koodali

Monday, April 30, 2012

సుకన్య........శర్మిష్ఠ..


యయాతి   కధలో   కొన్ని    వ్యాఖ్యలను    కష్టేఫలి  శర్మగారి  బ్లాగులో  వ్రాసాను.  ఒకచిన్న  పొరపాటు  వల్ల  దేవయానికి  శర్మిష్టకు    గొడవ  జరిగి  శర్మిష్ట  దేవయానిని  నూతిలో  తోయటం ,   దేవయాని  పట్టుదలతో  శర్మిష్టను  దాసిగా  చేసుకోవటం ,  యయాతికి  దేవయానికి  వివాహం  జరగటం,  శర్మిష్ట  కూడా  యయాతి  వల్ల  సంతానాన్ని  పొందటం  ఇలా  కధ   సాగింది  కదా  !  


 దేవయాని  శర్మిష్టను   క్షమించి  ఊరుకుంటే  ఆమెకు    ఈ  బాధలన్నీ  ఉండేవి  కాదు.  దేవయానిది  స్వయంకృతాపరాధం.


శర్మిష్ట  పాత్ర  విషయంలో  చూస్తే  ఆమె  ఒక  రాక్షసుల  రాజు  కూతురట.  ఒక  గొడవ  కారణంగా  శర్మిష్ట  దేవయానిని  నూతిలో  తోసి  వెళ్ళిపోతుంది.  యయాతి  రక్షించకపోతే  దేవయాని  చనిపోయుండేది  కాబట్టి  శర్మిష్ట  చేసింది  హత్యాప్రయత్నమే.  పూర్వం  చిన్న  నేరాలకు  కూడా  శిక్షలు  బాగానే  ఉండేవి .  దేవయాని   శర్మిష్టను   దాసిగా  చేసుకోవటం    వల్ల  శర్మిష్ట  యొక్క    పచ్చటి  జీవితం  వ్యర్ధం  అయిపోయిందని  ,  అందుకే  యయాతిని  ఆమె  వివాహం  చేసుకోవటం  ధర్మమేనని    కొందరు   భావిస్తారు.  


  కానీ  లోకంలో  ప్రజలు  తెలిసిచేసినా,  తెలియక  చేసినా  చట్టం  వారికి  శిక్ష  విధిస్తుంది.  ఈ  రోజుల్లో  కూడా    యుక్తవయసులో  ఉన్న  వ్యక్తులు     హత్యాప్రయత్నం,  హత్య   వంటి   నేరాలు    చేస్తే ,     ( తెలిసిచేసినా  తెలియకచేసినా )  కొన్ని  సంవత్సరాలు   కారాగారంలో  వేసే  అవకాశం  ఉంది.  అలాంటప్పుడు  అయ్యో  ! వారి  జీవితం  అంతా  వృధా  అయిపోయిందే  అని  ఎవరూ  జాలిపడటం  లేదు   కదా  !


  పూర్వం  రాజులు  కూడా  శత్రురాజ్యంతో    యుద్ధం  చేసినప్పుడు  అక్కడి  వారిని  పట్టుకొచ్చి  చంపెయ్యటం,  లేక  కారాగారంలో  వేసెయ్యటం  చేసేవారట.  మరి  వారి   గురించి,  వారి   కుటుంబసభ్యుల  గురించి     ఎవరు  ఆలోచిస్తున్నారు  ? వాళ్ళ  గురించి  ఎందుకు  ఆలోచించాలి  ?  వాళ్ళు  తప్పు  చేసారు  కదా  !  అంటారు.    

...................................

  పూర్వం  చ్యవనుడనే   మహర్షి  తపస్సు  చేసుకుంటుంటే  క్రమంగా   ఆ  మహర్షి  చుట్టూ  పుట్టలు  ఏర్పడతాయి.  సూర్యవంశంలో  శర్యాతి  అనే  గొప్పరాజుకి  కూతురు    సుకన్య .       చెలికత్తెలతో      సమీపంలోని   అడవికి   వాహ్యాళికి    వచ్చిన  సుకన్య  ఆ  పుట్టను  చూసి   చిత్రంగా  అనిపించి  ,  ఎందుకో   సన్నపాటి  పుల్లతో  ఆ  పుట్టలో  పొడుస్తుంది. పుల్లకు  తడి  అంటగా  విషయం    అర్ధం  కాని   సుకన్య     ఇంటికి  తిరిగి  వచ్చేస్తుంది. 


  ఆ పుల్లలు  గుచ్చుకుని   పుట్టలో  ఉన్న   చ్యవన  మహర్షికి      కళ్ళు  పోతాయి.   మహర్షికి  కలిగిన  బాధ  వల్ల  ఆయన  శపించకపోయినా ,   వెంటనే  రాజపరివారానికి  మూత్రసంబంధమైన  చిత్రమైన  బాధలొస్తాయి.    కారణం  వారికి  అర్ధం  కాదు.   ఇదంతా  గమనిస్తున్న  సుకన్య  ముందుకు  వచ్చి  తాను  పుట్టలో  పుల్లతో  గుచ్చటం  అంతా  చెప్పి  ఏం  జరిగిందో    తనకు  తెలియదంటుంది. 


