koodali

Monday, May 30, 2011

డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.


అవునండి నిజమే.. భోగభాగ్యాలు అంటే డబ్బు మాత్రమే అనుకుంటారు చాలామంది . అది తప్పు.

ఒక ఇంట్లో తల్లిదండ్రులు,పిల్లలు, భార్యాభర్తలు ఇలా ఒకరికొకరు అందరూ జీవించి ఉండటమే పెద్ద భాగ్యము.

మనకు పెద్దగా జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండటం ఇంకో పెద్ద భాగ్యం.......... బి.పి, సుగర్ లేకుండా మనకు ఇష్టమయిన పదార్ధాలు తినగలగటం కూడా భాగ్యమే.

దేవుడు మనకు కళ్ళు అలా అన్ని అవయవాలు సవ్యంగా ఇవ్వటం ఎంతో భాగ్యం.


ఇన్ని భోగభాగ్యాలు ఉండగా డబ్బు లేనంత మాత్రాన ఎవరైనా పేదలు ఎలా అవుతారు ?......... చాలా మంది డబ్బు ఉన్నవాళ్ళకు ఇవన్నీ ఉండకపోవచ్చు.


.ఇప్పటిలా టివీలు, సినిమాలు లేని రోజుల్లో ........ ధనవంతుల ఇండ్లు, అందులో వస్తువులు ఎలా ఉండేవో సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం అంతగా ఉండేది కాదు.

ఈ మధ్యన ఎవరో ఇలా అన్నారు ..... టి.వీల్లో ,సినిమాల్లో......... డబ్బు ఉన్నవారి యొక్క పెద్దపెద్ద భవంతులు ,అందులో విలాసవంతమైన సామాను చూపిస్తున్నారు కదా !

అంతే కాదు .... బయట కూడా డబ్బు ఉన్నవారి ఇండ్లలో జరిగే భారీ ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తున్నారుకదా అందరూ.

ఇవన్నీ చూడటం వల్ల కూడా ............ తాము కూడా అలాంటి వస్తువులను పొందాలన్న కోరికలు కలుగుతాయట ప్రజలకు.

( ఈ భారీ భవంతుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కొట్టుకుచస్తూ , ఏడుస్తున్నట్లే కధలలో ,సీరియల్స్ లో చూపించినా కూడా వారి జీవితాలే నచ్చుతాయి ప్రజలకు. )


అందుకే ఈ రోజుల్లో జనానికి సంపాదన పట్ల విపరీతమైన క్రేజ్ పెరగటానికి ఇవన్నీ కూడా కారణాలట.

సంపాదించటం తప్పేమీకాదు కానీ ..........దేనికైనా కొన్ని పధ్ధతులు, పరిమితులూ ఉంటాయి కదా !

అది అలా ఉంచితే , అసలు ,డబ్బు ఉన్న వాళ్ళందరూ నిజంగా సంతోషంగా ఉన్నారంటారా ?


ఇక్కడ కొన్ని నిజాలు గ్రహించాలి. ఒక వ్యక్తికి కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ బి.పి, సుగర్ వంటి వ్యాధులు ఉండటం వల్ల తనకు ఇష్టమయిన పదార్ధాలు తినలేడు...... మరి ఆ సంపద వల్ల అతనికి ఏం సంతోషం కలుగుతుంది ? .

అతనికన్నా ( డబ్బు ఎక్కువ లేకపోయినా )......... ఇష్టమయినవి తినగలిగే ఆరోగ్యం ఉన్న పేద వ్యక్తి అదృష్టవంతుడు కదా !


కొందరికి బోలెడు సంపద ఉంటుంది. వారికి సంతానం కలగలేదు. అప్పుడు వారి మనసు ఎలా ఉంటుందంటే...........పిల్లలతో తిరిగే కోడిపెట్టను చూసినా ఆ కోడిది ఎంత అదృష్టం. తమ కన్నా అనిపిస్తుందట.


పిల్లలు ఉండి కూడా ఆ పిల్లలు పెట్టే బాధలు భరించలేక కొందరు డబ్బున్న తల్లిదండ్రులు పడే బాధలూ ...........అబ్బో చాలా ఉంటాయి.


డబ్బు ఉన్నవారిలో కొందరికి ............ తల్లి గానీ,తండ్రి గానీ దూరమయితే వారి సంపద వారికి ఆ తల్లినో,తండ్రినో తిరిగి తెచ్చివ్వ లేదు కదా !

( ఈ రోజుల్లో ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రులు కొట్టుకుని విడిపోతున్నారు కూడా ! )

అలాంటి వారి పిల్లలకు ........... తల్లిదండ్రులతో జీవిస్తున్న పేదింటి పిల్లలను చూసినా వారెంత అదృష్టవంతులో కదా ! తనకన్నా........ అనిపిస్తుందట.


కెరీర్, సంపాదన ........ వీటితో ఎప్పుడో తప్ప ఇంటికి రాని భర్త ఉన్న ఒక భార్యకు అష్టైశ్వర్యాలూ ఉన్నా కూడా .......... అది ఏం అదృష్టం .
.తమ కన్నా పొలంలో కలసి పనిచేసే పేద రైతు దంపతులే అదృష్టవంతులని ........... ఆమెకు అనిపిస్తుంది.


డబ్బే గొప్ప అయితే , ఎంతో డబ్బు ఉండీ కూడా.......... కొందరు భార్యాభర్తలు మనస్పర్ధలతో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.

వీళ్ళందరూ డబ్బు ఉన్నా పేదవాళ్ళ కిందే లెక్క. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.

అయితే డబ్బు అందరికీ అవసరమే.......... డబ్బు లేని వాళ్ళకు దాని విలువ బాగా తెలుస్తుంది. కొందరు పేదవాళ్ళకు జబ్బులు వస్తే బాగు చేయించుకోవటానికి కూడా డబ్బు ఉండదు.

కొందరికి తినడానికి కూడా డబ్బు చాలదు. .......... అందుకని డబ్బు అవసరమే.


మేము ఒకసారి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ....అక్కడ ఒక కుటుంబాన్ని చూసాము.

అందులో భార్యాభర్త చక్కగా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి మాత్రం మెంటల్ డిసబిలిటి ........ప్రాబ్లం ఉన్న అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అతన్ని తీసుకువచ్చారు.


వారికి డబ్బు బాగానే ఉండటం వల్ల అతనికి మంచి వైద్యం, మంచి సదుపాయాలు కల్పించగలరు.

కానీ ఆ అబ్బాయిని అలా చూస్తూ జీవితాంతం వారు ఏమంత సంతోషాన్ని అనుభవించగలరు ? తమ తరువాత ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి ? ఎవరు చూస్తారు ? అనే ప్రశ్నలు వారిని వేధిస్తూనే ఉంటాయి.


అందుకని నాకు ఏమనిపిస్తుందంటే డబ్బు అవసరమే కానీ............. డబ్బు ఉన్నవాళ్ళు మాత్రమే అదృష్టవంతులు ............. డబ్బు అంతగా లేని వాళ్ళు దురదృష్టవంతులు అనుకోకూడదు.

డబ్బు ఎక్కువ లేకపోతే ఇక జీవితం అంతా శూన్యం అనే భావన తప్పు.


భోగభాగ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటాయి. అందరూ అదృష్టవంతులే........... ఇలా ఆలోచించి .,ధైర్యంతో ముందడుగు వేస్తే ............ డబ్బు లేనివాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చి డబ్బు సంపాదించగలరు.


డబ్బు ఎక్కువగా ఉంటేనే జీవితంలో సంతోషం ఉంటుంది అనుకోవటం వల్ల.............. ఈ రోజుల్లో అధర్మంగా అయినా సరే డబ్బు సంపాదించాలనే ధోరణి సమాజంలో పెరిగిపోయింది.

 

Friday, May 27, 2011

ఒక చక్రానికి మొదలు........... తుదీ ఏదో ........... చెప్పటం కష్టం.



ఈ అనంత విశ్వంలో మనం తెలుసుకోలేని రహస్యాలు ఎన్నో ఉంటాయి..... అన్నీ తెలుసుకోవాలనుకోవటం మనకు అనవసరం కూడా.

దైవం లేరు అని ఎవరైనా అన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సృష్టిలో చూడండి ... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే ....... ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.

ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం .....ఇవన్నీ ఇంత పద్దతిగా ఎలా ఏర్పడి ఉన్నాయి ?

ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే .....ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం.... ఆ మూల ఆ మహాశక్తినే ఆస్తికులు దైవం అని పిలుచుకుంటున్నారు.


ఆ మహా శక్తికి భౌతికవాదులు మరేదో పేరు పెట్టుకోవచ్చు. అది వారిష్టం.

సృష్టిలో ఉన్నవన్నీ వాటికవే అలా ఏర్పడలేవు కదా !

ఒక చిన్న బీజంలో వృక్షం అంతా ఇమిడి ఉన్నట్లు సృష్టి కూడా అలా మొదలై ఉంటుందేమో ! మరి అన్నిటికీ మొదలు ఏది ? అంటే .... ఇలాంటి కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఆ సమాధానాలు దైవానికే తెలియాలి.


ఉదా..మీరు మనసులో ఒక చక్రం ఆకారాన్ని ( circle ) .......... o ........ఊహించుకోండి.
దీనికి మొదలు..... తుదీ , ఏదో .... చెప్పటం కష్టం.

కొన్ని విషయాలు అంతే.

ఆద్యంతములు లేని ..... అనే దానికి ఉదాహరణ చెప్పవలసి వచ్చినప్పుడు ....ఉదాహరణగా ఈ చక్రము యొక్క ఉదాహరణను కూడా చెబుతారు పెద్దలు..

అలాగే మనకు తెలియనంత మాత్రాన అన్నీ అబద్దాలు అనుకోకూడదు.

దైవం ఉన్నారు అని నమ్మటానికి కావలసినన్ని అనుభూతులు ఎందరో భక్తుల జీవితాల్లో జరుగుతున్నాయి.


ఇవన్నీ నమ్మని వాళ్ళు సాక్షాత్తూ ఆ దైవమే ఎదురుగా వచ్చి ప్రత్యక్షమయినా అదంతా భ్రాంతి అనుకుంటారు. ............ దైవం గురించి నమ్మకం కలగాలన్నా ఆ సమయం రావాలి అంతే.


ఎవరైనా .... అంతా మన గొప్పే .... ,మనమే తెలివిగలవాళ్ళం అని అహంకరించ కూడదు.. అంతా దైవం దయే అనుకోవాలి..


Wednesday, May 25, 2011

ఈ మధ్య సినిమాల్లోనూ, యాడ్స్ లోనూ ...........

. 

అండర్ గార్మెంట్స్ స్థాయికి దిగజారిపోయిన ............ నేటి సినీ నాయికల ( కొందరు ) వస్త్రధారణ.

ఈ మధ్యన అన్నా హజారే గారు దీక్ష చేపట్టినప్పుడు ......... కొందరు నటీమణులు కూడా దేశంలో అవినీతికి వ్యతిరేకంగా తమ మద్దతును తెలియచేశారు.

ఇందులో కొందరు సగం దుస్తులు వేసుకుని మాత్రమే సినిమాల్లో నటిస్తుంటారు. దేశంలో అవినీతి సంగతి అలా ఉంచితే ........... మొదలు వీరు తాము సినిమాల్లో నటించేటప్పుడు చక్కగా బట్టలు కట్టుకుని నటిస్తే బాగుంటుంది. .............

వీళ్ళందరూ తమ సినిమాల ద్వారా ........ తరతరాల సంస్కృతిని భ్రష్టుపట్టించకుండా ఉంటే......... అదే వీళ్ళందరూ దేశానికి చేసే పెద్ద సేవ.


డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంది. ........ అదే సంస్కృతి, పరువు పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం. ఈ సినిమాల ప్రభావం ప్రజల పైన చాలా ఉంటుంది.


ఈ మధ్య సినిమాల్లోనూ, యాడ్స్ లోనూ ఆడవాళ్ళ వేష దారణ ఎలా ఉంటుంది అంటే ..... ఒక ఆమె చిన్న పొట్టి నిక్కర్, చిన్న బనీను, వేసుకుంది......... జుట్టు విరబోసుకుంది......... పారల్లాంటి గోళ్ళు ఉన్నాయి..... ఇప్పుడు చాలా మంది చిన్నగా అయినా బొట్టు పెట్టుకోవటం లేదు కదా ! ( పూర్వం మన ఆడవాళ్ళు బొట్టు లేకపోవటాన్ని అశుభంగా భావించేవారు.) ..


(
ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుంటే దరిద్రమని పెద్దలు చెప్పటం జరిగింది...
జడవేసుకోవటం కుదరక అలా వదిలేసినప్పుడు, ......... కనీసం జుట్టుకు ప్రక్క పిన్నులు గానీ, చిన్న క్లిప్ గానీ పెట్టుకోవటం వల్ల........... జుట్టు గాలికి ఎగిరి అందులోని చుండ్రు, పేలు వగైరా చుట్టు పక్కల పడవని పెద్దల అభిప్రాయం కావచ్చు...... )


రతీయ స్త్రీ అవతారం ఇలా ఉంటుందా ? గత యాభై ఏళ్ళలో సమాజం ఎంతగ మారిపోయింది ?

పూర్వం ఆటవిక కాలంలో బట్టలు గురించి తెలియని వారు ఆకులు అవి తగుమాత్రంగా కట్టుకునేవారు.......... ఇప్పుడు అన్నీ తెలిసీ పొట్టి దుస్తులు ధరించటం ఫేషన్ అంటున్నారు......... ఇదేనా మనం సాధించిన అభివృద్ది ?


దుస్తులతో శరీరాన్ని చక్కగా కప్పుకోవటం అనాగరికమా ?

పూర్వం పాశ్చాత్య దేశాల ఆడ వాళ్ళు కూడా నిండుగా గౌన్లు వేసుకునేవారట............ వాళ్ళు ఫేషన్ పేరుతో పొట్టి దుస్తులు ధరించటం మొదలుపెట్టారు........... వాళ్ళని చూసి మనవాళ్ళూ అదే విధంగా తయారవటం ఏం పద్దతి ?

ఇలా అర్ధనగ్న దుస్తులు, డ్యూయెట్ల పేరుతో అసభ్యకర నృత్యాలు , కుటుంబ సభ్యులు ఒకరికొకరు విషం కలిపి ఇచ్చే పాత్రలున్న సీరియళ్ళు,............... ఇవన్నీ చూసి,చూసి ప్రజల ప్రవర్తనలో, పద్దతుల్లో విపరీతమైన మార్పు వచ్చింది.


ఇందులో తప్పేమిటి ? ఇదంతా అత్యంత సహజం ........... అన్న స్థాయికి వచ్చేసారు.

తరతరాల భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ,............ కాలగర్భంలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతయినా ఉంది.

కొద్ది సినిమాలు ,సీరియల్స్ మంచి సందేశాత్మకంగానే ఉంటున్నాయి. ......... మంచి కన్నా చెడు తొందరగా ప్రభావాన్ని చూపిస్తుంది కదా !


.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.......... ఇలాంటి సినిమాలు తీసి దేశానికి అందిస్తున్న వాళ్ళలో.......... చాలా మంది అన్నీ తెలిసిన వాళ్ళు, ధర్మాధర్మాల గురించి మంచిగానే మాట్లాడుతారు. కానీ ............. మరి వాళ్ళ సినిమాలు అలా ఎందుకుంటాయో ! అర్ధం కాదు...?


ఇవన్నీ ఎంతవరకూ సబబో వారి వారి విజ్ఞతకు వదిలెయ్యటం తప్పా .సామాన్యులు ఏం చేయ
లరు ?

 

Monday, May 23, 2011

అసభ్య చిత్రాలను వేస్తే ........ పత్రికలు ఎలా కొనేది ?...

 
(.ఇంతకు ముందటి శీర్షికను మార్చి కొత్త శీర్షికను పెట్టానండి. )

నాకు దిన
పత్రికలు , వారపత్రికలు, పుస్తకాలు ఇలాంటివి చదవటం బాగా ఇష్టం.... సమయముంటే అందులోని అడ్వర్ టైజ్ మెంట్స్ కూడా వదలకుండా చదువుతాను.


ఇంతకుముందు మేము వారపత్రికలు తెప్పించుకొనేవాళ్ళం. అందులో మంచి విజ్ఞానదాయకమైన ఆర్టికల్స్, మంచి కధలు ఉంటాయి కదా !

వాటితో పాటూ కొన్ని కధలూ........ వాటికి అసభ్యకరమైన బొమ్మలతో ఉంటాయి.


కొంతకాలం క్రిందట పత్రికల్లో ఇలాంటి బొమ్మలు వేసేవారు కాదు. ఒకరిని చూసి ఒకరు ఇలా మొదలుపెట్టారు.

ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ ఈ పుస్తకాలు చూస్తున్నప్పుడు, మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది... పత్రికల వాళ్ళు ఇలాంటి బొమ్మలు వెయ్యకపోతే బాగుండు అనిపిస్తుంది.

కొన్నిసార్లు పత్రిక రాగానే ఆ బొమ్మలున్న పేజీలు కత్తిరించి పారవెయ్యటం కూడా జరిగింది. ( పిల్లల వాటిని చూడకుండా ఉండాలని. ) కానీ.............. అలాంటి బొమ్మలు ఎక్కువయ్యి కత్తిరించటం మొదలుపెడితే ఇక పుస్తకమన్నది మిగిలేటట్లు కనిపించలా.....

ఇలాంటి పరిస్థితిలో నేను .ఒకసారి పత్రికా ఆఫీసుకి ఫోన్ చేసాను. ఆఫీసులో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసారు. నేను మా ప్రాబ్లం చెప్పాను.


మేము మీ పత్రిక 15 సంవత్సరాలనుంచీ కొంటున్నాము.మొదట మీ పత్రిక బాగుండేది. ............. ఇప్పుడు మీరు పత్రికలో వేసే బొమ్మలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి............... ఇంట్లో పిల్లలు చూస్తే బాగుండదు. దయచేసి అలాంటివి ప్రచురించవద్దు. అని.

వారు ఏమన్నారంటే ... అలాగేనండి...మీరు చెప్పిన విషయం పై వాళ్ళకు చెబుతాను అన్నారు.(సామాన్య ఉద్యోగులు అంతకంటే ఏమనగలరు లెండి ?)

ఈ దేశంలో నా లాంటి సామాన్యుల గోడు వినిపించుకునేదెవరు ?

ఆ తరువాత కూడా పత్రికలో బొమ్మలు అలాగే వచ్చాయి. ( అలా రాకపోతేనే ఆశ్చర్య పడాలి .)

ఇక చేసేదేమీ లేక మేము పత్రిక కొనటం మానేసాము.

వెనకటికి ఒక ముసలామె ఊరు వాళ్ళ మీద కోపమొచ్చి నేను, నా కోడి లేకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తాను అని తన కోడిని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయిందట.

అలా నేను కొననంత మాత్రాన ఆ పత్రికకు ఏమిటి నష్టం ? ప్రజలు చాలా మంది కొంటూనే ఉన్నారు గదా !

అయినా జరిగిన దానికి నాకేమీ బాధ లేదు. నా పరిధిలో నాకు చేతనయినది చేసానన్న తృప్తి నాకుంది.

ఈ పత్రికల వాళ్ళకు ఇలాంటివి వెయ్యకూడదని తెలియదంటారా ? తెలుసు , కానీ వాళ్ళ పత్రికల సర్క్యులేషన్ పెంచుకోవటానికి అలా వేస్తుంటారు.

అలా వార పత్రికలు తెప్పించుకోవటం మానేసాం కదా !

ఇప్పుడు దిన పత్రిక వాళ్ళు కూడా ..... పిల్లలు చూడకూడని అసభ్యకరమైన సినిమా బొమ్మలు అవీ వేస్తున్నారు. అవి కూడా మానేద్దామన్నంత కోపం వస్తోంది కానీ .. అన్నిటినీ మానేసి ఎక్కడికని చస్తాం. వార్తలు తెలియాలి కదా !


మరీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోతే కష్టమని తప్పనిసరి పరిస్థితిలో కొంటున్నాము.... మన చుట్టూ అవే ఉన్నప్పుడు టి.విలూ, నెట్లూ, ఇలా ఎన్నని మానేయగలం.


ఇలా సమాజాన్ని చెడగొడుతున్న వారి పాపం ఎప్పటికయినా పండకుండా పోతుందా............ .అని తిట్టుకుంటూ పత్రికలూ కొంటున్నాము, టి.వి ప్రోగ్రామ్స్ , సినిమాలు, ( కొన్ని ) చూస్తున్నాము... అంతకంటే సామాన్యులం ఏం చేయగలం ?

మాకు తెలిసిన వాళ్ళు కొందరు కేబుల్ కనెక్షన్ తీయించేసారు.... పిల్లలు పాడయిపోతున్నారని. మేము ఇంకా అంత త్యాగం చెయ్యలేకపోతున్నాము.

***********
   
ఇంకొక విషయం ఏమిటంటేనండి, 

కొన్ని దేవాలయాలపైన శృంగారచిత్రాలు ఉన్నాయి.ఇలా వేయటానికి కారణాలు మనకు తెలియవు.

 కొందరు ఏమంటారంటే, పాతకాలంలో నవవధూవరులకు శృంగారం గురించి తెలియజేయటం కొరకు కొన్ని  దేవాలయాల గోడలపై శృంగారపరమైన చిత్రాలు వేసారని కొందరు అంటారు. ఇది కొంతవరకూ నిజమే కావచ్చు. 

అయితే, కొన్ని అసభ్యకరమైన శృంగార చిత్రాలను గమనిస్తే, ఇలాంటి చిత్రాలు ఎందుకు ఉన్నాయో? అనే సందేహాలు కలుగుతాయి.

ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వాళ్ళలో కొందరు, కొందరు స్వార్ధపరులు,  మతాన్ని వ్యతిరేకించే కొందరు..ఆధునిక కాలంలోనూ ఉంటారు, ప్రాచీనకాలంలోనూ ఉంటారు.

 ఇలాంటి వారి వల్ల  సమాజంలో కొన్ని మూఢాచారాలు ప్రవేశపెట్టబడ్డాయి.  ఇలాంటి వారి వల్లే అసభ్యంగా ఉండే చిత్రాలు కూడా  కొన్ని దేవాలయాల గోడలపై ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. 

అంతేకానీ అసభ్యకరమైన సంస్కృతిని హిందూ సంస్కృతి సమర్ధించదు. మూఢనమ్మకాలను కూడా వ్యతిరేకించాలి.

(ఈ విషయం పోస్టులో  తరువాత ప్రవేశపెట్టబడింది. )


Friday, May 20, 2011

ఎంతకని పిల్లలను వీటి బారినుంచి కాపాడగలం ?

ఈ మధ్యన కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూనే, మందులు వాడుకుంటూనే .... కాలభైరవాష్టకము ఒకసారన్నా చదివితే బాగుంటుంది అనిపిస్తోందండి. ఇంకా ....లలితా అమ్మవారి నామములు గానీ ఎవరికి ఇష్టమయిన దైవాన్ని వారు ప్రార్ధించుకోవటం మంచిది.
.................................................................

ఇంకా , ఈ మధ్యన తిరుమల లోని వేదపాఠశాలలో జరిగిన అకృత్యాల గురించి విన్నాక ... ఈ సమాజం ఎటుపోతోందో అర్ధం కావటం లేదు.


మనుషుల్లో నైతిక విలువలు లోపిస్తున్నాయి......... దానికి తోడు ఆధునిక విజ్ఞానం అందించిన కొన్ని సాధనాలు కూడా ఇలా నేరప్రవృత్తి పెరగటానికి ..........మరింత దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు.


ఉదా...చూడండి.......ఇప్పుడు వస్తున్న సినిమాలు, సీరియల్స్ , పత్రికల్లో వస్తున్న కధలు ,నవలలు వీటిలో అసభ్యత ఎక్కువగా ఉంటోంది.


ఇదివరకు సినిమాలు అందులోని దృశ్యాలు, చూడాలంటే హాలుకు వెళ్ళవలసి వచ్చేది. . ఇప్పుడు పెరిగిన ఆధునిక విజ్ఞానం పుణ్యమా అని ఇవన్నీ టి.విల పేరుతో నట్టింట్లోకి నడిచి వచ్చేసాయి.


ఇది వరకు ఇంటర్నెట్ కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ........ ఇప్పుడు సెల్ ఫోన్ లోనే నెట్ కూడా వచ్చేస్తోంది.

వేదపాఠశాల పిల్లల వద్ద కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని వార్తలలో చదివాము.


పిల్లలు దూరంగా ఉన్నప్పుడు సెల్ వల్ల సమాచారం అందుబాటులో ఉంటుందని సెల్ ఇస్తారు పెద్దవాళ్ళు............ సెల్ ఫోన్స్ లో అసభ్యకర దృశ్యాలు చూసే వీలుంది. .......... ఎంతకని పిల్లలను వీటి బారినుంచి కాపాడగలం ?


టి. విల్లో కూడా అడ్వర్ టైజ్ మెంట్స్ రూపంలో అసభ్యకరమైన సన్నివేశాలు వస్తూంటాయి. వీటిని అడ్డుకోనే వారే లేరా ?


తల్లిదండ్రులు కూడా చదువు కోసం పిల్లల్ని హాస్టల్స్ లో వేస్తారు............ అక్కడ ఏమైనా ర్యాగింగ్ జరిగితే పిల్లలు పెద్దవాళ్ళకు సూటిగా చెప్పలేరు. ............ హాస్టల్ నచ్చలేదని పిల్లలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఆలోచించాలి.


