koodali

Friday, December 31, 2010

అన్నివేళలా అందరినీ ఆపదలలో ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న , అమృత , అభయ హస్తం పరమాత్మదే...........

 

లోకములో అదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మినవారు. దురదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మనివారు.

మనం
భగవంతుని నమ్మినప్పుడు వారికి ఇష్టమయిన పనులను చెయ్యటానికి ప్రయత్నించాలి. అంతేకానీ భగవంతుడుమెచ్చని అన్యాయమైన పనులను చేస్తే అది దైవభక్తి అనిపించుకోదు.


ఒకోసారి మన నిర్ణయములలో పొరపాట్లు జరగవచ్చు.


కానీ పరమాత్మ విషయంలో అలా జరగదు. పరమాత్మ చూపిన దారి, వారి నిర్ణయములు ఎప్పుడూ సరిగ్గానే ఉంటాయి. వాటి వెనుక కారణాలు ఒకోసారి మనకు తెలియవు అంతే....అందుకే పరమాత్మను నమ్మేవాళ్ళు అదృష్టవంతులు అనేది.


ఇంకా , భగవంతుని
నమ్మినవారు అదృష్టవంతులని ఎందుకు అంటారంటే , మనకు ఎప్పుడయినా ఆపదలు వస్తే ఆదుకునే శక్తి భగవంతునికి మించి విశ్వంలో ఎవరికీ ఉండదు కాబట్టి.


జీవితంలో
ఒక్కోసారి మనం సంపాదించిన సొమ్ము కానీ, మనవాళ్ళు అని అనుకున్న ఆప్తులు కానీ, విజ్ఞానశాస్త్రంకానీ, మనకు సహాయము చెయ్యలేని సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆపదలలో అన్నివేళలా అందరినీ ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న అమృత అద్భుత హస్తం పరమాత్మదే.


అందుకే
అందరం ఆ దైవాన్ని సదా గుర్తుంచుకోవాలి. సత్ప్రవర్తనతో జీవిస్తూ వారిని ఆనందపరచాలి.

 

Wednesday, December 29, 2010

రెండుపిల్లులు, ఒక కోతి,................రొట్టెముక్క . కధలోలాగ అవకూడదని ఆశిద్దామండి.......

 

ఇప్పటి రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ? ఒక్కోసారి ఒక్కోరకంగా అనిపిస్తోంది.

తెలుగు వాళ్ళంటే మొదటినుంచీ అందరికీ అలుసే. ఓట్ల కోసమే మనం కాని, ఏ రైల్వే బడ్జెట్ లోనూ, అభివృద్ధి నిధుల కేటాయింపుల లోను మనకి అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇహ విడిపోతే మన మొహం డిల్లీలో ఎవరూ చూడరేమో అని ఒకోసారి అనిపిస్తుంది.


ఒకోసారేమో ఇంతగా అభిప్రాయభేధాలు వచ్చాక కలసి ఉండి ఏమి లాభం ? అసలు రెండు కాదు మళ్ళీమళ్ళీ విడిపోవటాలు లేకుండా ఒక్కసారే మూడో నాలుగో రాష్ట్రాలుగా విడిపోయి హాయిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృధ్ధి చేసుకుంటే గొడవుండదు అని కూడా అనిపిస్తోంది. కానీ.....

ఈ రాష్ట్రం ఇలా కలిసి ఉన్నా బాగానేఉంటుంది అని కూడా అనిపిస్తోంది. కానీ.......

ఆ మధ్య ఒకరు ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని అన్నారు. ఇలా అందరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆఖరికి ఏమవుతుందో ?


మన రాష్ట్ర పరిస్థితి గురించి నాకు కూడా ఇలా కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. కానీ నేను వాటిని సరిగ్గా పైకి చెప్పలేనండి. ఏమంటే పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి లాగ ఉంది కద.


అదీకాక మా బంధువులలో అన్ని ప్రాంతముల వాళ్ళు ఉన్నారు. వివాహసంబంధాలు కలుపుకోవటం , లాంటి కారణాలవల్ల చాలామందిది ఇదే పరిస్థితి.

అది అలా ఉంచి ఇంకో విషయం మీకు చెప్పాలని ఉందండి..........మనము ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే వాస్తు గురించి ఎంతో ఆలోచిస్తాము. ఒకవేళ అందులో తప్పులు వస్తే సరిచేసుకుంటాము. అంత ఖర్చు పెట్టలేకపోతే కనీసం వాస్తు దోష నివారణ యంత్రం అయినా పెట్టుకుంటాము.


ఇంటిలాగే నగరాలకు, రాష్ట్రాలకు కూడా వాస్తు ఉంటుందట. .ఇప్పుడు ఎటూ రాష్ట్ర మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయి గదా ! అందుకని వాస్తు పండితులని కూడా ఒక సలహా అడిగితే బాగుంటుంది ఏమో !


మన ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి ఆనక అరిష్టాలు వస్తే అందరూ బాధలు పడాలి. అందుకని ఏ విధంగా , ఎక్కడ మార్పులు చేస్తే బాగుంటుంది ఇలాంటివి పండితులకైతేనే బాగా తెలుస్తాయి.


ఇంకో చిత్రమయిన ధర్మ సందేహం కూడా వచ్చిందండి. మనకు శ్రీ శైలం మహా క్షేత్రం ఉంది కదండి. ఆ దేవాలయానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలు ఉన్నాయట.

ద్వారాలు ...........ఉపద్వారాలు.

30 ఆమడల ( 384 కి.మీ.ల) పొడవు . 30 ఆమడల వెడల్పు గల యీ మహాక్షేత్రానికి , ప్రకాశం జిల్లాలోని ' త్రిపురాంతకం ' తూర్పు ద్వారం గానూ , కడప జిల్లాలోని ' సిధ్ధవటం ' దక్షిణ ద్వారం గానూ , మహబూబ్ నగర్ జిల్లాలోని ' అలంపురం ' పశ్చిమ ద్వారం గానూ , 'ఉమామహేశ్వరం ' ఉత్తర ద్వారం గానూ , పురాణాలు చెబుతున్నాయి. ఇంతేకాక నాలుగుమూలలా నాలుగు ఉపద్వారాలు చెప్పబడినాయి. అవి పుష్పగిరి క్షేత్రం ( ఆగ్నేయ ద్వారం ) , సోమశిల క్షేత్రం (నైరృతి ద్వారం ), సంగమేశ్వర క్షేత్రం ( వాయువ్య ద్వారం ) , ఏలేశ్వర క్షేత్రం ( ఈశాన్య ద్వారం ) .


అయితే ....... ఈ సంగమేశ్వరం శ్రీ శైలానికి ఉపద్వారంగా చెప్పబడుతున్నది .కానీ శ్రీ శైల ఖండం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిని ఒక మహా తీర్ధంగా శ్రీ శైలఖండం చెబుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న ఏలేశ్వరం యీశాన్యద్వారంగా చెప్పబడుతున్నప్పటికి దీనిని శ్రీశైలఖండం తీర్ధంగానే వర్ణించింది తప్ప ద్వారంగా కాదు.


ఇవన్నీ చూశాక రాష్ట్రంలో మార్పులు జరిగితే ఈ క్షేత్రంలో కొంత భాగం ఒక ప్రాంతములో ............ కొంత భాగం ఇంకొక ప్రాంతములో వచ్చే అవకాశం ఉంది. అలా ఉండవచ్చా అని అనిపించిందండి.


అయితే దైవ క్షేత్రములకు ఇలాంటి రాష్ట్రము, ప్రాంతము , సరిహద్దులు వంటి పట్టింపులు ఉండవులే అనికూడా అనిపించిందండి. ఇలాంటివిషయాలు పండితులకే బాగా తెలుస్తాయి. అయితే క్షేత్రం అంతా ఒకే ప్రాంతములో ఉండేలా చూసుకుంటే బాగుంటుందేమో !


ఈ నాడు దేశం చాలా సమస్యలలో ఉంది. ప్రజల పేదరికాన్ని పోగొట్టడం, దేశాన్ని అభివృధ్ధిపధంలో నడిపించటం ప్రజాప్రతినిధుల ప్రధమ కర్తవ్యం. కొంతమంది ఇలా మంచిపనులు చేస్తున్నారు, కానీ కొంతమంది అవినీతి ఇలాంటివాటితో దేశానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారు.


ఏమైనా మనం చేస్తున్న ప్రతీపనిని గమనిస్తున్న దైవశక్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలా అవినీతి లాంటి పనులు చెయ్యలేరు.


తెలుగు వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. ఈ దేశ రాజకీయ, ఆర్ధిక, ఇంకా ఎన్నో రంగాల్లో వాళ్ళు ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నారు. మనం ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండాలేకానీ ఇతరులతో చెప్పించుకునే స్థాయికి పడిపోరాదు.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం యొక్క ప్రభావం దేశం పైన ఎంతో ఉంటుంది.

ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎంతో గొప్పదిగా ఉండాలి. ఆవేశముతో కాకుండా ఆలోచించి విజ్ఞతగా నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయమిది.


మనం ఎంతో తెలివిగలవాళ్ళమేకానీ, మన భాషను, సంస్కృతిని అంతగా గౌరవించని బలహీనత ఒకటి మనకు ఉంది. ఉదా........ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురుపడితే ఇతర భాషలో మాట్లాడుకుంటారు.


ఇక్కడ ఒక కధ........ పీతలను ఇతరప్రాంతాలకు ఎగుమతి చేసే వ్యాపారి ఒకరు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసేవారు ఒకసారి పీతలు ఉన్న పెట్టెలను వాన్లో ఎక్కిస్తున్నారట. అందులో కొన్ని పెట్టెలకు మూతలు వేసి లేవట.


ఆ వ్యాపారి కంగారుపడి పనివాళ్ళతో అదేమిటి మూతలు వెయ్యకపోతే అవి పైకి ప్రాకి పారిపోతాయికదా అని కోప్పడితే వాళ్ళేమన్నారంటే,...........అవి తెలుగు పీతలు సార్. ఒకటి పైకి రావటానికి ప్రయత్నించినా ఇంకొకటి వెంటనే క్రిందకు లాగేస్తుంది. అందుకే మూతలు పెట్టలేదు. అవి పైకి వెళ్ళి తప్పించుకుంటాయన్న భయం వద్దు. అన్నారట. మన గురించి ఇలా ప్రపంచానికి అంతా తెలుసుకదా !

రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో కానీ, రెండుపిల్లులు, ఒక కోతి,................రొట్టెముక్క . కధలోలాగ మాత్రం అవకూడదని ఆశిద్దామండి.......

ఇందులో తప్పులేమైనా ఉంటే భగవంతుడు దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను...........

Monday, December 27, 2010

విదేశాల్లో స్థిరపడటమే ఇక్కడ పుట్టిన ప్రతిఒక్కరి లక్ష్యమా ? .

 

ఈ రోజుల్లో , ఈ దేశంలో చాలామంది విదేశాల్లో స్థిరపడటమే జీవితలక్ష్యముగా భావిస్తున్నారు.

ఈ నాడు చాలామంది తల్లిదండ్రులు తమపిల్లల్ని విదేశాలకు పంపటమే ధ్యేయంగా చిన్నప్పట్నించి పిల్లలను ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ? డబ్బు సంపాదనే జీవిత ధ్యేయమా ?


ఇలా విదేశాల్లో స్థిరపడినవాళ్ళు ఏమంటారంటే ............... వారి వల్ల దేశానికి ఎంతో విదేశీమారకద్రవ్యం వస్తోందని అంటూ తమని తాము సమర్ధించుకుంటారు. ఇక్కడ సమస్య మన దేశంలో సంపద లేకపోవటము కాదు.................. ఉన్న సంపద ఒక ప్రణాళిక ప్రకారం సద్వినియోగపరుచుకోలేకపోవటం.


మన దేశంలో కావాలసినంత నీరు, మంచిపంటపొలాలు, ఇలా అనేకసహజవనరులు ఉన్నాయి. ఇక్కడ కావలసినంత సంపద ఉంది. అయితే అది కొద్దిమంది దగ్గర ప్రోగయి ఉండటం అసలు సమస్య.


పాత తరం వాళ్ళు చాలామంది తమ ఆస్తులను, జీవితాల్ని త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. కానీ ఇప్పుడు మనవాళ్ళే విదేశాలకు వెళ్తున్నారు. ఇక్కడి యువత అంతా ఇలా వెళ్ళిపోతే దేశం ఎలా అభివృధ్ధి చెందుతుంది ?


మన దేశంలో పేదరికం, అవినీతి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నమాట నిజమే . మన ఇల్లు బాగోలేదని ప్రక్క ఇంటికి వెళ్తే ఎంతకాలం గౌరవం ఉంటుంది ? మన ఇల్లు మనమే బాగు చేసుకోవటం పధ్ధతిగా ఉంటుంది.


ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ వెళ్ళి అక్కడ అలవాటుపడి మనసుకు సర్ది చెప్పుకుని అక్కడే ఉండిపోతున్నారు. అలా కాకుండా ఒక్క తరం వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారము .................. కష్టపడి ఈ దేశాన్ని అభివృధ్ధి చేసుకుంటే ...తరతరాల వాళ్ళు ఈ తరం త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఎవరూ గుర్తించకపోయినా మంచి పనులను భగవంతుడు గుర్తించటం జరుగుతుంది.


ఒక్క తరం కష్టపడితే చాలు ....... భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవటానికి.

అలా కాకుండా విదేశాల ఆకర్షణలకు లోబడి అక్కడే స్థిరపడితే అక్కడ కొంతకాలం గౌరవాన్ని పొందవచ్చు. తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.


ఎవరికయినా స్థానబలం, స్వధర్మం ముఖ్యం. మొసలి చూడండి.......దానికి నీళ్ళలో ఉన్నబలం నేల మీద ఉంటుందా ? మనింట్లో వేడి అన్నములో పచ్చడి ముద్దలు తిన్న తృప్తి పరాయి ఇంట్లో పాయసం తింటే వస్తుందా ?


మనం మన దేశం విడిచి ఇతరచోట్లకు వెళ్తే అక్కడ మనము పేదవారిగా ఉన్నంతవరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కొంచెం డబ్బు సంపాదించామంటే చాలు ఇక సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడు ఎవరి బుధ్ధి ఎలా మారుతుందో చెప్పలేము.


మన తరువాతి తరాలవాళ్ళని మీ దేశం మీరు వెళ్ళిపోండి........లేకపోతే అక్కడే ఉంటే ,వాళ్ళని రెండో తరగతి పౌరులుగా బ్రతకమనే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు ,.. ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళ పిల్లలు తమ తల్లిదండ్రుల మాతృదేశానికి తిరిగిరాలేక, ( వచ్చినా ఇక్కడి సంస్కృతికి అలవాటుపడలేక ) తాము పుట్టిపెరిగిన దేశంలో రెండవ తరగతి పౌరులుగా బ్రతకలేక ఎన్నో కష్టాలు పడతారు.


అందుకే ఎక్కడివాళ్ళు అక్కడే ఉండి తమదేశాన్ని అభివృధ్ధి చేసుకుంటే మంచిదేమో.

ఈ సామాజిక సమస్యలను ఆలోచించే మన పూర్వులు సముద్రం దాటితే పాపమని చెప్పారేమో ! అయితే అప్పట్లో కూడా కొన్ని దేశాలమధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.


అయితే కొంతమంది మేధావులు అక్కడివాళ్ళు ఇక్కడికి , ఇక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల దేశాల మధ్యన మంచి స్నేహసంబంధాలు ఉండే అవకాశం ఉంది. అయితే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పటిలాగ................ వేలంవెర్రిగా........ పుట్టిన ప్రతిఒక్కరూ పరాయి దేశాలకు వెళ్ళిపోవాలని అప్పటి వారు అనుకునేవారు కాదు.


