koodali

Wednesday, April 30, 2014

ఓం.....అత్యంత శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రము .



శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.



శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.

    దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!
               శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .



     శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి  దివ్య  సిద్ధమంగళ  స్తోత్రము  ఎంతో  శక్తివంతమైనది.  శ్రీపాద  శ్రీవల్లభ స్వామి  వారి  గురించిన  ఎన్నో  వివరములు   మరియు  ఎంతో  శక్తివంతమైన  సిద్ధమంగళ  స్తోత్రము .....



 ఈ  లింకులో  ఉన్నాయి....1.Sripada Charitamrutam - Sripada Sri Vallabha - 1 - Webs
Siddhamangala Stotram - Sripada Sri Vallabha - 1 - Webs


        

........Sripada Sri Vallabha - 1 - Webs.

     

     Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube



  Dattatreya - Siddha Mangala Stotram.mp4 - YouTube. 



 

 

Monday, April 28, 2014

ఒకసారి నారాయణమహర్షి నారదమహర్షితో..కొన్ని విషయాలు ....


ఒకసారి నారాయణమహర్షి నారదమహర్షితో ఎన్నో విషయములను చెబుతూ , ఇలా కూడా చెప్పటం జరిగింది ...

జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ, భార్యాపుత్రులు గానీ, జ్ఞాతిమిత్రులు గానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి  ....... అనీ,

ఇంకా ఎన్నో విలువైన విషయములను చెప్పటం జరిగింది.


ఇంకా, జగన్మాత గురించి చెబుతూ........... 

ఆవిడ జగన్మాత కనక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా ! అని కూడా చెప్పటం జరిగింది.

ఇలా దేవతలు, పెద్దలైన మహర్షులు వంటివారు మనకు ఎన్నో విలువైన విషయములను అందించటం జరిగింది.

.....................................


పెద్దలు  తెలియజేసిన   విషయాలను  గమనిస్తే,   మనకు  ఎన్నో విషయాలు  తెలుస్తాయి. నాకు  తోచిన  కొన్ని ..
 
పరమాత్మ పరాశక్తికి అందరూ బిడ్డలే.

పుణ్యాత్ముల గురించి దైవం ఎంతగా ఆలోచిస్తారో పాపాత్ములను గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.

పాపాలు చేస్తున్న వారిని  దైవం శిక్షించటమంటే , ఆ విధంగా వారిని  సక్రమమార్గంలోకి మళ్ళించి , వారికి కూడా  పుణ్యాత్ముల  వలెనే  పరమపదమును అందించటం కొరకే.

( లోకంలో తల్లిదండ్రులు   చెడుమార్గంలో వెళ్తున్న తమ పిల్లలను కొద్దిగా శిక్షించి అయినా సరే, మంచిమార్గంలోకి   తీసుకువస్తారు కదా ! అలాగన్నమాట. )

 .............................

ఈ  రోజుల్లో   చాలామంది  ,  దైవాన్ని నమ్ముతూ  కూడా , పాపపుణ్యాల  గురించి   తెలిసి కూడా , మనస్సును  అదుపులో  పెట్టుకోలేక  ఎన్నోపాపాలు  చేస్తున్నారు కదా !

ఇక ,  ఇలాంటివారికి   దైవభీతి,  పాపపుణ్యాల  భయం లేకపోతే  ఇంకా   ఎన్ని పాపాలు  చేస్తారో !  లోకాన్ని ఎంతగా పీడిస్తారో  కదా !  అనిపిస్తుంది.


వీరు కూడా  భయంతో కానీ,  భక్తితో  కానీ,    పూజలు  చేయగా చేయగా,  ఎప్పటికైనా  మంచిదారిలోకి   వస్తారు  అనిపిస్తుంది.   ( కొన్ని జన్మలు కూడా  పట్టవచ్చు. )

అప్పటికీ  మంచి  దారిలోకి   రాకపోతే ,   దైవం    తనదైన  శైలి  ద్వారా,   వారిని   సక్రమమార్గంలోకి   తీసుకురావటం   జరుగుతుంది.... అనిపిస్తుంది.

 దైవం  ఎప్పటికప్పుడు   లోకంలో  ధర్మమును  కాపాడటం జరుగుతుంది.

................................

అచ్చు తప్పులు  వంటి  పొరపాట్లు  లేక   ఇతర   పొరపాట్లు  ఉన్నచో  దైవం  దయచేసి  క్షమించాలని  వేడుకుంటున్నాను.

అంతా  దైవం  దయ.




Saturday, April 26, 2014

ముహూర్తాలు....సత్కర్మాచరణ.

 ఓం.

లోకహితం  కోరి  దైవం    జ్యోతిషశాస్త్రాన్ని    లోకానికి  అందించారు.     అయితే,  చక్కటి    ముహూర్తాలలో  పనులు  ప్రారంభించాలన్నా    దానికి    ఎంతో  అదృష్టం,    పూర్వపుణ్యం  ఉండాలని,   సత్ ప్రవర్తన   అర్హతగా  ఉన్నవారికే   అన్నీ  కలిసివస్తాయి    అని   అనిపిస్తుంది.
 

  ఈ  రోజుల్లో  కొందరు   అదేపనిగా    పాపాలు  చేస్తూ   కూడా   ,  తమ  జీవితాలు  బాగుండాలనీ,  ఏదైనా  పని  ప్రారంభించే  ముందు     గొప్ప  ముహూర్తాల   కోసం     తాపత్రయపడటం    జరుగుతోంది.



  కానీ,   పాపాలను  చేసే   వ్యక్తులు   మంచి  ముహూర్తం  కోసం  ఎంత  తాపత్రయపడినా   ఆశించిన  ఫలితం  దక్కదు.   చేసుకున్నవారికి  చేసుకున్నంత  మహాదేవా  అన్నట్లు ,  ఎవరికెంత  ప్రాప్తమో  అంతే  దక్కుతుందట.  
 
  
 పాపాలు  చేసేవారు   గొప్ప  పండితుల  వద్ద  ముహూర్తం  పెట్టించుకున్నా  కూడా ,   దైవవశాన  ,  ఆ  పండితుల   నోట  కూడా  ( వారికి   తెలియకుండానే)    ఏదో  ఒక  దోషం  ఉన్న  ముహూర్తమే  వస్తుంది.   ఒకవేళ  మంచిముహూర్తమే  పండితులు  వ్రాసినా   కూడా,      ఏదో  విధంగా   ఆ  శుభముహూర్తం  తప్పిపోయే  అవకాశం  ఉంది.     (ఉదా  ... గడియారం  తప్పు  సమయాన్ని  చూపించటం.....   .వంటివి  ) 


మంచివ్యక్తులకు    ముహూర్తం    చూడటానికి     కుదరకపోయినా  కూడా   ,  వారికి    తెలియకుండానే  చక్కటి  ముహూర్తం  ఉన్న  సమయంలోనే   వారు  పనులు  ప్రారంభించే  విధంగా  దైవం  అవకాశాన్ని  కలిగిస్తారు. 
 

 ఏ జాతకాలూ    తెలుసుకోకపోయినా    చెడుపనులకు    దూరంగా ఉంటూ,    సత్ప్రవర్తనను    కలిగిఉండి    దైవంపైన    భారం వేసి    జీవించే    వ్యక్తికి    దైవమే    సరియైన   దారిని   చూపిస్తారు.
....................

ముహూర్తాల  గురించి    పురాణేతిహాసాల్లో  చక్కటి  ఉదాహరణ  ఉంది.    అది  ఏమిటంటే.....

  రావణాసురుడు  ఎంతో  పాండిత్యం  తెలిసిన  వ్యక్తి  అంటారు.   అతనికి   జ్యోతిషం  గురించి  కూడా  బాగా  తెలుసట.  తన    సంతానం    బాగుండాలని  భావించి,  వారిపట్ల  నవగ్రహాలు  శుభంగా 
మాత్రమే  ఉండాలని  అనుకోగా....   

   సూర్యదేవుని  పుత్రుడైన    శనిదేవుని  కోపం    వల్ల ,   ఇంద్రజిత్తు  జాతకం    చెడ్డగా   మారిపోయిందని  అంటారు.
 

 రావణుడు  దేవతలను,  మునులను ,   మంచి  వారిని   .... బాధించటం  చేస్తుండేవాడు.   ఒకసారి  దేవతలతో  జరిగిన  యుద్దంలో  గ్రహాలను  కూడా  బంధించి  తెచ్చి  తన  రాజ్యంలో    ఉంచాడట.  
 

 (   భగవాన్  శ్రీరామ  భక్తుడైన  భగవాన్ హనుమంతులవారు   గ్రహాలను   విడిపించగా,  వారు    ఎంతో  సంతోషించారట.  అందువల్ల   శనివారం  నాడు  హనుమంతుని  పూజించిన   వారిని   శని   బాధించరని   అంటారు.   సూర్యుడు  హనుమంతునికి  గురువు.  )
 

   రావణాసురుని  కధ  ద్వారా    ఏమి  తెలుస్తుందంటే,     ఎన్ని  పూజలు  చేసినా   పాపాలు  చేసేవాళ్ళకు  దైవం  సహకరించరు  అని,  అలాంటి  వారికి    మంచి  ముహూర్తాలు   కూడా    దొరకవు .....   అని  తెలుస్తుంది.  

 ఇవన్నీ  గమనించితే..... దైవకృపను  పొందాలంటే ,   పూజలు  చేయటంతోపాటూ  సత్ప్రవర్తన   కూడా    ఎంతో   ముఖ్యమని    తెలుస్తోంది.

........

ఈ  రోజుల్లో  కూడా  కొందరు  .  ఒక  చేత్తో  పాపాలూ  ....... ఒక  చేత్తో  పూజలు    చేస్తూ     దైవాన్నే  మోసం  చేయాలని  చూస్తున్నారు  . రావణాసురుడంతటి  వాని    ఆటలే  సాగలేదు.   ఇక     ఈ  నాటి   పాపాత్ముల     అతితెలివి     ఎందుకూ  పనికిరాదు. 


  తల్లితండ్రులు    తమకు  పుట్టబోయే  సంతానం  మంచి  ముహూర్తంలో  జన్మించాలని,  వారి  భవిష్యత్తు  బాగుండాలని    ఎంతో  తాపత్రయపడతారు.  తమ   సంతానం  యొక్క  భవిష్యత్తు  బాగుండాలని  తల్లితండ్రులు  ఆశపడటం  సహజమే.  
 

  అయితే,     చక్కటి  భవిష్యత్తు  కలిగిన  సంతానం  కలగాలన్నా,  చక్కటి  ముహూర్తాలు  కలిసి  రావాలన్నా  ..... పెద్దవాళ్ళు  చక్కటి  నైతికవిలువలతో  కూడిన  జీవితాన్ని    కలిగిఉండాలి.     కనీసం   సత్ప్రవర్తన  కొరకు   సాధ్యమయినంత  వరకు    ప్రయత్నించాలి.  
..............................

కొంతకాలం  క్రిందట  మేము  ఒక   ఉరిలో  ఉన్నప్పుడు  మాకు  తెలిసిన    ఒకరికి  సంతానం  లేరు.  కొంతకాలానికి  ఆమె    గర్భం  ధరించింది.   వారు  ముందే  డెలివరీ  కోసం  మంచి  ముహూర్తాన్ని  కూడా    చూసి  పెట్టుకున్నారు. 



 ఇక  వారం  రోజుల్లో  డెలివరీ  ఉందనగా  దురదృష్టవశాత్తూ   తల్లి    మృతశిశువును  ప్రసవించింది.   పెద్ద పేరున్న    డాక్టర్లు  ఎంత  ప్రయత్నించినా  బిడ్డను  రక్షించలేకపోయారు.  పాపం  ఆ  తల్లిదండ్రులు    ఏ  జన్మలో  చేసుకున్న  పాపఫలితం  వల్లో    అలా  జరిగి  ఉంటుంది. 
 

ఇలాంటివి  గమనిస్తే  ముందే  అనుకున్న   ముహూర్తంలో  చక్కగా  పని  జరగాలన్నా  దైవానుగ్రహం  ఉండాలని  తెలుస్తుంది.  దైవానుగ్రహం  ఉండాలంటే    వ్యక్తులకు  పూర్వపుణ్యం  ఉండాలి.  పూర్వపుణ్యం  ఉండాలంటే  సత్కర్మలు  చేసి   ఉండాలి.


    ఎట్లా  చూసినా , దైవకృపను  పొందాలంటే  సత్కర్మాచరణే  మానవుల  కర్తవ్యమని  స్పష్టమవుతుంది.

 మాకు  తెలిసిన  ఇంకొక  ఆమెకు    ఒక  గర్భాన్ని   కోల్పోవటం  జరిగితే ,     తరువాత   నాగేంద్రస్వామిని   ఆరాధించటం,   దైవానికి   పుట్టలో  పాలు  పోయటం  చేసారు.   కొద్దికాలంలోనే   వారికి     చక్కటి  అబ్బాయి  పుట్టటం  జరిగింది.  నాగులచవితికి  భక్తిగా  పుట్టలో  పాలు  పోసిన  ఆమె  ఒక  లేడిడాక్టర్.


అంతా  దైవం  దయ.  వ్రాసిన   విషయాలలో ఏమైనా పొరపాట్లు  ఉంటే   దయచేసి   క్షమించాలని   దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 
 
ఈ బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి    అనేక    కృతజ్నతలండి .

Tuesday, April 22, 2014

ఈ నాటి పిల్లలకు ఏ విధమయిన ఎడ్యుకేషన్ అవసరము అంటే .......



ఈ రోజుల్లో చదువు అన్న పదానికి అర్ధమే మారిపోయిందని అనిపిస్తోంది . అంటే సంపాదన కోసమే చదువు అన్నట్లు ఉంది కదా మరి.



భుక్తితో పాటూ దైవ భక్తి, ఉన్నతవిలువలతో కూడిన చదువు అవసరమని నా అభిప్రాయం.



సమాజములో పేదరికం పెరిగిపోవటానికి ,ఇన్ని నేరాలు, ఘోరాలు జరగటానికి ముఖ్యకారణం
నైతిక విలువలు తగ్గటం .....అంతేకాని డబ్బు లేకపోవటం కారణం కాదని అనిపిస్తోంది.


ఉదాహరణకు....నైతిక విలువలు  ధర్మం మీద గౌరవం ఉన్నవారు ప్రపంచములో సంపద అంతా తనకే కావాలని అత్యాశ పడరు.



ఇందువలన సంపద అందరికీ సమానముగా అందుబాటులోకి వచ్చి పేదరికం ఉండదు.తిండి లేక చనిపోయేవాళ్ళు ఉండరు.
 

ధర్మాన్ని పాటించేవారు మగవారయినా , ఆడవారయినా ,ఎటువంటి బలహీన క్షణము ఎదురయినా సరే పరాయి స్ర్తీ,పురుషులను పూజ్యభావంతో మాత్రమే చూస్తారు.

ఇందువలన అందరి కుటుంబములు పచ్చగా ఉంటాయి.కుటుంబ వ్యవస్థ   విచ్చిన్నం అవటం జరగదు.హత్యలు,ఆత్మహత్యలు ఉండవు.
 

ధర్మాన్ని పాటించేవారు అసూయ,లోభం, దొంగతనం, పరాయి సొమ్ముకు ఆశపడటం జరగదు.  ధర్మబద్ధముగా అభివృద్ధి చెందటానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే తమకు అంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటారు. 


ఇందువలన వ్యక్తులు,కుటుంబాలు,దేశాలు మద్యన కక్షలు, యుద్ధవాతావరణం ఉండదు. బోలెడు డబ్బు నష్టం ఉండదు.

 
ధర్మాన్ని పాటించేవారు సమస్త జీవకోటి యందు దయను కలిగి ఉంటారు.పర్యావరణానికి విచ్చలవిడిగా హాని కలిగించరు.



ఇందువలన జీవ పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. చెట్లు పచ్చగా ఉండి సకాలంలో వర్షాలు పడతాయి.అప్పుడు ఆహారం కొరత ఉండదు.


వీటివలన అర్ధమయ్యేది ఏమిటంటే,   ప్రపంచములో ఆనాడు కానీ, ఈనాడు కానీ ఇన్ని యుద్ధాలు, ఇంత గందరగోళం ,ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయంటే  దైవభీతి, పాపభీతి .. లేకపోవటం,  ధర్మం నైతిక విలువ
ను  పాటించని కొంతమంది ప్రజలవల్లనే.


అందువలన పిల్లలకు మంచి విలువలను నేర్పించటం ఎంతో ముఖ్యం. చాలా సమస్యలకు అది పరిష్కారమని  అనిపిస్తుంది.



ఎడ్యుకేషన్  అంటే  కేవలం  పాఠశాలలో  మాత్రమే  నేర్పించేది  కాదు,  తల్లితండ్రులు  మరియు  సమాజం  నుంచి  కూడా  పిల్లలు  ఎంతో  నేర్చుకుంటారు. ఎన్నో  విషయాలను  తెలుసుకుంటారు.

 అందుకని   తల్లితండ్రి,  పాఠశాల,  మరియు  సమాజం  ..ఇలా  అన్ని  చక్కగా  ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి.



Monday, April 21, 2014

మంచి కర్మకు మంచి ఫలితము....చెడ్డ కర్మకు చెడ్డ ఫలితము..


కొందరు 
అధర్మపరులు  ప్రపంచపు   సొమ్మును   దోచి  పది తరాలకు  సరిపడా  దాచుకుంటారు.

అలా  ఇతరులకు    అన్యాయం  చేసిన  వారికి  ఏం మిగులుతుంది ?   శాశ్వత అపకీర్తి ,  ప్రజలు పెట్టే శాపాలూ తప్ప.


ఇలాంటి  అధర్మపరులకు  .... చచ్చిన  తరువాత  కూడా  నరకం , నీచమైన   పునర్జన్మ  తప్పకపోవచ్చు.

 ( ఎవరైనా  మరణించిన  తరువాత  పూర్వ  జన్మలోని   కుటుంబంలోనే  
  తిరిగి  జన్మిస్తారని  గ్యారంటీ   ఏమీ  లేదు  కదా  !  మరి    పాపాలు  చేసి అయినా  పది  తరాలకు  సరిపడా  డబ్బును  ఎందుకు  సంపాదిస్తారో  అర్ధం  కాదు.  )

..............................................

 అవినీతిపనులు  చేసే   వారిని   చూస్తే   పాపం   అనిపిస్తుంది.

ఎందుకంటే , వీళ్ళు   అష్టకష్టాలు పడి   ఎన్నో   పాపపు పనులు   చేసి  డబ్బు సంపాదిస్తారు.

కానీ ,  ఆ పాప ఫలితాన్ని   ఈ  జన్మలోకానీ , వచ్చే జన్మలో కానీ అనుభవించవలసి   వస్తే ఎంతో  కష్టం  కదా !   


ఇటువంటి వారు కూడా మంచిమార్గం లోకి వచ్చి భగవంతుని కృపకు పాత్రులు అవాలని కోరుకుందాము.

...................................................

మంచి కర్మకు మంచి ఫలితము.........చెడ్డ కర్మకు చెడ్డ ఫలితము.... లభిస్తాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.  


కొందరు   మంచి  వ్యక్తులు  తమ పూర్వ  జన్మలో  చేసిన   కర్మల   ఫలితంగా వర్తమానంలో  కష్టాలను అనుభవిస్తున్నా కూడా .. ..  వారు   ఈ  జన్మలో   ఆచరించే మంచిపనుల యొక్క ఫలితాలు ఎక్కడికీ పోవు . మంచి ఫలితాలనూ తప్పక పొందుతారు.




Tuesday, April 15, 2014

ఓం.. చ్యవనుల వారు ...ప్రహ్లాదునితో..మనోవాక్కాయాలను శుద్ధిగా ఉంచుకున్నవారికి అడుగడుగునా తీర్ధాలే. ..

ఓం

శ్రీరామ శ్రీరామ సీతారామ..చైత్ర  శుద్ధ  పౌర్ణమి  హనుమాన్  జయంతి.
........................

శ్రీ దేవీ భాగవతము  నుండి  తెలుసుకున్న  విషయములు..

వ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..


ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.


చ్యవనుడు  అన్నాడు  కదా...


హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలిన మనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే. 



మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటేనే  ఏ  తీర్ధాలైనా  పావనాలయ్యేది.  గంగానదికి  ఇరువైపులా  పొడుగునా  ఎన్నెన్నో  గ్రామాలున్నాయి. నగరాలు ఉన్నాయి.  అడవుల్లో  గిరిజనావాసాలు ఉన్నాయి.