బోలెడు డబ్బు కట్టామనో , ఎలాగోలా చదువుకో అనో పెద్దవాళ్ళు మూర్ఘంగా ప్రవర్తిస్తే ........తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ........... బలి అయ్యేది పిల్లలే. ఇలా కొందరు పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.


పాఠశాలలు, వాటిని నడిపే యాజమాన్యాల మీద ఎంతో నమ్మకంతో తమ పిల్లలను హాస్టల్స్ లో వేస్తుంటారు తల్లిదండ్రులు. ........... వారి పిల్లలను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత హాస్టల్ యాజమాన్యాలకు లేదా ?

పెద్దలు కూడా కొంచెం కళ్ళు తెరిచి ............ చదువు, సంపాదన పేరుతో జరుగుతున్న వికృతవ్యవస్త నుంచి బయటకు వచ్చి ........... పిల్లల బాగోగుల గురించి ఆలోచించాలి. వారి పాలిట మీరే విలన్లు కాకండి.


ఈ రోజుల్లో మన సమాజం ఎలా ఉందంటే......పాశ్చాత్య నాగరికతను అనుకరిస్తూ విలాసంగా జీవించే వారిని గొప్ప వారిగా అందరూ గౌరవిస్తున్నారు.

అలా కాకుండా......... సింపుల్ గా , సాంప్రదాయబధ్ధంగా జీవించేవారిని చాదస్తులుగా, బ్రతకటం చేతకానివారిగా ఎగతాళి చేస్తున్నారు చాలామంది.


ఆర్భాటాలూ, అట్టహాసాలూ, అసభ్యకరమైన దుస్తులూ , ఆడంబరాలతో కూడిన జీవనవిధానాలు, ...ఒక ప్రక్క ............. దేవుడూ, గీవుడూ ఎవరూ లేరని గోల పెట్టే నాస్తిక వాదులు ... ..వీటన్నిటి మధ్య....... ఈ గందరగోళంలో నలిగిపోయి బలహీనమనస్కులు....దైవము, ధర్మం, పాపపుణ్యాలను గాలికి వదిలేసి తప్పు దారి పట్టే అవకాశం ఎంతయినా ఉంది.


( దైవానుభూతులను పొందిన ఆస్తికులు మాత్రము .......... దైవం లేరని ఎవరు చెప్పినా దారి తప్పక దృఢంగా నిలబడతారు ... )

ఇలా రాస్తున్నందుకు కొందరికి కోపం వచ్చినా పిల్లలకు మంచి చెప్పవలసిన తల్లిదండ్రులే చాలా మంది ఈ రోజుల్లో దారి తప్పుతున్నారు..


పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? ఇలా పాపాలు పెరిగిపెరిగి ..... ప్రళయం వచ్చి ప్రపంచం అంతమయిపోతుంది. మళ్ళీ కృతయుగం ప్రారంభమయి ధర్మం నాలుగు పాదాలా నిలబడుతుంది.... 

 

Wednesday, May 18, 2011

దైవం,ధర్మం ,పాపం, పుణ్యం అంటూ ఏమీ లేవా ? అయితే ........... మనం ఏం చేసినా గమనించేవారు లేనప్పుడు...........

కొందరు దైవం అంటూ ఎవరూ లేరు అంటుంటారు. అయితే, ఉన్న దైవాన్ని లేరని ప్రచారం చేయటం వల్ల ప్రపంచానికి ఏం లాభం.

లాభం లేకపోగా అంతా నష్టమే...........

దైవం,ధర్మం ,పాపం, పుణ్యం అంటూ ఏమీ లేవా ? అయితే ........... మనం ఏం చేసినా గమనించేవారు లేనప్పుడు ................... మనం చిన్న తప్పు చేసినందువల్ల లోకానికి వచ్చే నష్టమేముంటుందిలే.............అని జనం అనుకొనే ప్రమాదముంది.


జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దైవం ఉన్నారని ............ వారు మనకు ఎప్పటికీ తోడు........ అని భావిస్తూ బ్రతుకుతున్నవాళ్ళు ఎందరో ఉన్నారు.


కష్టాలలో ఉన్నప్పుడు ఆ బాధలో ................. ఉన్నావా? అసలున్నావా ? అని చనువుగా దైవాన్ని అడిగినా ......... అది తాత్కాలికమే. .......... దైవం ఉన్నారని, చూస్తున్నారని ............ నమ్మి ఎందరో ఉన్నారు. దైవం ఉన్నారని, కనుగొన్నామని ......... ఎందరెందరో అన్నారు.


దైవం మీద నమ్మకంతో ఎందరో .............ధైర్యంగా కష్టాలకు ఎదురీదుతున్నారు.
ధైర్యంగా బాధలను భరిస్తున్నారు. ఈ ప్రపంచములోని ఎన్నో ఆకర్షణలను, ప్రలోభాలను తట్టుకుంటూ ......... నీతిగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నారు.


మనకు తెలుసు .... ఒక వ్యక్తి , జీవితంలోని ఆకర్షణలను, ప్రలోభాలను తట్టుకుని నీతిగా జీవించాలంటే ( కనీసం అలా ప్రయత్నించాలంటే )........ఎంత మానసిక సంఘర్షణను అనుభవించాలో !


అలా జీవించేవారికి శక్తిని ఇచ్చేది........ దైవమనే ఆశ . ధర్మంగా జీవిస్తే ........... దైవం మెచ్చుకుంటారు, .............. మనకు మంచి జరుగుతుంది, ..... కష్టాలు దూరమవుతాయి, ............ మరణించాక దైవం దగ్గర మంచి స్థానం లభిస్తుంది ఇలా.........ఆశిస్తూ............ ఆ దారిలో ముందుకు పోతున్నారు..


అందుకే.......... దైవమని ఎవరూ లేరు అంటూ ఎందరో భక్తుల జీవితాలను నిరాశామయం చేయకండి.

ఆ విధంగా... దైవము, ధర్మము, పాపపుణ్యాలు అంటే ఉన్న భయభక్తుల వల్ల........... ప్రపంచము ధర్మ మార్గంలో నడుస్తోంది.


నిజమే, ఈ రోజుల్లో భక్తి పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారు. కొన్ని మూఢాచారాలు అమలులో ఉన్నాయి.... అయితే వాటిని సరిదిద్దుకోవాలి గానీ ఇంట్లో ఈగలు ఉన్నాయని .... ఇల్లే తగలబెట్టుకుంటారా ఎవరైనా ?


సమాజంలో జరిగే ఇలాంటి మోసాలను సరిదిద్దుకోవాలి కానీ ............ అసలు దేవుడు, మహిమలు లేవనటం అన్యాయం.

ఎందరో నాస్తికులు దైవం ఉన్నట్లు అనుభవాలు పొంది ఆస్తికులుగా మారుతున్నారు.... దైవం ఉన్నట్లుగా ఎందరో ఆస్తికులకు జీవితంలో అనుభవాలు కలుగుతున్నాయి. .....


దైవం ఉనికిని నిరూపిస్తూ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కొట్టిపారేస్తూ దైవం లేరు అని వాదించటం వల్ల ............ ప్రపంచానికి జరిగేది అపకారమే.

అప్పుడు ఏమవుతుందంటే .... ఇది పాపం ..... ఇది పుణ్యం....ఇది ఒప్పు.....ఇది తప్పు......ఇది ధర్మం.......ఇది అధర్మం ..... అనే తేడా లేకుండా ఎలాగయినా సరే అడ్డగోలుగా డబ్బు సంపాదించి ...... విలాసంగా జీవించటం మాత్రమే జీవిత ధ్యేయమయిపోతుంది జనాలకు.

.................................................................................
అయితే, కొందరు హేతువాదుల వల్ల దేవుని భక్తులకు కొన్ని లాభాలు కూడా జరుగుతున్నాయిలెండి. ఎలాగంటే........కొందరు భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు గదా ! భక్తులకు వారిని ఏమన్నా అనాలంటే భయం. ఏమంటే ఏ పాపం వస్తుందో అని.... మనకెందుకులే అని ఊరుకుంటారు. 

 హేతువాదులకు ఇలాంటి భయాలేమీ ఉండవు కాబట్టి ............ వారు ఇలా మోసం చేసే వాళ్ళను అడ్డుకుంటారు.... ఆ విధంగా హేతువాదులు భక్తులకు ఒకోసారి మేలే చేస్తున్నారు.అందుకు హేతువాదులకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

( అయితే ...ఈ క్రమంలో ఎవరు మంచి స్వాములో ? ఎవరు మోసం చేసే స్వాములో కనిపెట్టడం కష్టమే ! అలా ఒకోసారి అపార్ధాలు కూడా వస్తున్నాయి. )
................................................................

. మరి,  కొందరు భక్తులు ,పూజలు చేసేవాళ్ళు కూడా చెడ్డపనులు చేస్తున్నారు కదండీ అని ప్రశ్నించవచ్చు.

నిజమే.. దైవం ఉన్నాడని నమ్మి పూజలు చేస్తూ కూడా మనసును అదుపులో పెట్టుకోలేక చెడ్డపనులు చేసే వాళ్ళూ ఉన్నారు. ................ దేవుడిని నమ్ముతూ కూడా ఇన్ని పాపాలు చేస్తున్నారంటే ....... ఇక ఇలాంటి వాళ్ళని ............. దేవుడు గీవుడు ఎవ్వరూ లేరు అని నమ్మిస్తే..... ఇక ఆ వ్యక్తులు చేసే చెడ్డపనులకు అడ్డూ అదుపూ ఉంటుందా ? ( ఇలాంటి వాళ్ళు ఇలా పూజలు చెయ్యగా,చెయ్యగా ........... ఎప్పటికయినా మంచిగా మారే అవకాశం ఉంది కూడా.........)

........................................................................

ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన ఒక పిల్లవాడు..... తాను మంచి మార్కులతో పాసయ్యానని తెలిసినప్పుడు తాను సాధించిన గొప్ప ఫలితాన్ని తల్లిదండ్రులకు చూపించి ... వారి మెప్పును పొందాలనుకుంటాడు. ..
.అలాగే............

జీవితంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని నిగ్రహంగా, ధర్మంగా జీవించి ........... దైవం యొక్క దయను పొందాలని తపించే భక్తులు..... ఎందరో ఉన్నారు.

అందుకే,..దైవం అనేవారు ఎవరూ లేరు అని అంటూ వారి ఆశలను దయచేసి త్రుంచివేయవద్దు.

 

Tuesday, May 17, 2011

ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

 

ప్రహ్లాదుని వంటి బాలకుని సడలని భక్తికి మెచ్చి....... ఆవిర్భవించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఈ రోజు..

ఈ మధ్యన మేము 4 రోజులు తమిళనాడు వెళ్ళి , దేవాలయాలు అవీ చూసి ,ఈ నెల 14 న ప్రొద్దున తిరిగి వచ్చామండి...... తిరువణ్ణామలై, శ్రీరంగం, శ్రీ విల్లిపుత్తూరు, సమయపురం, మేల్ మరువత్తూర్, మధురై మీనాక్షి సుందరేశ్వరుల గుడి , తిరుచ్చిలో ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్ ఇంకా కొన్ని గుడులు చెన్నైలోవి కూడా చూసి వచ్చామండి....... భగవంతుని దయవల్ల అన్నీ బాగా జరిగాయి.


ఆ దేవాలయాలు రాతితో కట్టినా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి,.............. ఆ శిల్ప సౌందర్యం చాలా గొప్పగా బాగుంది. ...... శ్రీ విల్లిపుత్తూరులో కూడా వటపత్ర శాయి గుడిలో ...... చెక్కతో చేసిన ఆ ఆర్చిటెక్చర్ చాలా గొప్పగా బాగుంది.


మేము కూడా చాలా మందిలాగే......... కొద్దిగా భక్తి ఉండి, ................ ఇంకా కోరికలు తీరటం కోసం కూడా ..... ఇలా యాత్రలకు వెళ్ళామండి. ( ఇలా చెప్పటానికి సిగ్గుగా ఉంది. కోరికలు లేని పసిపిల్లల్లాంటి నిష్కల్మషమైన భక్తి కలిగే అదృష్టం ......ఇంకా మాకు కలగలేదు .).


సరే, అది అలా ఉంచండి. కొందరు దైవము, మహిమలు ఇలాంటివన్నీ లేవంటారు కదా ! ఈ ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.


ఈ భూమి మీది రహస్యాలు తెలుసుకోవటానికే మనకు ఎప్పటికీ సాధ్యం కాదు.... ఇక అనంత విశ్వంలోని రహస్యాలు , కోటానుకోట్ల నక్షత్రాల గురించి తెలుసుకోవటం అసలెప్పటికీ సాధ్యం కాదు........... అసలు వీటి గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి............ మనం మన జీవితంలోని ఆనందాన్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది.


కొందరు ,హేతువాదులు విభూతి సృష్టించటం లాంటివి మాజిక్ ద్వారా చూపించి చూశారా !..... ఇదంతా మేము కూడా చెయ్యగలం కాబట్టి .............. దేవుడు, మహిమలు లాంటివి ఏమీ లేవు అంటుంటారు..


మహిమలు అంటే కేవలం విభూతి సృష్టించటం ఇలాంటివి మాత్రమే కాదండి. ........... యోగులు కొందరు అణిమాది సిధ్ధులను పొందినవారు ఉన్నారట.............. శరీరాన్ని చిన్నదిగా , పెద్దదిగా చెయ్యగలగటం, పరకాయ ప్రవేశం, ఆకాశ గమనం, ఒక దగ్గర మాయమయ్యి......... ఇంకొక దగ్గర ప్రత్యక్ష మవ్వటం , దూరశ్రవణం, దూరదృష్టి కలిగిఉండటం ఇలా ... ఎన్నో శక్తులు ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధించిన వారు ఉన్నట్లు ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తుంది.


1.. మహా భారతంలో సంజయుల వారు భారతయుధ్ధం జరుగుతున్న విధానాన్ని ................ ఎంతో దూరం నుంచీ చూసీ, అక్కడ జరిగే సంభాషణలు వినీ .................... దృతరాష్ట్రుల వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు అని అంటే ............. ఇదంతా అభూత కల్పన. ............. దూరం నుంచీ యుధ్ధం జరగటం చూడటం ఎలా సాధ్యం ? అని ఎగతాళి చేసిన వారు ఎందరో ఉన్నారు ........


మరి ఇప్పుడు టి.విలు, ఫోన్లు వచ్చాక దూరశ్రవణం, దూరదృష్టి అసాధ్యం కాదని తేలిపోయింది కదా !

2.. ప్రపంచంలో సైన్స్ కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో ఇలాంటి మహిమలు స్వయంగా చూసినవారు.......... చెప్పిన మహిమల యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి. ................ ఆహారం తీసుకోకుండా ఎన్నో ఏళ్ళు జీవించిన ఒక మహా సాధ్వి గురించి,............. రాముడు అనే ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన.......... శ్రీ శ్రీ లాహిరీ మహాశయులనే ఒక మహా యోగి గురించి............. ఇలా ఎన్నో వివరాలు ఆ గ్రంధములో చెప్పబడ్డాయి.


3..ఇప్పుడు కూడా ఒక స్థాయిలో ......... యోగా, ప్రాణాయామం చేసే వారు కొందరు నీటిమీద తేలుతూ వెల్లికిలా పరుండి విన్యాసాలు చేయటం మనం చూస్తూ ఉంటాము.

మన వాళ్ళకు విదేశాల వాళ్ళ గురించి చెబితే బాగా నమ్ముతారు. అలాంటి ఉదాహరణ చూడండి...........

4....వైద్య ప్రపంచానికి అంతు చిక్కని అద్భుతం....విచిత్ర శక్తుల వింత మనిషి........." edgar caycey ""ఈయన గురించి .......... నెట్ లో............ వివరంగా వ్రాయబడింది. దయచేసి చదవండి.


ఈయన ఏసు క్రీస్తు భక్తుడు. వైద్యం గురించి ఏ మాత్రం తెలియని ఈయన ట్రాన్స్ లోకి వెళ్ళి , తనకు భగవదత్తమయిన శక్తి ద్వారా ............... గొప్ప డాక్టర్ గా మారి ఎన్నో క్లిష్టమయిన కేసులలో రోగాలను తగ్గించేవారట.

1910 లో డాక్టర్ వెస్లీ అనే ఆయన......... అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ రీసెర్చి వారికి ఎడ్గర్ ను ఓ మెడికల్ వండర్ గా పరిచయం చేశారట .


5.....ఇంకా మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో " ఆంరోహా " అన్న పట్టణానికి వెలుపలగా ఉండే " షర్ పుద్దీన్ షా దర్గా " లో తేళ్ళు ఎవరినీ కుట్టవట..

ఈ దర్గాలోని మౌల్వీ గారి మహిమకు మరో నిదర్శనం ఏమిటంటే ................ఈ తేళ్ళను ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళేందుకు ఇక్కడి అధికారులు అనుమతిస్తారట.


అయితే..............అధికారులు ఎంత సమయం వరకూ ఉంచుకోవచ్చని ఆ సమాధి దగ్గర అనుమతి తీసుకుని మీకు అనుమతిస్తారో ............. అంతవరకే ........ అవి ఎలాంటి హానీ చేయని సాధు జంతువుల్లా ఉంటాయట.

నిర్ణీత సమయానికి ముందుగానే వాటిని మరలా దర్గా అధికారులకు అప్పగించాలట. ............ కేవలం సమాధిలోని ఆ మహిమాన్విత మహాపురుషుని దివ్య ఆత్మ యొక్క అద్భుత శక్తి కారణం గానే........... ఈ ఆలయ ప్రాంగణంలో తేళ్ళు ఎవరినీ కుట్టవట............ ఈ విషయం నేను ఒక పుస్తకంలో చదివానండి.


6...ఇంకా కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్య క్షేత్రంలో పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. .............. ఆ నందీశ్వరుని చుట్టూ కొంతకాలం క్రితం వరకూ కూడా ................. భక్తులు ప్రదక్షిణలు చేయటానికి స్థలం ఉండేదట.

అయితే ఆ నందీశ్వరుడు పెరుగుతుండటం వల్ల .......... ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయటానికి అవకాశం లేనంతగా ........... నందీశ్వరుడు పెరగటం జరిగింది. మేము కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నాము.


భక్తి పేరుతో కొందరు ప్రజలను మోసం చేయటాన్ని, భక్తి పేరుతో మూఢత్వం పెరగటాన్ని ఖండించవలసిందే.............కానీ ఇలా ప్రపంచములో ఎన్నో వింతలు ఉండగా దేవుడు లేడు, మహిమలు లేవు అనటం అన్యాయం కదండి..

 

Monday, May 9, 2011

దైవం,సైన్స్ వేరు కాదు........ సైన్స్ సృష్టిలో భాగమే..........

 

నాకు మూడు ,నాలుగు రోజులు కొంచెం పని ఉందండి.

అందుకని ఈ రోజు పోస్ట్ రాద్దామా ? వద్దా ? అనుకుంటుంటే.. మీ కామెంట్స్ ఇంతకుముందే చదివానండి. అందువల్ల ఈ పోస్ట్ ద్వారా నాకు తెలిసినంతలో చెప్పటానికి ప్రయత్నిస్తానండి.


కొందరు డాక్టర్స్ కు కూడా వ్యాధులు ఎందుకు తగ్గటం లేదు ? అని రాయటానికి కొన్ని కారణాలున్నాయండి.

నా దృష్టిలో దైవం.........సైన్స్ వేరు వేరు కాదండి. దైవం సృష్టించిన సృష్టిలో సైన్స్ ఒక భాగమే. కానీ కొందరు ఏమంటారంటే.....దైవం అని ఎవరూ లేరు. సైన్సే గొప్పది అని.. అది దృష్టిలో ఉంచుకొని , సైన్స్ అంత గొప్పదయితే .......... మరి మందులు వాడినా కొందరు డాక్టర్లకు జబ్బులు ఎందుకు తగ్గటంలేదు అన్న దానికి .. డాక్టర్లను ఉదాహరణగా చెప్పటం జరిగింది.



అంతేగానీ డాక్టర్లను తక్కువగా చెప్పటం నా ఉద్దేశం కాదండి. నాకు డాక్టర్లంటే చాలా గౌరవం. ఎవరికయినా రోగాలు తగ్గాలంటే మందులతో పాటూ దైవకృప కూడా ఉండాలన్నదే నా అభిప్రాయం.


మీరు ఒత్తిడి వల్ల కొందరికి జబ్బులు తగ్గవు అంటున్నారు. నిజమే కానీ చాలా జబ్బులు వచ్చేదే ఒత్తిడి పెరగటం వల్ల. మరి ఒత్తిడి తగ్గకపోతే మందులు పనిచేయవు అంటే జబ్బులు తగ్గటం కష్టమే.............


పూర్వం మన పెద్దవాళ్ళు 90 ఏళ్ళు అలా ఆరోగ్యంగా జీవించిన వారు చాలామందే ఉన్నారు. గత కొన్ని శతాబ్దాలుగా కొన్ని కారణాలవల్ల భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం తగ్గటం జరిగింది.


విదేశీయాత్రికులు ఎందరో ........... భారతదేశ సౌభాగ్యాన్ని, ఇక్కడి ప్రజల సంస్కృతిని, ఎంతో గొప్పగా ప్రశంసించారు............. అప్పటి ప్రజలు ఎంతో పుష్టిగా ,ఆజానుబాహు శరీరాన్ని కలిగి ఉండేవారట. మ్యూసియంస్ లో ఆనాటి వీరుల దుస్తులు చూస్తే ......... ఆ విషయం తెలుస్తుంది.


ఇక పురాణకాలం వాళ్ళయితే వందల సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది. అలాంటివాళ్ళం ఇలా అయిపోయాం. మన ఖర్మ.

ఇక వివేకానందులవారు , శంకరులవారు ఇలాంటి వారు తక్కువ కాలమే జీవించినా ....సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి చరిత్రలో నిలిచిపోయారు.

ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఎవరు ఏమన్నా దైవం.అతీతశక్తులు తప్పక ఉన్నాయి.

ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిని సాధించిన వారికి కొన్ని అతీతశక్తులు వస్తాయట. వారు వాటిని లోకోపకారం కోసం కూడా వినియోగిస్తారట.

ఈ విశ్వాన్ని సృష్టించిన దైవం కూడా తాను నిర్మించిన ధర్మాన్ని తాను అతిక్రమించటం జరగదట.

అలాగే గొప్పవారు కూడా ధర్మం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. ప్రతీదానికి తమ మహిమలను వినియోగించరు.


మీరు అన్నట్లు రామకృష్ణపరమహంస , షిరిడిసాయి బాబా ,ఏసుక్రీస్తు వీరందరూ కూడా కొన్ని బాధలు అనుభవించారు.... నిజమే , అందుకు చాలా కారణాలుంటాయి. మనకు సరిగ్గా తెలియదు.


అయితే వారు తమ శిష్యుల, భక్తుల బాధలను తాము స్వీకరించటం వల్ల ..వారు అలా బాధలను అనుభవించవలసి వచ్చిందని పెద్దలు చెబుతారు.


వీరందరూ తమ భక్తులను ఎన్నో కష్టాల నుంచీ రక్షించారు. అలా మహిమలు చూపించి ...... లోకంలో దైవం యందు నమ్మకాన్ని కలిగించారు........... ఆ విధంగా ప్రజలు ధర్మమార్గంలో జీవించటానికి కృషి చేసారు.


ఇక వీరు గొప్పవాళ్ళయ్యీ ఎందుకు బాధలు అనుభవించారు ? అంటే ప్రతి దానికి ఒక పధ్ధతి ఉంటుంది.... అధికారం, మహిమలు ఉన్నాయని వాటిని ఎడాపెడా వాడరుగదా నీతిపరులు.


ఉదా....ఒక గొప్ప జమీందారు ఉన్నారనుకోండి. వారి పిల్లలు ఏవైనా తప్పులు గానీ, అప్పులు గానీ చేసి అప్పులవారిబారి నుండి రక్షించమని వస్తే.... ఆ జమీందారు లాంటి పెద్దలు చేస్తారు ?


కొందరు పెద్దలు తమ పిల్లలు చేసిన అప్పులు, తాము తీర్చి .... ఆ పిల్లలు అనుభవించాల్సిన శిక్ష తాను అనుభవిస్తారు ..


కొన్నిసార్లు పిల్లలకు బుధ్ధి చెప్పాలనిపిస్తే వాళ్ళను శిక్షిస్తారు. ( పిల్లల పరిస్థితిని బట్టి ఏది ఎలా చేస్తే బాగుంటుందో అలా చేస్తారు. )

అంతేగానీ తాను జమీందారు కాబట్టి ... తన పిల్లలు ఏం చేసినా చెల్లుతుందని తన అధికారాన్ని అప్పుల వాళ్ళ మీద ప్రయోగిస్తే అది అన్యాయమే అవుతుంది.


అలాగే గురువులు ఆదుకొమ్మని తమను శరణు వేడే శిష్యుల, భక్తుల బాధలను .... తాము భరిస్తారు ( వ్యాధి రూపంలో గానీ, ఇతరరూపాలలోగానీ )అంతే గానీ వారికి మహిమ లేక కాదు.


షిరిడి సాయి తమ మరణానికి కొన్ని సంవత్సరాల ముందు వ్యాధికి గురయ్యి ... ఉచ్చ్వాశ, నిశ్వాసలు కూడా లేని పరిస్థితి తరువాత మూడురోజులకు ....మరల కళ్ళు తెరిచారు. అంతటి శక్తి వారికుంది.


తాత్యాకోతే పాటీలు అనే తన భక్తుని మరణాన్ని తప్పించటం కొరకు సాయి .... తాను త్యాగం చేసారని చెబుతారు.

ఇక శ్రీ మహా విష్ణువు లోకాన్ని పీడించే రాక్షసులను సంహరించే క్రమంలో ........... భృగు మహర్షి చేత శాపానికి గురయ్యారు. భృగు మహర్షి ..... విష్ణుమూర్తి భార్యా వియోగంతో బాధపడాలని శాపం ఇవ్వటం జరిగింది. ( రామావతారంలో సీతావియోగం జరగటానికి ఇదొక కారణం. )


ఆ విధంగా ప్రజల సుఖం కొరకు రాక్షసులను చంపే క్రమంలో ............. విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించి బాధలు పడవలసి వచ్చింది.

కృష్ణుడయినా.....క్రీస్తు అయినా ప్రజల సుఖం కొరకు ఆ బాధలు తాము భరించారు.

కష్టాలనుండి కాపాడమని , తమ దగ్గరకు వచ్చిన భక్తులను బాధల నుండి తప్పించటానికి .వారు .. రకరకాల పధ్ధతులను ఉపయోగిస్తారు.


ఒకోసారి తమ తపశ్శక్తిని ఉపయోగించి ..........భక్తుల పాపకర్మను నిర్మూలించి కష్టాలను పోగొడతారు. ఒకోసారి శిష్యులు,భక్తులు అనుభవించాల్సిన బాధలు ... వారి బదులు తాము అనుభవిస్తారు. ( ఆ పరిస్థితిని బట్టి ఏది, ఎలా చేస్తే ధర్మంగా ఉంటుందో అలా చేస్తారు. )

అందుకే దేవుడిని గానీ,  తల్లిదండ్రులను గానీ బాధపెట్టకూడదంటే మనం తప్పులు చెయ్యకూడదు.

ఇక సత్యసాయి బాబా గురించి నాకు పెద్దగా తెలియదండి. అయితే ఈ మధ్య నెట్ లో చూస్తోంటే ఇది కనిపించింది........మీరు కూడా చూడండి.............. kirlian photography ......satya sai baabaa Archives ...........


నాకు తోచింది తొందరగా రాసానండి. ఇందులో పొరపాట్లు వస్తే దైవం క్షమించాలని కోరుకుంటున్నాను.

 

Friday, May 6, 2011

ఎంత బాగా మందులు వాడినా కొందరికి రోగాలెందుకు తగ్గటం లేదు ?.( వారి పూర్వ కర్మ వల్ల.)

అక్షయ తృతీయ శుభాకాంక్షలు....

 ప్రతి ఒక్కరికి మహిమలు చూపించి వారి కష్టాలు తీర్చటం, రోగాలు తగ్గించటం గొప్పవారి ఉద్దేశం కాదు,   ఆ విధంగా చేస్తే ప్రజలు సోమరులవుతారు. అది సృష్టి ఉద్దేశం కాదు.

మన ప్రయత్నం కూడా మనం చేయాలి. రోగం తగ్గాలంటే భగవంతుని కరుణ కావాలి. అలాగే మనం మందులు కూడా వాడుకోవాలి.

అదేమిటి ? మందులు వాడుకున్నప్పుడు ఇక భగవంతుని కరుణతో ఏం పని ? అని కొందరికి సందేహం రావచ్చు.


మందులు వాడితేనే రోగాలు తగ్గిపోయేటట్లయితే ఎంత జాగ్రత్తగా మందులు వాడినా... కొందరికి రోగాలు ఎందుకు తగ్గట్లేదు ? ..

కొందరు డాక్టర్లు కూడా జబ్బు చేసి ... తగ్గక ,.బాధపడుతున్నారు.

జబ్బులు ఎలా వస్తాయో తెలిసీ...వస్తే ఏ మందులు వాడాలో తెలిసీ కూడా..... కొందరు డాక్టర్లు కోలుకోవటం లేదెందుకని ?

ఇలాంటి వాటికే పూర్వ కర్మ, పాపం ..ఇలా ఆధ్యాత్మికత ద్వారా సమాధానం దొరుకుతుంది .

కొందరు మందులు సరిగ్గా వాడకపోయినా... జబ్బులు తగ్గినవారున్నారు... దైవం దయ కొందరిపై అలా అపారంగా ఎందుకు ఉంటుందంటే...వారి పూర్వ పుణ్యమే అందుకు కారణం.


.మామిడిచెట్ల వయిపు పూతపూసియున్నప్పుడు చూడుము.పువ్వులన్నియు పండ్లు అయినచో , నెంత మంచి పంట యగును ? కాని యట్లు జరుగునా ? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.. అన్నారు షిర్డీ సాయిబాబా.


ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మనస్తత్వాలు , ఒకేలా ఉండవు... పిల్లలలో ఎన్నో తేడాలుంటాయి. .... కొందరికి బాగా తెలివి ఉండి బాగా విద్య వస్తుంది. కొందరికి విద్య సరిగ్గా రాదు. .. కొందరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. కొందరికి ఎప్పుడూ అనారోగ్యమే. ఇలా ..
వారి అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎందుకు ఉండవు. ? ( ఎవరి కర్మఫలం వారిదే..)

ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆధ్యాత్మికత సమాధానాలు ఇస్తుంది.

ఇప్పటి జన్మలో మనిషి అవసరాల వరకూ మాత్రమే చెప్పటంతో.. భౌతిక శాస్త్రం ఆగిపోతుంది.

జీవుల పుట్టుకకు ముందు......మరణానికి తరువాత ఎలా ఉంటుందో ఆ విశేషాలు కూడా ఆధ్యాత్మిక గ్రంధాల ద్వారా చెప్పబడ్డాయి.

ఇంకా,ప్రాచీన గ్రంధాలలో .... విశ్వం గురించీ ,
సృష్టిలో ఉన్న ఇతరలోకాలు, జీవుల గురించి ఎన్నో విషయాలు వివరించబడ్డాయి...అందుకే ఇదంతా ఆధ్యాత్మికశాస్త్రం అనటంలో కూడా తప్పు లేదనిపిస్తుంది...


శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి గొప్పవారు........ వారి జీవితంలో ప్రతి చిన్నదానికి మహిమలను ఉపయోగించలేదు. . ......... వారిలా కష్టపడి అయినా ధర్మంగా జీవించాలని... వారి జీవితం ద్వారా సందేశాన్నిచ్చారు.

ప్రజలకు దైవం అంటే నమ్మకం కలిగించవలసి వచ్చినప్పుడో, ........ తప్పనిసరి పరిస్థితిలోనో, ఇతరులకు సహాయం చేయటానికి ........ వారు మహిమలు చూపిస్తారు..


Wednesday, May 4, 2011

మతవాదులు..........ఆధునికభౌతిక వాదులు.........అత్యాశాపరులు .......... .ఎవరివల్ల ప్రపంచానికి...............



కొందరు ఏమంటారంటే.. మతవాదుల వల్లనే
ప్రపంచంలో ఎక్కువగా రక్తపాతం, హింస జరిగిందని అంటారు. ఇది నిజం కాదు.

అధికారం కోసం, ఆధిపత్యం కోసం, ఆర్ధికాభివృధ్ధి కోసం, ............... అహంకారంతోనూ, అపార్ధాలతోనూ, ............ ఆధునిక అభివృధ్ధి పేరుతోనూ జరుగుతున్న హింసతో పోలిస్తే మతవాదుల వల్ల జరిగిన హాని ఎంత ?

కొందరు స్వార్ధపరులు తమ అవసరాలకోసం కూడా మతాన్ని వాడుకున్నారు. నిజమైన ఆధ్యాతికవాదులు అలా చేయరు.


*నిజమైన ఆధ్యాత్మికవాది వల్ల ప్రపంచానికి ఏ హాని కలగదు.


మొదటి ప్రపంచ యుధ్ధం, రెండవ ప్రపంచ యుధ్ధము అధికారం కోసమూ, ఆర్ధికాధిపత్యం కోసమూ జరిగాయి.

ఆ సందర్భంగా జరిగిన రక్తపాతమూ, హింసతో పోలిస్తే ............?

ధికారం కోసం, ఆధిపత్యం కోసం, ఆర్ధికాభివృధ్ధి కోసం చరిత్రలో ఎన్నెన్ని యుధ్ధాలు జరిగాయి. ఎంత నష్టం జరిగింది.

అత్యాశాపరుల వల్ల, అవినీతిపరులవల్ల, ప్రపంచానికి జరిగిన హానీ తక్కువదేమీ కాదు.


* ఇవన్నీ వదిలేసి మతవాదుల వల్లనే ఎక్కువ హాని జరిగిందని అనటం అన్యాయం.

*ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో కూడా ఎంతో హింస జరుగుతోంది.

ప్రపంచానికి, పర్యావరణానికి, కోట్లాది మూగజీవులకు ఎంతో హాని కలుగుతోంది.

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ అసమతుల్యత, గ్లోబల్ వార్మింగ్ ఇటువంటి వాటి వల్ల మనుషులే కాక, ఎన్నో జీవులూ బాధలు పడుతున్నాయి.


ఇదంతా మనిషి చేసుకున్న స్వయంకృతాపరాధం.

మనిషి తన అంతులేని కోరికల కోసం చేస్తున్న చేష్టల వల్ల ఎన్నో మూగజీవులు మూగగా బాధను అనుభవిస్తున్నాయి. ........... . చెప్పుకోటానికి వాటికి చేతరాదుగా ! వాటికి దేవుడే దిక్కు.


* పూర్వం యుధ్ధాల వల్ల మనుషులు మాత్రమే బాధలు పడేవారు............. ఇప్పుడు ఆధునిక అభివృధ్ధి పేరుతో జరుగుతున్న చేష్టల వల్ల కోట్లాది మూగజీవులు కూడా బాధలు పడుతున్నాయి............ వాటిదీ మనలాంటి భాదే కదా !


పురుగుమందుల వాడకంలో ప్రమాదాల గురించి సరైన అవగాహన లేక ......... పంజాబులో వందల మంది రైతులు కాన్సర్ వ్యాధి బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి.

పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్ధాలు ............. నదులలో , సముద్రాలలో కలసి, భూమిలో ఇంకి,........... ఆ నీటితో పండించిన ఉత్పత్తులు తినటం వల్ల .............మనుషులు, ఇతర జీవులు అనేక రోగాల బారిన పడటం జరుగుతోంది.

ఇక అణు కర్మాగారాలనుంచీ విడుదలయ్యే అణువ్యర్ధాలను ఎక్కడ వదలాలన్న దానికి పరిష్కారం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ............ వాటి దుష్ప్రభావాలు ఎన్నో తరాల తర్వాత కూడా కనిపిస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే.


*మనుషులు ఎదురుగా ఒకరినొకరు యుధ్ధం చేసి చంపుకుంటేనే హింస , రక్తపాతం అనక్కర్లేదు. ..... ఇంతకు ముందు చెప్పుకున్నవి కూడా హింస అనే అంటారు.

* ఆద్యాత్మికత వల్ల మనుషులలో భయం, భక్తి పెరిగి కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండటానికి ప్రయత్నిస్తారు............ విశ్వాన్ని సృష్టించిన పరమశక్తికి కృతజ్ఞత చూపించటం మనిషి కనీస ధర్మం.

అయితే కొందరు స్వార్ధపరుల వల్ల మరి కొందరు తెలిసీతెలియనివాళ్ళ
వల్ల మతం విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి.......... అంతకు మించి దాని వల్ల ప్రమాదం లేదు.

కానీ మిగతా వాటితో జరుగుతున్న హాని తో పోలిస్తే మతవాదుల వల్ల జరుగుతున్న హాని ఎంతో తక్కువ..

ఆధునిక విజ్ఞానం అంటే నాకు వ్యతిరేకత ఏమీ లేదండి. ........ ఆ విజ్ఞానం హాని చెయ్యకుండా ప్రపంచానికి ఉపయోగపడాలన్నదే నా అభిప్రాయం.

ఈ మధ్యన మనరాష్ట్రం విద్యార్ధులు సౌరశక్తితో పనిచేసే వాహనాలు కనిపెట్టారని అన్నారు............ ఇది చాలా సంతోషకరమైన విషయం. ...........

* ఇలా వివిధరంగాలలో ప్రపంచానికి మేలు చేస్తున్నవారందరూ అభినందనీయులు..
 

Monday, May 2, 2011

యాంటిబయాటిక్స్ తో జాగ్రత్త........

ఇప్పుడు .కొత్త ప్రమాదం....ఔషధనిరోధకత పొందుతున్న బాక్టీరియా ...........

ఔషధ నిరోధకత అంటే .... ఎన్ని మందులు వాడినా అవి రోగికి పని చెయ్యక జబ్బులు తగ్గని పరిస్థితి అని చెబుతున్నారు.

కొన్ని బాక్టీరియా మందులను తట్టుకొనే శక్తిని సాధించినప్పుడు ........ రోగులకు.......... ఇలా మందులు పనిచెయ్యని పరిస్థితి వస్తుందట. .

అప్పుడు మరి మనుషులకు దిక్కు ఎవరు ? ( దేవుడే ) .

ఇప్పుడు ఇలా ........... మందులు పని చేయని కొత్తరకం ఉపద్రవం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారట.

దీనిని ఇ-కొలి బాక్టీరియా అని కూడా అంటారట. ఎంత శక్తివంతమైన యాంటిబయాటిక్స్ వాడినా........ ఈ బాక్టీరియా లొంగక........... రోగాలు తగ్గని పరిస్థితి వస్తుందంటున్నారు.

జలుబు, దగ్గు చిన్నపాటి జ్వరం, ఇలా ప్రతీదానికీ యాంటిబయాటిక్స్ వాడటం,.. యాంటిబయాటిక్స్ విచక్షణ లేకుండా వాడటం ......... ఇలా రకరకాల కారణాల వల్ల బాక్టీరియా.. ఔషధనిరోధకత శక్తిని పొందుతుందట.


అందుకని యాంటిబయాటిక్స్ వాడటంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలట.

విదేశాల్లో అయితే ..... పశువులకు కూడా యాంటిబయాటిక్స్ వాడటం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయట.

అసలు ప్రపంచములో.... మనుషులు ఏదో సాధించాలనుకుంటే ఏదో జరుగుతోంది.

ప్లాస్టిక్, పురుగుమందులు వీటివిషయంలో కూడా అంతే. . ఇవి కనిపెట్టిన కొత్తలో కూడా బ్రహ్మాండం బ్రద్దలయ్యే లెవెల్లో అభివృధ్ధి జరిగిపోతుంది .. వాటివల్ల........ అనుకున్నారు.

కొన్ని దశాబ్దాల తరువాత గానీ వాటి అసలు రంగు బయటపడలేదు. . ఇప్పుడు ప్లాస్టిక్, లాంటివన్నీ ప్రపంచానికే పెద్ద సమస్య అయి కూర్చున్నాయి.


ఇలాంటివన్నీ మొదట్లో గొప్పగా అనిపిస్తూ వాటి చెడ్డ ఫలితాలను నెమ్మదిగా బయటపెడుతున్నాయి....వాటి నష్టం గురించి మనకు తెలిసేటప్పటికి అవి ప్రపంచమంతా విస్తరించి .....మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తోంది.


ఎంతో తెలివిగలవాళ్ళు అనుకున్న మనుషులు ఇలా బలహీనపడిపోతున్నారు.... ఏ తెలివీ లేకపోయినా బాక్టీరియా మందులను తట్టుకొనే శక్తిని సంపాదించుకుంటోంది.


ఎన్నో వేల సంవత్సరాలనుంచీ ఆయుర్వేద మందులు వాడుతున్నా.. ఇలా బాక్టీరియా బలపడటం...మనిషి బలహీనపడటం ఎప్పుడూ జరగలేదు.


ఆయుర్వేద మందులు .... మన శరీరంలో ప్రవేశించిన చెడ్డ బాక్టీరియా ను చంపేస్తాయి. .. మనలోని మంచి బాక్టీరియాకు ఏమీ హాని కలిగించవు. ........ అవి అలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి.


అందుకే మనము మన ప్రాచీన వైద్యాన్ని కాపాడుకోవాలి . ............ ఇప్పటికే మనకు వాటియందు ఉండే చిన్నచూపు వల్ల , మన నిర్లక్ష్యం వల్ల......... ఎన్నో విలువైన గ్రంధాలను పోగొట్టుకున్నాము.

అల్లోపతితో పాటు ఆయుర్వేదాన్ని , హోమియోని కూడా వాడుకోవాలి.

ప్రపంచంలో జరిగేవన్నీ చూస్తుంటే ఈ విశాలవిశ్వంలో మనిషి , మనిషి యొక్క తెలివితేటలు ఎంత పరిమితమయినవో తెలిసివస్తోంది.