ఇప్పుడు కూడా కొంతమంది మన దేశంలోనే ఉండి , ఇక్కడి అభివృధ్ధికి పాటుపడాలనుకునే వాళ్ళు కూడా........ ఉన్నత ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్స్ ఇలాంటివాటి వల్ల తప్పనిసరిగా పరాయి దేశానికి వెళ్ళవలసి వస్తోంది.

అన్ని దేశాలు, ప్రాంతాలు సమానంగా అభివృధ్ధి చెంది, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటే ఈ సమస్య ఉండదు.


అందరూ ప్రపంచమంతా తిరిగితే సమసమాజం ఏర్పడుతుందేమో అని ఒకోసారి అనిపించినా .......ఒకోసారి అది పూర్తిగా సరి కాదేమో అని కూడా అనిపిస్తోంది.


ఏది ఏమైనా ఈ రోజుల్లో , విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచన
ఇంత వేలంవెర్రిగా......... చాలా ఎక్కువ మందిలో ఉండటం దేశానికి ఆందోళన కలిగించే విషయం.

భారతదేశం గొప్ప పుణ్యభూమి. ఇక్కడ ఒక చెట్టుగా అయినా జన్మ లభిస్తే చాలని దేవతలు కూడా కోరుకుంటారట. అలాంటప్పుడు నేటి పరిస్థితి ఎంతో బాధాకరం.

కష్టాలలో ఉన్న కన్నతల్లిని వదిలి వెళ్ళటం ఎంత తప్పో ................. కష్టాలలో ఉన్న మాతృభూమిని వదిలి వెళ్ళటం అంతే బాధాకరమైన విషయం.. ( అయితే పిల్లలు మన మాట వినకపోతే మనమేమీ చెయ్యలేము ).

 

Sunday, December 26, 2010

1.మన ఆచారములు అన్నిచాదస్తములా ...... 2. ..జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

 

మన ఆచారములు అంతా చాదస్తమేనా..........

విషయములో అయినా మంచిని మాత్రమే గ్రహించాలి అని నా అభిప్రాయమండి. అంటే మన పాత ఆచారములు గానిక్రొత్త సైన్స్ గాని వీటి వల్ల నైతికత తో కూడిన ఆనందం మనకు కలగాలి.

సైన్స్ మరియు భగవంతుడు వేరని ఎందుకు అనుకోవాలి . ఇంత గొప్ప ప్రపంచాన్ని స్రుష్టించిన భగవంతుడు పెద్ద సైంటిస్ట్అని నా అభిప్రాయము.


మనము గుమ్మానికి పసుపు రాయటము వల్ల గాలికి బయట నుంచి వచ్చే దుమ్ము గడపకు తగిలి .............చెడ్డ బాక్టీరియా ఇంట్లోకి రాకుండా పసుపు రాసిన గడప కాపాడుతుంది.

ఆపసుపు
లోని ఆంటిబయొటిక్ గుణము వల్ల గడపకు ఉన్న దుమ్ము లోని చెడు క్రిములు చనిపోతాయి.

ఇవన్నీ అర్ధము కావని గుమ్మానికి పసుపు రాస్తే డబ్బు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. మరి మనము రోజుల్లోపసుపు రంగు పెయింట్ వేసేసి................. పెద్దవారు చెప్పినదానివల్ల ఏమి ఉపయోగము....... అంతా చాదస్తముఅంటున్నాము.
అలాగే చెట్ల ఆకులు కార్బండైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజెన్ విడుదల చేస్తాయని మనకు తెలుసు.ఒక్క మామిడి చెట్ల ఆకులుమాత్రము చెట్ల నుంచి కోసిన తరువాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే శక్తి కలిగి ఉంటాయట.


అందుకని ఎక్కువమంది కలిసే ఫంక్షన్స్ లో మామిడి ఆకులు కట్టడము వల్ల గాలి శుభ్రముగా ఉంటుంది. రోజుల్లోఇవన్నీ సైంటిస్ట్స్ కనిపెడుతున్నారుకదా.

ఎన్నో వందల సంవత్సరముల మన ఆచారములలో......... తెలిసీ తెలియని కొంతమంది......... చెడ్డ ఆచారములుప్రవేశపెట్టడము వల్ల మనము అన్ని ఆచారములు తప్పని చెప్పకూడదు.

మీ అందరికి థాంక్స్. నా అభిప్రాయములు చదివినందుకు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యటము సరిగ్గా రాదండి. దయచేసి తప్పులు క్షమించండి.

.ప్లాస్టిక్ మామిడి ఆకులు బదులు నిజమయిన ఆకులు వాడుదాము....


విడాకుల వలన లాభమా....


అసలు 90 పర్సెంట్ ఆడవాళ్ళు, 90 పెర్సెంట్ మగవాళ్ళు దగ్గరదగ్గర ఒకే రకమయిన మెంటాలిటి కలిగి ఉంటారని నా అభిప్రాయము.

కొంతమందిరెండు, మూడు పెండ్లిండ్లు చేసుకున్నాక అప్పుడు తత్వము తెలుసుకుంటారు. ఇక చేసేదిలేక అప్పుడు సర్దుకుపోవటమునేర్చుకుంటారు. తాము చాలా సంతోషముగా ఉన్నట్లు ప్రపంచానికి కనిపిస్తారు.

సర్దుకుపోవటము మొదటిపెండ్లివారితోనే అయితే కనీసము వారి తల్లితండ్రులు,పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు.

సారి భార్యాభర్తలూ మీమద్య గొడవ వచ్చినప్పుడు ............మీరు ముసలి వారు అయ్యాక, మీ పిల్లలు,కోడళ్ళు,అల్లుళ్ళు, లేక........... వ్రుద్దాశ్రమములో ఎవరయినా మిమ్ములను విసుక్కోవటము ,మీరు ఓపికలేక నోరుమూసుకుని సర్దుకుపోవటము ఇదంతా .......ఊహించుకోండి.( ఇది పెద్దయ్యాక ప్రతి ఒక్కరికి తప్పని పరిస్థితి .) అప్పుడు భార్యాభర్తల మధ్యన కూడా సర్దుకుపోవటం అలవాటవుతుంది.


మరి
వారందరిమాట వినే మనము భార్య మాటభర్త, భర్తమాటభార్య వింటే తప్పేమిటి.ఇంకా మీ మనసు మీ మాట వినక పోతే భగవంతుని సహాయము చెయ్యమని ప్రార్దించండి.

ఇక మరీ తప్పని పరిఖర్మ ప్రకారము విడిపోవాలిసివస్తే......... వేరే వారి కాపురము లో చిచ్చుపెట్టకుండా గౌరవముగా జీవిస్తే బాగుంటుంది. అప్పుడుఅందరూ గౌరవిస్తారు.

అందరి కాపురములు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ...

Saturday, March 27, ౨౦౧౦

జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..


రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము.

ఈ రోజుల్లో పిల్లలు వారి జీవితాంతం అమ్మా,నాన్న ఉంటారాలేక.............. వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని ............అతి చిత్రమయిన పరిస్థితిలో నేడు చాలామంది పిల్లలు ఉన్నారు.

అంటే మరి........ తల్లితండ్రి విడిపోయి, ఎవరికి వారు వేరే పెండ్లి చేసుకుంటే......... పిల్లలకు కొత్తా అమ్మానాన్న వస్తారు కదా........ అలా అన్నమాట.

ఇది రాయటానికి నాకు చాలా బాధగా ఉంది.

రోజుల్లో భార్యాభర్తలను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. రకరకముల ప్రాబ్లంస్ ,ఒకోసారి బంధువుల పంతాలు ,పట్టింపులు వలన కూడా
భార్యాభర్తల మధ్యన పెద్దపెద్ద గొడవలవుతాయి.


ఏదిఎలా ఉన్నా ఒక జంట గుర్తుంచుకోవాల్సింది ఏమంటే......... మనము జీవితములో చిన్నతనములో పెద్దల మాటగౌరవిస్తాము.................. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,అల్లుళ్ళను చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటేఅప్పుడు మనకు ఒపిక ఉండదు కాబట్టి.


మరిఈ మద్య కాలంలో......... జీవితములో ఎంతో మందితో , అంటే ఆఫీసులలో పై వారితో, ఇరుగు పొరుగు వారితోనూ ,పనివారితోను,కూరలవారితోను,మనసొంతపిల్లలతోను, ఇలాఎంతో మందితోసర్దుకుపోతుంటాము....మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.

మరి భార్యాభర్తలు కూడా ఇలా......... సర్దుకుపోతే ఈప్రపంచములో చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారిజీవితము ఎంతో సంతోషముగా ఉంటుంది.

నాకుతెలుసు.......ఇది కష్టమయిన పని అని. కాని కొంచము ప్రయత్నించిచూడండి...........

కుటుంబం అన్నాక రకరకాల కారణాల వల్ల , ఆర్దిక సమస్యలవల్లా భార్యాభర్తలకు తప్పక గొడవలు వస్తాయి.... బయటివారికి ఇవన్నీ ఉండవు ........కాబట్టి ఇన్నిసమస్యలు రావు,

మనము మన చిన్నతనములో మన అమ్మమ్మా,నాయనమ్మా ఊర్లు వెళ్తే,......... వారు ఎంత ఆప్యాయముగా మనల్నిచూసారో మనపిల్లలకు కధలుగా చెపుతాము.

మరి మన పిల్లలకు మనము ఇలాంటి ప్రేమలు ఇవ్వాలంటే........... మన పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు....... మనఆప్యాయతలు పొంది సుఖముగాపెరగాలంటే.... ఈనాటి భార్యాభర్తలు కూడా సర్దుకుపోకతప్పదు.

మనపెద్దలు సర్దుకుపోయారు కాబట్టి......... మనము ఇలాసంతోషముగా ఉన్నాము.

మనపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తమసొంత అమ్మ బదులు వేరే అమ్మ ,................సొంతనాన్న బదులు వేరే నాన్న........... ఉంటే వారి మనస్సూ ఎంత భాధగాఉంటుందో ఆలోచించండి. కొత్తగా వచ్చిన వారు ఎంత బాగా చూసినా సరే..

ఈసారి పోట్లాటలు వచ్చినప్పుడు బయట అయితే కోపము ఎలా అణుచుకుంటామో గుర్తు తెచ్చుకోండి. అందరి కాపురములు సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను. ...


Friday, March 26, ౨౦౧౦

హక్కులు పెద్దలకేనా..పిల్లలకు వుండవా..

రోజుల్లో ప్రపంచము లో సంస్క్రుతి బాగా మారిపోయింది.ఇప్పుడు ఎక్కువ మంది భార్యాభర్తలు తమ హక్కుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.మరి పిల్లలకు కూడా బాధలు ,భయములు ఉంటాయి కదా.

డబ్బు ఉన్న వాళ్ళు కూడా.............. నాడు తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగములకు వెళ్ళటము వల్ల చాలా చిన్న పిల్లలను క్రెచ్లలోవదిలి వెళ్తారు. అక్కడకొన్ని దగ్గర బాగా చూస్తారు. కొన్నిదగ్గర సరిగ్గా చూడకపోవచ్చు....
ఎంతయినా వారు తల్లిలా చూస్తారా..


మరి పిల్లలకు తమ భాధలు చెప్పుకోవటానికి.... భగవంతుడే దిక్కు... పెద్దవాళ్ళు చెప్పే జవాబు..... మేము వాళ్ళ కోసమే డబ్బు సంపాదిస్తున్నామని.


ఇప్పుడు ప్రశ్న ఏమంటే .........ఇదే పెద్దలు వారి ముసలితనములో వారి పిల్లలు వారిని వ్రుద్దాశ్రములలో చేర్పిస్తే మాత్రము, ఎంతఘోరం........... మాపిల్లలు మమ్మల్ని ప్రేమగా చూడటము లేదు, మాకు డబ్బు కాదు ప్రేమ కావాలి వయసులో ........ అని అందరికి చెప్పి భాధ పడుతారు.


కొంతమంది పిల్లలపైన కేస్ కూడా వేస్తారు. వీరికి తమ పిల్లల చిన్నతనములో పిల్లలతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు............... మరిఇప్పుడు వారి పిల్లలకు వీరితో మాట్లాడటానికి టైం ఉండదు.
ఏమంటే పిల్లలు వారికి పుట్టిన పిల్లలకు సంపాదించటములో బిజీగా ఉంటారు కాబట్టి..


పెద్ద వయసులో మనముపిల్లల ప్రేమను కోరుకున్నప్పుడు..... మరి పిల్లలు వారి చిన్నతనాన్నితల్లిదండ్రులకు దూరంగా బయటెక్కడో ఎందుకు గడపాలి... ఎందుకంటేవారికి మాటలు రావు కాబట్టి..... వారికి హక్కులు తెలియవు కాబట్టి.


మనకు గాని మన పిల్లలకు గానిజీవితములో ఎప్పుడయినా , ఏదైనా కష్టము వచ్చినప్పుడు అది పోవాలంటే... భగవంతుడు మన కోట్లఆస్తిని చూసి మనల్ని కాపాడడు.... మనము ఎన్ని మంచి పనులు చేసామో చూసి వాటిని బట్టి రక్షిస్తాడు.


అందుకని నా అభిప్రాయము ఏమంటే..... మనము జీవితములో సుఖముగా ఉండాలంటే మన కోరికలను తగ్గించుకోవాలి. ... మనమేమో ప్రక్రుతిని సర్వనాశనము చేసేసి భూమిని తవ్వేసి చందమామను కూడాను పొల్యూట్ చెయ్యటానికి కూడా రడీ అయిపోతున్నాము.

విషాదమేమంటే ఇన్ని సౌకర్యాలు పెరిగినా ఒక్కరికి మనశ్శాంతి లేదు............

మనము మనకు సరిపడినంత ఆస్తి మాత్రముసంపాదించుకుని..... నలుగురికి సహాయపడితే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనకు కూడా ఎంతోసంతోషముగాఉంటుంది.

ఏదో నాకు తోచింది రాసేసాను,దయచేసి ఎవరి మనసునైనా కష్టపెడితే క్షమించండి...


ఇవి నేను ఇంతకుముందు రాసిన పాత టపాలే నండి..మళ్లీ పోస్ట్ చేసాను.....

Monday, December 13, 2010

మన ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే చాలా లాభాలు ...............

 

 

మన ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే చాలా లాభాలు ఉంటాయని చాలామంది చెబుతున్నారు.

మనము వరి, గోధుమను,......... ఆహారంలో ఎక్కువగా వాడుతున్నాము. వాటితోపాటు ఇతర ఆహారధాన్యాలను కూడా ఆహారంగా తీసుకుంటే అన్నిరకాలుగా మంచిది. వరి పంట పండించటానికి ఎక్కువగా నీరు కావాలి.


కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్కడ చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి బాగా పండుతాయి. వాటికి ఎక్కువ నీరు అవసరం లేదు. చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుందట. అవి చాలా బలమైన ఆహారమని అంటున్నారు.


మనం ఒక పూట వరి , గోధుమ తీసుకుని రెండోపూట ఇతరరకాలు ఆహారంలో తీసుకుంటే బలానికి బలం. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలవారికి వారు పండించిన పంటలకు తగ్గ ఫలితం వస్తుంది. ఆహార కొరత తీరుతుంది.


ఇక మన పెద్దలు నవధాన్యాలుగా వడ్లు, గోధుమలు , కందులు, పెసలు, సెనగలు, అనుములు, నువ్వులు, మినుములు , ఉలవలు ఇలా .......... చెప్పటంలో ఇవన్నీ మనకు ఉపయోగమైనవని మనం గ్రహించవచ్చు.


నువ్వులతో చేసిన పదార్ధములలో ఎంతో ఐరన్ ఉంటుందట. మన పెద్దవాళ్ళు ఉడికించిన అనుములు , పెసలు, బొబ్బర్లు ఇలాంటివి చిరుతిళ్ళుగా తినేవారమని చెబుతుంటారు. మరి మనము పిజ్జాలు, బర్గర్లు తింటున్నాము.


ఇప్పుడయితే అలాంటివి తింటే పిల్లలకు కూడా అజీర్తి చేస్తుంది. ఇక పెద్దవాళ్ళకి ఏమి అరుగుతాయిలెండి. పనులన్నీ యంత్రాలకి అప్పజెప్పి మనం ఆయాసపడుతూ కూర్చుంటే అంతే మరి. మనము మెత్తని కేక్స్, బ్రెడ్, ఐస్ క్రీం ఇలాంటి వాటికి శరీరాన్ని అలవాటు చేశాము కదా !


పళ్ళు కూడా చెరకు గడలు లాంటి గట్టి పదార్ధములను నమలలేవు . కొన్నాళ్ళకి శరీరము పనిచెయ్యాలన్నా సహకరించదు. సరేలెండి ఈ సోది ఎప్పుడే ఉండేదే. చాలామందికి బోర్.


సరే, రోజూ .... వరి , గోధుమనే కాకుండా అన్నిరకములు సమపాళ్ళలో తీసుకుంటే మంచిది. పూర్వం పేరంటం వంటి ఫంక్షన్స్ లో నానబెట్టిన శనగలు పంచేవారు. ఉలవలు కూడా మంచిబలవర్ధకమైన ఆహారం.


ఇవన్నీ తిన్నా అప్పటివారికి ఏమీ తేడా చేసేది కాదు. తమపనులు తాము కష్టపడి చేసుకోవటం వల్ల , అన్నీ ఆహారపదార్ధములు చక్కగా అరిగి మంచి పుష్టిగా ఉండేవారు.


ఇప్పుడయితే ఇవన్నీ తింటే కాళ్ళు, కీళ్ళు పట్టేస్తాయి. కొన్ని రోజులు డాక్టర్ చుట్టూ తిరగటానికే సరిపోతుంది.


చిరుధాన్యాలైన రాగులు, జొన్నల యొక్క పిండి గోధుమ పిండితో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు, ఇంకా నువ్వుల లడ్లు, జొన్న ఉప్మా, బొబ్బర్లతో వడలు ఇలా చాలామంది ఎన్నో వంటలు వ్రాస్తున్నారు గదా ఈ రోజుల్లో.


రాగి అంబలి అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో గుడులలో , అమ్మవారికి రాగి అంబలిని నైవేద్యముగా పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మనము అది బలమైన ఆహారమని తెలుసుకోవాలని పెద్దలు ఇలా ఏర్పాటు చేసిఉంటారు.

మనమేమో అవన్నీ వట్టి చాదస్తాలుగా భావిస్తాము. మన పూర్వులు ఎన్నో ఆలోచించి ఆచారములు ఏర్పాటు చేశారు.


నేను ఇవన్నీ కొంచెం తొందరగా వ్రాస్తున్నానండి. ఈ మధ్యన పనివత్తిడి బాగా పెరిగింది. ఇంకో పది రోజులు ఇలాగే పని వత్తిడి ఉంటుందేమో .

Friday, December 10, 2010

శ్రీ టెంబెస్వామి

 

 

శ్రీ టెంబెస్వామి
ఈ కధ శ్రీ శిరిడి సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము లోనిదండి.

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు ( టెంబెస్వామి ) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు , పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు.


నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు శిరిడీ పేరు వచ్చెను.


బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి. " దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. " ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను.


పుండలీకరావు ఆ టెంకాయను , సమాచారమును శిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులును శిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి.


పరగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది.


శిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను.

టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను.


పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని , తన తప్పును , అలక్ష్యమును వెలిబుచ్చుచు , పశ్చాత్తాపపడుచు , బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను.


కానీ బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునదింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను.


యింకను బాబా ఇట్లనెను. " ఆ విషయమై నీవే మాత్రము చింతింప నవసరములేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని యనుకొననేల ? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును. "ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. !


( ఇక్కడ " మంచి గాని చెడ్డ గాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు ) అంటే ........ కొంతమంది అవకాశవాదులు దీనిని సాకుగా తీసుకుని ......... చెడ్డ పనులు చేసి వాటికి తాము కర్తలం కాదు అని భావించమని దీనికి అర్ధం కాదు.


ఈ కధలో జరిగిన సంఘటనలా ........... పూజల్లో పొరపాటుగా,....... పొరపాట్లు జరిగినప్పుడు భక్తులు అదే ఆలోచిస్తూ భయపడకూడదని సాయి ఆ సంఘటనను ఆ భక్తుని ద్వారా ఇలా జరిపించారేమో....... అని కూడా భావించవచ్చునేమో. ( అయితే పొరపాటు జరిగిన తరువాత పశ్చాత్తాపం చెందటం బాగుంటుంది )


ఇంకా జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టమునకు విపరీతంగా క్రుంగిపోకుండా తేరుకుని భగవంతునిపై భారం వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని .......... మనకు జీవితంలో లాభం కలిగినప్పుడు ................ అంతా నా గొప్పే అని విర్రవీగకుండా భగవంతుని దయ అని భావించి గర్వాహంకారరహితులమై ప్రవర్తించాలి అని కూడా భావించవచ్చు.

 

Thursday, December 9, 2010

అలా.......అత్యంత స్వార్ధపూరిత తరాలుగా నేటి తరాలవాళ్ళు చరిత్రలో నిలిచిపోతారా ?

 

నా అభిప్రాయం నేటి విజ్ఞాన శాస్త్రములో క్రొత్త పరిశోధనలు జరగకూడదని కాదండి. ఇలా కనిపెడుతున్న వస్తువుల వలన ప్రపంచానికి హాని జరగకూడదన్నదే నా భావం.


మనకు కష్టమైన కొన్ని పనుల సౌలభ్యము కొరకు కొన్ని వస్తువులను అవసరమైనంతవరకూ వాడుకోవచ్చు. ఉదా..........నా చిన్నప్పుడు ఎడ్లబండిలో వెళ్తున్నప్పుడు , అయ్యో ! ఎద్దులు ఎంత బరువును లాగుతున్నయ్యో కదా ! పాపం ! అని బాధగా అనిపించేదండి. ఇప్పుడు వాహనముల వల్ల వాటికి ఆ బాధ తగ్గింది లెండి..........


కానీ...కారు, బస్సు ఇలాంటివాటికి పెట్రోల్ లాంటి ఇంధనముల బదులు సౌరశక్తిని వినియోగిస్తే బాగుంటుంది.


ఒక్కోసారి ఏమని అనిపిస్తుందంటేనండీ, ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులు చేస్తున్న డాన్సులను మనం ఇంట్లో కూర్చునే టి.వి లో చూస్తున్నాము.. కానీ గ్రుడ్డివాళ్ళు తమ కళ్ళముందున్న ప్రపంచాన్ని కూడా చూడలేకపోతున్నారు.


ఈ నాటి విజ్ఞానశాస్త్రం ...తాను , దేనికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ? విలాసాలకా ? నిత్యావసరాలకా ? అని ఆలోచించుకుంటే బాగుంటుంది కదండి.


అంధత్వాన్ని పోగొట్టటానికి పరిశోధనలు జరుగుతున్నాయని వింటున్నాము. ఎంతో ఆనందకరమైన విషయమిది.

