koodali

Sunday, October 31, 2010

భగవంతుడు చండశాసనుడు కాదు...............................పరమ కరుణా సముద్రుడు , మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..

సాయి సాయి

పూజా నియమములను ఉన్నదున్నట్లు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ఎంతో కష్టపడి కఠిననియమములను పాటించి ................. దైవాన్ని ఆరాధించి శీఘ్రముగా పరమాత్మను పొందాలనుకొనేవారు ఎందరో ఉంటారు.

సామాన్యులు కూడా సరియైన పధ్ధతులను తెలుసుకోవటం ద్వారా వారికి వీలయినంత నియమములను పాటించటానికి ప్రయత్నిస్తారు.

అసలు లౌకికపరమయిన కోరికలను (విద్య, ఉద్యోగం ) సాధించాలంటేనే, ఎన్నో కష్టాలు, త్యాగాలు అవసరమవుతాయి. అలాంటిది మరి, అత్యున్నతమమయిన పరమాత్మను పొందాలంటే కొంచెం కష్టపడటం తప్పదు మరి.

ఏదైనా కష్టపడి పొందిన దానిలో ఉన్న తృప్తి ఎక్కువ కూడా కదండి.

అలాగని అన్ని నియమములను పాటించగలమా ? అని అందరూ నిరాశ చెందనవసరం లేదు. భగవంతుడు సామాన్యులకు, అసామాన్యులకు కూడా సులభంగా అందే అందరివాడు.

ఉదా.. అందరూ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున పూజలు చేయలేకపోవచ్చు.

అందరికి పెద్ద పెద్ద గ్రంధములు చదివి భగవంతుని గురించి విస్తారంగా తెలుసుకొనే పాండిత్యం లేకపోవచ్చు.

కొందరు ఆరోగ్యం సహకరించకపోవటం, ఇంకా, రకరకాల కారణముల వల్ల కఠిననియమములను పాటించలేకపోవచ్చు.

కానీ భగవానుడు భక్తసులభుడు. కేవలం ప్రేమభక్తి ఉన్నంత మాత్రమునే దైవం భక్తులను అనుగ్రహించిన కధలెన్నో మనకు ఉన్నాయి. అందుకని ఎవరూ నిరాశ పడనవసరంలేదు.

శ్రీ వైభవలక్ష్మీ పూజా వైభవము పుస్తకములో ఏ విధమైన కోరికలు లేకుండా ,కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు సామాన్యనియమములను పాటించటం తప్ప కఠిననియమములను పాటించనవసరంలేదని నేను చదివానండి.

మరి మన లౌకికపరమైన కోరికలు తీరాలంటే చేసే పూజలలొ నియమాలను పాటించటానికి మనము కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు ? ...........ఆ కోరికలు కూడా ప్రపంచానికి కీడు చేసేవిగా ఉండకూడదు. ఇంకా,.

శిరిడి సాయి ఇలా అన్నారట....." ఎవరు అదృష్ష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో, వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరంలేదు. భక్తి యున్నచోటనే నా నివాసము " అని...

 

Wednesday, October 20, 2010

" ఒక యోగి ఆత్మ కధ " గ్రంధము లోని కొన్ని సంగతులు.....................

 
ఈ విషయములు "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో చదివినవండి.

మహామహులు బాబాజీ వారు తమ శిష్యులయిన లాహిరీ మహాశయులతో " ''దిగ్భ్రమ చెందిన అనేకమంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనలు మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు ' అంటూ ఎన్నో విషయములను తెలియజేసారు.

వాటిని గురించి లాహిరీ మహాశయులు తెలియజేస్తూ ఇలా చెప్పటం జరిగింది. ( అందులో కొన్ని సంగతులు )

.... యోగవిద్యను గురువునుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు.

"యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు ,"అన్నారు బాబాజీ. 'దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించటానికి ప్రతిజ్ఞ పూనినవాడే , ధ్యానయోగం ద్వారా పరమరహస్యాల చిక్కుముళ్ళు విడదియ్యడానికి అర్హుడు.'


"'గురుదేవా, మరుగు పడిన క్రియాప్రక్రియని పునరుధ్ధరించి మీరు, మానవజాతికి మహోపకారం చేసినట్టే, శిష్యరికానికి కావలసిన కఠిననియమాల్ని సడలించి, ఆ లాభాన్ని పెంచరూ ?' అని విన్నవించుకుంటూ బాబాజీ కేసి చూశాను. 'చిత్తశుధ్ధి గల అన్వేషకులందరూ మొదట్లోనే సంపూర్ణ అంతస్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ, వారందరికీ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను. ప్రపంచములో, మూడు విధాలైన క్లేశాలకీ గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమయిన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగదీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తిమార్గమే తొక్కకపోవచ్చు.'


" 'అలాగే కానియ్యి, ఈశ్వరేచ్చ నీ ద్వారా వ్యక్తమయింది. వినయంగా నిన్ను సహాయమడిగే వాళ్ళందరికీ క్రియాయోగదీక్ష ఇయ్యి. " అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు.


" కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం, బాబాజీ ఇంకా చెప్పారు. 'స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ' అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వినిపించు,' [" ఈ ధర్మం ( ఈ ధార్మిక ప్రక్రియ ) ఏ కొద్దిపాటి అయినా ఆచరణలో పెడితే , అది నిన్ను పెద్ద భయం నుంచి ( మహతో భయాత్ ) కాపాడుతుంది"- అంటే, జననమరణ చక్రపరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది ]. అంటూ వివరించారు లాహిరీ మహాశయులు..

(మొదట్లో మహావతార బాబాజీ, ఇతరులకు క్రియాయోగదీక్ష ఇవ్వడానికి లాహిరీ మహాశయుల కొక్కరికే అనుమతి ఇచ్చారు.

తరవాత, యోగావతార మూర్తులైన లాహిరీమహాశయులు, క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారు.


బాబాజీ అంగీకరించారు; అంతే కాకుండా, భవిష్యత్తులో క్రియాయోగదీక్షా ప్రదానం, క్రియాయోగపధంలో ప్రగతి సాధించి, లాహిరీ మహాశయులనుంచీ కాని ఆ యోగావతారుల అధికృత శిష్యులు ఏర్పరిచిన మార్గాలనుంచి కాని అధికారం పొందిన వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు.

యధావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న , భక్తివిశ్వాసాలు గల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మజన్మాంతర బాధ్యత తాము స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో అన్నారు.


సామాన్య ప్రజలు క్రియాయోగంవల్ల లాభం పొందడానికని బాబాజీ, పురాతనమైన వానప్రస్థ, సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలు తొలగించినప్పటికీ ........ దీక్ష కోరేవారికి ఎవరికయినా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాధమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం ఒకటి లాహిరీ మహాశయులూ వారి ఆధ్యాత్మిక పరంపర (వై .ఎస్. ఎస్. - ఎస్. ఆర్. ఎఫ్. గురు పరంపర ) లోని శిష్యులందరూ విధించాలని ఆయన ఆదేశించారు.


క్రియాయోగం వంటి అత్యున్నత యోగ ప్రక్రియా సాధన అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడేది కాదు. క్రియాయోగం ధ్యాన ప్రక్రియను మించినది; అదొక జీవిత మార్గం; అంచేత దీక్ష పొందేవాడు కొన్నికొన్ని ఆధ్యాత్మిక విధుల్నీ నిషేధాల్నీ మన్నించడం అవసరమవుతుంది.

మహావతార బాబాజీ, లాహిరీ మహాశయ, స్వామీ యుక్తేశ్వర్, పరమహంస యోగానందగార్ల ద్వారా పారంపర్యంగా వచ్చిన ఈ బోధలను యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ నిష్ఠగా పాటిస్తున్నాయి.




Saturday, October 16, 2010

శ్రీ దేవీ అవతార గాధలు...............

 

నారాయణుడు నారదుడి కోరికమీద భ్రామరీదేవి దివ్యావతార గాధను చెప్పడం జరిగింది.

ఒకప్పుడు అరుణుడు అనే దైత్యుడు పాతాళానికి ప్రభువుగా ఉండేవాడు. దేవతలంటే అతనికి ద్వేషం. వాళ్ళనెలాగైనా నిర్జించానే కోరికతో భూలోకానికి వచ్చి హిమాలయ పర్వతప్రాంతములో ఒక పర్ణశాలను నిర్మించుకుని , ముప్పైవేల సంవత్సరాలు కఠోరదీక్షతో గాయత్రీ మంత్రాన్ని జపించాడు.

తపశ్శక్తి చేత అతని శరీరం వేడెక్కింది. ప్రపంచమంతా అట్టుడికినట్లు ఉడికిపోయింది. ప్రజలు గగ్గోలు పెట్టారు.


దేవతలు భీతులై పరిస్థితిని బ్రహ్మకు నివేదించి ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని రక్షించమని మొరపెట్టుకున్నారు.

బ్రహ్మ వెంటనే హంస నెక్కి అరుణుడి సమక్షానికి వచ్చాడు.ఆయన వెంట చతుర్వేదాలతో పాటు గాయత్రీ దేవి కూడా ఉంది.
అరుణుడు బక్కచిక్కి, కొన ఊపిరితో ఉన్నాడు. అతని ముఖం మాత్రం అగ్నితేజంతో ప్రకాశిస్తోంది.


నాయనా! నీ తపస్సు చాలించు. దేనికోసం ఇదంతా ? అన్నాడు బ్రహ్మదేవుడు.

ఆ చల్లని మాటలు విని అరుణుడు కళ్ళు తెరిచాడు. పరమేష్టికి నమస్కరించాడు.


పితామహా ! అస్త్రాలతోను, శస్త్రాలతోను, స్త్రీపురుషులతోను, రెండురూపాలు కలవారితోను, రెండుపాదాలు లేక నాలుగు పాదాలు కలవారితోను, నాకు మృత్యువు కలగకుండా వరం ప్రసాదించు. యుధ్ధంలో విజయం లభించేటట్లు బలం అనుగ్రహించు. ఇదే నా కోరిక." అన్నాడు తెలివిగా.

అలాగే అని వరాలను ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు.

వరాల్ని పొందిన మరుక్షణమే అసురుడు గర్వంతో విర్రవీగిపోయాడు. అతని బాహువులు యుధ్ధం కోసం ఉబలాటపడ్డాయి. విజయ కాంక్ష, పదవీవ్యామోహం పరుగులు తీశాయి.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన లోకానికి వెళ్ళి, దేవేంద్రునికి ఒక వర్తమానాన్ని పంపించాడు.
"మీరు స్వర్గలోకాన్ని నా అధీనం చెయ్యండి. అది కుదరదంటే మిమ్మల్ని యుధ్ధంలో ఓడించి నేనే స్వాధీనం చేసుకుంటాను.


ఇంద్రుడు ఏమి చెయ్యాలో తోచక కంగారు పడ్డాడు. బ్రహ్మ ఇచ్చిన వరం గుర్తుకొచ్చి దిగులుపడ్డాడు.
దేవతల్ని తీసుకొని వెళ్ళి పరమేష్టితో మొరపెట్టుకున్నాడు. ఆ తరువాత అందరూ వైకుంఠానికి, అటుతరువాత కైలాసానికి వెళ్ళి న తరువాత, శ్రీ మహావిష్ణువు, శివుడు అందరూ దీర్గాలోచనలో పడ్డారు.

ఇంతలో దివ్యవాణి సందేశం వినిపించింది.

" అరుణుడు గాయత్రీ మంత్ర జప పరాయణుడు. గాయత్రీ జపాన్ని చేసినంతకాలమూ అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ మంత్రాన్ని విడిచిపెట్టినప్పుడు అతనికి మరణం ఆసన్నమయినట్లే. మీరు ఈ లోపల భువనేశ్వరిని భజించండి. శుభం కలుగుతుంది."

ఈ సందేశం దేవతల్ని ఆనంద సముద్రంలో ఓలలాడించింది.
ఈ లోపల అరుణుడు స్వర్గాన్ని ఆక్రమించాడు.

దేవేంద్రుడు బృహస్పతితో " గురువర్యా! మీ తెలివితేటల్ని ఉపయోగించి దానవుడి చేత గాయత్రి జపాన్ని మానిపించండి. తర్వాత పని మేము చూసుకుంటాము " అన్నాడు.

బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్ళాడు.
" ఆచార్యా! మీ రాక మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేవతలు మాకు విరోధులు. శత్రు వర్గానికి చెందిన వాళ్ళు. మాతో ఏమి పని ఉండి వచ్చారు ? అరుణుడు అనుమానంతో స్వాగతం పలుకుతూ ప్రశ్నించాడు.

" మేము ప్రార్ధించే గాయత్రినే నువ్వుకూడా ప్రార్ధిస్తున్నావు కదా! ఇంకా మా వర్గం మీ వర్గం ఎక్కడ ? దేవ గురువు బుధ్ధిచాతుర్యాన్ని ప్రదర్శించాడు.
దానవుడు దేవమాయామోహితుడై ఆలోచనలో పడ్డాడు. బృహస్పతి చెప్పింది నిజమే. దేవతలు యుగయుగాలనుంచీ దైత్యులకు ప్రబల విరోధులు. వాళ్ళు సేవించే దేవతనే తానెందుకు సేవించాలి ?

ఇలా తీర్మానించుకుని గాయత్రీ జపాన్ని మానేశాడు. ఆ కారణంగా కొంతకాలానికి తేజోవిహీనుడయ్యాడు. తమకు కాలం కలసి వచ్చిందని, పరిస్థితి అనుకూలంగా మారిందని గ్రహించి దేవతలు సంతోషముతో అంబను ఆరాధించారు.

కరుణామృతవర్షిణి, జగన్మంగళకారిణి అయిన జగజ్జనని ప్రసన్నురాలై కోటిసూర్య ప్రతీకాశంతో, కోటి కందర్ప సుందరాకాశంతో, చిత్ర విలేపన వస్త్రాలతో , విచిత్ర మాల్యాభరణాలతో, వరాభయ హస్తాలతో, భ్రమరముష్టికయై, నానాభ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితయై భ్రామరీ దేవిగా అవతరించింది,.


ఆమె చుట్టూ కోట్లకొద్దీ భ్రమరాలు { తుమ్మెదలు } హ్రీంకార నాదం చేస్తున్నాయి. వేదాలు ఆమెను వినుతిస్తున్నాయి.

దేవతలు పరమానంద భరితులై, భ్రామరిని అనేక విధాలుగా ప్రస్తుతించి-
" తల్లీ ! అరుణుడు చేసే అత్యాచారాలు నీకు తెలియనివి కావు. నువ్వు మమ్మల్ని కనికరించి, దానవ సంహారం చేసి, ధర్మాన్ని పరిరక్షించు." అని ప్రార్ధించారు.


వాళ్ళు చేసిన విన్నపం విని ఆమె తన పిడికిలి లోని భ్రమరాలను, తన చుట్టూ ఉన్న భ్రమరాలనూ, అప్పటికప్పుడు తాను సృష్టించిన అసంఖ్యాకమైన భ్రమరాలనూ ప్రేరేపించింది.


అంతరిక్షం భ్రమరాలతో నిండిపోయింది. భూమి చిమ్మచీకటిలో మునిగిపోయింది. దేవి కనుసైగ చెయ్యగానే ఆ గండు తుమ్మెదలు జుమ్మని ఝుంకారం చేస్తూ అరుణుణ్ణీ, అతని పరివారాన్నీ చుట్టుముట్టి వాళ్ళ ప్రాణాలను పీల్చేశాయి. ( తుమ్మెదలకు ఆరు కాళ్ళుంటాయి కాబట్టి బ్రహ్మ ఇచ్చిన వరానికి చేటు రాదు. )
యుధ్ధం లేకుండా, అస్త్రశస్త్ర ప్రయోగం లేకుండా అరుణుడు అసువులు కోల్పోయాడు. ఈ అద్భుతాన్ని తిలకించి, దేవి లీలా విలాసాన్ని కొనియాడుతూ దేవతలు పూలవానలు కురిపించారు. ఆటపాటలతో వినోదించారు.


భ్రామరీ దేవి మందహాసం చిందిస్తూ దేవతల్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యింది.

దశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. శ్రీచక్ర అధిష్ఠాన దేవత అయిన లలితాదేవే రాజరాజేశ్వరి. మహా కామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని ఉంటుంది. శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు అభయమిచ్చే అమ్మ రాజరాజేశ్వరీ దేవి. ఆమెను ధ్యానిస్తే అపజయమే ఉండదంటారు.

దశమి రోజే శిరిడి శ్రీసాయి బాబా సమాధి చెందిన రోజు.

ఈ మధ్య నేను హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు,...అందులో,..జై జై జై హనుమాన్ గోసాయీ
కృపాకరో గురుదేవకీ నాయీ అన్న దానిలో....
హనుమాన్ గోసాయి ...అన్న దగ్గర సాయి గుర్తు రావటం జరిగింది.

అంతా దైవం దయ. భగవంతునికి నమస్కారములు. ఇన్ని విషయములు మనకు అందించిన భగవంతునికి, పెద్దలకు నా నమస్కారములు.

 

Friday, October 15, 2010

మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

 

 

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్తదివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు,. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుణ్ణీ క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.


అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.


మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.

 

Wednesday, October 13, 2010

దేవీ అవతార గాధలు..............

 
వ్యాసమహర్షి , జనమేజయ మహారాజుకి దేవీ అవతారగాధలను తెలియజెప్పటం జరిగింది. కొన్ని కధలను క్లుప్తముగా ....

ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది.

ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.


శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని .... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.


దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.


హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.


సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను,. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.


ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది. కొంతమంది విద్యాధరులకు.


జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలు- ఓహ్! రణరంగం మహా భయంకరంగా ఉంది.


ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.


ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.
కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .


రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.


నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు. అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.


శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.

దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.

రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి. విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.
 


Monday, October 11, 2010

శతాక్షి అవతారం కధ................... .

 

శతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసులవారు జనమేజయ మహారాజునకు తెలియచేశారు. మరల ఎంతోమంది పెద్దలు ఆ కధలను క్లుప్తంగా మనకు తెలియచేశారు.

హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడుండేవాడు. అతని కొడుకు దుర్గముడు. మహాపరాక్రముడు. కానీ దుష్టచిత్తుడు. దేవవిరోధి.

దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.

చివరికి అతనికో ఆలోచన తట్టింది-దేవతలకు బలాన్ని యిచ్చేవి వేదాలు. వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది గదా - అని.

ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు.

"పద్మాసనా! బ్రాహ్మణుల వద్దా, దేవతల వద్దా ఉన్న వేదాలు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు నా చేతిలో ఓడిపోవాలి" అంజలి ఘటించాడు దుర్గముడు.

"అలాగే" అన్నాడు పితామహుడు.

బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరచిపోయారు. సంధ్యావందనం, హోమం, జపతపాలు, యజ్ఞాలు మొదలైన నిత్యనైమిత్తిక కర్మలన్నీ మానేశారు. యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు.

వేదాలు తన వశం కావడంతో
దుర్గముడు మహాబలవంతుడయ్యాడు.

అనతికాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చేసేదిలేక దేవతలు కొండ గుహల్లోనూ, ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

వంద సంవత్సరాలు గతించాయి.

ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ?
ఎవరికీ ఏమీ అంతుపట్టలేదు.
చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జననిని ప్రార్ధించారు.


"అంబా! శాంభవీ ! మాకు నువ్వే శరణ్యం. సకల భువనాలకు నువ్వే ఆధారం. నువ్వు లేని జగత్తు జడ పదార్ధం. మాతా ! ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది. ప్రజలకు తిండితిప్పలు లేవు. తాగటానికి నీళ్ళు లేవు. మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి. ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు. పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు. మా దోషాలన్నింటినీ పరిహరించి , ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉధ్ధరించు తల్లీ!"

అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది.
శ్యామల వర్ణంతో , శత (అనంత ) నేత్రాలతో, కోటి సూర్యప్రభలతో, శాకపాకఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది.

అమ్మ కన్నులు శ్రావణమేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి.


నదీనదాలు నిండిపోయాయి. వాపీ కూపాదులు జలసమృధ్ధాలైనాయి. తరువులు పుష్ప ఫలభరితాలైనాయి. ఓషధులు తేజోవంతములైనాయి. ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది.

ప్రజల మనసులలో మల్లెలు గుబాళించాయి. ఉల్లాసం వెల్లివిరిసింది.

దేవతలు ఆనందించారు. కొండగుహల్లోంచి, కారడవుల్లోంచి వచ్చి, విప్రులతోను మునులతోను కలిసి దేవిని నుతించారు.


"తల్లీ! నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది. అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్ధకం అవుతుంది. ఈశ్వరీ! మేమందరం ఆకలితో బాధపడుతున్నాం. ఇంకా నిన్ను ప్రార్ధించే ఓపిక మాకు లేదు. ఒక్కటిమాత్రం కోరుకుంటున్నాం. వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చెయ్యి తల్లీ !"


దేవి తాను తెచ్చిన శాకపాకాల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది. అందుకనే ఆమె ' శాకంభరి ' అయింది.


చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు.

ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీసమక్షములో వున్న దేవమునిగణాల మీద బాణాలు గుప్పించాడు.

పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళమీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డంపెట్టి, తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణీ, అతని సైన్యాన్నీ శరపరంపరలతో ముంచెత్తింది.


దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకులసమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, ఛిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే తీవ్రశక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది. ఆ శక్తులు ఒక్కపెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ, కరాళ నృత్యాలు చేస్తూ, అడ్డం వచ్చిన అసురసైన్యాన్ని అణచివేస్తూ , కదనరంగాన పదిరోజులపాటు విశృంఖలంగా విహారం చేశారు.

రాక్షస సైన్యమంతా నశించింది. చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు.

పదకొండో రోజున బాహాబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి. జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు.


అంబ అలిగి సారధిని, రధాన్నీ రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది.

వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది.

ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది. అమరులు ఆనందించారు.

శతాక్షిని వినయావనత వదనాలతో వినుతించారు.

ఆ తల్లి కదా తమ బాధలు చూసి , తమకోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు.

దుర్గముణ్ణి సంహరించినందువల్ల అంబకు ' దుర్గ ' అనే పేరొచ్చింది. 

 

Friday, October 8, 2010

ఆదిపరాశక్తి కధలు.

 

ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు. ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.


మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.


అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సం హరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు. అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.


మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.


యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది. ఆ చూపులకు మధుకైటభులు తమనుతాము మరచిపోయారు.


ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు. పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు. వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సం హరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు

 

Wednesday, October 6, 2010

దైవము . మరియు ,పెద్దలు మనకోసము ఎంతగా ఆలోచిస్తారో కదా..................

 

పూజల యొక్క విధివిధానములను పాటించటములో నాకు వచ్చిన సమస్యలు, సందేహములను గురించి ఇంతకుముందు వ్రాశాను కదండి.

శ్రీ లలితాసహస్రనామములలో సుఖారాధ్యా అనే నామమును గురించి విన్నాక ధైర్యం వచ్చిందండి.

అలాగే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ కూడా తెలియజేసారు కదండీ .... ఎవరయినా భక్తితో ........ కొద్దిగా జలమును గానీ, పుష్పములను గానీ, ఫలములను గానీ సమర్పించినా చాలు తాను స్వీకరిస్తానని. ..నిజంగా భగవంతుడెంతో దయామయుడు.


పెద్దలు ఒక అత్యుత్తమ సాధకుని గురించి ఎంతగా ఆలోచిస్తారో ఒక అతి సామాన్య భక్తుని గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.


ప్రపంచములోని ప్రతి ఒక్కరూ దైవానికి దగ్గరవ్వాలని వారి తాపత్రయము.

ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో విధముగా ప్రవర్తించవలసి ఉంటుంది.

అందుకేనేమో పూజల విధివిధానముల విషయములో పెద్దలు ఒక్కోదగ్గర గట్టిగా చెబుతారు. ఒక్కోసారి పట్టు సడలిస్తారు.


పూజానియమాలను ఉన్నదున్నట్లు చెప్పటము వల్ల శక్తి ఉన్నవాళ్ళు వాటిని పాటించి ఫలితములను శీఘ్రముగా పొందుతారు. అందరికీ అంత శక్తి ఉండదు కదా.
అటువంటి వారు నిరాశపడకుండా పెద్దలు మనకు ఎన్నో ఉపాయములను ఎందరో భక్తుల కధల ద్వారా తెలియజేసారు.