 రాజు  సైనికులతో  అక్కడకు  వెళ్ళి  పుట్టను  తొలగించగా  ,    బాధపడుతున్న  చ్యవనుల  వారు  కనిపిస్తారు.    రాజు  భయంతో  చ్యవనునికి  క్షమాపణ  చెప్పి ,  ఆయన  సేవకు  సైనికులను  నియమిస్తానంటారు.  అప్పుడు  చ్యవనుడు ,   సైనికులు  తనకు  సరిగ్గా  సేవలు  చేయరని  శంకించి,   రాజుకి  ఇష్టమైతే  సుకన్యను  తన  సేవకు  నియమించమని  అడుగుతారు.   ఈ  మాటలు  విన్న   రాజు    బాధతో      రాజ్యానికి  తిరిగివెళ్ళిపోతారు. 


 అప్పుడు  సుకన్య  ముందుకొచ్చి  తండ్రీ    !    చ్యవనులవారిని  భర్తగా  పొంది  సేవ  చేయటానికి  నాకు  ఎటువంటి    అభ్యంతరం  లేదు .  నాకు  సంతోషమే .  అని  చెబుతుంది.  ఇక  చేసేదేమీలేక  రాజు  సుకన్యను  చ్యవనునికిచ్చి  వివాహం  చేస్తాడు. 


 సుకన్య  రాజభోగాలను  వదిలి   నారచీరలు  ధరించి   అడవిలో   భర్తకు  సేవలు  చేస్తూ   ఉంటుంది.  ఒకరోజు  సూర్యపుత్రులైన    అశ్వినులు  అటుగా  వెళ్తూ    సుకన్యను  చూసి  ఆమె  అందానికి  అబ్బురపడి    వివరాలు  అడుగుతారు.  ఆమె  తాను  చ్యవనమహర్షి  యొక్క  భార్యను  అని  చెబుతుంది.


  అప్పుడు  వాళ్ళు  అయ్యో  !  ఎంత  అన్యాయం జరిగిపోయింది.  , ఆ  వృద్ధ  అంధ  తాపసి  నీకు  భర్తా    !  మాలో  ఒకరిని  వివాహం    చేసుకుని  దేవలోకపు  సుఖాలు  అనుభవించమని  ఆమెను  ప్రలోభపెట్టడానికి  ప్రయత్నిస్తారు. 


 వారి  మాటలు  విన్న  సుకన్య  కోపించి  , సూర్యుని  పుత్రులైన  మీరు  ఇలా  ధర్మవిరుద్ధంగా  మాట్లాడవచ్చునా ... అని  కోపించగా  , అశ్వినులు  తాము  ఆమె  పాతివ్రత్యానికి  సంతోషించామని    చెప్పి ,  తాము  దేవవైద్యులమని    చెప్పి,   తాము  చ్యవనుని  తమంతటి  అందంగా   , ఆరోగ్యవంతునిగా    చేస్తామంటారు.   ,  అయితే ,   చిన్న  పరీక్ష  పెడతారు. 


 సుకన్య     ఈ  విషయాలన్నీ    భర్తతో  చెబుతుంది.  చ్యవనుడు  సంతోషించి  ,  తాను  సుకన్యను  వివాహం  చేసుకుని  ఆమెను  కష్టపెడుతున్నానని ,  అందుకు   ఎంతో  బాధపడుతున్నానని  చెప్పి ,  అశ్వినులను  వెంటనే  పిలవమని  సుకన్యకు  చెబుతారు. 


 అశ్వినులు   చ్యవనుని   సరస్సులో  మునగమని  చెప్పగా,  అలా  చేసిన     చ్యవనునికి     అశ్వినులను  పోలిన  రూపం  వచ్చేస్తుంది. ఒకే  రూపంలో   ఉన్న  ఆ  ముగ్గురిలో  తన  భర్త  అయిన  చ్యవనుని  గుర్తించటమే సుకన్యకు  అశ్వినులు  పెట్టిన   పరీక్ష. 


 సుకన్య  జగన్మాతను  ప్రార్ధించి ,  జగన్మాత  దయవల్ల      ఆ  ముగ్గురిలో  తన  భర్త  అయిన  చ్యవనుని      గుర్తించగా  సుందర  రూపాన్ని  పొందిన  చ్యవనుడు    ఎంతో  ఆనందిస్తాడు.  తరువాత    ఈ  విషయాలన్నీ  తెలిసిన  శర్యాతి  దంపతులు  తమ  కూతురి  జీవితం  బాగుపడిందని  ఆనందిస్తారు.
...................


ఇక్కడ  మనం  గమనిస్తే,   సుకన్య    తెలిసిచేసినా   తెలియకచేసినా  పుల్లతో  గుచ్చటం  వల్ల  చ్యవనుని  కళ్ళు    పోయాయి.    ఆమె  తన  తప్పు  తెలుసుకుని  వృద్ధుడు,  అంధుడైన  చ్యవనుని  వివాహం  చేసుకుని   ధర్మం  తప్పకుండా  సేవించింది.  అందమైన  అశ్వినులు  ప్రలోభపెట్టినా   ధర్మాన్ని  తప్పలేదు.    జగన్మాత  ఆమెకు  అందమైన  జీవితాన్ని  ప్రసాదించింది.