ఇన్ని  జాతులవారూ  రోజూ  ఆ  గంగలోనే  ముప్పొద్దులా   మునుగుతున్నారు.  బ్రహ్మసమానమైన  ఆ పవిత్రజలాన్నే  గ్రోలుతున్నారు.  అయితేనేమి  ఒక్కడంటే ఒక్కడు  ముక్తి  పొందాడా ?


విషయలంపటులు  వెళ్ళి  ఎంతటి  పవిత్రతీర్ధంలో  మునిగినా  ఫలితం  శూన్యం. అన్నింటికీ  మనస్సే  ముఖ్యం.  దాన్ని  శుద్ధి  చేసుకుంటే  అన్నీ  శుద్ధి  పొందుతాయి. 

అలా  కాకుండా తీర్ధయాత్రలకు  వెళ్ళి  అక్కడ ఆత్మవంచన - పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.
 

ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా  ఇష్టం  కానట్టే  దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో  కోటిసార్లు  మునిగినా  పవిత్రుడు  కాలేడు. 


అందుచేత  అన్నింటికంటే  ముందు  మనశ్శుద్ధి  ఉండాలి. అది  ఉంటేనే  ద్రవ్యశుద్ధి  సిద్ధిస్తుంది.  అటుపైని  ఆచారశుద్ధి.  ఇవన్నీ  ఉన్నవాడికే  తీర్ధం  తీర్ధమవుతుంది.  లేకపోతే  అదొక  రేవు  మాత్రమే.  అక్కడ  ఏవేవి  ఎంతెంత  చేసినా  "శుద్ధ దండుగ " . 



నిజానికి  వీటన్నింటికంటే  భూతదయ  చాలా  గొప్పది. 

 అయినా నువ్వు  తీర్ధాలను  గురించి  అడిగావు  కనక  వాటినే  చెబుతాను  - విను. భూలోకంలో  లెక్కలేనన్ని   తీర్ధాలున్నాయి. 


వాటికేంగానీ  ఉత్తమోత్తమమైన  తీర్ధరాజం  ఒక్కటేఒక్కటి -   నైమిశంలో  చక్రతీర్ధం. దాన్నే  పుష్కరతీర్ధమని  కూడా  అంటారు......అంటూ తెలియజేశారు.




Friday, April 11, 2014

దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.


 
భగవంతునికి  జీవులంటే  ఎంతో  ప్రేమ.  ఎన్నో  తప్పులను  చేసిన  వారికి   కూడా   మంచిగా  మారటానికి  మళ్ళీమళ్ళీ  అవకాశాలను  కల్పిస్తారు. 


 ఎన్ని  అవకాశాలను  కల్పించినా  పట్టించుకోకుండా  పాపాలను  చేస్తూనే   ఉంటే .... అప్పుడు  లోకహితం  కొరకు,   దైవం    పాపాత్ములను   శిక్షిస్తారు.


  పాపాలు  చేసిన  వారు  కూడా ....  తాము   చేసిన  తప్పులను    తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారితే   దైవానుగ్రహానికి  పాత్రులే.

................................


ఈ  రోజుల్లో    కొంత మంది  అధర్మపు  సంపాదనతో  పూజలు  చేస్తూ   దైవానుగ్రహాన్ని  పొందాలని  తాపత్రయపడుతున్నారు.  అదే  భక్తి  అని   భ్రమపడుతున్నారు.  



 ఒక  ప్రక్క  పాపాలు  చేస్తూ,  ఇంకో  ప్రక్క   పూజలు  చేసినంత  మాత్రాన   దైవానుగ్రహం  లభిస్తుందని  ఎలా  అనుకుంటున్నారో  ?

...........................................


దైవం  యొక్క  చాకచక్యం    ఎవరి  అంచనాలకూ  అందనిది. 



 పూర్వము  కొందరు  రాక్షసులు  తపస్సు  చేసి  దేవతల  వల్ల   వరాలను  పొందారు.

 తమకు    త్వరగా   మరణం  రాకూడదని   భావించి,   అతితెలివిగా  ?  వరాలను    అడిగారు.  అలా    పొందిన  వరాల  ద్వారా  లభించిన  శక్తితో  లోకాలను  పీడించారు.

అప్పుడు   దైవం,    ఏ  మాత్రం  మొహమాటం  లేకుండా   ఆ  రాక్షసులను    సంహరించారు. 

