక్కలు  వేసి   రాబోయే  గ్రహణాలను    ఎంతో  ముందే  చెప్పగలుగుతున్నారు  కదా!
........................ 

ఇక్కడ  బాధాకరమైన  విషయమేమిటంటే, ఆధునిక  శాస్త్రసాంకేతికత  విషయంలో  ఒక  విజయం  లభిస్తే,  అది ఆస్తికులకు  వ్యతిరేకం  అన్నట్లుగా కొందరు  మాట్లాడటం  జరుగుతోంది. 


 వాస్తవంగా  చెప్పాలంటే,  ఆధునిక  శాస్త్రవేత్తలలో  చాలామంది  దైవాన్ని  నమ్మేవాళ్ళున్నారు.     రాకెట్ వంటి  వాటిని  అంతరిక్షంలోకి  పంపేముందు ఆ  ప్రయోగం  విజయవంతమవ్వాలని  దైవాన్ని  ప్రార్ధించే శాస్త్రవేత్తలూ ఉన్నారు.


 సైన్స్ అంటే  నాస్తికులకు  మాత్రమే  సంబంధించినది  కాదు. సృష్టిలో  ఉన్న  సైన్స్  అంతా  దైవం  సృష్టించిందే  కదా!  

..................

శాస్త్రసాంకేతికరంగంలో  కొద్ది  ప్రగతి  సాధించగానే , కొందరు  ఏమంటారంటే,  దేవుడు  అంటూ  ఎవరూ లేరు ..అంటుంటారు. ఇలా  అనటం  సరైనది  కాదు.  ఇంకా,  ప్రాచీనులు  మనకు  అందించిన  విజ్ఞానాన్ని  తక్కువచేసి  మాట్లాడటం  కూడా సరైనది  కాదు.

మానవులు  విమానాన్ని  కనుగొనటానికన్నా  ముందే   పక్షులు  గాలిలో  ఎగురుతున్నాయి. నీటిలో  వెళ్ళే  సబ్  మెరైన్ల  కన్నా  ముందే  చేపలు  నీటిలో  ఈదుతున్నాయి. 

సృష్టిలో, మానవులతో  సహా  అన్నింటినీ  సృష్టించిన  సృష్టికర్తే  మొదటి  శాస్త్రవేత్త. 

దైవాన్ని  చులకనగా  మాట్లాడటం  తగనిపని.

  ప్రాచీనులు  మనకు  తెలియజేసిన  విజ్ఞానంలో  చాలా  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకునే  స్థాయికి  ఆధునిక  విజ్ఞానం  ఇంకా  ఎదగలేదు. 


 మనకు  అర్ధం  కాని  విషయాలన్నీ  మూఢనమ్మకాలే  అనుకోవటం  కొందరు ఆధునికుల  మూఢనమ్మకం.



Friday, October 3, 2014

దసరా...


ఓం ..                                           

సాయి సాయి.


శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,
 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ   భైరవీ
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ
  జాజీపంకజ  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనే  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వాలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

6. అంబా  సృష్టివినాశ  పాలనకరీ  ఆర్యా  విసంశోభితా
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ

7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  

8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా  ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ


   ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.





ఆదిపరాశక్తి కధలు..మూడవ భాగము..


ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. 

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.



శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.



దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.



హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.



సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 


అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.



ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది   కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో   రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .

రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.



శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.



దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.

........................

ఈ  కధలను  ఇంతకు  ముందు  కూడా బ్లాగులో   ప్రచురించాను .



  దేవీనవరాత్ర  వ్రతకధ....వంటి  పుస్తకాలలో  ఈ  కధలను  పండితులు  క్లుప్తంగా  వ్రాసారు. 


  పండితులందరికి  కృతజ్ఞతలు.