ప్రాచీన గ్రంధాలలో కూడా విమానాల గురించి, పుష్పక విమానాల గురించి ఇంకా, ఆయుర్వేదములో అంధత్వ నివారణకు చికిత్స గురించి చెప్పబడిందట. కానీ విజ్ఞానము ఇప్పుడు అంతగా అందుబాటులో లేదు.


ఇంకా, మనకు ప్రమాదమని తెలిసినా టెక్నాలజీని వదలుకోవటానికి ఇష్టపడటం లేదు. అంతగా దానికి అలవాటుపడిపోయాము. కానీ ఈనాటి టెక్నాలజీ వల్ల ఎన్నో ఇతరజీవులు ఎంతో హింసని అనుభవిస్తున్నాయి.


ఉదా.. కాలుష్యం, .ప్లాస్టిక్ వల్ల , ఎన్నోజంతువులు, ఎన్నో సముద్రజీవులు ప్రాణములను కోల్పోతున్నాయి. మరి వాటిని అలా హింసించే అధికారాన్ని మనకు ఎవరిచ్చారు ?


కొన్ని కొత్త ఆవిష్కరణల వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం అది లేకపోయినా బ్రతకగలం. ఉదా..........అణుశక్తి వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ఇలాంటి వాటిదగ్గర ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ కట్టడాన్ని మొత్తం ముక్కలుగా చేసి వాటిని సిమెంట్ తో సీల్ చేసి వాటిని సముద్ర గర్భములో వదలటం , లేక భూమిలో లోతుగా పాతిపెట్టటం గానీ చేస్తారట.


లేకపోతే ఆ అణుధూళి వల్ల ప్రపంచానికి ఎంతో హాని కలుగుతుందట. నేను ఇవన్నీ వార్తాపత్రికల్లో చదివానండీ. నాకు అప్పుడు ............ చిన్నప్పుడు విన్న కధలలోని .......... ఒక భూతాన్ని సీసాలో బంధించి భూమిలో లేక సముద్రంలో వదలటం గుర్తుకు వచ్చిందండి.


ఇక భూమిలో పెట్రోల్, ఖనిజాలు తయారుకావటానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుందట. మరి మనం వాటిని బయటకు తీసి ఎంత త్వరగా వాడేస్తున్నామో కదా ....


1 కిలో ముడి ఖనిజం తీయాలంటే ఎన్నో టన్నుల మట్టిని శుధ్ధి చేయాల్సి వస్తుందట.

గత కొన్ని వేల సంవత్సరాలుగా జరగని సహజవనరుల దుర్వినియోగం ... గత 100 సంవత్సరములలోనే జరిగిందని అంటున్నారు.


అంతులేనికోరికలతో తమ ముందు తరాల వాళ్ళకు కూడా సహజవనరులని మిగల్చకుండా వాడేస్తూ అలా.......అత్యంత స్వార్ధపూరిత తరాలుగా నేటి తరాలవాళ్ళు చరిత్రలో నిలిచిపోతారా ?



ఇంకా నా అబిప్రాయం ఏమంటేనండి, ఈ నాటి టెక్నాలజీని ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీగా మార్చుకోవాలి. అదే సమయంలో మన అంతులేని కోరికలను అదుపులో పెట్టుకోవాలి.


శాస్త్రవేత్తలలో ప్రపంచానికి మంచి చేయాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదైనా కొత్తవిషయాన్ని కనిపెట్టేముందు భవిష్యత్తులో దాని ప్రభావం ప్రపంచము పైన ఎలా ఉంటుంది ? ఇవన్నీ దయచేసి ఆలోచించాలని విన్నవించుకుంటున్నానండి. 

 

Monday, December 6, 2010

వేసవిలో , వెండి వెన్నెలలో, వేడివేడి పప్పుచారు, వడియాలతో విందు భోజనం...........ఆనాటి ముచ్చట......... ....

 

ఇప్పటి వాళ్ళు పాతకాలం వాళ్ళు సౌకర్యవంతమైన జీవితం అనుభవించలేదు పాపం అనుకుంటారు. నాకు తెలిసినంతలో........ అప్పటి సంగతులు,.. ఇప్పటివి కొన్ని.......... పోల్చి చూద్దామండి.


అప్పటివాళ్ళు రాత్రి త్వరగా నిద్రపోయి ప్రాతఃకాలముననే నిద్ర లేచి అటూ ఇటూ తిరుగుతూ తాపీగా పళ్ళు తోముకునేవారు.

పళ్ళు తోముకోడానికి వేప లాంటి కొన్ని ఔషధ గుణములు గల చెట్ల పుల్లలను వాడటం వల్ల పళ్ళు ధృఢముగా ఉంటాయని ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే.


పళ్ళు తోముకుని ముక్కు చీదటానికి కూడా కావలసినంత ఫ్రీగా ఉండేది అప్పుడు. ఆ పుల్లలను వాడి రోజూ పారేసినా పొల్యూషన్ ఉండదు వాటితో . అవి సహజమైనవి కనుక .

ఇక ఈ రోజుల్లో బ్రష్షులను అలా చేయలేము కదా.

ఈ రోజుల్లో రాత్రి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా నిద్రలేచి కొంపలు అంటుకుపోయినట్లు హడావిడిగా టైం చూసుకుంటూ బ్రష్ చేస్తారు.


ఇక జలుబు చేసినప్పుడు కూడా ఫ్రీగా ముక్కు చీదటానికి ఉండదు. చాలామంది ఇళ్ళలో గట్టిగా చీదితే, ఆ పడిశం, వాష్ బేసిన్ ప్రక్క గోడల పైన ఎక్కడ పడుతుందోనని జాగ్రత్తగా ముక్కును చీదుకోవాలి.


ఇక బాత్రూంల సంగతి ..........అప్పటి బాత్రూంలు ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. అందుకే జబ్బులు త్వరగా రావు. వారు స్నానానికి సుగంధ సున్నిపిండి లాంటి సహజమైన పదార్ధములు వాడేవారు.


ఇప్పటి వారు స్నానానికి షాంపూలు, రసాయనిక సబ్బులు వాడుతారు.

ఇంటి నడిమధ్యన బాత్రూం ఉండటం వల్ల..... అవి శుభ్రం చేయటానికి వాడే యాసిడ్స్, ఫినాయిల్ తో కలిసిన ఇలాంటినీరు చెట్లకు వెళితే అవి చచ్చూరుకుంటాయి. ఇలాంటి నీరు భూమిలో ఇంకటం వల్లే నేడు భూమి విషపూరితం అయిపోయింది.


ఇక భోజనం......రసాయనిక ఎరువులతో పండిన పంటల వల్ల మట్టి , మరియు మన శరీరం విషపూరితమై పోతున్నాయి,

పెద్ద వయసు చిహ్నములైన ........కళ్ళజోళ్ళు , తెల్లజుట్టు , పళ్ళు కదలటం నేడు 5 సంవత్సరముల వయసు గల చిన్న పిల్లలలోనే కనిపిస్తోంటే ............. మనము అవన్నీ అత్యంత సహజమైన విషయాలుగా పరిగణిస్తూ ......... పట్టించుకోకుండా నిర్లిప్తతను పాటిస్తున్నాము.

అప్పటి కూరగాయలను తింటుంటే సహజపరిమళంతో ఉండేవి.

నేటి కూరగాయలు.......... చిక్కుడుకాయల వంటివి తింటున్నప్పుడు మందు వాసన చక్కగా తెలుస్తోంది.


మా తాతగారింటికి వేసవి సెలవల్లో వెళ్ళినప్పుడు , రాత్రిపూట అందరమూ కలిసి వెండి వెన్నెలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, వేడివేడి చారన్నము, వడియాలతో వెన్నెలలో ఆరుబయట భోజనం చేసేవారం. ఎంత బాగుండేదో .
ఇప్పుడు ఎంత ఏ.సి లో తిన్నా ఆ సహజత్వం వస్తుందా ?


అసలు రాత్రిపూట చంద్రకాంతిలో కాస్సేపు గడపటం వల్ల శరీరానికి మంచి కాంతి, మనసుకు మంచి ప్రశాంతి కలుగుతాయట.


