koodali

Friday, December 30, 2011

మనువు నుంచి మానవులు ...


మనం ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని రెండింటిని గౌరవించాలి. అని నా అభిప్రాయం. అయితే కొందరు తెలిసీతెలియని వారు, కొందరు స్వార్ధపరుల వల్ల ప్రాచీన సాహిత్యంలో చేరిన మూఢనమ్మకాలను, విడిచిపెట్టాలి. 


అలాగే ఆధునిక విజ్ఞానంలో పెరుగుతున్న అతివాదపరిశోధనలను అంటే పర్యావరణానికి, ప్రపంచానికి హాని కలిగే విజ్ఞానాన్ని విడిచిపెట్టాలి.


కొందరు ఏమనుకుంటారంటే ప్రాచీనులు నిర్లిప్తత వంటి గుణాలను ప్రోత్సహించారు అనుకుంటారు. కానీ, అర్జునునికి గీత ద్వారా భగవానుడు బోధించినది నిర్లిప్తత కాదు కదా !  ధర్మయుద్ధం చెయ్యమని ప్రోత్సహించారు. అంతేకానీ నిర్లిప్తతను కాదు.


ప్రాచీన గ్రంధాలలో లోకానికి కావలసిన అన్ని విషయాలూ ఉన్నాయి. అంటే సైన్స్ కోణం నుండి చూస్తే సైన్స్, సామాజిక కోణం నుండి చూస్తే సామాజిక సంబంధ విషయాలూ ఇలా ఏ కోణం నుండి చూసే వారికి ఆ విషయాలు తెలుస్తాయి.

ఉదా... చంద్రునికి 27 మంది భార్యలు అని పెద్దలు చెప్పారు. సైన్స్ కోణం నుండి చూసేవారికి 27 మంది భార్యలు అని కాకుండా 27 నక్షత్రాలుగా అనుకోవచ్చు.



ఇంకా పూర్వులు టెలిస్కోపుతో తెలుసుకున్నారో ? తపశ్శక్తితో తెలుసుకున్నారో ? నవ గ్రహాలు గురించి ... వాటి మధ్య ఉండే దూరం ఎన్ని యోజనాలో ...ఆ వివరాలు కూడా చెప్పటం జరిగింది. ఇదంతా సైన్సే కదా !



ఇంతకుముందు టపాలో దశావతారాల గురించి అనుకున్నాము. అందులో కశ్యపుని సంతానమైన దేవతలకు స్వర్గ లోకము, దైత్యులకు పాతాళలోకము నివాసంగా వ్రాశానండి. పాతాళంలో దైత్యులూ మాత్రమే కాకుండా సర్ప జాతులు కూడా నివసిస్తాయట. 



పాతాళంలో దైవమైన " అనంతుడు " ఉంటారు. .... ఇంకా వాసుకి మొదలైన సర్ప శ్రేష్టులు, కొన్ని సర్ప జాతులు కూడా నివసిస్తారట. ఈ విషయం ఇంతకుముందు టపాలో వ్రాయలేదు. జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించండి.



* పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు వచ్చారని భావించటం తప్పేమో అనిపిస్తుంది. రామాయణ కాలంలో ఎంతో పరిణతి చెందిన వానరుల గురించి పెద్దలు చెప్పారు. అయితే ఆంజనేయస్వామి మాత్రం ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని పెద్దలు చెప్పటం జరిగింది. 



రామాయణంలో చెప్పబడ్డ వానరులు దగ్గరదగ్గర మానవుల లాగే ఎంతో పరిణతి చెందినవారు. బహుశా ఇలాంటి వానరుల గుర్తులు చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు మానవులు వానరుల నుండి పరిణామం చెందారని అనుకుంటున్నారేమో?


* ఇక మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే ......అలా పరిణామం చెందలేదని చెప్పే శాస్త్రవేత్తలు కూడా బాగానే ఉన్నారు. "AGAINST EVOLUTION " అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వివరాలు ఉన్నాయి. 



సృష్టిలో జీవం ఏకకణ జీవి, బహుకణజీవి, ఆల్గే, సరీసృపాలు, మొక్కలు, పక్షులు, జంతువులు, మానవులు ..ఇలా సృష్టి పరిణామం జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారంటున్నట్లు సృష్టిలో జీవులు ఒకదానితరువాత ఒకటి ఒక క్రమంలో జన్మించి ఉండవచ్చు.


అయితే వేటికవే జన్మించాయి కానీ, సరీసృపాల నుంచీ పక్షులు.......పక్షుల నుంచీ జంతువులు .. జంతువుల నుంచీ ... మానవులు ....ఇలా పరిణామం జరగలేదు అనిపిస్తుంది.



* ఇతర గ్రహాలలో జీవులు ఉన్నారని, ఆ జీవుల ద్వారా కూడా భూమిపై జీవం ఏర్పడి ఉండవచ్చని ఈనాటి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అలా చూస్తే బ్రహ్మదేవుడు భూమిపై సృష్టి చేయటానికి సంకల్పించి మానసపుత్రులను పొందటం....తరువాత అలా కశ్యపుని ద్వారా భూమిపై జీవజాలం ఏర్పడటం ...పరిశీలిస్తే..


*బ్రహ్మదేవుడు, కశ్యప మహర్షి వంటివారు ఇతర లోకాలకు సంబంధించిన వారే. అయితే వారు తలుచుకుంటే ఏ లోకంలోనైనా ఉండగలరు. వరుణుడు కశ్యపుని భూలోకంలో జన్మ ఎత్తమని శపిస్తారు. అలా కశ్యపుడు కృష్ణుని తండ్రి అయిన వసుదేవునిగా జన్మ ఎత్తటం జరిగింది. ఈ విషయం పరిశీలిస్తే కశ్యపుడు ఇతరలోకంలో ఉంటారని తెలుసుకోవచ్చు. .


భూమిపై జీవం ఏర్పడకముందే కశ్యపుడు దేవదానవులను, వాసుకి వంటి వారిని సంతానంగా పొందారు . దేవదానవులు, వాసుకి మొదలైన వారు స్వర్గలోకం ,పాతాళలోకాలలో నివాసం ఏర్పరుచుకున్నారు. వారే కూర్మావతారంలో క్షీరసాగరమధనంలో ఉన్న వారు కావచ్చు. అని ఈ విషయాలు ఇంతకుముందు టపాలో అనుకున్నాము.



* ఇక తరువాత వరాహస్వామి భూమిని సముద్రం నుంచీ పైకి తీసిన తరువాత .... బ్రహ్మదేవుని మానస పుత్రుడైన .స్వాయంభువ మనువు తన తండ్రి సలహాతో మహాదేవిని ఆరాధించి సృష్టి చేయ సంకల్పించారు . స్వాయంభువ మనువు శతరూప దంపతులకు పుత్రులు, పుత్రికలు జన్మించారు. . .... ఒక పుత్రికను కశ్యపునికిఇచ్చి వివాహం చేయగా వారికి సంతానంగా భూమిపై ప్రాణులైన మొక్కలు, జంతువులు ( వానరులు మొదలైనవి...) జన్మించటం .....కశ్యపుని పుత్రుడైన సూర్యుడు ... ..సూర్యునికి పుత్రుడైన వైవస్వత మనువు .... ... యిలా అభివృద్ధి జరిగింది.వైవస్వత మనువు తరువాత మానవుల అభివృద్ధి జరిగిందని అనుకోవచ్చేమో ? అనిపిస్తుంది.


స్వాయంభువు మనువు యొక్క పుత్రులు, పుత్రికలు ..... మానవులు అని కాకుండా వారు దేవతల వంటి వారు అని మనం భావించ వచ్చేమో .

అంటే, ఇంద్రుడు, సూర్యుడు మానవుల కన్నా గొప్ప వారైన దేవతలు .అయినప్పుడు వీరికన్నా ముందు వారైన కశ్యపుడు, స్వాయంభువ మనువు యొక్క పుత్రులు, పుత్రికలు ఇంకా గొప్పవారు అయి ఉంటారు కదా ! అందుకని వైవస్వత మనువు తరువాతే భూమిపై మానవుల అభివృద్ధి జరిగిందని మనము భావించ వచ్చేమో . తోచింది వ్రాశాను. ఎంతవరకూ సరైనదో భగవంతునికే తెలియాలి.


ఈ విధంగా భూమిపై జీవం ఏర్పడిన విధానాన్ని పూర్వులు తెలియజేశారు అనిపిస్తుంది.

వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను.


సృష్టి , స్వాయంభువ మనువు, వైవస్వత మనువు గురించిన ఎన్నో వివరాలు " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో చెప్పబడినవి. ఆసక్తి ఉన్నవారు చదవగలరు.


 


2 comments:

  1. అవునండి... మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది...ఏది ఏమైనా అంతా భగవంతుని లీల... ఆయన ఆడించేవాడు.. మనం ఆడేవారం

    ReplyDelete
  2. సాయి గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete