koodali

Friday, May 24, 2013

ఓం..ఊరు వెళ్ళినప్పుడు కుండీలలోని మొక్కలకు నీటిని అందించటం........


ఓం
శ్రీ  లక్ష్మీసమేతనరసింహస్వామివారికి  వందనములు.
.................................


కుండీలలో  మొక్కలను  పెంచటమంటే ..... పంజరంలో  పక్షులను  పెంచినట్లు,  వాటిని  స్వేచ్చగా  పెరగనీయకుండా  అడ్డుకోవటం  అని  నాకు   అనిపిస్తుంది.  మా  వద్ద  చాలా  తక్కువ  సంఖ్యలో  మొక్కల  కుండీలున్నాయి.  ఆ  విషయం  అలా  ఉంచితే ,

 కుండీలలో  మొక్కలను  పెంచుకునేవారు  ఏదైనా  ఊరు  వెళ్ళవలసివస్తే  మొక్కలకు  నీరు  పోయటం  ఎలా  అనేది  పెద్ద  సమస్య.

 కొందరు  నీళ్ళు  బాగా  పోసి ,  ఎండవేడికి   తడి  ఆరిపోకుండా  మొక్కల  మొదటిలో  కొబ్బరి  పీచు,  స్పాంజ్ ....  వంటివి  వేస్తారు.


నేను  ఏం  చేస్తానంటే  ఒక  బకెట్లో  నీరు  పోసి  మట్టి  కుండీని  అందులో  పెడతాను.   అప్పుడు   ఆ  నీటిని  కుండీ  గోడల  ద్వారా  లేక  కుండీకున్న    చిన్న  కన్నం  ద్వారా  మొక్కల  వేళ్ళు  పీల్చుకుంటాయి. 

 ఇలా  చేయటానికి   మట్టి  కుండీలు  చాలా  అనుకూలంగా  ఉంటాయి. సిమెంట్  కుండీలు  అంత  అనుకూలంగా  ఉండవు.   ( సిమెంట్  కుండీల గోడలు  తడిని  పీల్చుకోవు  కదా  !

  ఊరు  వెళ్ళినప్పుడు  బాత్రూంస్ లోని  బకెట్స్  ఖాళీగా  ఉంటాయి   కదా  !    ఒక్కొక్క  బకెట్లో  ఒక  కుండీని  ఉంచుతాము. 

కుండీని  బకెట్లో  పెట్టిన  తరువాత  కుండీ  అంచుకు  కొంచెం  కిందవరకు  నీటిని  పోయాలి. 

 (  ఇలా  నీరు  పోసినప్పుడు   కుండీ  అంచు  వరకు  నీరు  పోయాలి.  అంతే. కుండీ  నీటిలో  మునిగిపోయేవరకూ  నీటిని  పోయకూడదు. )


 ఇలా  ఏర్పాటుచేసిన  బకెట్ + కుండీలను  నీడలోనే  ఉంచాలి.  ఎండలో  పెడితే  మనం  ఊరినుండి  వచ్చేసరికి    బకెట్లోని  నీరు  ఆవిరైపోయి  మొక్కలు  ఎండిపోతాయి.   అందువల్ల  నీడలోనే  ఉంచాలి. 
చలికాలంలో  అయితే  నీరు  త్వరగా  ఆవిరైపోదు .
 
 
 ఇలా  చేయటం  వల్ల  ఊరు  వెళ్ళి  వారం  తరువాత  వచ్చినా  మొక్కలు  చక్కగా  ఉన్నాయి.  అప్పుడు  కుండీని   బయటకు  తీసి  బకెట్లోని  నీటిని    తీసివేయాలి.

.................... 


పై  పద్ధతిలో   సిమెంట్  కుండీలలోని  మొక్కలకు  నీరు  అందించవచ్చా  ?  లేదా  ?  అన్నది  నాకు  తెలియదు. 

అయితే  సిమెంట్  కుండీలకు  కూడా  అడుగున  చిన్న  రంధ్రం  ఉంటుంది  కదా  ! ఆ  రంధ్రం  ద్వారా  నీటిని  వేర్లు  పీల్చుకుంటాయేమో  ?    మా  ఇంట్లో  సిమెంట్  కుండీలు  లేవు. 

..................................

మట్టి  కుండీలలో  మొక్కలను  పెంచితే   మొక్కలకు  చల్లగా  ఉంటుంది.   ఈ  రోజులలో    ఎక్కువమంది   సిమెంట్  కుండీలను  వాడుతున్నారు. 

(  పగలకుండా  గట్టిగా   పడుంటాయని .)  
............................

 సిమెంట్  కుండీలు,  సిమెంట్  ఇళ్ళు  వేడిగా  ఉంటాయి.   ఈ  రోజులలో  రోడ్లను  కూడా  సిమెంట్ తో  వేస్తున్నారు. 

వర్షం  పడితే  నీరు    భూమిలో  ఇంకటానికి   మట్టి  నేల    ఎక్కువగా  కనిపించకుండా  సిమెంట్  రోడ్లను  వేసేస్తున్నారు.   టెక్నాలజీ  పెరిగిపోయింది  కదా  ! మరి.

...........................................


అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీ  .......... 

 ఒకసారి  నేను  ఊరు వెళ్ళి  వచ్చిచూస్తే,   అన్ని  కుండీలలోని   మొక్కలు  చక్కగా  ఉన్నాయి.   ఒక కుండీలోని  మొక్క  మాత్రం కుళ్ళిపోయినట్లు  అనిపించింది. 

ఇదేంటి  చెప్మా  నీరు  ఎక్కువైపోయిందా  ?  అనుకుని  కుండీని  పరీక్షిస్తే  ఆ  కుండీ  యొక్క  అడుగు భాగం    కొంతకాలం  క్రిందట  పగిలిపోయిందన్న  విషయం  నాకు  గుర్తు  వచ్చింది.  


అప్పుడు   నాకు  తెలిసింది  ఏమిటంటే .... అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీలను   నీటిలో  పెడితే  నీరు  ఎక్కువై   మొక్క  కుళ్ళిపోయే  అవకాశం  ఉంది  అని. 

 అందువల్ల  అడుగుభాగం  పోయిన  కుండీని  నీళ్ళ  బకెట్లో  పెట్టాలంటే  కుండీకి  క్రింద  ఏదైనా  ప్లేట్  ఉంచాలి.  

.........................................

వడదెబ్బకు   మరణించిన  వారి  గురించి   వార్తలను    చూస్తుంటే  చాలా బాధగా అనిపిస్తోంది. ఏమిటో జీవితం?  ప్రకృతి  ముందు  మనిషి  ఎంత  ?  అనిపిస్తోంది.


Wednesday, May 22, 2013

ఎండలు .. మొక్కలకు చల్లటి నీళ్ళు .