ఆనాడు కూడా వ్యవసాయం, ఎన్నో వ్యాపారాలు , వృత్తులు, రకరకాల ఉద్యోగాలు ఉండేవి. అప్పటి వృత్తుల గురించి ప్రాచీన గ్రంధాలలో చెప్పబడ్డాయి. అప్పుడు ఎన్నో వస్తువులు తయారుచేయబడ్డాయి. కానీ వాటివల్ల పర్యావరణానికి హాని కలిగేది కాదు.


వారు తమ జీవనానికి అవసరమైనంత వరకే........ వస్తువులను తయారుచేసేవారు.

ఇక ఈ విషయంలో ఇప్పటివారి గురించి అందరికీ తెలిసిందే..ఇప్పటి వారు చాలామంది విలాసవంతమైన వస్తువులనే ........ నిత్యావసరాలుగా మార్చుకుని వాటిని సంపాదించుటయే జీవితలక్ష్యమని అనుకుంటున్నారు.


అప్పటి ఆడవారికి ఇప్పటిలా వాషింగ్ మెషీన్స్ లేకపోయినా ........... మగవాళ్ళకి కార్లు లేకపోయినా ............ త్వరగా పనిపూర్తి చేసుకుని తీరిక సమయాలలో ............ ఆడవాళ్ళు . ప్రక్కవారితో కబుర్లు చెప్పుకోవటం, కష్టసుఖాలు చెప్పుకోవటం, కుట్లు అల్లికలు, కలిసి పిండివంటలు చేసుకోవటం ,................... ఇంకా, మగవారు రచ్చబండ దగ్గర ఎన్నో విషయాలు చర్చించుకోవటం జరిగేదట.


ఇప్పటివాళ్ళకి ఎన్ని యంత్రాలు కనిపెట్టినా భోజనం సరిగ్గా చేయటానికే సమయం చాలటంలేదు. కాకులలాగా అక్కడకు, ఇక్కడకు తిరగటానికే సరిపోతోంది.


అప్పటివారికి చక్కటి భోజనం, ఆహ్లాదకరమైన ప్రకృతిమధ్య జీవితం బాగుండేది. ఇక అప్పటి వారి దైవభక్తి .......... ఇప్పటి వారి దైవభక్తి గురించి అందరికి తెలిసిన విషయమే.


అందరూ సరదాగా కలవటానికి ఎన్నో పండుగలు, ఆడవాళ్ళకి పేరంటాలు, ,ఎన్నో ఉత్సవములు , కార్తీక వనభోజనాలు ఇలా ఎన్నో ఉండేవి. నాట్యము , సాహిత్యము, సంగీతము , నాటకములు వేయటము ఇలా ఎన్నో ఉండేవి.


ఇప్పుడయితే చాలా మందికి కాలక్షేపానికి .................. క్లబ్బులు, పబ్బులు, డబ్బులు వదుల్చుకుని కొత్తసామాను కొనుక్కుని రెండుచేతులలో మోయలేని ప్లాస్టిక్ కవర్లతో బయటికి వస్తూ అదే అదే .......... వీకెండ్ కాలక్షేపం అనుకొనే జీవులు.


అప్పటి సామాగ్రి వల్ల పర్యావరణానికి ఏ హానీ కలిగేది కాదు.

ఇప్పటి ఎలక్ట్రానిక్ సామాగ్రి నుండి వెలువడే మీధేన్, కార్బన్ డయాక్సైడ్ వల్ల ఓజోన్ పొర దెబ్బతినటం అందరికీ తెలిసిందే.



ప్రపంచములోని కొన్ని ప్రాంతములు, శుభ్రంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. నిజమే మనం చెత్త మధ్యన. ........ బ్రతుకుతున్నాము. కానీ వారు చెత్తను వారి ప్రాంతము లో కాకుండా బయట
ఇతరప్రాంతములలో పోస్తారు. అంతే తేడా ........... చెత్త ఎవరికైన వస్తుంది కదా.


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ అండి ...... విచిత్రమైన విషయము ఏమిటంటే ...... ఇవన్నీ అందరికీ తెలిసిన సంగతులే..

 

Friday, December 3, 2010

నైతిక విలువలతో కూడిన విద్య ద్వారా ఎన్నో సమస్యలను నివారించవచ్చు............


అసలయిన విద్య ద్వారా వ్యక్తులు క్రమముగా తన పరమలక్ష్యమును సాధించగలరు.

ఇప్పటివాళ్ళు చాలామంది ప్రాచీనకాలం వాళ్ళకు ఏమీ తెలియదని వాదిస్తారు.

కానీ వాళ్ళకు విశ్వమును గురించిన పరిజ్ఞానం, ఆయుర్వేదం, అర్ధశాస్త్రం, లోహశాస్త్రం, జీవశాస్త్రం ఇంకా ఎంతో ప్రపంచజ్ఞానం తెలుసని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము.


మన అశ్రధ్ధ, దురదృష్టం వల్ల అప్పటి విలువైన గ్రంధములను మనం జాగ్రత్తగా భద్రపరచుకోలేకపోయాము.


అప్పుడు పిల్లలను చిన్నతనం నుండే ఆదర్శ వ్యక్తులుగా తీర్చిదిద్దేవారు. ఉదా......పంచతంత్రం లోని కధలను పిల్లలకు చెప్పటం ద్వారా వారికి భవిష్యత్తులో ఎలా పధ్ధతిగా జీవించాలి ........ లాంటి విషయాలను నేర్పటం జరిగేది.


జంతువులను పాత్రలుగా చేసి కధలుగా చెప్పటం వలన పిల్లలకు వినటానికి ఉత్సాహముగా ఉండేది.


ఇక పురాణముల ద్వారా జీవితములో ఎదురయ్యే సమస్యలు, జీవితములో ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి ,........ ఇలా విలువలను నేర్పటం జరిగేది.

పాతకాలంలో కూడా చెడ్డ వ్యక్తులు ఉన్నా వారి శాతము చాలా తక్కువగా ఉండేది.


ఇంకా ఈ మధ్య కాలం వరకూ కూడా వినాయక చవితి పండుగ వచ్చిందంటే పత్రిని సేకరించేసమయములో పిల్లల పాత్ర ఎక్కువగా ఉండేది. అలా వాళ్ళు తమ చుట్టుప్రక్కల పరిసరాలలోని మొక్కల గురించి వాటి ఔషధ గుణముల గురించి తెలుసుకునేవారు.


దైవభక్తి, పాపము,పుణ్యం, స్వర్గనరకాలు ఇత్యాది భయభక్తులతో కూడిన జీవనం వల్ల వారు జీవితములో సత్ప్రవర్తనను కలిగిఉండటానికి అవకాశం ఉండేది.


అందుకే వారు ఇతరులకు హానిచెయ్యటానికి, అన్యాయంగా జీవించటానికి జంకేవారు. ఇతరజీవుల పట్ల దయతో ప్రవర్తించేవారు.


తమకు జీవితములో ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే వస్తువులను వాడుకొనేవారు.

ఇప్పటిలా తమ సుఖముకొరకు పర్యావరణాన్ని ,ఇతరజీవులను పీల్చిపిప్పి చేయటాన్ని పాపముగా భావించేవారు.


ఇలా రకరకాల మార్గముల ద్వారా అప్పటి పిల్లలు ఎన్నో విషయములను నేర్చుకొనేవారు. ప్రాచీన కాలం లోని ఈ పధ్ధతులన్నీ చదువులో భాగం కాదా ?


అప్పటివాళ్ళు జీవితానికి అవసరమైన వృత్తివిద్యలూ నేర్చుకుంటూనే జీవితపు విలువలను నేర్చుకునేవారు.


ఇప్పటిలా పిల్లల్ని ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ కుర్చీలకు కట్టేసి, ఏకధాటిగా గంటలతరబడి ఒక సబ్జెక్ట్ తరువాత ఇంకొకటి బోధించటం వల్ల ............... భవిష్యత్తులో వారికి వెన్నెముక సమస్యలు, మోకాళ్ళ సమస్యలు ఇంకా రకరకాల అనారోగ్యాలు రావటం తప్ప ఒరిగేదేమీ ఉండదు.


పిల్లలను క్లాస్ మధ్యలో బాత్రూంకి కూడా వెళ్ళనివ్వక పోవటం నాకు తెలుసు.


ప్రొద్దున, మధ్యాహ్నం సబ్జెక్ట్ ల పీరియడ్స్ రెండు కాన్సిల్ చేసి అయినా ............ పిల్లలు క్లాస్ లో బిగుసుకుపోయి కూర్చోకుండా కాస్త అటూ ఇటూ కదిలేలా ఆటలు, డ్రాయింగ్ , బొమ్మలు తయారుచెయ్యటం ........ ఇలా వేరే ఇతర క్లాసెస్ ఉండేలా విద్యావిధానం మార్చాలి.


కొంచెం సిలబస్ తగ్గించటం వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.


సమాజములో పెరుగుతున్న నేరాలను ఆధునిక విజ్ఞానం ద్వారా తగ్గించటం అసాధ్యం. చిన్నప్పటినుంచీ పిల్లలకు నైతిక విలువలతోకూడిన విద్యను అందించటం ద్వారా మాత్రమే పిల్లలు ఆదర్శపౌరులుగా తయారుకాగలరు.


నేరములు జరిగినతరువాత వాటిని అరికట్టే పరిజ్ఞానంకన్నా అసలు నేరస్తులే తయారుకాకుండా చూడటం విజ్ఞత అనిపించుకుంటుంది.


ఈ రోజుల్లో పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పాలంటే ముందు ఈనాటి పెద్దవాళ్ళు చాలామంది తమ నడవడికను మార్చుకోవలసిన అవసరం ఎంతోఉంది.

 

Wednesday, December 1, 2010

నేటి వస్తూత్పత్తి చదువులు.......

 

ఆ మధ్యన నేను ఊరు వెళ్ళాను కదండి. ఎక్కడ చూసినా మురికి,మురికి . వర్షం వస్తే ఇక చెప్పనే అక్కరలేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్, పారేసిన సామాను, డబ్బాలు, ఎలక్ట్రానిక్ వేస్ట్ సామాను.


మా చిన్నతనములో మా తాతగారి పల్లెటూరు వెళితే అక్కడ పేదవారి గుడిసె ముందు కూడా శుభ్రంగా కళ్ళాపి జల్లి చక్కగా ముగ్గు వేసి ఉండేది. రోడ్ల పైన ఇలా వాడిపారేసిన సామాన్లు ఉండేవి కాదు.


అంటే మరి, ఇప్పుడంటే యంత్రాలు కనిపెట్టి విపరీతంగా వస్తువులను తయారుచేసి ప్రపంచముపై గుట్టలు పోస్తున్నారు. కానీ,...........
అప్పటికి ప్రపంచం పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి చెందలేదు లెండి


ఈ రోజుల్లో చదువు అంటే కూడా అర్ధం మారిపోయింది కదా ! ఇప్పుడు చదువు అంటే ఎన్నిరకాలుగా క్రొత్తవస్తువులను తయారుచేయవచ్చో నేర్చుకోవటమే కదా !

అసలు ఇప్పుడు మనం బ్రతికేదే కొత్త వస్తువులను కొనుక్కోవటానికి, దానికోసం డబ్బు సంపాదించటానికీను. ఆ వస్తువులతో శరీరానికి పనిలేకుండా సుఖంగా ఉండటానికీను.


శరీరానికి శ్రమ తగ్గించాలన్న ఆలోచనతో జీవితములో విపరీతముగా శ్రమిస్తున్నారు. ఉదా...చూడండి.......పిల్లలను పుట్టగానే స్కూల్లో వేసేస్తున్నారు. ఇక బడిలో వేయగానే ప్రొద్దున నుండి రాత్రి వరకూ చదువు పేరుతో రాచిరంపాన పెట్టడము.


ఇక ఉద్యోగములో చేరాక టార్గెట్ ల గోలతో ప్రొద్దున్న నుండి అర్ధరాత్రి వరకూ పని,పని.

ఇక రిటైర్ అవుతారు. అప్పటికి ఇంటినిండా వస్తువులు, డబ్బు ఉన్నా, ఆరోగ్యమే ఉండదు. జరిగిపోయిన జీవితములో ఏమీ ఎంజాయ్ చెయ్యలేదన్న బాధతో , అనారోగ్యముతో, హాస్పిటల్ కే జీవితం అంకితం చచ్చేవరకూ. ఇదీ నేటి జీవితం.


ఇక చాలా కుటుంబములు ఇవ్వాళ ఎలా ఉన్నాయంటే, భార్యాభర్తలు చెరొక దగ్గర ఉద్యోగం, పిల్లలు ఎక్కడో హాస్టల్స్ లో.

ఇదే కుటుంబము అంటే. అదేమిటంటే, ........ ఈ రోజుల్లో అభివృధ్ధి చెందాలంటే ఇవన్నీ తప్పవు కదండీ,,,, అంటారు. నాకు అర్ధము కానిది ఒకటే అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? అని......


అసలు విషయం మనకు కోరికలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఇన్ని కొత్త వస్తువులు తయారుచేయటం అవసరమా ?

ఎప్పుడైనా సూర్యతుఫాన్ లాంటిది వచ్చి ఈ సదుపాయములు అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు మన పనులు మనం చేసుకోవటానికి శరీరావయములు సహకరిస్తాయా ?


( భవిష్యత్తులో సూర్య గోళముపైన తుఫాన్లు రాబోతున్నాయని వాటివల్ల శాటిలైట్ సిస్టంస్ ఫెయిల్ అయ్యి , ఫోన్స్, ఇంటర్నెట్ వగైరాలు అన్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతున్నారు,. )

అంతవరకూ ఎందుకు ........ శరీరమును శ్రమ పెట్టకుండా ముద్దు,ముద్దుగా గారాబం చేస్తే మనకే అనారోగ్యం వస్తుందని వైద్యులు చెబుతున్నారు కదా.......... 



కొత్తవస్తువులను కనిపెడుతున్న కొద్దీ వాటిని అందుకోవాలనే కోరికతో జనం జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వాటిని కొనటానికి కావాలిసిన డబ్బు సంపాదించటానికే జీవితకాలం సరిపోవటం లేదు. ఇక సుఖం, సంతోషం ఎక్కడ ?


మనకన్నా పాత కాలం వాళ్ళే నింపాదిగా, ప్రశాంతముగా బ్రతికారు అనిపిస్తోందండి. వారికి ఇన్ని కోరికలు లేవు.


అభివృధ్ధి, అభివృధ్ధి అని మనం చెప్పుకుని సంబరపడటమే కానీ, ప్రపంచములో పేదరికం, ఆకలి కేకలు అలాగే ఉన్నాయి. అప్పుడూ వరదలూ, భూకంపాలు , అగ్నిపర్వతాలు బ్రద్దలవటాలు ఉన్నాయి.......ఇప్పుడూ అవన్నీ అలాగే ఉన్నాయి.

పాత సమస్యలు తొలగకపోగా ఎలక్ట్రానిక్ వ్యర్ధములు, ప్లాస్టిక్ చెత్త , గ్లోబల్ వార్మింగ్ లాంటి కొత్త సమస్యలు వచ్చాయి ఈ అభివృధ్ధి వల్ల .


అంగారకుని మీదకు వెళ్ళిపోతున్నాము అంటున్నారు.  మంచిదే, కాని ఈ చెత్త సమస్యలను ఎవరు సాల్వ్ చేస్తారు ?


క్రొత్తవస్తువులను మనకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి గాని, అవి మన మనుగడకే ఆటంకం కాకూడదు కదా .