 శర్మిష్ఠకు  సుకన్యకు  చాలా  తేడా  ఉంది.  శర్మిష్ట  తెలిసే  దేవయానిని  నూతిలో  తోసివేసింది.   తరువాత     యయాతిని  కోరుకోవటం,  యయాతి    శాపాలు  పొందటం  ,    తన  వార్ధక్యాన్ని  భరించమని   యయాతి   పిల్లలను  అడగటం  ఇలా.......   కధ  సాగింది.


ఈ  రోజుల్లో  కూడా   సమాజంలో   ఇలాంటి  కధలను  పోలిన  కధలు  జరుగుతున్నాయి.సమాజంలో  శర్మిష్ట  లాంటి  వాళ్ళూ  ఉంటున్నారు...సుకన్య  లాంటి  వాళ్ళూ  ఉంటున్నారు.  


సుకన్యలా   ఓపికగా  ఉంటే  ఈ  జన్మలోగానీ,  వచ్చే  జన్మలోగానీ  దైవకృప   తప్పక   లభిస్తుంది.

  

Friday, April 27, 2012

ఈ లింక్ లో .....


ఈ  లింకులు  ఇంతకు  ముందు  టపాలోనే  ఇవ్వాలనుకున్నాను.  ఇప్పుడిస్తున్నానండి. 
 
 నారాయణుడు , నరుడు...కృష్ణార్జునులుగా  జన్మించారని   ,  అయితే    అర్జునునికి  తన  క్రితం  జన్మ  గురించి  గుర్తు  లేదని,  కృష్ణునికి  అన్నీ  గుర్తున్నాయని  చెప్పుకున్నాము.  ఈ    విషయాలు  ఈ  క్రింది  టపా    చదివిన  తరువాత  నాకు  స్పష్టంగా  తెలిసింది.

ఈ  లింకులో  ఎన్నో  విషయాలు  ఉన్నాయండి.......
 *nara-narayana Rsi is which (kind of avatara)? - Vaniquotes 



విష్ణుమూర్తి  ధరించిన  అవతారాల  గురించిన  విషయాలు  ఈ  లింకులో    ఉన్నాయి.
*  Incarnations and Expansions of the Lord - VEDA - Vedas and Vedic 


ఈ   లింక్ లో  శివుని  అవతార  విశేషాలు  ఉన్నాయి.* SHIV MAHAPURAN : SHATRUDRA SAMHITA : EIGHT IDOLS OF .



మన్వంతరాలు,  కల్పముల  గురించిన   ఎన్నో  విషయాలు  అంతర్జాలంలో  ఉన్నాయండి.      ఇంద్రుడు  అన్నది  ఒక  పదవి  అని,   ప్రతి  కల్పంలోనూ  మారే  ఇంద్రుల  పేర్లు,  రుషుల  పేర్లు,  దేవతల  పేర్లు  అంతర్జాలంలో  ఉన్నాయండి.
*1....  manvamtaras.



భగవద్గీతలో శ్రీ కృష్ణుల వారు అర్జునునితో ....( విభూతి యోగం.) ...దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో శంకరుడను వాడను,పాండవులలో  అర్జునుడను ..... మునులలో వేదవ్యాసమునీంద్రుడను....నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించి యున్నాను .....అని చెప్పటం జరిగింది.  

 (పాండవులలో అర్జునుడను ....  అని కూడా  చెప్పిన   విషయాన్ని  మనం  గమనించాలి.)


ఇవన్నీ  గమనిస్తే  దైవం  ఒక్కరే.  వారు  సర్వత్రా  వ్యాపించి  ఉన్నారని  తెలుస్తుంది. 


ఈ చిత్రం  శివకేశవుల  చిత్రం.



............................................................




Wednesday, April 25, 2012

శ్రీ కృష్ణుడు అర్జునునితో ..ఎన్నో విషయాలు.....



భగవద్గీతలో ....  శ్రీ కృష్ణుడు   అర్జునునితో  ఏమంటారంటే.. నీకు  నాకు  ఇంతకుముందు  అనేక  జన్మలు  గడిచాయి.  అవి  నీకు  గుర్తు  లేవు .... అని చెప్పటం జరిగింది.

   శ్రీ  కృష్ణుడు  చెప్పిన  దానికి  ఒక  ఉదాహరణ..  

నరనారాయణులు  ఒకప్పుడు  ధర్ముని  కుమారులుగా  జన్మించి  ఎంతో  తపస్సు  చేసారు.  ఆ  నరనారాయణులే  28వ  ద్వాపరంలో   కృష్ణార్జునులుగా    జన్మించారట. 
  ( నారాయణుడు  కృష్ణునిగా,  నరుడు  అర్జునునిగా.) 


నేను ఇంకో    దగ్గర  చదివానండి.....  విష్ణుపురాణంలో  పరాశరుడు  మైత్రేయతో   ఏమంటారంటే.......

విష్ణుమూర్తి  కృతయుగంలో  కపిలునిగా  జన్మిస్తారట,  త్రేతాయుగంలో  చక్రవర్తిగా  జన్మించి  దుష్టులను  శిక్షిస్తారట,  ద్వాపరయుగంలో  వేదవ్యాసునిగా  జన్మించి  వేదవిభజన  చేస్తారట.    కలియుగంలో  కల్కి గా  జన్మిస్తారని  చెప్పటం  జరిగిందట. ఇలా  లోకకళ్యాణం  కొరకు  భగవంతుడు   ప్రతి  యుగంలోనూ   ఎన్నో  అవతారాలను  ధరిస్తారట.  


  ఒకసారి  భూదేవి  భూమి  మీద    పెరిగిపోతున్న  పాపాత్ముల  భారం  మోయలేకపోతున్నానని   బాధపడగా , ఇంద్రుడు  మొదలైన  దేవతలంతా    అమ్మవారిని  ప్రార్ధించగా....... ఆ  జగన్మాత  .....  దేవతలారా  !  ఈ  విషయమై  నేను  ఎప్పుడో  ఆలోచించాను.  దుష్టులను  శిక్షించి   భూదేవికి  బరువు  తగ్గించటానికి  ప్రణాళిక  రచించాను.  మీరు  అందరూ  మీమీ  అంశలతో   భూలోకంలో  జన్మించాలి.  అవసరమైన  శక్తిని  నేను  అనుగ్రహిస్తాను........మీరంతా  నిమిత్తమాత్రులు.   స్వశక్తితో  నేనే  ఈ  కార్యం  నెరవేరుస్తాను........అని    ఓదార్చి    యోగమాయ  అంతర్ధానం  చెందుతుంది. 


   ఆ  ప్రణాళిక  ప్రకారం కశ్యపుడు  వసుదేవునిగా,  అదితి  దేవకీదేవిగా   , ఆదిశేషుడు  బలరాముడిగా,   యోగమాయ  యశోదకు  కూతురిగా,  నారాయణుడు  కృష్ణుడిగా, నరుడు  అర్జునుడుగా ..ఇలా జన్మించారు.


 ఇవన్నీ  ముందే  తెలిసి అవతారాలను  ధరించినా, జన్మనెత్తిన  తరువాత వారిలో  కొందరికి పూర్వం  తామెవరు?  అన్నది గుర్తుండదు  అనిపిస్తుంది.. (అంతా  మహామాయ)

ఉదాహరణకు... అర్జునునికి  తాను  క్రితం  జన్మలో  నరుడను  అని  గుర్తు  ఉన్నట్లు  అనిపించదు.  కృష్ణునకు  మాత్రం  అంతా  తెలుసు అనిపిస్తుంది. 

     సృష్టిలో   ఏది  ఎలా  నడవాలో , జగన్మాతాపితరులు  అలా  నడిపించగలరు  అనిపిస్తుంది. 

.............................................

 బ్లాగులోకంలోని  సోదర,  సోదరీమణులకు.........వివరములు  దయచేసి    క్రింద  వ్యాఖ్యలలో  చూడగలరు.


Monday, April 23, 2012

*కొన్ని ధర్మ సందేహాలు...


బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్ఞతలండి.

..............................................

వ్యాసులవారి   కుమారుడైన  శుకుడు     గృహస్థాశ్రమం  అంటే  విముఖతను  చూపిస్తూ  సన్యాసాశ్రమం    అంటే  మక్కువ  చూపిస్తున్నప్పుడు    వ్యాసులవారు  శుకునితో   ఎన్నో  విషయాల  గురించి  చెప్పటం   జరిగింది. 


  అలా     చెబుతూ  .....  ఇంద్రియాలు   ఎంతో   బలవత్తరమైనవని,   ఆశ్రమస్వీకరణ  ఒక  వరసలో  వెళ్ళాలి  తప్ప   ,   దుముకుళ్ళు  చెల్లవు.  అంటూ .నచ్చచెప్పటానికి  ప్రయత్నిస్తారు. 

 

  ఇంకా, ... జనకమహారాజు   గృహస్థాశ్రమంలో  ఉంటూనే  జీవన్ముక్తునిగా     జీవించటం  గురించి  చెప్పి , ఆ  విషయాల  గురించి   తెలుసుకురమ్మని  శుకుని  జనకుని  వద్దకు  పంపటం  జరుగుతుంది  కదా  !

ఇక్కడ   నాకు  కొన్ని  ధర్మసందేహాలు  కలిగాయి.

 నాకు  తెలిసినంతవరకూ  వ్యాసులవారు  ద్వాపరయుగానికి  చెందిన  వారు  అనుకుంటున్నాను.  మరి  జనకుడు  అంటే  సీతాదేవికి  తండ్రి  .

1. శుకుడు  వెళ్ళి  కలుసుకున్న       ఈ  జనకుడు  ఎవరు  ? సీతాదేవి   యొక్క    తండ్రి  గారా  ?

 లేక

2.  సీతాదేవి   యొక్క తండ్రి    అయితే  ఆ     జనకుడు   అంతకాలం  జీవించి  ఉన్నారా  ? 

 

 (  అప్పటివారు  కొందరు  అలా  ఎంతోకాలం  జీవించి  ఉండేవారు  కదా  !  ఉదాహరణకు  త్రేతాయుగానికి  చెందిన  హనుమంతులవారు  ఇప్పటికీ  జీవించి  ఉన్నారని  అంటారు  కదా  ! )

 లేక
3.  నిమి  యొక్క  వారసులు (  విదేహులు  )  జనకులు  అన్న  పేరుతో  ప్రసిద్ధి  చెందారు. శుకుడు  మిధిలా  నగరానికి  వెళ్ళి    కలిసిన  జనకుడు    ( ద్వాపరయుగంలోని  )   ఆ   జనక   పరంపరకు  చెందిన  వ్యక్తా ?

 లేక

4.  శుకుడు  మేరువును  ,  హిమాలయాలను  దాటి  మిధిలా  నగరానికి  చేరినట్లు  అంటారు.  అలా  చూస్తే ... ఒకవేళ  ధ్యానం ,  యోగా   మొదలైన  ప్రక్రియల   ద్వారా   శుకులవారు    పురాతనకాలానికి  చెందిన  సీతాదేవి  తండ్రి  అయిన  జనకులవారితో   సంభాషించారా  ? 


లేక
 5. కాలంలో  వెనక్కి  వెళ్ళి  జనక  మహారాజుతో  సంభాషించారా  ? 

  (  ఒక  సినిమాలో  ...వ్యక్తులు    టైం  మెషిన్లో  భూతకాలానికి  ,  భవిష్యత్తు  కాలానికి  వెళ్ళినట్లుగా ... )


6..ఇవన్నీ  కాకుండా  ఈ  సందేహాలకు  వేరే   సమాధానాలు  ఉన్నాయా  ?   ఇలా .... ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.

ఇవన్నీ  కాకుండా ,  వేరే   సమాధానాలు  ఎవరికైనా   తెలిస్తే  ,     దయచేసి  చెబుతారా  ?  (  మీకు  ఇబ్బందిలేకపోతే  ) మీకు  తెలిసిన  విషయాలు   ఈ  బ్లాగులో  చెప్పటం  ఇబ్బందిగా  అనిపిస్తే ,  మీ  బ్లాగులో  అయినా  చెప్పగలరు..

 

ఈ  క్రింది  వ్యాఖ్య  ల వద్ద  కూడా  చదువుతారా...

  .................................................................

 


Friday, April 20, 2012

కొన్ని విషయాలు...



బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్ఞతలండి.
....................



ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాయాసీత యొక్క ప్రస్తావన వాల్మీకిరామాయణంలో  లేదంటున్నారు. కానీ, చాయాసీత గురించి నారాయణ మహర్షి నారద మహర్షితో స్పష్టంగా  చెప్పటం జరిగింది. ఈ వివరములు శ్రీదేవీ భాగవతములో ఉన్నాయి. ఇవన్నీ చదివిన తరువాతే నేను  చాయాసీత గురించి వ్రాసాను.
.................

పైన వ్రాసిన విషయంతో ఇప్పుడు వ్రాయబోయే విషయానికి సంబంధం లేదు లెండి.

ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరపు పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణులైన వారికి నా శుభాకాంక్షలు .
 

ఉత్తీర్ణులు
కాని పిల్లలు అధైర్యపడవద్దని కోరుకుంటూ, అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకుని  ధైర్యంగా  ముందుకు సాగాలని పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు నా సలహా .


ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యల వంటి పిచ్చిపనులు చెయ్యరాదని,    పిల్లలను విపరీతంగా సూటిపోటి మాటలతో తిట్టవద్దని తల్లితండ్రులకు నా విజ్ఞప్తి. 
 

జీవితంలో
ఉన్నతశిఖరాలను అధిరోహించిన వారెందరో ఒకప్పుడు అపజయాన్ని ఎదుర్కొన్నవారేనని ఎందరో గొప్పవారి కధల ద్వారా మనకు తెలుస్తుంది కదా !



Wednesday, April 18, 2012

ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.



కొందరు ఏమంటారంటే , ద్రౌపది తనకు ఆరవ భర్తగా కర్ణుడు అయితే బాగుండు అని మనసులో భావించినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఒక పాత సినిమాలో కూడా ఇలాంటి ఒక సంఘటన ఉంది.


కానీ కర్ణుడు కుంతీదేవి యొక్క పుత్రుడని కుంతీదేవికి మాత్రం తెలుసు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణునికి తెలుసు. అంతేకానీ కర్ణుడు భారతయుద్ధంలో మరణించే వరకూ పాండవులకు మాత్రం ఆ విషయం తెలియదట.


యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత మాత్రమే కర్ణుడు తమకు అన్నగారని తెలుసుకున్న ధర్మరాజు , ఆ విషయం తమకు ముందే తెలిస్తే ఎంత బాగుండేది అని బాధపడినట్లు, ( కుంతీదేవి తమకు కర్ణుని విషయం ముందే చెప్పనందుకు బాధపడుతూ..... ) ఇకపై స్త్రీల నోట్లో రహస్యాల వంటివి దాగకూడదని శపించినట్లు ...పెద్దలు చెబుతారు కదా !


శాపం సంగతి ఎలా ఉన్నా, కర్ణుడు చనిపోయేంత వరకూ పాండవులకు అతను కుంతీదేవి కుమారుడని తెలియదన్నది వాస్తవమే అనిపిస్తుంది.


మరి అలాంటప్పుడు ద్రౌపదికి కూడా కర్ణుడు చనిపోయేవరకూ , కర్ణుడు కుంతీదేవి కుమారుడని తెలియదు కదా !


కర్ణుడు కుంతీదేవి కుమారుడనే విషయమే ద్రౌపదికి తెలియనప్పుడు .... కర్ణుడు తనకు ఆరో భర్తగా వస్తే బాగుంటుందని ద్రౌపది భావించినట్లుగా కొందరు ప్రచారం చేయటం చాలా అన్యాయం. ( అసలు పంచ పాండవులందరినీ కూడా వివాహం చేసుకోవాలని ద్రౌపది కోరుకోలేదు . అదలా జరిగిందంతే. )


ఇవన్నీ చూస్తుంటే, పురాణేతిహాసాలలోని సంఘటనలను ఎన్నో తరాలనుంచి కొందరు తమకు నచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి ప్రచారం చేస్తున్నారేమో ? అనిపిస్తోంది.


Monday, April 16, 2012

చాయలకు ప్రాణం వస్తే. ....

ఈ మధ్య నేను

SHANI DEV KI KATHA - YouTube ..

లో చూస్తుంటే నాకు కొన్ని చిత్రమైన ఆలోచనలు వచ్చాయి.

ఆ దైవ విగ్రహాలను చూస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. గుడిలోని విగ్రహమూర్తులు గుడిలో ఉండగానే మనం ఆ విగ్రహమూర్తులను ( వాటి యొక్క ప్రతిబింబాలను ) కంప్యూటర్ లో చూడగలుగుతున్నాము కదా ! . అంటే అసలు విగ్రహం గుడిలోనే ఉంది . దాని ప్రతిబింబం మాత్రం టీవీల్లోనూ, కంప్యూటర్లోనూ చూడగలుగుతున్నాము.


మనుషులను, ప్రకృతిని చాయాచిత్రాలుగా తీసే విధానాన్ని ( వీడియో తీయటం ద్వారా ) శాస్త్రవేత్తలు కనిపెట్టారు కదా !
ఉదా...సినిమాలు చూస్తే ,అందులోని అసలు నటీనటులు తమ ఇళ్ళలోనే ఉంటారు.. కానీ అదే సమయంలో సినిమాహాల్లో మాత్రం ఆ నటీనటుల చాయాచిత్రాలు కదులుతాయి ,మాట్లాడతాయి కదా !


అలాగే అసలు సీతాదేవి సురక్షితంగా ఉండగా ....అగ్నిదేవుడు సృష్టించిన ఛాయాసీత ( సీతాదేవి యొక్క ప్రతిబింబం ) లంకలో ఉండి ఉండవచ్చు కదా ! అనే చిత్రమైన ఆలోచన కలిగింది.


అయితే ఇక్కడ సినిమాలలో అయితే నటీనటులు అంతకుముందు తాము ప్రదర్శించిన హావభావాలే చాయాచిత్రాలుగా తిరిగి కనిపిస్తాయి.


ఛాయాసీత విషయంలో మాత్రం చాయాసీత ఏర్పడిన తరువాత ఆ 
ఛాయ యొక్క హావభావాలు ఇతరులకు కనిపిస్తాయి.


అంటే ఉదాహరణకు .. దేవతలు ., ప్రతిబింబాలకు ప్రాణం పోసారేమో ? అనిపిస్తుంది. ఉదా.. సీతాదేవి యొక్క ,ఒక ప్రతిబింబానికి ప్రాణం పోస్తే, ఆ ప్రతిబింబం యొక్క రూపం ,
ఛాయాసీతగా సజీవంగా ఎదుటివారికి కనిపించి ఉండవచ్చు కదా ! ( ఛాయాసీత.. రావణుడికి .. అసలు సీతగా కనిపించినట్లుగా ) ..అనిపించింది.


తోచింది వ్రాసాను. వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..


Friday, April 13, 2012

మనకు తెలిసింది చాలా తక్కువ అని......

 

ఇంతకు ముందు టపాలో పళ్ళతో లారీ, లేక బస్సులను లాగటం గురించి చెప్పుకున్నాము కదా ! తమ జుట్టుతో బరువైన వాహనాలను లాగిన వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు.


సాధారణంగా ఎవరైనా ఇలా లాగితే వాళ్ళ పళ్ళు లేక జుట్టు కుదుళ్ళతో సహా ఊడి వచ్చేస్తాయి. లారీని లాగేంత బలంగా అవి ఉండవు కదా మరి. అలా లాగే వ్యక్తులు ఎలా లాగుతున్నారో అర్ధం కావటం లేదు. .


ఇదంతా చూస్తే శారీరిక శక్తిని మించి మానసిక శక్తి బలమైనదేమో అనిపిస్తుంది.


ఇంకా కొందరు ప్రాణాయామ , యోగా చేసేవారు నీటిపై తేలుతూ నిశ్చలంగా పడుకుని చాలాసేపు ఉండగలరు. యోగా ద్వారా శరీరాన్ని తేలిగ్గా చేసి అలా ఉండగలరట వాళ్ళు.


కొందరి శరీరాలకు చెంచాలు, గిన్నెలు వంటివి అతుక్కుపోయే అయస్కాంత శక్తి ఉంటోంది. మరి అందరికి ఆ శక్తి ఉండదు. కారణం ఏమిటో ?


౧..మనకు తెలిసినంత వరకూ శరీరానికి అయస్కాంత శక్తి ఉండదు కదా !

౨..మనకు తెలిసినంత వరకూ మనుషుల జుట్టుకు, పళ్ళకు లారీల వంటి వాటిని లాగేంత శక్తి ఉండదు కదా !

౩..మనకు తెలిసినంత వరకూ మనిషి శరీరానికి నీళ్ళలో నిశ్చలంగా తేలే శక్తి ఉండదు కదా !


మనిషి నీళ్ళలో నిశ్చలంగా తేలాలంటే శరీరానికి లైఫ్ జాకెట్స్ వంటివి అమర్చుకోవాలి.

లారీని కొంతదూరం లాగాలంటే యంత్రం సహాయం అవసరం.

మరి పరికరం సహాయం లేకుండా కొందరు వ్యక్తులు ఇలాంటి విన్యాసాలు ఎలా చెయ్యగలుగుతున్నారు. వాళ్ళ శరీరాలకు శక్తి ఎలా వస్తోంది ?


ఇలాంటి చిత్రమైన విషయాలెన్నో ప్రపంచంలో జరుగుతున్నాయి.. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మనకు తెలిసింది చాలా తక్కువ అని. మనకు తెలిసిన విజ్ఞానానికి మించి ఇంకెన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తోంది..


కొందరు నిరంతర సాధన వల్ల తాము అలా చేయగలుగుతున్నాం. అంటారు. అంటే సాధన వల్ల శరీరధర్మాలను, సైన్స్ కనుగొన్న విషయాలను మార్చవచ్చని తెలుస్తోంది.

సామాన్యులే సాధన వల్ల ఇలా చేయగలిగినప్పుడు, తపశ్శక్తి గల మహర్షులకు సాధ్యం కానిదేముంటుంది . పూర్వపు మహర్షులు సంవత్సరాల తరబడి నిరంతర తపస్సాధన చేసి దైవానుగ్రహాన్ని పొంది , అసంభవాలను సంభవాలుగా మార్చే శక్తిని సాధించారు కాబోలు అనిపిస్తుంది..

.....................


నిన్న ఒక చానల్లో కొందరు వ్యక్తులను చూపించారు. ఒక విదేశీ అమ్మాయి 9 సంవత్సరముల వయస్సులో సడన్ గా బొమ్మలు వెయ్యటం ప్రారంభించిందట. ఆమె బొమ్మలను వేసే విద్యను ఎక్కడా నేర్చుకోలేదట. వాళ్ళింట్లో కూడా ఎవరూ వెయ్యరట,.


ఆ బొమ్మలు అద్భుతంగా సజీవకళ ఉట్టిపడుతున్నట్లున్నాయి. ఆమెను బొమ్మలు వెయ్యటం ఎలా నేర్చుకున్నావని అడిగితే తనకు చిన్నప్పుడు దేవుడు కనిపించాడని అప్పటినుంచి అలా వేయగలుగుతున్నానని , దేవుడే తన గురువు అని చెబుతోంది....

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి.



Wednesday, April 11, 2012

ప్రాచీన విజ్ఞానం.....

 

ఓం .

పూర్వీకులు ఖగోళ శాస్త్రం , వైద్య శాస్త్రం , రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం ఇంకా అనేక శాస్త్రాల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని అందించారు.పురాణేతిహాసాలలో కూడా ఎంతో సైన్స్ ఉంది.
...............


దేవకీ దేవి గర్భం నుంచీ రోహిణీ దేవి గర్భం లోనికి పిండాన్ని మార్చటం గురించి ( బలరాముడు ) గ్రంధాలలో చెప్పబడింది. ఇది చదివిన వాళ్ళలో కొందరు.. పిండాన్ని ఒకరి గర్భం నుంచి ఇంకొకరి గర్భానికి ఎలా మారుస్తారు ? అని ఆశ్చర్యపోతారు .


కానీ రోజుల్లో....... గర్భంలోని పిండాన్ని తల్లి మోయలేనప్పుడు ( కొన్ని అనారోగ్య కారణాల వల్ల ) సొంత తల్లి గర్భంలోని పిండాన్ని అద్దె తల్లి గర్భంలోకి మార్చి పెంచి .. బిడ్డను సొంత తల్లితండ్రులకు అందిస్తున్నారు. .

విధంగా పూర్వులు చెప్పినవి సాధ్యమే అని తేలింది కదా!

....................

పూర్వం కొందరి విషయంలో స్త్రీపురుషుల సంబంధం లేకుండానే బిడ్డలు పుట్టేవారని గ్రంధాలలో ఉంది.

కుంతీదేవి ( సూర్య దేవుని ప్రభావం వల్ల ) తన కన్యాత్వానికి భంగం లేకుండానే బిడ్డను పొందటం గురించి గ్రంధాలలో ఉంది. ( అప్పటివారు తమ తపశ్శక్తి వల్ల కూడా సంతానాన్ని ప్రసాదించే అంతటి శక్తి గలవారు.)


ఈ రోజుల్లో పిల్లలు లేని తల్లితండ్రులు కొందరు, స్పెర్మ్ బ్యాంకుల సాయంతో,
టెస్ట్ ట్యూబ్ పద్ధతిలో సంతానాన్ని పొందుతున్నారు కదా !

.......................

రాజ్యరక్షణ మరియు వంశ రక్షణ కొరకు , వారసుల కోసం సత్యవతీదేవి వ్యాసుని ఆజ్ఞాపించగా .... ఆయన తనకు ఇష్టం లేకపోయినా తల్లి
ఆజ్ఞా ప్రకారం అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించారు.


అయితే వారికి ఇష్టం లేకపోవటం వల్ల ధృతరాష్ట్రుడు గ్రుడ్డివానిగానూ , పాండురాజు పాలిపోయి జన్మించారట.

ఈ సంఘటనల ద్వారా
తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డల పైన ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో పెద్దలు తెలియజేసారు.

గర్భంలోని బిడ్డకు పరిసరాల్లోని విషయాలను గ్రహించే శక్తి ఉంటుందట. ( అభిమన్యునిలా ) అందుకే ఇంట్లో గర్భిణి స్త్రీ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని పెద్దలు చెబుతారు.


ఈ రోజుల్లో విదేశాల్లోని కొందరు గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ తెలివిగా పుట్టాలని సంగీతం వంటి క్లాసులకు వెళ్తున్నారట..

సంతానాన్ని పొందే స్త్రీలు , గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలని , తల్లి
మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డల పైన ప్రభావాన్ని చూపిస్తుందని ఈనాటి శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు.
.............................

తులసిమొక్కను ఇంట్లో పెంచుకుంటే పుణ్యం , ఎంతో ఆరోగ్యకరం అని పెద్దలు చెప్పారు.

తులసిమొక్క నుంచి ఎంతో ఆక్సిజన్ విడుదల అవుతుందని ఈ నాటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు కదా !

..............................

పూర్వీకులు కొందరు పిండాలను కుండలలో పెంచారని గ్రంధాలలో తెలియజేసారు. అదెలా సాధ్యం ? అని అన్నవారే


ఈ రోజుల్లో టెస్ట్ ట్యూబులలో పిండాలను పెంచటం చూసి పెద్దలు చెప్పినది నిజమే. అని ఒప్పుకుంటున్నారు,

...............................

మహాభారతయుద్ధంలో జరిగే సంఘటనలను ఎంతో దూరంలో ఉండే తన దివ్య దృష్టితో చూస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధంలో జరుగుతున్న విషయాలను చెబుతారు.

ఈ విషయాన్ని గ్రంధాలలో చదివి..... ఎక్కడో దూరంగా జరిగే సంఘటనలు ఎవరికైనా ఎలా కనిపిస్తాయి ? మాటలు ఎలా వినిపిస్తాయి ? చోద్యం కాకపోతే ... పురాణాల్లో ఇలాంటి వింతలే ఉంటాయి ... అని హేళన చేసినవారే


... ఈ రోజుల్లో టీవీలు, ఫోనులు వచ్చాక పూర్వీకులు చెప్పిన విషయాలు సాధ్యమే అని ఒప్పుకుంటున్నారు.

...............................

అయితే నాకు ఏమనిపిస్తుందంటే... నాటి విజ్ఞానం ఎక్కువగా భౌతిక పద్ధతి మీద ఆధారపడింది. పూర్వీకుల విజ్ఞానం భౌతికశాస్త్రాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళింది అనిపిస్తుంది. .


కొన్ని సంఘటనలు చూస్తుంటే శారీరిక బలం కన్నా మానసిక బలం గొప్పదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు.. .ఒక వ్యక్తి లారీనో లేక బస్సునో తాడు కట్టి ఆ తాడును పళ్ళ మధ్య పట్టి ఉంచి లారీని కొంత దూరం లాగాడట. సాధారణంగా పళ్ళకు అంత బలం ఉండదు. మరి ఆ వ్యక్తి అలా ఎలా లాగగలిగాడు ?


పూర్వీకులు తమ తపశ్శక్తిని పెంచుకుని ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసారా ? అంటే భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది కదా ! అదే తపస్సు ద్వారా పొందే ఆధ్యాత్మిక దైవశక్తి కావచ్చు...
.