 
ఎండలు  విపరీతంగా  ఉన్నాయి.  ఎంత  వేడిగా  అంటే,  నీళ్ళకోసం  పంపు  తిప్పితే  చేయి  చురుక్కుమనేంతగా....   

 ఇలాంటప్పుడు  ఇళ్ళల్లో  పెంచుకునే  మొక్కలకు  నీరు  పోయాలంటే  కొన్ని   జాగ్రత్తలు  తీసుకోవాలి.   

వేసవికాలంలో  మొక్కలకు  నీరు  పోయాలంటే  ఉదయం  సూర్యుని  వేడి  పెరగకముందే  పోయాలి.  సాయంత్రం   వాతావరణం  కొంచెం  చల్లబడిన  తరువాత  పోయాలని పెద్దలు  తెలియజేసారు. 


   వేసవికాలంలో  .... చెరువుల్లో,  నూతిలో  నీరు  చల్లగా  ఉంటుందో ? వేడిగా  ఉంటుందో?   నాకు  తెలియదు  కానీ, 

 డాబాపైన  కట్టిన  నీళ్ళ టాంకుల  ద్వారా  పంపుల్లో  వచ్చే  నీళ్ళు   మాత్రం  చాల  వేడిగా ఉంటాయి . 

    వేసవికాలంలో మొక్కలకు  నీరు  పెట్టాలంటే   కొన్ని  జాగ్రత్తలు  తీసుకోవాలి. 

 పంపులకు   పైప్  తగిలించి ,  వచ్చే  వేడినీటిని   డైరెక్ట్  గా  మొక్కలకు  పట్టకూడదు.  

  ఇప్పటి  ఎండలకు  సాయంత్రం  6  గంటలకు  కూడా  పంపుల్లో  వేడినీరే  వస్తోంది.  

 అందువల్ల   ఏం  చేయాలంటే ..  ఉదయం  ఎండ  పెరగకముందే   మొక్కలకు  నీరు  పెట్టి , ఇంకొక  బక్కెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచుకోవాలి.  ఆ  చల్లటి  నీటిని  సాయంత్రం  మొక్కలకు  పోయాలి. 

 లేకపోతే  మధ్యాహ్నం  ఒక  బకెట్ తో  నీరు  పట్టుకుని  నీడలో  ఉంచితే  సాయంత్రానికి  ఆ   వేడి   నీరు  చల్లగా  అవుతాయి.   అప్పుడు  ఆ  నీటిని  మొక్కలకు  పోయాలి.  వేసవికాలం  అంతా  ఇలా  చేయాలి.

 
...............

ఎండలు  ఇలా  పెరుగుతూ  పోతే .. కొంతకాలానికి  ధృవ  ప్రాంతాల్లో  మంచు  కరిగి  సముద్రనీటిమట్టాలు  పెరిగిపోతాయట.  సముద్రనీటిమట్టం  అతికొద్దిగా  పెరిగినా  ప్రపంచంలోని   ఎన్నో  నగరాలు  మునిగిపోతాయట.


 ( పర్యావరణకాలుష్యం  ఇదే  తీరులో  ఉంటే, మంచు  కరిగి   సముద్రనీటిమట్టం  పెరగటానికి   50  సంవత్సరాల  కన్నా  ఎక్కువకాలం  పట్టదంటున్నారు . ) 

 హిమాలయాలలో  మంచు  కూడా  కొద్దికొద్దిగా  కరుగుతోందంటున్నారు.

 అభివృద్ధి పేరుతో  మానవులు  పర్యావరణాన్ని    పాడుచేయటం  వల్ల  వాతావరణంలో  ఎన్నో  మార్పులు  వస్తున్నాయి.  వాటి  ఫలితమే  విపరీతమైన  ఎండలు,  విపరీతమైన  వరదలు.


కొంతకాలం  క్రిందట  రెంటచింతల  వంటి  కొన్ని  ప్రాంతాల్లో  మాత్రమే  వేడి  40  డిగ్రీలు  దాటేది.  ఈ  సంవత్సరం  మన  రాష్ట్రంలోని  చాలా  ప్రాంతాల్లో  వేడి  40  డిగ్రీలు  దాటిపోయింది. 


 మానవుల  అవసరాలు  పెరుగుతున్న  కొద్దీ   ..   ఎండలు,  వరదలు ,  పొల్యూషన్....పెరిగిపోతున్నాయి .


 కూర్చున్న  కొమ్మనే  నరుక్కుంటూ .. ..ఇదే    గొప్ప అభివృద్ధి .    అని  సంబర పడిపోతున్న  మానవుల  ప్రవర్తనకు  కాలమే  తగిన తీర్పును  చెబుతుంది .



Monday, May 20, 2013

దైవం..జీవులు..కర్మ సిద్ధాంతము..జన్మపరంపర..మరియు..కొన్ని సంగతులు .

ఓం
 వాసవీ  కన్యకా పరమేశ్వరీ  దేవి  జయంతి  సందర్భముగా శుభాకాంక్షలు.
   వాసవి కన్యకా పరమేశ్వరీదేవినగరేశ్వర  స్వామి వార్లకు  వందనములు.
 అనఘాదేవీదత్తాత్రేయస్వామివార్లకు  వందనములు
శ్రీ  పాద శ్రీ వల్లభస్వామి వారికి  వందనములు.
శ్రీ  పాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము .... గ్రంధములో  వాసవీ  కన్యకా పరమేశ్వరీ దేవి  గురించి అనేక  వివరములున్నాయి.

.........................................


ఇంతకుముందు  ఒక  టపాలో  దైవానికి ఆది, అంతము లేవు ...అనే  విషయం  గురించి  చెప్పుకున్నాము.


ఆండాళ్  అమ్మవారి  చరిత్ర  ( శ్రీ గోదాదేవి  శ్రీ రంగనాధుల కల్యాణం )
సినిమా  ద్వారా  తెలుసుకున్న  కొన్ని  విషయములు....   


  ఒక  రాజుగారు  నాస్తికులు.

ఆ  రాజు  ,  ఆస్తికులను .........  దైవం  గురించి   కొన్ని    ప్రశ్నలు  అడుగుతారు.  


సృష్టికర్త  అయిన  దైవాని  కంటే  ముందు  ఏమున్నది ?  అనే  అర్ధం  వచ్చేటట్లు  ప్రశ్న  అడుగుతారు.

 
అప్పుడు ,  ఆండాళ్  మాతకు  తండ్రి  అయిన  విష్ణుచిత్తుల  వారు   రాజుతో ...  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఉన్న  అంకె  పేరు  చెప్పమంటారు.

 అప్పుడు  రాజు  చెప్పలేకపోతారు. 
(  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ  అంకె  లేదు  కదా  !  )
............................................


 విష్ణుచిత్తులవారు  చెప్పిన    విషయాన్ని  గమనిస్తే,  మనకేం  తెలుస్తుందంటే,  నిజమే.  ఒకటి  అనే  అంకెకు  ముందు  ఏ   అంకె   లేదు.

అలాగే,  సంఖ్యలలో  ఆఖరి  సంఖ్య  ఏది  ?   అనే  ప్రశ్నకు  కూడా  మనకు   జవాబు  తెలియదు.

ఎందుకంటే,  సంఖ్యలను  అలా  లెక్కవేసుకుంటూ   వెళ్తే    ఒకదానితరువాత  ఒకటి  అంతం  లేకుండా  అలా  వస్తూనే  ఉంటాయి  కదా  !


ఇదంతాగమనిస్తే, 1,2,3,4,...అనే  వాటికి  ఆది, అంతమూ  అనేవి  లేవు . అని  మనకు   తెలుస్తుంది.

 అలాగే ,   దైవానికి  ఆది,  అంతమూ  అనేవి  లేవు . అని కూడా   మనకు  తెలుస్తుంది.


ఆది,  అంతమూ  లేక   అంతటా  వ్యాపించి  ఉన్న  శక్తినే  దైవమని  ఆరాధిస్తారు.  ఆస్తికులు. 

....................................

  " Matter and energy cannot be created or destroyed "  సిద్ధాంతం  ప్రకారం  ............ 


 మంచు  గడ్డ  నీరులా  మారుతుంది.  నీరు  ఎండ   వేడికి  ఆవిరిగా  మారుతుంది.    నీటి ఆవిరి     తిరిగి    నీరుగా  మారి  వర్షంలా    కురుస్తుంది...... అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  తెలియజేసారు. 

 అయితే    " Matter and energy cannot be created or destroyed
"   సిద్ధాంతం  ప్రకారం  జీవులు  ఏమవుతారో ..  ఆదునిక  శాస్త్రవేత్తలు  చెప్పలేదు.

 అయితే    ఈ  విషయాల  గురించి  ప్రాచీనులు  చక్కగా  తెలియజేసారు. 

ప్రాచీనులు  తెలియజేసిన  ...."    కర్మలను  బట్టి " జన్మపరంపర  విధానాన్ని "  "Matter and energy cannot be created or destroyed ".....    ప్రకారం   అన్వయించి  చూస్తే    జన్మలు,  పునర్జన్మలు  ఉండే  మాట  వాస్తవమే  అని  తెలుస్తుంది .


ఉదాహరణకు...  ఎవరైనా  వ్యక్తి   యొక్క    జీవితం  ముగిసినప్పుడు ,   పంచభూతాలతో  తయారైన    శరీరం  పంచభూతాల్లో  కలిసిపోతుంది.


  జీవించి  ఉన్నప్పుడు   మనిషి  మనస్సుతో  ఎన్నో  ఆలోచనలు  ( పనులు ) చేస్తాడు.  అంటే,  మనస్సు  కూడా  శక్తే  కదా  !....


మరణించిన  వ్యక్తి  యొక్క   మనస్సు ( ఆత్మ ) మరో  శరీరాన్ని  ధరిస్తుంది.   మరో  జన్మనెత్తుతుంది.

 పరమాత్మను   చేరేవరకూ  (మోక్షాన్ని  పొందేవరకూ) ఈ   జన్మపరంపర .... కొనసాగుతుంది. 

ఇవన్నీ  గమనిస్తే ,  ప్రాచీనులు  చెప్పినట్లు  జన్మలు,  పునర్జన్మలు   ఉన్నాయన్నది   పరమసత్యం .  అని  తెలుస్తుంది. 

 జన్మలు,  పునర్జన్మలు    ఉన్నప్పుడు ,  జీవికి  తాను  చేసిన  పూర్వకర్మల   ఆధారంగా    భవిష్యజన్మ    ఉంటుంది.   ఈ  విధంగా   జీవులు  జననమరణచక్రంలో  పరిభ్రమిస్తుంటారు.

  సృష్టిలో  ప్రతి  చర్యకూ   ప్రతి  చర్య  ఉంటుందని   అంటారు.  అంటే  మనం  మంచి  పనులు  చేస్తే  మంచి  ఫలితాలు  చెడ్డపనులు  చేస్తే  చెడ్డఫలితాలు  లభిస్తాయి. 


  మనం  చేసే  ప్రతిపని  మన  భవిష్యత్తును  నిర్ణయిస్తుంది.

  వివేకానందుల  వారు  చెప్పినట్లు  మన  భవితకు  మనమే  బాధ్యులం.  


అందువల్ల    చెడ్డపనులను  చేయకుండా   జాగ్రత్తగా  జీవించటానికి  ప్రయత్నించాలి.
.....................................

 
పాత  టపాలను  చూడాలనుకుంటే  ఈ  లంకెల  ప్రకారం 
చూడగలరు......

 దైవానికి ఆది, అంతము లేవు ....ఒక ఉదాహరణ.

".Matter and energy cannot be created or destroyed...


వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, May 17, 2013

ప్రహ్లాదునితో చ్యవనుల వారు..

ఓం

వ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..


ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.


చ్యవనుడు  అన్నాడు  కదా...


హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలిన మనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే. మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటేనే  ఏ  తీర్ధాలైనా  పావనాలయ్యేది.  గంగానదికి  ఇరువైపులా  పొడుగునా  ఎన్నెన్నో  గ్రామాలున్నాయి. నగరాలున్నాయి.  అడవుల్లో  గిరిజనావాసాలున్నాయి. 



ఇన్ని  జాతులవారూ  రోజూ  ఆ  గంగలోనే  ముప్పొద్దులా   మునుగుతున్నారు.  బ్రహ్మసమానమైన  ఆ పవిత్రజలాన్నే  గ్రోలుతున్నారు.  అయితేనేమి  ఒక్కడంటే ఒక్కడు  ముక్తి  పొందాడా ? విషయలంపటులు  వెళ్ళి  ఎంతటి  పవిత్రతీర్ధంలో  మునిగినా  ఫలితం  శూన్యం. అన్నింటికీ  మనస్సే  ముఖ్యం.  దాన్ని  శుద్ధి  చేసుకుంటే  అన్నీ  శుద్ధి  పొందుతాయి. 



అలా  కాకుండా తీర్ధయాత్రలకు  వెళ్ళి  అక్కడ ఆత్మవంచన  పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.



ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా  ఇష్టం  కానట్టే  దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో  కోటిసార్లు  మునిగినా  పవిత్రుడు  కాలేడు. 


అందుచేత  అన్నింటికంటే  ముందు  మనశ్శుద్ధి  ఉండాలి. అది  ఉంటేనే  ద్రవ్యశుద్ధి  సిద్ధిస్తుంది.  అటుపైని  ఆచారశుద్ధి.  ఇవన్నీ  ఉన్నవాడికే  తీర్ధం  తీర్ధమవుతుంది.  లేకపోతే  అదొక  రేవు  మాత్రమే.  అక్కడ  ఏవేవి  ఎంతెంత  చేసినా  "శుద్ధ దండుగ " . నిజానికి  వీటన్నింటికంటే  భూతదయ  చాలా  గొప్పది. 



 అయినా నువ్వు  తీర్ధాలను  గురించి  అడిగావు  కనక  వాటినే  చెబుతాను...విను. భూలోకంలో  లెక్కలేనన్ని   తీర్ధాలున్నాయి. వాటికేంగానీ  ఉత్తమోత్తమమైన  తీర్ధరాజం  ఒక్కటేఒక్కటి.  నైమిశంలో  చక్రతీర్ధం. దాన్నే  పుష్కరతీర్ధమని  కూడా  అంటారు......అంటూ తెలియజేశారు.


Wednesday, May 15, 2013

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు మరియు పాపాలు చేసిన వాళ్ళు పాపపరిహారం చేసుకున్నంత మాత్రాన పాపఫలితాలు అనుభవించనక్కరలేదా ?

....................
 ఓం
 శ్రీ  శంకర  జయంతి   సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలు.

......................................................

పాపాలు  చేసిన  వాళ్ళు   పాపపరిహారం  చేసుకున్నంత   మాత్రాన  పాపఫలితాలు  అనుభవించనక్కరలేదా ?

ఈ  విషయాల  గురించి  తోచినంతలో  ఏమనిపిస్తుందంటే......

నిజమే  పాపపరిహారం  చేసుకోవటం  ద్వారా  పూర్వ  పాపఫలితాలను  తగ్గించుకోవటం,  నిర్మూలించుకోవటం   సాధ్యమే.

 అయితే   చేసిన  పాపాలకు  పశ్చాత్తాపం  చెంది,   వర్తమానంలో  పాపకర్మలను  చేయటం  మాని  , సత్కర్మలను  ఆచరిస్తూ .. పరిహారం  చేసుకోవటం  ద్వారా  పాపకర్మఫలితాన్ని   తగ్గించుకోవటం,   నిర్మూలించుకునే  అవకాశం  ఉందంటారు. 

తెలిసోతెలియకో  పాపాలు  చేసిన  తరువాత  పశ్చాత్తాపపడితే ,   పడే  శిక్ష  తగ్గే  అవకాశం  ఉంది. అంతేకానీ   ఏ మాత్రం పశ్చాత్తాపం  లేకుండా  పాపాలు  చేస్తూనే  ప్రాయశ్చిత్తంగా   పరిహారక్రియలను    చేసేవారి  అతితెలివిని  దైవం  చూస్తూ  ఊరుకోరు.

 పూర్వం  హిరణ్యకశిపుడు  వంటి  ఎందరో  రాక్షసులు  తపస్సులు  చేసి   వరాలను  పొందారు. (వరాలను కోరుకోవటంలో తమదే  గొప్ప  తెలివి అని భ్రమించారు.  ) 

సృష్టినే  సృష్టించిన  దైవం  తెలివి  ముందు  వారి  ఆటలు  సాగవు  కదా  !

  వర గర్వంతో  రాక్షసులు   లోకాలను  పీడించినప్పుడు,    దైవం  ఎటువంటి  మొహమాటం  లేకుండా  ఆ  రాక్షసులను  సంహరించారు.  ( రాక్షసులు  పొందిన  వరాలకు  భంగం  కలుగకుండానే. )



అందువల్ల  దైవకృపను  పొందాలన్నా,  పూర్వం  చేసిన  పాపఫలితాన్ని  వదిలించుకోవాలన్నా  వర్తమానం,  భవిష్యత్తులో  పుణ్యకార్యాలను  చేస్తూ  సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నించాలి. 

 అంతేకానీ  అతితెలివితో    చెడ్డపనులు  చేస్తూనే   ఆ  పాపఫలితాలను  పరిహారక్రియలను   చేయటం  ద్వారా  పోగొట్టుకోవాలనుకోవటం  వృధాప్రయాస  మాత్రమేనని  గ్రహించాలి.


......................................

పాపకర్మపరిహారక్రియల  ద్వారా   తమ  పాపాన్ని  పోగొట్టుకోవటం  అందరికీ  సాధ్యమయితే  ,  రాక్షసులు  కూడా   పాపపరిహారక్రియల  ద్వారా    తాము  చేసిన   పాపాలను  పోగొట్టుకుని  హాయిగా  ఉండేవారు  కదా  !

 రావణాసురుని  వంటివారికి  తాము   చేసిన  పాపాలకు  విరుగుడుగా  చేసే   పాపపరిహారక్రియల  గురించి  కూడా  తెలుస్తాయి  కదా  !  

ఇలాంటి వారు  అధర్మమైన  లోకపీడాకరమైన  పూజలు,  తపస్సులు  మొదలైనవి ..  చేయాలనుకున్నా  దైవం  వారి  ఆటలను  సాగనివ్వరు.  వారి  పూజలలో  ఎక్కడో  ఒక  దగ్గర  దోషాలు   లేక  విఘ్నాలు   వచ్చేలా  చేస్తారు.

 రామ  రావణ  యుద్ధ  సమయంలో   ఇంద్రజిత్తు  చేస్తున్న  పూజకు    ఆటంకాలను     కల్పించి  దైవం  ఇంద్రజిత్తును  సంహరించారు.

రావణాసురుడు  ఎన్నో  పూజలు  కూడా   చేసేవాడట.  అయినా  సీతాదేవిని    అపహరించటం  అనే  పెద్ద  పాపం  చేయటం  వల్ల  రావణాసురునితో  పాటూ  అతని  బంధుమిత్రులు  కూడా  కష్టాలపాలయ్యారు.  రావణుడు  చేసిన  పాపం  వల్ల  యుద్ధంలో   అతని  సంతానం  కూడా  ప్రాణాలను  కోల్పోవలసి  వచ్చింది. 

 ఇవన్నీ  గమనిస్తే  మనకు  ఏం  తెలుస్తుందంటే,   చెడ్డపనులు  చేసేవారి  పూజలకు  సత్ఫలితాలు  లభించవు.  అని. 

....................................................

పాపపరిహారక్రియల  వల్ల  పాపాలు  పోగొట్టుకోవచ్చు ...... అని  పెద్దలు  చెప్పటానికి  కొన్ని  కారణాలు  ఉండి  ఉండవచ్చని  అనిపిస్తోంది.  కొన్ని  కారణాలు......

1.  తెలిసోతెలియకో  క్రితం  జన్మలో  చేసిన  పాపాల  వల్ల  ఈ  జన్మలో  కష్టాలు  వస్తున్నప్పుడు  ఇప్పుడు  ప్రాయశ్చితం  చేసుకోవటం  ద్వారా  గత కాలపు   పాపభారాన్ని  వదిలించుకోవచ్చు. (  ఈ  జన్మలో  సత్ప్రవర్తనతో     ప్రయత్నించినప్పుడు .....)

2.  జీవితంలో  కొన్నిసార్లు  మనకు  ఇష్టం  లేకపోయినా  పరిస్థితుల  ప్రభావం  వల్ల  పొరపాట్లు  చేయవలసి  వస్తుంది.  ఇలాంటివారికి  కూడా   ప్రాయశ్చితం  ద్వారా  పాపభారాన్ని  వదిలించుకునే  అవకాశం   ఉండవచ్చు.

3   ప్రాయశ్చిత్తం  ద్వారా  చేసిన  పాపఫలితాన్ని  వదిలించుకోవచ్చు .... అనే  ఆశను  కల్పిస్తే,      పాపాత్ములలో   కొందరయినా   మంచిగా  మారే  అవకాశం  ఉంది. 

4.  పాపాలు  చేస్తున్న  వారికి  ప్రాయశిత్తం  లేనే లేదు..... అంటే  ఆ నిస్పృహతో  కొందరు  చెడ్డవాళ్ళు   మరింతగా  చెడ్డపనులు  చేసే  అవకాశం  ఉంది.  


ఇలాంటివారికి  మంచిగా మారటానికి  మరల   అవకాశం   ఇచ్చి  చూడాలనే  అభిప్రాయంతో  పెద్దలు  అలా  చెప్పి  ఉండవచ్చు. 


5. కొందరు  వ్యక్తులకు  చెడ్డపనులు  చేయటం  ఇష్టం  ఉండదు.  అయినా  తమ  మనస్సును  నిగ్రహించుకోలేక  చెడ్డపనులను  చేస్తుంటారు. తాము   చెడ్డపనులను  చేసినందుకు   విపరీతమైన  మానసికబాధను  అనుభవిస్తారు.  తమ  మనస్సును  నిగ్రహించుకోలేనందుకు  తమను  తాము  నిందించుకుంటారు. ఇలాంటివారు  ధ్యానం,  దానధర్మాలు  చేయటం,  పూజ,  తీర్ధయాత్రలు  చేయటం....వంటి  పద్ధతుల  వల్ల  మానసికచాంచల్యం  నుంచి  క్రమంగా   బయటపడే   అవకాశం  ఉంది. 


6. ఇంకా  చాలా   కారణాలు ఉంటాయి......

ఇవన్నీ  గమనిస్తే   ఏమనిపిస్తోందంటే  , ప్రాయశ్చిత్తం   ద్వారా   పూర్వ పాపఫలితాన్ని  పోగొట్టుకోవాలంటే ,  ఇప్పుడు  సత్ప్రవర్తనతో  ఉండటానికి  ప్రయత్నిస్తూ  పాపపరిహార క్రియలను    ఆచరించవచ్చు. 


   అంతేకానీ , పాపాలు  చేస్తూనే  ప్రాయశ్చిత్తం  ద్వారా  పాపఫలితాలను   పోగొట్టుకోవచ్చు.......అన్నది   పెద్దల  అభిప్రాయం  కాదు  అని.
............................


తప్పులు  చేసి  జైలు శిక్ష  పడిన  ఖైదీలు  జైలులో  సత్ప్రవర్తనతో   ఉంటే ,  పై  అధికారులు  ఖైదీ  యొక్క  శిక్షా  కాలాన్ని  తగ్గించి  , అతనిని   కారాగారం  నుంచి  త్వరగా  విడుదల  చేసే  అవకాశం  ఉంది.

అలాగే   పూర్వజన్మలో  చెడ్డ పనులు   చేసి  ఈ  జన్మలో  కష్టాలను  అనుభవిస్తున్నవారు  ఇప్పుడు  మరింత  ఎక్కువగా  సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నిస్తే ,   దైవం   కరుణించి  వారిని  కష్టాలనుంచి   కాపాడే   అవకాశం  ఉంది.

............................................

  దైవకృపను  పొందాలన్నా, పూర్వ  పాపఫలితాన్ని  పోగొట్టుకోవాలన్నా..... సత్ప్రవర్తనతో  జీవించటానికి  ప్రయత్నించాలి.  సద్బుద్ధిని   కలిగి  సరైన  దారిలో  నడిపించమని  దైవాన్ని  శరణు  వేడాలి.  


అంతేకానీ  దైవం    దగ్గర   ట్రిక్కులు   పనికి  రావు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Monday, May 13, 2013

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .


 అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు.

  ఈ  రోజున మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే   మంచిదని  కూడా  పెద్దలు  తెలియజేసారు.

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి   జరుగుతుందని, ఆహారం, గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు.



 అయితే   ఈ రోజుల్లో, దానం చేసే  ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.



 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు కదా!


అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.


 .............
లోకం అంతా బాగుండాలి. అంతా దైవం దయ.


 

Saturday, May 11, 2013

బండిలో పశువులు


 ఒక  దగ్గరనుంచి  ఇంకొక  దగ్గరికి  వాహనాలలో   తరలించే  పశువులను  చాలామంది  చూసే  ఉంటారు.    కొద్ది  స్థలంలో  ఎక్కువ  సంఖ్యలో  పశువులను   కుక్కి  తరలించేటప్పుడు  కొన్నిసార్లు  ఆ ఇరుకు  వల్ల  తల  తిప్పటానికి  కూడా వాటికి  అవకాశం ఉండదు .  


ఇలా  ప్రయాణం  చెయ్యాలంటే  ఎంతో  ఇబ్బంది  . వాటికి  ఇబ్బందిగా  ఉంటుందని  తెలిసినా  అలాగే  కుక్కి  పంపిస్తుంటారు.


     ఇలాంటి  ప్రయాణాలలో  వాటికి  దాహం  వేసినా,  ఆకలి  వేసినా   వెంటనే   నీళ్ళు  త్రాగటానికి  ఏర్పాట్లు  అవీ  ఉంటాయా ? పాపం  అవి  తమ  బాధలను,  ఇబ్బందులను  చెప్పుకోలేని మూగ  జీవులు  . 

 వాటికి  తమ  హక్కుల  గురించి  పోరాడటం  చేతకాదు   కదా !  అందువల్ల  అలా బాధలు  పడుతుంటాయి.  
..........................

నుషులయితే  ఒక  ఊరి  నుంచి  ఇంకో  ఊరు  ప్రయాణించాలంటే   ఎన్నో  ఏర్పాట్లు  చేసుకుంటారు.  ప్రయాణించే   వాహనంలో  ఏసి  సౌకర్యం   ఉందా  ? లేదా  ?  ట్రైన్  అయితే  పై  బెర్తా  ?  క్రింద  బెర్తా  ? మధ్యలో  బెర్తా  ?  కూర్చుని  వెళ్తే  కిటికీ  ప్రక్కన  సీట్  దొరుకుతుందో  లేదో ?

వాహనంలో  వీడియో  సౌకర్యం  ఉందా  ?  లేదా  ?  ఇలా  ఎన్నో  ఆలోచిస్తాము.  


ప్రయాణం  మధ్యలో  త్రాగటానికి,  తినటానికి     రకరకాల  ఫలహారాలు,   పానీయాలు.....ఇలా  ఎన్నో  సౌకర్యాలను  ఏర్పాటుచేసుకుంటాము.
................. 


బలవంతులు  బలహీనులను  పీడిస్తున్నారని  హక్కుల  కోసం  ఉద్యమిస్తుంటాము.  మరి  మూగజీవులైన  పశుపక్ష్యాదుల  పట్ల  ఎంతమంది   మానవులు  దయగా  ప్రవర్తిస్తున్నారు  ? 

 మానవజన్మ  ఎంతో  గొప్పది.   మన  అభిప్రాయాలను  ఇతరులతో  చెప్పుకోగలం.  ఇంకా  ఎన్నో  సౌకర్యాలను  పొందగలం.   ఇవన్నీ  చేతకాని   పశుపక్ష్యాదుల  పట్ల  మానవులు  దయగా  ప్రవర్తించాలి. 




Thursday, May 9, 2013

నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి ఉంటుంది... శిరిడి సాయిబాబా . మరియు కొన్ని విషయములు.

ఓం

 శిరిడి  సాయిబాబా  జీవిత చరిత్రము  గ్రంధము  ద్వారా  తెలుసుకున్న   కొన్ని  విషయములు  ...

దాము అన్నా(  సాయి  భక్తుడు  )


 ఒక  బొంబాయి  స్నేహితుడొకడు  దాము అన్నాకు,  ప్రత్తిలో  జట్టీ  వ్యాపారము  చేసి  భాగస్తుడుగా  సుమారు  రెండు  లక్షల  రూపాయలు  లాభము  సంపాదించవలెనని  వ్రాసెను. వ్యాపారము  లాభకరమైనదనియు,  నెంతమాత్రము  ప్రమాదకరము  కాదనియు  ,  గనుక  అవకాశము  పోగొట్టకొనవలదనియు  అతడు  వ్రాసెను. దాము అన్నా  యా బేరమును  చేయుటయా  ?  మానుటయా  ? యను  నాందోళనలో  పడెను.

జట్టి  వ్యాపారము  చేయుటకు  వెంటనే  నిశ్చయించుకొనలేకుండెను. . దాని  గూర్చి  బాగుగా  ఆలోచించి, తాను  బాబా  భక్తుడగుటను  వివరములతో  శ్యామాకొక  ఉత్తరము  వ్రాసి బాబానడిగి  వారి  సలహాను  తెలిసికొనుమనెను.  ఆ  మరుసటి  దినము  ఆ  ఉత్తరము  శ్యామాకు  ముట్టెను. శ్యామా  దానిని  తీసికొని  మసీదుకు  బోయెను.  బాబా  ముందర  బెట్టెను. .................


బాబా  యిట్లనెను.  ఏమి  వ్రాయుచున్నాడు  ? ఏమి  యెత్తు  వేయుచున్నాడు ? భగవంతు   డిచ్చినదానితో  సంతుష్టిజెందక   యాకాశమునకెగుర  ప్రయత్నించుచున్నట్లున్నది.  వాని  యుత్తరము  చదువుము..

బాబా చెప్పినదే  ఆ యుత్తరములో  గల సమాచారమని ,   ...ఉత్తరములోని  సంగతులు  తెలిసియు  నన్నేల  చదవమని  బలవంతపెట్టుచున్నావు  ?  అని 
శ్యామా అనెను.
 
అయినప్పటికి  , బాబా  శ్యామాను  ఉత్తరమును  చదవమనగా....
అప్పుడు  శ్యామా  ఉత్తరమును  చదివెను...........

బాబా  జాగ్రత్తగా  విని  కనికరముతో  నిట్లనియె. ,  సేటుకు  పిచ్చి  యెత్తినది.  అతని  గృహమందేలోటు  లేదని  వ్రాయుము.  తన  కున్న  సగము  రొట్టెతో  సంతుష్టి చెందుమని   వ్రాయుము. లక్షలార్జించుటకు  ఆయాసపడవద్దని  చెప్పుము.  శ్యామా  జవాబును  పంపెను..........


దాము అన్నా  స్వయముగా  శిరిడీకి   వెళ్ళెను.

  అతనికి  బాబాను  బహిరంగముగా  జట్టీ  వ్యాపారము  గూర్చి  అడుగుటకు    ధైర్యము  చాలకుండెను. బాబా  సహాయపడినచో  వ్యాపారములో  కొంత  లాభము  బాబా   కిచ్చినచో  బాగుండుననుకొనెను.  ఇట్లు  రహస్యముగా  దాము అన్నా  తన  మనస్సున  ననుకొనెను. 



బాబాకు  తెలియనిదేమియు  లేదు. అరచేతినున్న  యుసిరికాయ వలె  భూతభవిష్యత్వర్తమానములు  కూడ  బాబా  తెలిసినవారు. 



బిడ్దకు  తీపివస్తువులు  కావలయును. కాని  తల్లి  చేదుమాత్రలిచ్చును.   తీపి  వస్తువులు  ఆరోగ్యమును  జెరచును.  చేదుమాత్రలు  ఆరోగ్యమును  వృద్ధిచేయును. తల్లి  తన  బిడ్డయొక్క  మేలును  కాంక్షించి  బుజ్జగించి  చేదుమాత్రలే  ఇచ్చును. 


బాబా  దయగల  తల్లి  వంటివారు.  తన  భక్తుల  భూత  భవిష్యత్  వర్తమానముల  లాభముల  గూర్చి  బాగుగా  తెలిసినవారు.  దాము అన్నా  మనస్సును  కనిపెట్టి  బాబా  యిట్లనెను.  ప్రపంచ  విషయములలో  తగుల్కొనుటకు  నాకిష్టము  లేదు.

బాబా  యొక్క  యసమ్మతి  గ్రహించి  దాము అన్నా  యా పనిని  మానుకొనెను.

ధాన్యముల  బేరము.

 
పిమ్మట  ధాన్యము, బియ్యము,  గోధుమలు  మొదలగువాని  వ్యాపారము  చేయతలపెట్టెను. ఈ  యాలోచన  కూడ  బాబా  గ్రహించి   యిట్లనెను.


నీవు  5 సేర్ల చొప్పున  కొని  7  సేర్ల  చొప్పున  అమ్మవలసి  ఉంటుంది. కనుక  నీ వ్యాపారము  కూడ  మానుకొనుమనెను.

కొన్నాళ్ళ  వరకూ  ధాన్యము  ధర  హెచ్చుగానే  యుండెను. కానీ  యొక మాసము  రెండు  మాసములు  వర్షములు  విశేషముగా  కురిసెను. ధరలు  హఠాత్తుగా  పడిపోయెను.  ధాన్యము  నిలువచేసిన  వారెల్ల  నష్టపడిరి.  ఈ  దురదృష్టము  నుండి  దాము  అన్నా  కాపాడబడెను. 


 ప్రత్తిజట్టి  వ్యాపారము  కూడా  కూలిపోయెను. ఆ  దళారి  ఇంకొక  వర్తకుని  సహాయంతో  వ్యాపారము  చేసెను. మదుపు  పెట్టిన  వారికి  గొప్పనష్టము  వచ్చెను.

బాబా  తనను  రెండుసార్లు  గొప్పనష్టముల  నుండి   తప్పించెనని  ,  దాము అన్నాకు  బాబా  యందుగల  నమ్మకము  హెచ్చెను.  

  .....................................

 
ఇవన్నీ  గమనించితే  నాకు  ఏమనిపించిందంటే,   వ్యాపారములో   తగినంతమేరకు  లాభాలను  పొందటం  వరకూ  ఫరవాలేదు  కానీ,   అత్యాశతో    అత్యధిక  స్థాయిలో  లాభాలను  ఆశించటం  మంచి  పద్ధతి  కాదు .  అనిపించింది. ......  ఇలాంటివి   దైవానికి   ఇష్టం  ఉండవు.  అనిపించింది.

సమాజంలో  అందరూ  బాగుండాలి  కదా  !  అయితే,   కొందరు  వ్యాపారస్తులు ,  అధికలాభాల  కొరకు   కల్తీ  చేసిన  సరుకులను  అమ్ముతుంటారు.  కొందరు  వ్యాపారస్తులు ,
అత్యాశతో  అత్యధిక  లాభాల  కొరకు   రైతుల  వద్ద  అతి  చవకగా  పంటలను  కొని  అతి ఎక్కువ  రేట్లకు  వినియోగదారులకు  అమ్ముతారు.   ఇందువల్ల  అటు  రైతులు  ఇటు  వినియోగదారులు  నష్టపోతారు.... ఇలాంటివి   దైవానికి   ఇష్టం  ఉండవు  అనిపించింది.

దైవానికి నచ్చినట్లు జీవించినవారికి  మంచి  జరుగుతుంది  అనిపించింది.
............................
 
 వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  కోరుకుంటున్నాను.



Monday, May 6, 2013

వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు .. . వ్యవస్థ ద్వారా చేయగలగటం సాధ్యమే కదా !

  
ఒకప్పుడు  ఈ  దేశం   ఎంతో  సిరిసంపదలతో  తులతూగేదని   అప్పటి   విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాల ద్వారా తెలియజేసారు. 
మరి ఇప్పుడు ..ఈ దేశం ఎందుకిలా తయారయ్యిందో ?

దేశంలో  ఎందరో  మేధావులు  ఉన్నారు.  ఎందరో  కష్టించి  పనిచేసేవాళ్ళు  ఉన్నారు. అపారమైన  ప్రకృతి  సంపదలున్నాయి.  జలజలపారే  జీవనదులెన్నో  ఉన్నాయి.   చక్కటి  సూర్యరశ్మి  ఉంది.   చక్కగా  జీవించటానికి  కావలసినవెన్నో  ఉన్నాయి.

 మరి  దేశంలో  ఇంత  పేదరికం,  ఇంత  అశుభ్రత  ఎందుకు  పెరిగిపోయింది ? మనం  మన దేశాన్ని    బాగుచేసుకోలేమా?  అందరూ  తలచుకుంటే   దేశంలో   పేదరికం,  అవినీతి,  అశుభ్రత  పోకుండా  ఉండదు  కదా!

   మన  పూర్వీకులు  చక్కగా  పొదుపుగా  జీవించేవారు.  ఎక్కువ  ఆడంబరాలకు  పోవద్దని  ,  పరిసరాలను  శుభ్రంగా  ఉంచుకోవాలని ,  మరెన్నో  చక్కటి  విషయాలను   గ్రంధాల  ద్వారా  తెలియజేశారు.

శుచిశుభ్రత  ఉన్న  ఇంట్లో ,  పరిసరాలలో   లక్ష్మీదేవి  ఉంటుందని  తెలియజేశారు.  జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో,  ఎలా  ప్రవర్తించకూడదో ,   ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  వస్తాయో  పురాణేతిహాసాల  ద్వారా  తెలియజేశారు.

 మనిషి  పుట్టుక  నుంచి  మరణానంతరం  కూడా  ఏమవుతుందో    వివరించే  విజ్ఞానాన్ని    అందించారు. చావుపుట్టుకల  మధ్య  జీవించటానికి  అవసరమైన  విజ్ఞానాన్ని  తెలియజేశారు.

  నైతికవిలువలను  పాటించిన  దగ్గరే  దైవానుగ్రహం  లభిస్తుంది.   నైతికవిలువలను  పాటించకుండా  జీవిస్తున్న  జాతి   గతి   అధోగతే.
..................................... 


 కొందరు  వ్యక్తులు  తాము   జన్మించిన  ఊళ్ళను   ఆదర్శంగా  తీర్చిదిద్దారని , పేదరికం,  నిరక్షరాస్యత ,  దురలవాట్లు.  వంటివి  లేకుండా  చేశారని ,  తమ  గ్రామాలను  ఎంతో  అభివృద్ధి  చేసారని  పత్రికల్లో  రాస్తుంటారు.

ఇలాంటి   గొప్ప  వ్యక్తులు  తమ  గ్రామాలను  ఏ  విధంగా   అభివృద్ధి   చేసారో  చూసి  తెలుసుకుని  ఆ  విధంగా  అన్ని  గ్రామాలను,  నగరాలను  అభివృద్ధి  చేయవచ్చు.

చేతిలో  అధికారం,  ఆర్ధికవసతులు  సరిగ్గా  లేకుండానే   కొందరు  వ్యక్తులు  గ్రామాలను  అభివృద్ధి చేస్తున్నారంటే ,   ప్రభుత్వం,  అధికారులు,  ప్రజలు  గట్టిగా  సంకల్పించుకుంటే  ఈ  దేశం  తిరిగి  పునర్వైభవాన్ని  పొందగలుగుతుంది  ....అని  ఆశించటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.





Friday, May 3, 2013

మనస్సును నిగ్రహించుకోలేకపోతే....

  శరీరానికి   ఏదైనా  గాయం   లేక  కురుపు  వచ్చి   నయమయే  సమయంలో  బాగా   దురదగా  అనిపిస్తుంది.   గోకాలనిపిస్తుంది.  

గోకితే    కురుపు    పెద్దదవుతుందని ,   గోకవద్దని  పెద్దలు  హెచ్చరిస్తారు.

 పెద్దవాళ్ళ  మాట   వినకుండా  గోకటం  మొదలుపెడితే  మొదట  ఉపశమనంగానే  అనిపిస్తుంది.  

 కొంచెం  సేపటికి  అసలు  కధ   మొదలవుతుంది. 


  విపరీతమైన  మంట, నొప్పి.  గాయం  రేగి  రక్తం  కూడా  రావచ్చు.  

అప్పుడు  తెలిసివస్తుంది..పెద్దవాళ్ళు  ఎందుకు  హెచ్చరించారో.....

....................................

గాయం  మానేవరకు   కొంచెం  ఓర్పుతో  మనస్సును  నిగ్రహించుకుంటే  గాయం  త్వరగా  మానిపోతుంది. 


 అలా  కాకుండా   గోకటం  వల్ల  గాయం  తిరగబెట్టి  మళ్ళీ  కధ  మొదలుకు వస్తుంది.

 ఈ సారి  పుండు  త్వరగా  మానకపోవచ్చు    సెప్టిక్  కాకుండా  ఇంజక్షన్  కూడా  తీసుకోవలసి   రావచ్చు.

 ..............................................

జీవితంలో  కూడా  అంతే.  మనకు  హాని  కలిగించే  విషయాలు  ఎక్కువ  ఆకర్షణీయంగా  అనిపిస్తాయి.

 వ్యసనాలు  మొదలైనవి   ఆకర్షణీయంగా  కనిపించి  అలవాటయ్యాక   మనిషిని  పీల్చి  పిప్పి  చేస్తాయి.  అధోగతికి  తీసుకువెళతాయి.

...................................

  
హాని  కలిగించే  విషయాల  పట్ల  మనస్సును  నిగ్రహించుకుంటే  సుఖంగా  ఉండగలము.

మనస్సును  నిగ్రహించుకోలేకపోతే  ఎన్నో  కష్టాలు    ఎదురయ్యే  అవకాశం  ఉంది. 


 మనసును  నిగ్రహించుకోవటం  కష్టమే.

మనస్సును  నిగ్రహించుకునే  శక్తి  లేకపోతే  ఆ  శక్తిని  ఇవ్వమని  దైవాన్ని  ప్రార్ధించాలి.




Wednesday, May 1, 2013

పాపాలు చేసినవారు అనుభవించే శిక్షల గురించి కొన్ని విషయాలు......మరియు...

ఓం  
..................... 

అందరికి  .. మే డే .. శుభాకాంక్షలు .
......................

 
శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధము ద్వారా   ......

యమధర్మరాజు  సత్యవంతుని  ప్రాణాలను  తీసుకువెళ్తుంటే ..   సావిత్రి  పతి  ప్రాణాల  కోసం  యముని  అర్ధించటం...   మొదలగు  విషయాల   గురించి  కూడా  తెలుసుకోవచ్చు. 


 యమధర్మరాజు  సావిత్రికి  ఎన్నో  విషయాలను  తెలియజేశారు.   పాపాత్ములు  అనుభవించే  శిక్షల  గురించి  కూడా  తెలియజేశారు. 



పాపాలు  చేసినవారు అనుభవించే  శిక్షల  గురించి  కొన్ని  విషయాలు......

...లోభంతో  గానీ  స్వలాభం  కోసం గానీ  జీవహింస  చేసినవాడు  మజ్జాకూపంలో  లక్షసంవత్సరాలు  మగ్గుతాడు. ఆ  పైని  ఏడు  జన్మలు  శశకంగా  , ఏడు  జన్మలు మీనంగా  పుడతాడు.  మూడుజన్మలు  వరాహంగా  ఏడుజన్మలు  కోడిగా  ఏడుజన్మలు  లేడిగా  ఎత్తిఎత్తి  కడకు  పాతకశుద్ధి  పొందుతాడు.

 

సావిత్రీ  !  ధనలోభంతో  ఎదుటివాడి  శిరస్సును  కత్తితో  నరికిన  హంతకుడు  అసిపత్రనరకంలో  యాతనపడతాడు. పధ్నాలుగుమంది  ఇంద్రులు  మారేటంతకాలం  అందులో  కత్తికోత  అనుభవిస్తాడు.



బలప్రయోగంతో  గానీ మోసంచేసి  గానీ  ఇతరుల  పిత్రార్జిత భూమిని  కాజేసిన వాళ్ళు   తప్తసూచీ కూపంలో  పడి  దగ్ధులవుతారు.  ఏడు మన్వంతరాలు  ఈ  నరకం  అనుభవించి  అరవైవేల  సంవత్సరాలు కృమికీటకమై   తిరిగి  స్వజాతిలో  జన్మిస్తారు. పాపకర్మల  ఫలంగా  నరకయాతనలు  అనుభవించి  పరిశుద్ధులై  స్వీయజాతిలో  జన్మించాక  శుభకర్మలు  ఆచరించాలి. శుభఫలాలు  దక్కుతాయి. మళ్ళీ  పాపాలే  చేస్తే  ఇలాగే  నరకయాతనలు  తప్పవు. 

 

గోడలకు  కన్నం  వేసి  తలుపులు  బద్దలు  చేసి  ఇళ్ళల్లో  చొరబడి  వస్తువుల్ని  దొంగిలించేవారు  గోకాముఖనరకంలో  మూడుయుగాలు  యమకింకర  బాధలు  అనుభవిస్తారు.  గిత్తలూ  గొర్రెపొటేళ్ళూ  మేకపోతులూ  కొమ్ములతో  కుమ్ముతోంటే  గిట్టలతో  మట్టగిస్తోంటే  హాహాకారాలు  చేస్తారు.  ఆ  పైని  వ్యాధిగ్రస్తమైన  ఎద్దుగా  ఏడుజన్మలూ  మేషజాతిలో  మూడుజన్మలూ  ఛాగజాతిలో  మూడుజన్మలూ  ఎత్తి  మానవుడిగా  దారిద్ర్యం  నిత్యరోగం  భార్యా వియోగం  బంధు  వియోగం  అన్నీ  అనుభవించి  పాపకర్మ  విముక్తుడవుతాడు.


ఏ  రకమైన  ద్రవ్యాన్ని  ఎవరినుంచి  కాజేసినా  చోరుడు  నక్రముఖకుండంలో నలిగిపోవలసిందే. మూడు  శతాబ్దాలపాటు  యమభటుల  దండతాడనలు  తినవలసిందే.  ఆ  పైన  రోగిష్టి  ఎద్దుగా  ఏడు  జన్మలు   దుఃఖించి మానవుడై  మహారోగిగా  అందరితోనూ  ఏవగింపబడి  కడపటికి  పరిశుద్ధిపొందుతాడు........ఇలా  ఎన్నో  విషయాలు  చెప్పబడ్డాయి.
 ..........................................
 
ఈ  నరకబాధలు  లేకుండా  ఉండాలంటే, 
సత్ప్రవర్తనతో   దైవ  కృపను  పొందటానికి  ప్రయత్నించాలి .  దేవీభక్తిని  కలిగి  ఉండాలి.     జీవితాన్ని  సరైనదారిలో  నడిపించాలని   దైవాన్ని  ప్రార్ధించాలి. 
............... 

వ్రాసిన  విషయాలలో  అచ్చుతప్పులు  వంటి   పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.