రాక్షసులు  పొందిన  వరాలకు  భంగం  కలుగకుండానే  చాకచక్యంగా  వారిని  వధించారు.

ఉదా..  .పగలు , రాత్రి  కాకుండా   సంధ్యా  సమయంలో  హిరణ్యకశిపుడి  వధ  జరిగింది .


 ( హిరణ్యకశిపుడు  ..పగలు  కానీ,  రాత్రి  కానీ  తనకు  మరణం  కలుగకూడదని   వరాన్ని  పొందాడు. )


 
............................................


ఈ  రోజుల్లో  కూడా  కొందరు  వ్యక్తులు  హిరణ్యకశిపునిలా   ప్రవర్తిస్తున్నారు. 


 ఎన్నో    పాపాలు  చేసి  సంపాదించిన  సొమ్ముతో  పూజలు  చేస్తూ   వరాలు    పొందాలని  తాపత్రయపడుతున్నారు.

ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అని    అనుకుంటున్నారు.


 అలాగైతే ,  రావణాసురుడు   కూడా  పూజలు    చేసాడు . కానీ , అతను
చేసిన  పాపాలు  కొట్టుకుపోలేదు . 

  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు  కదా  !

అతను    పూజలు    చేసాడు ,  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.

 అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.



అయితే, పాపాలు  చేసిన  వారు  కూడా  తాము   చేసిన  తప్పులను    తెలుసుకుని  పశ్చాత్తాపపడి  మంచిగా  మారి  పూజలు చేయగా చేయగా... ఆ పూజల వల్ల మంచి వారిగా మారి .. దైవకృపను పొందే  అవకాశం కూడా ఉంది.
........................ 

 దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు. 


 (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )
...............................


అధర్మంగా   సంపాదించిన   డబ్బు వల్ల   ఎన్నో సౌకర్యాలను  పొందినా కూడా, మనశ్శాంతి   మాత్రం   ఉండదని  గ్రంధాల ద్వారా   తెలుస్తోంది.



మనశ్శాంతి   లేకపోయాక   ఎంత డబ్బు,   ఎన్ని సౌకర్యాలు   ఉంటే   మాత్రం  ఏం లాభం ? ....... అని పాపాలు  చేసేవారు   తెలుసుకుంటే సమాజంలో  మంచి మార్పు  వస్తుంది.

...................................


   తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి.

  జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.




Wednesday, April 9, 2014

ఓం ..

ఓం ..                                            
సాయి సాయి.

శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,
 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ   భైరవీ 
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ  


2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  


3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ 
  జాజీపంకజ  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనే  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  


4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వాలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

 
5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ  


6. అంబా  సృష్టివినాశ  పాలనకరీ  ఆర్యా  విసంశోభితా 
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ


7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ   


8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా  ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 


   ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




Monday, April 7, 2014

ఆది పరాశక్తి కధలు...3.

ఓం....
 దుర్గమ్మకు  అనేక   వందనములు.
.....................


శ్రీ  రామ  నవమి    సీతారామ  కల్యాణమహోత్సవము .
.........................


మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్తదివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు,. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుణ్ణీ క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.


అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.


మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.

........................

  దేవీనవరాత్ర  వ్రతకధ  ....వంటి  పుస్తకాలలో  ఈ  కధలను  పండితులు  క్లుప్తంగా  వ్రాసారు.

  పండితులందరికి  కృతజ్ఞతలు.





Friday, April 4, 2014

ఆదిపరాశక్తి కధలు...2.



వ్యాసమహర్షి , జనమేజయ మహారాజుకి దేవీ అవతారగాధలను తెలియజెప్పటం జరిగింది. కొన్ని కధలను క్లుప్తముగా ..........................

ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు ................. ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని .......... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 
అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను,. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది. కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలు- ఓహ్! రణరంగం మహా భయంకరంగా ఉంది.


ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.


ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.
కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .

రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.


నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.



నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. 


ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.

దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.




Wednesday, April 2, 2014

ఆదిపరాశక్తి కధలు..


ఇప్పుడు   వసంత  నవరాత్రులు  ప్రారంభమయ్యాయి . 

................................  

  ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు.

 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సం హరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు    తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సం హరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.