koodali

Monday, July 2, 2012

హరిశ్చంద్రుడి పుత్ర వ్యామోహం.



హరిశ్చంద్రునికి  చాలాకాలం  సంతానం  కలుగలేదు.  అప్పుడు  ఆయన  తమ  కులగురువైన  వసిష్ఠుల  వారి    వద్దకు  వెళ్ళి  సలహా  చెప్పమని  ప్రార్ధించగా ,   వరుణుని  ఉపాసించమని  చెప్పగా ,  హరిశ్చంద్రుడు  వరుణుని  కొరకు  తపస్సు  చేయటం  జరుగుతుంది.

అప్పుడు   వరుణుడు  ప్రత్యక్షమయి   హరిశ్చంద్రునికి  కుమారుని  ప్రసాదిస్తానని  , అయితే  తరువాత    ఆ  కుమారుని  బలి  ఇచ్చి  వరుణయజ్ఞం   చేయాలని  షరతు  పెడతాడు  వరుణుడు.  

.... పుత్రుణ్ణి  అనుగ్రహించు. ముందు  మా  వంధ్యత్వం  తొలగిపోతే  చాలు. ...అని  వరుణుడు  పెట్టిన  షరతుకు  హరిశ్చంద్రుడు   ఒప్పుకుంటాడు. 

  కుమారుడు  పుట్టిన  కొంతకాలానికి   వరుణుడు   మారువేషంలో  వచ్చి  వెనకటి   విషయాన్ని  గుర్తుచేస్తారు.  అప్పుడు  హరిశ్చంద్రుడు   పుత్రుని  మీద  ప్రేమతో  ఏదో  కారణం  చెప్పి  అప్పటికి  వాయిదా  వేస్తాడు. 

   వరుణుడు  రావటం...  హరిశ్చంద్రుడు  వాయిదా  అడగటం .... ఇలా  కొన్నిసార్లు  జరుగుతుంది.    ఇంతలో  రోహితుడు   పెద్దవాడు  అవుతాడు. 

 వరుణుడు  రావటం,  తన  తండ్రి  వరుణుని  బ్రతిమలాడటం   ఇదంతా  గమనించిన  రోహితుడు  మిత్రుల  ద్వారా  విషయాన్ని  తెలుసుకుని  భయంతో  ఇల్లు  విడిచి  వెళ్ళిపోతాడు.  

మరల    వరుణుడు  వచ్చి   రోహితుడు  ఇల్లు  విడిచి  వెళ్ళిపోయిన  విషయం  విని  ,  మాట  తప్పినందుకు    హరిశ్చంద్రునికి  జలోదరం  వ్యాధి  రావాలని    శపించి  వెళ్ళిపోతాడు. 

 అడవుల్లో  ఉంటున్న  రోహితుడు   తాను  ఇల్లు  విడిచి  వచ్చినందుకు  సిగ్గుపడి   మరల  ఇంటికి  వెళ్ళబోతుండగా  ఇంద్రుడు  మారువేషంలో  వచ్చి  వెళ్ళవద్దని  చెబుతాడు. . 

 ఇక్కడ  రాజ్యంలో  వ్యాధితో  బాధపడుతున్న  హరిశ్చంద్రుడు  మంత్రుల  సలహాతో   శునశ్శేపుడు  అనే  బ్రాహ్మణ  కుమారుని  బలిపశువుగా  చేసి  యాగం  నిర్వహించటానికి  ప్రయత్నాలు  జరుగుతుంటాయి. 

 ఈ  శునశ్శేపుడు  అజీగర్తుడనే   బీదబ్రాహ్మణుని  కుమారుడు.  డబ్బు  కోసం  ఆ  తండ్రి   తన కుమారుని  హరిశ్చంద్రునికి  అమ్మేస్తాడు. 


  యాగం  మొదలయ్యి  బలి  ఇచ్చే  సమయం  సమీపిస్తుంది.

ఇంతలో  విశ్వామిత్రుడు  వచ్చి ,  భయంతో  రోదిస్తున్న  ఆ  బాలుణ్ణి  చూసి,  హరిశ్చంద్రునితో ..... ఆ  బాలుణ్ణి  విడిచిపెట్టమని ,  ప్రజలను   రక్షించవలసిన  రాజే  ఇలా  చేయటం  పాపమనీ,    హరిశ్చంద్రుని  వ్యాధి  తగ్గే  ఉపాయం  తాను  చెబుతానని,  హరిశ్చంద్రుని  తండ్రికి  చంఢాలత్వాన్ని  తొలగించి  సశరీరంగా  స్వర్గానికి  పంపించిన  విషయం  గుర్తు  చేసి,   ఈ  బాలుణ్ణి  విడిచి  పెట్టమని  అడుగుతారు.
 

అప్పుడు  హరిశ్చంద్రుడు , విశ్వామిత్రునితో .... నాకు  ఈ  జలోదరం  బాధ  తొలగటం  ముఖ్యం.  అటుపైనే  మిగతా  పాపాలూ  పుణ్యాలూనూ .... నన్ను  అర్ధం  చేసుకో.  ఈ  బాలుణ్ణి  విడిచి  పెట్టమని  నిర్బంధించకు. ...... మరింక  ఏదైనా  వరం  కోరుకో  చెల్లిస్తాను.  అంటాడు.

 
హరిశ్చంద్రుని  సమాధానానికి  విశ్వామిత్రునికి  కోపం  వచ్చినా  నిగ్రహించుకుంటాడు.  

 
విశ్వామిత్రుడు    రోదిస్తున్న  ఆ  బాలుని  వద్దకు  వెళ్ళి, నాయనా  ! వరుణమంత్రం  ఉపదేశిస్తాను,  జపించు . నీకు  శుభం  కలుగుతుంది.  అని  వరుణమంత్రాన్ని   ఉపదేశిస్తాడు. 



  ఆ  బాలుడు  ఎంతో  ఆర్తిగా  వరుణమంత్రం  జపించగా  వరుణుడు  ప్రసన్నుడై  ప్రత్యక్షమవుతాడు.  బాలుణ్ణి  అనుగ్రహించి  వరాలనిస్తాడు. 

 
వరుణుడు  హరిశ్చంద్రునితో,  మహారాజా  ! ఈ  శునశ్శేపుడు  నన్ను  స్తుతించాడు.  కనక  విడిచి  పెట్టు.  యజ్ఞం  సంపూర్ణమైనట్టే. నీ  వ్యాధి  క్షణంలో  తొలగిపోతుంది.  అని  అనుగ్రహిస్తాడు.


 
తరువాత  హరిశ్చంద్రుని  కుమారుడు  తిరిగి  ఇంటికి  వస్తాడు. 

 
ఒకనాడు  వశిష్టుడు  హరిశ్చంద్రుని  గొప్పదనాన్ని  పొగుడుతుంటే  అక్కడే  ఉన్న  విశ్వామిత్రుడు .... నేనెరగని  మహారాజా  మీ  హరిశ్చంద్రుడు !  వట్టికపటి.అబద్ధాల కోరు.  వరమిచ్చిన  వరుణుడినే  వంచించబోయాడు...అంటూ  మాట్లాడతాడు.



  వశిష్టునికీ  విశ్వామిత్రునికి  వాదం  పెరిగి  విశ్వామిత్రుడు  హరిశ్చంద్రుని  అసత్యవాదిగా  నిరూపిస్తానని    అంటారు. 

