koodali

Wednesday, July 14, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు ....అంతా ధర్మమే..... పురాణములు ఎంతో గొప్పవి .... ఐదవ భాగము.........

ఓం శ్రీ సాయి.

హరిశ్చంద్రుల వారి కధ నుండి నాకు తోచిన ఇంకొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ కాలం వాళ్ళు కొంతమంది అనుకుంటారు..... సత్యవాక్పరిపాలన ఇంత గట్టిగా పాటించాలా అని ....

 ఆ కధలో .... కాశీ పండితులవారు తన భార్య సుకుమారి కాబట్టి, పిల్లలతో... పని అంతా చేసుకోలేకపోతోంది అని చెప్పి హరిశ్చందులవారి భార్యను, కుమారుని పరిచారకులుగా కొనుక్కున్నారు గదా..... భార్యను, కుమారుని అలా అమ్మటం చాలా దారుణమైన విషయమని హరిశ్చంద్రుల వారికీ తెలుసు. దానికి వారు ఎంతో బాధపడ్డారని కూడా మనం చెప్పుకున్నాం.


అయితే రాజంతటి వారే మాట తప్పితే ఇక ప్రజలు సత్యం అన్నది పాటించరని ........ ఇక ప్రజలందరు రోజూ అబధ్ధాలే చెబుతూ ఒక అబధ్ధం కప్పిపుచ్చటానికి ఇంకో అబధ్ధం ....... ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఇక ధర్మం నిలబడదు. అంతా అధర్మం, అవినీతి మయం అయిపోతుంది. ఇన్ని ఆలోచించి ఆయన ప్రజలనందరిని పాపాత్ములను చేయకుండా ఉండటానికే తన కుటుంబం అష్టకష్టాలు పడినా భరించారు. అప్పటి పాలకులు ప్రజలను అలా చూసుకునేవారు.


ఇంకో విషయమండి. ప్రజలు చేసే పాపంలో పాలకులకు ఇంతని వాటా వస్తుందట. ఆ ప్రజలు చేసే పాపం పాలకులను పరలోకంలో కూడా పట్టి పీడిస్తుందట. . అందుకే అప్పటి మంచి పాలకులు ప్రజలు పాపపు పనులు చెయ్యకుండా పనికట్టుకుని చూసుకునేవారట. ఇది పెద్దలు చెప్పిన విషయం. 


 ఇంకోటి ,అసలు హరిశ్చంద్రులవారు విశ్వామిత్రుల వారికి కావాలని రాజ్యాన్ని దానం చెయ్యలేదు.


ఒకప్పుడు హరిశ్చంద్రుల వారు ఆపదలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు మారు వేషములో ఆయనను రక్షించారు. ఆ సంతోషములో ఆయన ఏదైనా కోరుకో ఇస్తానని అంటే విశ్వామిత్రుల వారు ఇంత పెద్ద కోరిక కోరుకున్నారు. దానికి వేరే కారణాలున్నాయని మనకి తెలుసు కదా....అది ఇంకో కధ.


హరిశ్చంద్రుడు ఆ తపస్వి ఏదో సాధారణ దానం అడుగుతారని అనుకున్నారు గాని ఇదంతా ఊహించలేదు. ఒకోసారి అంతే. ఇలాగే జరుగుతుంది. అయితే విశ్వామిత్రుల వారి వల్ల హరిశ్చంద్రునికి మంచే జరిగింది. వారి పేరు ఈ నాటికి మనము చెప్పుకుంటున్నాము.

అందుకే అందరూ మంచిపనులు చేస్తూ దైవాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ మనము రక్షించబడతాము.. 


No comments:

Post a Comment