ఉదా..కొంతమందికి సంసార బాధ్యతల వల్ల ఎక్కువసేపు పెద్దపెద్ద పూజలు చెయ్యలేకపోవచ్చు. ధర్మవ్యాధుని కధ ద్వారా స్వధర్మమును ఆచరిస్తూ కూడా దైవమునకు దగ్గర అవ్వచ్చునని తెలియజేసారు.

కొంతమంది ఎన్నో పాపాలు చేసి తరువాత తప్పు తెలుసుకుని అయ్యో మనకు దైవ పూజ చేసే అర్హత ఉందోలేదో అనుకుంటారు. నిగమశర్మోపాఖ్యానము ద్వారా అలాంటివారికి కూడా దైవపరమయిన ఆశను కల్పించారు. వారు మంచి మార్గములోకి వచ్చే మార్గమును తెలియజేసారు.


ఇంకొంతమంది ఉంటారు. ఇవన్నీ విని ...... అయితే విధివిధానములు పెద్దగా పాటించనక్కరలేదులే ........ అనేసుకునే బధ్ధకస్తులూ ఉంటారు. విధివిధానములు సరిగ్గా పాటించాలి అని కొన్ని కధల ద్వారా గట్టిగా చెప్పటము వల్ల ఇటువంటివారి బధ్ధకమును పోగొట్టవచ్చు.


మళ్ళీ ఇవన్నీ విని జనం భయపడకుండా ఈ విధమయిన గొప్ప భక్తుల కధలను తెలియజేసారు.


ఒక భక్తుడు ..భక్తిపారవశ్యములో పడి దైవమునకు పండ్లకు బదులుగా తొక్కలను నివేదించారట..... ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఆ తొక్కలనే ఆప్యాయముగా స్వీకరించారట.


అప్పుడు .... ఆ భక్తుడు అయ్యో తొక్కలను సమర్పించానే అని బాధపడి మళ్ళీ పూజను విధివిధానముగా చేసి ఈ సారి జాగ్రత్తగా తొక్కలు కాకుండా పండ్లనే దైవమునకు నివేదించగా ... ఆ భగవంతుడు స్వీకరించలేదట.


ఎందుకంటే రెండవసారి చేసిన పూజలో భక్తి శాతము తగ్గినందువల్ల. దీనిని బట్టి అన్నిటికన్నా భక్తి ప్రధానమని తెలుస్తోంది.


ఇంకా నాకు ఏమని అనిపిస్తోదంటేనండీ, ఏదైనా సరిగ్గా పాటించటమువల్లా ఉత్తమ ఫలితములను శీఘ్రముగా పొందవచ్చును. అయితే ఒకోసారి అలా పాటించటము కుదరదు కదండి.


ఉదా..పూజ చేసేటప్పుడు షోడశోపచారములు సమర్పించే సమయములో రత్నఖచిత సిం హాసనము సమర్పించటము విషయములో పుష్పములు వేసి నమస్కరించి సరిపెట్టుకుంటారు గదా.....


అలాగే మధుపర్కములు సమర్పించే విషయములో కూడా చాలామంది అక్షతలు సమర్పించి సరిపెట్టుకుంటారు కదా...... ఇలాగే కొన్నికొన్ని ఇతరమయిన విషయములలో కూడా ఉన్నదున్నట్లు చేయటము కుదరక పోవచ్చు.


ఇలా ధర్మ సందేహములు వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించి ఏమి చేయాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తెలియకపోతే దైవంపైన భారం వేయటము ఉత్తమమయిన పధ్ధతి. ఆ తరువాత పెద్దలు చెప్పిన శ్రీ దైవాపరాధ క్షమాపణ స్తోత్రము చెప్పుకోవలెను. ....



ఇంతవరకు వ్రాసిన దానిలో తప్పులున్నచో దయచేసి క్షమించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

 

Monday, October 4, 2010

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.

 

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.


నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ? అనిపించిందండి. తరువాత నాకు జరిగిన అనుభవాల ద్వారా నాకు అనిపించినది చెబుతాను అండి.


కసారి.. గుడికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు జరగకుండా పూజ జరగాలనే ఆలోచనలోపడి ... ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోవటము జరిగేది. అంటే తీర్ధప్రసాదములు తీసుకుని బయటకు వచ్చాక తీరిగ్గా గుర్తు వచ్చేది.


ఏమంటే హుండీలో కానుకలు సమర్పించటము మరిచిపోవటమో, లేక తీసుకువెళ్ళిన పండ్లు సమర్పించటం మర్చిపోయి సంచీలో ఉండిపోవటమో .... కొన్ని ఉపాలయములు చూడలేదని గుర్తు రావటము.. ఇలాగన్నమాట.

ఇలా గుడిలోనుంచి ఒకసారి బయటకువచ్చాక .... మళ్ళీ తిరిగి వెళ్ళి ఉపాలయములు దర్శించుకోవటము ..... ఇలా చేసినప్పుడు చుట్టూ అక్కడివాళ్ళు నన్ను వింతగా చూస్తున్నట్లు నాకు అనిపించిందండి.

ఎందుకంటే ఇప్పుడే తీర్ధప్రసాదములు తీసుకుని వెళ్ళి మళ్ళీ ....అప్పుడే వస్తే ఎవరైనా కొంచెం ఆశ్చర్యముగా చూస్తారు గదండి. ( ఏమో వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు అలా అనిపించేది. )


ఇలా కొన్ని సార్లు జరిగాక నాకు ఏమని అనిపించిది అంటేనండి.......ఇలా ఎవరూ అతిగా చేయకుండా ...అంటే ఏదోఒకటి మర్చిపోయి గుడిలోకి బయటకు తిరగటం...... ఇలాంటివి ఆపటానికే పెద్దలు అలా చెప్పారేమోనని.


ఇలా ఒకటిరెండుసార్లు జరిగాక నాకు ఓపిక లేక భగవంతునితో దేవా ............ పూజలో జరిగే లోటుపాట్లకు క్షమించు..... నాకు శక్తి మేరకే చేయగలను . అని చెప్పేసాను..


అప్పటినుంచి ఏదయినా మర్చిపోయి ఇంటికి వచ్చేసినా భయపడటంలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ......... లోటుపాట్ల గురించి అతిగా ఆలోచించకుండా, ప్రశాంతముగా నా శక్తి కొలది ప్రవర్తించటము మంచిదని అలా ప్రయత్నిస్తున్నాను.


ఇంతగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటేనండీ ..... ఈ రోజుల్లో దేవుని గురించి తక్కువగా ...... విధి విధానముల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండే నా లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారేమోనని.... ఇలా వ్రాయాలనిపించిందండి.

ఇలాంటివారు అతిగా ప్రవర్తించి మూఢత్వముగా మారకూడదని నా ఆలోచన.

పూజలో జరిగే లోటుపాట్ల వలన వచ్చే పాపం కన్నా.... అతిగా ఆలోచనల్లో పడి భగవంతుని భక్తికి దూరమవ్వటము మరింత పాపమని నాకు అనిపించింది అండి.
 

 సాయి కూడా పూజ ఎట్టిదయినా బుద్ది ప్రధానమని తెలియజేసారట. రామకృష్ణపరమహంస వారు కూడా దైవముతో మనము చనువుగా ఉండాలి....... భయపడటమెందుకు అని అనేవారట.

 
.అసలు పూజ చెయ్యటము దైవం కొరకే ..... మనము అసలు లక్ష్యమునకు దూరము కారాదు

 

Friday, October 1, 2010

ఇదండీ నా ఉపవాస ప్రహసనం................. ...

 

జీవితములో ప్రతి పనిని పధ్ధతిగా చేస్తే మంచి ఫలితములు వస్తాయి కదండి. ఉదా.......ఆఫీసులో పనులు పధ్ధతిగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆడవాళ్ళు పధ్ధతిగా వంట చేస్తే వంట రుచిగా ఉంటుంది. వైద్యం పధ్ధతిగా చెస్తే రోగం త్వరగా తగ్గుతుంది. ఇలాగే దైవ పూజ విషయంలో కూడా పెద్దలు పధ్ధతులను ఏర్పాటు చేసారు.


కొంతకాలం క్రితం నేను పూజలు కొద్ది భయభక్తులతో చేయటం జరిగేది. అయితే వాటి గురించి విషయములు తెలిసేకొద్దీ ఎందుకో మరి ......... బాబోయ్ ! ఏదైనా లోటు జరిగితే ఏం కష్టం జరుగుతుందో ? అని ఒక భయం ఏర్పడింది.


దాంతో దేవునియందు భక్తిశ్రధ్ధ కన్నా పూజయొక్క విధివిధానముల గురించిన శ్రధ్ధ ఎక్కువయిందండి. అప్పుడు నాకు ఏమని అనిపించిందంటేనండి......... ఎక్కువ విషయములు తెలియకముందే ప్రశాంతముగా పూజ చేసుకున్నానేమోనని .


ఇప్పుడు మళ్ళీ ఏమి అనిపిస్తుందంటేనండీ పెద్దలు చెప్పిన విషయములను మనము సరిగ్గా అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకోవటం వల్ల ఇలా అనిపిస్తోంది అని.


ఉదా......ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఒక సందేహము వచ్చిందండి. ఇది చదివి మీరు ఏమీ అనుకోకూడదు. ఏమి జరిగిందంటేనండీ.........ఒక రోజున ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళ సందున ఒక మూల క్రిందటి రోజున మిగిలిపోయిన ఆహారపదార్ధం నాలుకకు తగిలిందండి. నేను బాగానే శుభ్రం చేసుకుంటాను మరి.


ఇక నాకు సందేహం వచ్చేసింది. ( నాకు రాకపోతేనే ఆశ్చర్యపడాలి ) ఉపవాసం అంటే అన్నం లాంటి పదార్ధములు తినకూడదు. మరి ఇప్పుడు నా ఉపవాసనియమము భగ్నం అయిపోయినట్లేనా ?ఏమి చెయ్యాలి ?సుబ్బరంగా భోజనం చేసేసి రేపు మళ్ళీ మొదలుపెట్టాలా ?లేక ఇలా కొనసాగించాలా ?ఒకవేళ రేపు కూడా ఇలా అయితేనో ? ఇప్పుడు ఏది దారి ? ( ఇది చదివి మీరు కొత్త అనుమానాలు పెంచుకోకండి దయచేసి )


ఇప్పటికి మీకు అర్ధం అయిపోయుంటుంది. నా చాదస్తం ఏ స్థాయికి చేరిందో ?దీనినే అతి అంటారేమో ?ఉపవాసం గురించి మన పెద్దల అసలు అభిప్రాయము ఇది కాదేమో ?ఇలా ఆలోచిస్తూపోతే నాకు దేవునియందు భక్తి మాట అటుంచి ఏమయిపోతానో అని అనిపించిందండి.......


.ఇంకా ఏమిటంటేనండి నక్షత్రము చూసినతరువాత భోజనం చేయటం ఒక పధ్ధతి కదా. ఎప్పుడు నక్షత్రము కనిపిస్తుందా ......ఎప్పుడు భోజనం చేస్తానా అని ఆలోచన ....... నాకయితే భోజనం చేస్తేనే దైవపూజ నాకుచేతనయినంత శ్రధ్ధగా చేయగలననిపిస్తుంది. ఇది నా గురించి మాత్రమే చెబుతున్నానండి.
.

కలియుగములో జీవులు అన్నగతప్రాణులని అంటారు. ( ఈ వాక్యం నేను సరిగ్గా వ్రాసానో లేదో తెలియదండి )


అయితే కఠిన నియమములను పాటిస్తూ అపారమయిన దైవభక్తి గలవారు ఎందరో ఉన్నారు. వారికి నా వందనములు. నాలాంటి సామాన్యులకు కొంతదైవభక్తి, దేహభ్రాంతి రెండూ ఉంటాయి కాబట్టి ఇలా రకరకముల ధర్మసంకటములు తరచూ వస్తూ ఉంటాయి.


సరే , ఇలా నేను దైవభక్తిని గాలికొదిలేసి నక్షత్రములు ఎప్పుడు కనబడతాయో అని ఆలోచిస్తూంటే పరీక్షలాగ ఆ రోజే మబ్బులు వచ్చి నక్షత్రములు కనబడేవి కావు.

నాకయితే మరుసటి రోజు వరకూ నక్షత్రములు కనబడేవరకూ వేచిఉండే ఓపిక లేదు. ఏదో ఒక దేవుని పటములో చంద్రుని చూసి ఉపవాసమును వదులుకోవటము జరిగేది.

ఒకోసారి నాకు ఆకలివల్ల కోపం, చిరాకు కూడా వస్తుంటాయి. దాంతో ఇంట్లో వాళ్ళమీద చిరాకు పడటము కూడా జరిగేది . ఇలా చేసి వాళ్ళలో పూజలు అంటేనే విరక్తి కలిగితే అది మరింత ప్రమాదం.

అప్పుడు నాకు నా శక్తిమేరకు నేను ప్రవర్తించటం మంచిది అనిపించిందండి.

ఇంతకీ నాకు ఏమని అనిపిస్తుందంటేనండి ఒకోసారి కొన్ని విధివిధానములను పాటించటము కుదరదు. అలా అని మనకు అనుగుణంగా వాటిని మార్చుకొమ్మని చెప్పటము నా ఉద్దేశ్యం కాదు.

మరీ కుదరనప్పుడు నా ఉపవాస ప్రహసనం లోలా అతి గా ఆలోచించకుండా విచక్షణగా ఆలోచించాలి. శక్తి చాలనప్పుడు దైవం పైన భారం వెయ్యటం ఉత్తమము.

ఉపవాస సమయములలో దైవానికి సమీపముగా మనస్సు ఉండటము ముఖ్యమని పెద్దలు కూడా చెబుతున్నారు.


అప్పుడప్పుడు ఇష్టపడి చేసినా,
కష్టపడి చేసినా ......... ఉపవాసము వల్ల చాలా ఉపయోగములున్నాయండి.


శరీరములోని మలిన పదార్ధములన్నీ పోయి ఆరోగ్యం వస్తుందట. ఇంకా పేదవాళ్ళ ఆకలి బాధ అందరికి తెలిసివస్తుంది. ఆహారం యొక్క విలువ అందరికీ తెలిసివస్తుంది.


ఇంకో విషయమండి పూజలప్పుడు అతిగా తినటం వల్ల పూజ మధ్యలో కాలకృత్యములకు వెళ్ళవలసి రావటం ఇలా జరగకుండా ఉపవాసం సహాయపడుతుంది. ఉపవాససమయములో పాలు ,పండ్లు తీసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. (ఇది నాకు ఆనందమును కలిగించే విషయం ).


నేను చిన్నప్పుడు ఎప్పుడైనా ఉపవాసం పాటించినప్పుడు బాగా నీరసం వచ్చేది. ఇప్పుడు అంత రాదు అలవాటయిందండి. నేను అప్పుడప్పుడు మాత్రమే ఉపవాసం ఉంటుంటాను.
ఇదండీ నా ఉపవాస ప్రహసనం
...