ఆ  తరువాత  జరిగిన  విషయాలు  మనకు  తెలిసినవే.  విశ్వామిత్రుడు  మారువేషంలో  వచ్చి  హరిశ్చంద్రుని  రాజ్యాన్ని   దానంగా  తీసుకోవటం, దక్షిణగా   ఇవ్వవలసిన  బంగారం  కోసం  హరిశ్చంద్రుడు భార్యా  కుమారుడు  అమ్ముడుపోవటం  తరువాత  రోహితుడి  మరణం,    చివరికి  హరిశ్చంద్రుడు  భార్యతో  సహా   ప్రాణత్యాగం  చేసుకోబోతుండగా  వారి  సత్యసంధతకు  మెచ్చి  దేవతలు  రోహితుణ్ణి  బ్రతికించి  ,  వారికి   ఎన్నో  వరాలను  అనుగ్రహించటం  జరుగుతుంది.


*******************
 మొదట   పుత్రవ్యామోహంతో  హరిశ్చంద్రుడు  వరుణునికి   ఇచ్చిన  మాటను   నిలబెట్టుకోలేదు.  అందుకే  అసత్యవాది  అని    విశ్వామిత్రుడు    అనటం  జరిగింది.


 కానీ,  తరువాత  మరల  పరీక్ష  వచ్చినప్పుడు  భార్యను, కుమారుని  కూడా  దాసీలుగా  చేసి  తాము  ఎన్నో  కష్టాలను  భరిస్తూ    కూడా  ఎంతో  మానసిక  స్థైర్యంతో  తమ    సత్యసంధతను  ప్రపంచానికి  నిరూపించాడు.  



  ప్రజలకు  ఆదర్శంగా  తాను  తన  సత్యసంధతను  నిరూపించుకున్నాడు.    అసత్యవాది  అన్న  విశ్వామిత్రుని  చేతనే  సత్యవాది  అని    అనిపించుకున్నాడు.   సత్యహరిశ్చంద్రుడుగా  చరిత్రలో  నిలిచిపోయాడు. 


********************
 
పుట్టబోయే  శిశువుని   బలిపశువుగా  ఇమ్మన్నప్పుడు  హరిశ్చంద్రుడు ,  అలా  చేయటం  తన  వల్ల  కాదని  వరుణుని  ప్రాధేయపడితే  వరుణుడు  ఒప్పుకునేవాడేమో  ! కానీ  పుత్రుడు  పుడతాడన్న  ఆనందంలో  బలి  గురించి  పెద్దగా  ఆలోచించకుండా  ఒప్పేసుకున్నాడు.  కుమారుడు  పుట్టిన  తరువాత  పుత్రవ్యామోహం  వల్ల  (  సహజమే  కదా  ! )  బలి  ఇవ్వలేకపోయాడు. 

.......................................

 లోకంలో  చాలామంది  కష్టాలు  వచ్చినప్పుడు  తమ  శక్తికి  మించిన  మొక్కులు  మొక్కేస్తుంటారు. కోరికలు  తీరిన   తరువాత  మ్రొక్కు  చెల్లించటం  వాయిదా  వేస్తుంటారు.  తద్వారా  కష్టాలు  వస్తుంటాయి.  దానికన్నా  మనకు  శక్తికి  మించిన  మ్రొక్కులు  అనుకోకుండా  ఉంటేనే  మంచిది.

3 comments:

  1. బాగుంది పంచుకున్నదుకు థాంక్స్

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. హరిశ్చంద్రునికి చాలాకాలం సంతానం కలుగలేదు. అప్పుడు ఆయన తమ కులగురువైన వసిష్ఠుల వారి వద్దకు వెళ్ళి సలహా చెప్పమని ప్రార్ధించగా , వరుణుని ఉపాసించమని చెప్పగా , హరిశ్చంద్రుడు వరుణుని కొరకు తపస్సు చేయటం జరుగుతుంది.

    అయితే నిన్నటి టపాలో నేను ...

    ( వసిష్ఠుడు హరిశ్చంద్రునితో వరుణయాగం చేయమని చెప్పగా , హరిశ్చంద్రుడు వరుణయాగం చేసారని రాసాను. )

    జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete