koodali

Friday, July 30, 2010

పురాణములు, ఇతిహాసములు, మరియు ప్రాచీన గ్రంధములు ఇవన్నీ చాలాగొప్పవి.....అందులోని ధర్మమును తెలుసుకోవటం మన ధర్మం.

ఓం.
సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.


శ్రీకృష్ణార్జునులకు వందనములు.

ఆ ఆదిదంపతులైన శ్రీమన్మహాదేవీశ్రీమన్మహాదేవులు ఇద్దరూ వేరువేరుకాదట . వారు అర్ధనారీశ్వర తత్వంలా ఒకరేనట. నన్ను క్షమించాలి. ఈ విషయం వివరించటానికి నాకు శక్తి చాలదు. దేవతలు రాగద్వేషాలకు అతీతులు కారట. త్రిమూర్తులు సత్వ, రజో, తమో గుణ ప్రధానులు. ఆ పరమాత్మయే రాగద్వేషములకు అతీతులు. ఇంకా శ్రీ దేవీభాగవతములో ఎన్నో విశేషములు చెప్పబడ్డాయి. పరమాత్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.


శ్రీకృష్ణులవారిని గురించి కొన్ని విషయములు చెప్పుకుందాము. ఆయన శ్రీమహావిష్ణువు అవతారం. ఆయన అష్టభార్యలగురించి నాకు ఏమనిపిస్తుందంటే వారు అష్టలక్ష్మీదేవీ అవతారములకు సంకేతమేమోనని. కొంతమంది అయనయొక్క పదహారువేలమంది భార్యలగురించి అపార్ధం చేసుకుంటారు. దానికి ఒక కారణం ఉంది.


పూర్వం ఒకానొకప్పుడు శ్రీకృష్ణులవారు, అర్జునులవారు నారాయణుడు, నరుడు గా అవతరించిన రోజులలో ఇద్దరూ గొప్పతపస్సు చేస్తున్నారు. అప్పుడు ఇంద్రుడు వారివద్దకు అప్సరసలను పంపించారు. ఇక్కడ నేను అనుకోవటం ఇంద్రుడు తపస్వుల ఇంద్రియనిగ్రహాన్ని పరీక్షిమిచుట కొరకు, ఇంకా వారు ఇంద్రియములను ఎంతవరకూ జయించారు ఇవన్నీ పరీక్షించటానికి అలా వారిని పంపిస్తారేమోనని అనిపిస్తుంది.


సరే ఆ అప్సరసలు ఎంతోకాలం అలా ఆడి, పాడినా నరనారాయణులు అలా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూనేఉన్నారట.. కొంతకాలం తరువాత వారికివారే కండ్లు తెరచి అంతాగ్రహించి ............. ఆడి పాడి అలసిన అప్సరసలతో వారిని వారిలోకం తిరిగి వెళ్ళమనీ, వెళ్ళేముందు తమ ఆతిధ్యం స్వీకరించివెళ్ళవలసిందిగా మర్యాదకోసం కోరారట.


అప్పుడు నారాయణుడు తన తపశ్శక్తితో కొత్త అప్సరసలను, ఊర్వశిని కూడా సృష్టించి వారికి అతిధిమర్యాదలు జరిపారు. వీరి తపశ్శక్తికి , నిగ్రహశక్తికి ఆ అప్సరసలు ఆశ్చర్యపడి వారు తమలోకం వెళ్ళబోమని, తమందరిని వివాహం చేసుకోవలసినదిగా వరమడగటం జరిగింది.


అప్పుడు నారాయణుడు ఎంతో ఆవేదన చెంది వారిని శపించబోగా నరుడు కోపం మరింత అనర్ధకమని వారించటం జరుగుతుంది. అప్పుడు నారాయణుడు ఈ జన్మలో వారిని వివాహమాడటం జరగదని, భవిష్యత్తులో అది జరుగగలదని తెలియపరిచి వారిని పంపివేస్తారు.


ఆ తరువాత ఆయన ఎంతో ఆవేదనతో తాను ఎంతో తపశ్శక్తిని వ్యయపరిచి అప్సరసలను సృష్టించటం, ఆతిధ్యమివ్వటం , వరం ఇవ్వవలసిరావటం ,వీటన్నిటికి ఎంతో బాధపడి తాను అసలు వారిని పట్టించుకోకుండా గౌరవమర్యాదలు చెయ్యకుండా మౌనంగా ఉండిపోతే ఎంతబాగుండేది... వారి మానాన వారు వెళ్ళి పోయేవారు కదా అనుకుంటారు.


అదిగో.....ఆవిధముగా పదహారువేలమందిని శ్రీకృష్ణుల వారు వివాహం చేసుకొనవలసి వచ్చింది.దీని గురించి నాకు ఏమని అనిపిస్తుంది అంటే ....ఎవరైనా ఇలా కొన్ని సందర్భాలలో మర్యాదలు అంటూ మొహమాటాలు పోకుండా........... ముభావంగా వ్యవహరించటమే అందరికీ శ్రేయస్కరమని.....


ఇంకా ఒకసారి వైకుంఠములో శ్రీలక్ష్మీదేవికి, సవతులతో సంవాదం జరిగిన సందర్భములో విష్ణుమూర్తి లోకమునకు ఒక ఉపదేశం చేస్తూ....పురుషునికి బహుపత్నులు ఉండటం ధర్మ విరుధ్ధమని కూడా తెలియచేశారు.


ఒకప్పుడు శ్రీకృష్ణులవారు సంతానార్ధియై శివుని కొరకు తపస్సు చేయటం జరిగింది. అంటే రుక్మిణి దేవికి వారికి సంతానం కలిగి తనకు ఇంకా సంతానం లేనందుకు జాంబవతీదేవి కృష్ణుని ప్రార్ధించటం జరిగిందట . (  జాంబవతీ దేవి యేనా కాదా అని నాకు సరిగ్గా గుర్తులేదు. దయచేసి క్షమించాలి.)

అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయి సంతానవరాన్ని అనుగ్రహించటం జరుగుతుంది. దానికి ముందు కృష్ణులవారు వారితో తాను వారిని లౌకికమైన కోరికల కోసం ఆరాధించినందుకు బాధను వ్యక్తపరచటం జరుగుతుంది.


సరే ఆ తరువాత పార్వతీపరమేశ్వరులు కృష్ణులవారితో భవిష్యత్తులో జరగబోయే సంగతులు తెలియచేస్తారు. అందులో యాదవుల యొక్క నాశనంగురించి ,ఇంకా పదహారువేల యాభై మంది భార్యలు దొంగలవల్ల అవమానములు పొందటం ఇలా ఎన్నో విషయములు తెలియజేస్తారు.


ఇక భారత యుధ్ధములో అధర్మం జరిగిందని కొందరంటారు. ఇంతకుముందు ఒకసారి మనం ధర్మం అనేది సందర్భమును బట్టి మారుతుందని అనుకున్నాము కదండి.


అంటే ఉదా.....మీ స్నేహితుడు ఒకసారి మీ ఇంటికి వచ్చాడని అనుకుందాము. ఆయన చాలా మంచి వ్యక్తి. మీ ఇద్దరు లోపల మాట్లాడుకుంటున్నారు. ఇంతలో బయట పెద్దగా మీస్నేహితుడిని పిలుస్తూ , కొంతమంది ఆయన శత్రువులు మీఇంటిముందు గోల చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు?


మన పెద్దలు అసత్యం చెప్పటం పాపం అన్నారు కదా అని .... ఆయన ఇక్కడే ఉన్నాడని వారికి అప్పగిస్తారా ? అప్పుడు మీరు ఏమి చేస్తారంటే అబధ్ధం చెప్పనవసరంలేదు అప్పటికి యుక్తియుక్తముగా మాట్లాడి, ఏదో విధముగా తెలివిగా తప్పించి ఆయనను కాపాడుతారు. అదే కదా అప్పటికి ధర్మం.


శ్రీకృష్ణుల వారు ధర్మపరులైన పాండవులను ఇలాగే రక్షించారని నా అభిప్రాయం. మనము ఆయనను స్నేహితునిగా, లేక గురువుగా ఎలాభావిస్తే అలా ఆయన మనలను రక్షిస్తారు.


ఇక శ్రీ భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .అది అందరికి తెలిసిన విషయమే.

ఇంకా ధర్మాత్ములైన భీష్మాచార్యులు,, ద్రోణాచార్యులు, కర్ణుడు వీరు అలా జీవితాలు చాలించటం బాధాకరమే, కానీ మరి వారు అధర్మ పక్షములో చేరటంవల్ల అధర్మపరుడైన దుర్యోధనుడినికి శక్తి పెరుగుతోంది కదామరి. ... అయితే ఆ పెద్దలు అలా వారి పక్షాన ఉండటానికి వారి కారణములు వారికి ఉన్నాయి లెండి.


ఇక భారతయుధ్ధం తరువాత శ్రీకృష్ణులవారు, ,వారి అష్టభార్యలు అందరి అవతారసమాప్తి జరిగింది.తరువాత ఇన్నో సంగతులు జరిగాక దొంగలు వారి పదహారువేలమంది భార్యల ఆభరణములు దోచుకుంటారు. నేను అనుకోవటం అప్సరసలు ఒక తపస్విని అడగకూడని వరం అడిగినందుకే జన్మలో ఆఖరికి అలా అవమానించబడ్డారేమోనని..


ఇక కొన్ని విశేషాలు చెప్పుకుంటే శంకరుడు పార్వతీదేవి సలహాతో లోకహితం కొరకు విషమును కంఠములో దాచుకున్నారు. మరి ఈనాడు మనము మనసుఖం కోసం లోకాన్ని విషంతో నింపుతున్నాము.


ఇంకా ప్రాచీన గ్రంధములనుండి మనము ఎన్నో సంగతులు నేర్చుకోవచ్చు. ఒకప్పుడు కైలాసములో విఘ్నాధిపత్యం కొరకు శివుడు వినాయకుడు, కుమారస్వామికి మధ్యన ఒక పోటీ పెట్టిన కధ మనకు తెలుసుకదా....అందులో శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకములలో అన్ని పుణ్యనదులలో స్నానం ఆచరించి ముందుగా తిరిగి నా వద్దకు వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని అనటం జరిగింది.


అప్పుడు కుమారస్వామి వెంటనే బయలుదేరి వెళ్ళగా వినాయకుడు తన అసక్తతను తల్లిదండ్రులవద్ద తెలిపి బాధపడినప్పుడు వారు కుమారా ! ఒక్కసారి నారాయణమంత్రం జపించినంతమాత్రమున మూడువందల కల్పములు సకల పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం లభిస్తుంది. ఒక్కసారి జననీజనకులకు ప్రదక్షిణ చేసినంతనే మూడులోకములు చుట్టివచ్చినంత ఫలితం కలుగుతుందని బోధించగా వినాయకుడు అలా ఆచరించి ఆ పోటీలో గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. ఆతరువాత కుమారస్వామి కూడా ఈ రహస్యమును తెలుసుకుంటారు.


దీన్నుంచి నాకేమనిపించిందంటే మనము ఓపిక ఉండి తీర్ధయాత్రలు అలా చేయటం మంచిదేగాని ఒకవేళ కుదరనప్పుడు బాధపడక దైవాన్ని మనశక్తిమేరకు ప్రేమభక్తితో పూజించినా దైవం దయ లభిస్తుంది అని. ఇంకా మనము ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కదల ద్వారా మనము తెలుసుకోవచ్చు .


1. రావణాసురుని దుష్ట బుధ్ధికి సహకరించి వారి సంతానం మరణించారు.


2. దైవాన్ని ఎదిరించమన్న తండ్రి మాట వినక ధర్మమార్గములో నడిచి  దైవసహాయముతో ప్రహ్లాదుడు రక్షించబడ్డారు.


3.చెడ్డవాడైన వరునితో పెద్దలు వివాహం నిశ్చయించటం .... తరువాత రుక్మిణిదేవి శ్రీకృష్ణులవారిని వివాహమాడటం అందరికి తెలిసిన కధే. .

4. పెద్దలకు తెలియకుండా దుష్యంతునితో సంతానము పొందిన శకుంతల పడ్డ కష్టాలు మనకు తెలిసినవే.


5.అన్నదమ్ములు ఐకమత్యముగా ఉంటే వచ్చే లాభములు శ్రీరాముడు,లక్ష్మణుడు,భరతుడు,శత్రుఘ్నుడు కధ ద్వారాతెలుసుకోవచ్చు.


6.అన్నదమ్ములు వైరభావం కలిగిఉంటే వచ్చే ఫలితములు వాలి,సుగ్రీవుల కధ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇలా ఎన్నో మనం తెలుసుకోవచ్చు.

ఇంకా నాకు ఏమని అనిపిస్తుందంటేనండి......ఎంతో విజ్ఞానం కూడా ప్రాచీన గ్రంధములలో ఉన్నదని....ఉదా.... రోజుల్లో స్టెంసెల్స్ అని మూలకణముల ద్వారా ఎన్నో ప్రయోజనముల గురించి నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విష్ణుమూర్తి బొడ్డు నుండి పద్మం ద్వారా బ్రహ్మ జన్మించి సృష్టిని చేస్తారు అంటే...

..ఒకవేళ మూలకణములు వీటి ప్రయోజనములు, వాటిద్వారా కొత్త సృష్టిని సృష్టిచవచ్చు ఇవన్నీ ఇలా సంకేతముగా కూడా నాకు అనిపించింది. పిల్లలు పుట్టినప్పుడు వచ్చే బొడ్డుత్రాడు నుండి ఈ మూలకణములు సేకరిస్తారు. ఇంకా బ్రహ్మ బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టారు ఇలా కూడా మూలకణములు అన్నవి వారికి తెలుసునని నాకనిపించింది.చాలా త్వరగా వ్రాయవలసి వస్తోంది.క్షమించండి.


ఇంకా త్రిమూర్తులు వారివారి పదవీబాద్యతల ప్రకారం వారి వస్త్రధారణ ఉన్నట్లు కూడా నాకనిపించింది.

సృష్టిని చేసే బ్రహ్మ ఈ నాటి శాస్త్రవేత్తల వలె గడ్డం కలిగిఉండటం ...


మహావిష్ణువు స్థితి కి సూచనగా ఆభరణములు ధరించుట ఇలా అలంకారప్రియులు.


పరమశివుడు లయకారత్వానికి చిహ్నమైన భస్మమును ధరించుట, ఇంకా అభిషేకప్రియులు. ఇలా మనపెద్దలు ఎంత బాగా చెప్పారు... ఇలా ఎన్నో విషయములు మనము తెలుసుకుని ఆచరించవలెను. అపార్ధం చేసుకోవటం తప్పు.


శ్రీ గాయత్రీ మాతకు వందనములు.

ఇక ఇవన్నీ నేను వ్రాయటం జరిగింది అని చెప్పుకుంటే అంతకన్నా అహంకారం, హాస్యాస్పదమైన విషయం మరి ఇంకొకటి ఉండదు. సంస్కృతం కూడా చదవటం రాదు నాకు. వేదములు అసలే తెలియదు. నేనసలు ఇంత క్లిష్టమైన టాపిక్ ఎందుకు తీసుకున్నాను. అని ఎంతోబాధపడ్డాను.


ఒకోసారి ఏమి వ్రాయాలో తెలియక బెంబేలెత్తి ఇక నావల్లకాదు బాబోయ్ ... ఇక నీదే భారం అని దైవం పై భారం వేసేసి చేతులెత్తేసినప్పుడు .... నా యందు దైవం జాలిపడి మాత్రం వ్రాయటానికి సహాయం చేసినందుకు దైవమునకు నేనెలా కృతజ్ఞతలు తెలుపుకోగలను?అంతా భగవంతుని దయ.


చిన్నప్పటినుంచి పెద్దలు, పిన్నలు ద్వారా తెలుసుకున్నవి ,ఇంకా దత్తాత్రేయుల వారు చెప్పినట్లు ఎన్నో జీవులనుండి కూడా మనము ఎన్నో విషయములు నేర్చుకోవచ్చు. ఇంకా నాకు సహాయపడిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి.


************
వ్రాసిన విషయాలలో  ఏమైనా పొరపాట్లు ఉంటే, అవి నేను చేసినవి గాను, ఒప్పులను భగవంతుని దయగాను పాఠకులు గ్రహించవలెనని నా మనవి.
.పరమాత్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అంతా భగవంతుని దయ.


పరమాత్మార్పణమస్తు...........

 

Wednesday, July 28, 2010

పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ ఎంతో గొప్పవి........

 

ఓం.

శ్రీ కృష్ణార్జునులకు నమస్కారములు.

సుధాసముద్రములో, మణిద్వీపములో , చింతామణి గృహములో నివసించే ఆ ఆదిపరాశక్తి కి {పరమాత్మ {శ్రీ మన్మహాదేవిశ్రీమన్మహాదేవులు} నమస్కారములు.


ఆమెయే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సృష్టి, స్థితి, లయములనే పదవీబాధ్యతలను అప్పగించారట.


ఒకప్పుడు ఈ విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలను, అందులో ఎంతోమంది బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను చూసి మన త్రిమూర్తులు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారట. జీవులకు మోహబంధనాలను కలిగించినా, మోక్షాన్ని అనుగ్రహించినా ఆ తల్లి లీలయేనని పెద్దలు చెబుతున్నారు . లోకంలో ఎప్పుడయినా దేవతలకు కూడా లొంగని బలవంతులైన రాక్షసులను ఆమెయే సంహరిస్తుంది. . అలా ఎంతోమంది దానవులను సంహరించి ఆ తల్లి లోకాలను రక్షించింది. . ఎన్నో విషయములు శ్రీ దేవీ భాగవతములో చెప్పబడ్డాయి.


ఓకప్పుడు భూమిపై పాపాత్ములు పెరిగిపోయి భూభారం పెరిగిపోయినప్పుడు ఆ పరమాత్మ ఒక ప్రణాళిక ప్రకారం కధను నడిపించి మహాభారత యుధ్ధం ద్వారా భూభారాన్ని తగ్గించటం జరిగిందట. .

ఆ కధలలో ఎన్నో వింతలు, విశేషాలు,...... ,ఎన్నో మనస్తత్వాలు.... .....లోకంలో ఉండే విశేషాలన్నీ అందులో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు.


వ్యాస భగవానుడు...విష్ణు మూర్తి అవతారమని పెద్దలు చెబుతున్నారు. వీరు తమ తల్లి ఆదేశం మేరకు మాత్రమే వంశరక్షణ, రాజ్యరక్షణ కోసమని అంబిక, అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించారు. అయితే ఆ తర్వాత తమ అధర్మ ప్రవర్తనతో ధృతరాష్ట్రులవారి సంతానం అలా అయ్యారు. పాండురాజుల వారి జీవితంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి కదా..... ఇక విదురులవారు గొప్ప వేదాంతి.


ఇక పాండు రాజు ఆదేశించగా కుంతీదేవి, మాద్రిదేవి దేవతల ద్వారా సంతానాన్ని పొందారని పెద్దలు చెబుతున్నారు. మనలో చాలామంది ఈ సంఘటనలను అపార్ధం చేసుకోవటం తప్పు. ఈ రోజుల్లో కూడా కొంతమంది భార్యా,భర్తలు సంతానం లేనివారు స్పెర్మ్ బ్యాంకుల సహాయంతో కృత్రిమపధ్ధతులలో సంతానాన్ని పొందుతున్నారు కదా....నేను వారిని, పోల్చటం లేదు. విషయం అర్ధం అవటానికి చెప్పానండి.


సూర్య భగవానుని వల్ల కుంతీదేవి కి కర్ణ జననం జరిగిన సందర్భంలో ఆమె కన్యాత్వానికి భంగం రాకుండా సంతానాన్ని పొందారని పెద్దలు చెబుతున్నారు. దేవతలుగాని, మహర్షులు గాని తమ అధ్బుతమైన మహత్తు ద్వారా సంకల్ప మాత్రంచేతనే వరాలను, సంతానాన్ని అనుగ్రహించగలరు. దైవభక్తి, తపశ్శక్తి, యోగా ఇలాంటి వాటి ద్వారా గొప్పశక్తి కలుగుతుందట. ,


ఈ రోజుల్లో కూడా కొంతమంది యోగా సాధకులు నీటిపైన పడుకోవటం మనం చూస్తున్నాము. కరాటే చేసేవారు కూడా ఒక్క చేత్తో బండరాళ్ళను పగులకొట్టడం చూస్తూనే ఉన్నాము. ఇలా లోకంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం ? అని మనకి అనిపించే విషయాలు ఎన్నో సృష్టిలో ఉన్నాయి..



కొద్దిగా యోగా చేసే వారికే ఇన్ని శక్తులు ఉన్నప్పుడు మరి దేవతలు, మహర్షులకు ఎంత శక్తి ఉంటుంది....... ఇంకా కొన్ని మొక్కలు పువ్వులు పూయటం, కాయలు కాయటం, , విత్తనం, తద్వారా కొత్త మొక్కలు ఇలాంటి ఫలదీకరణం అనే ఒక సైకిల్ లేకుండా ఒక కొమ్మగాని, ఆకు గాని తుంచి నేలలో పాతినా అందులోనుంచి కొత్త మొక్క వస్తుంది. ఇది చూడటానికి సామాన్యంగా అనిపించినా ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టిలో ఇలా ఎన్నో రకాల సంతానోత్పత్తి పధ్ధతులున్నాయి.



ఇంకా కొన్ని సంఘటనలలో చేతితో మంత్ర పూర్వకముగా నాభిని స్పృశించి సంతానాన్ని అనుగ్రహించటం లాంటివి చదివినప్పుడు ఆ రోజుల్లో లాప్రోస్కోపీ లేక లేజర్ సర్జరీ ఇలాంటివి ఉండేవా అని అనిపించినా వారు తమ తపశ్శక్తితో సంతానాన్ని అనుగ్రహించగల గొప్ప మహిమ గలవారు.


ఒకోసారి ఈ కధలు వింటుంటే ఆ రోజుల్లోనే ఎంతో అబివృధ్ధి చెందిన విజ్ఞానం ఉండేదని అనిపిస్తుంది. అందుకే మనము విషయం సరిగ్గ తెలియనప్పుడు తొందరపడి పెద్దలను అపార్ధం చేసుకోకూడదు. . .


ఇక కొంతమంది ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఆడి ఓడటం అన్యాయమని అంటారు. నిజమే ఇది చాలా బాధాకరమైన విషయమే. అయితే ఆయన రాజ్యాన్ని, తన తమ్ములను కూడా ఓడిపోయారు.



మనకు ఒకోసారి కొన్ని ధర్మ సందేహాలు వస్తూఉంటాయి. ఉదా....అధర్మంగా ప్రవర్తించేవారు ఎప్పుడైనా జూదం ఆడటం ఇలాంటి పనులు చేస్తే ........... మనం ఠకీమని ఏమంటామంటే వారు దానికి తగ్గ ఫలితాన్నీ అనుభవిస్తారు అని. కానీ ఎప్పుడూ ధర్మబధ్ధంగా ప్రవర్తించేవారు ఇలా వ్యవహరిస్తే దాని ఫలితం ఎలా ఉండబోతుందనే సందేహం మనకు కలుగుతుంది.


ఒకోసారి న్యాయం చెప్పే న్యాయమూర్తులకు కూడా ఇలాంటి ధర్మసంకటం కలగవచ్చు. అంటే వారు గొప్పవారు కాబట్టి ఆ చెడు ఫలితాన్ని అనుభవిస్తారా? లేక క్షమించబడతారా?....అని.


ఈ కధ ద్వారా మనకు ఏమని తెలుస్తుందంటే ఎవరయినా ఎంతగొప్పవారయినా సరే ...... ,ఎలాంటి పనిచేస్తే అలాంటి ఫలితాన్నే వారు అనుభవించాల్సి ఉంటుందని. పాండవులు వనవాసాన్నీ అనుభవించారు. అయితే వారు ఆ కాలాన్ని అతిధి, అభ్యాగతుల సేవలు, ఇంకా ధర్మకార్యాలతో గడిపారు.


జీవుల పాప,పుణ్యాలను సరిచూసే సమవర్తి అయిన ఆ యమధర్మ రాజు అంశతో జన్మించిన ధర్మమూర్తి అయిన ధర్మరాజులవారికి ఈ పాప, పుణ్యాలు తెలియకుండా ఉండవు కదా.......


అయితే ఇలాంటి పాత్రలద్వారా మన జీవితంలో ఎదురయ్యే ధర్మసందేహాలకు సమాధానాలు తెలియచెప్పటం, జూదం ఆడటం లాంటి పనులవల్ల జీవితంలో ఎదురయ్యే కష్ట,నష్టాలను ........,మరియు ........ ఒక రాజు ఇలా చేస్తే అతని రాజ్యంలోని ప్రజలు కూడా దుర్యోధనుని లాంటి వారి పాలనలో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది .... ఇలా అన్ని విషయాలను పెద్దలు మనకు తెలియచేస్తున్నారు.


ఇవన్నీ చెప్పి మనల్ని భయపెట్టడం పెద్దల ఆలోచన కాదు. రాబోయే తరాలవారి యందు ప్రేమతో ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి, లేకపోతే దుర్యోధనుల లాంటి ద్వారా కష్టాలను అనుభవించాల్సి వస్తుందని ఆప్యాయంగా మనలను హెచ్చరిస్తున్నారు అంతే.


ఇక ద్రౌపదీ దేవి తాను కావాలని ఏమీ పాండవులు అందరినీ వివాహం చేసుకోలేదు కదా. అది అలా జరిగింది అంతే. కానీ పాపం ఆమె ఎందుకనో అలా పుత్రా శోకాన్ని అనుభవించవలసి వచ్చింది.


పాండవులు, ద్రౌపది వీరందరూ ఎన్ని కష్టాలను అనుభవించినా ధర్మ మార్గాన్ని వీడలేదు. అందుకే భగవానుడైన శ్రీ కృష్ణులవారు వారికి అండగా నిలబడ్డారు. . . ..

తప్పులను ఆ దైవం దయచేసి క్షమించాలని నా ప్రార్ధన..... ...
.అంతా భగవంతుని దయ..


Monday, July 19, 2010

పురాణేతిహాసములలో ఉన్నది అధర్మం కాదు....అంతా ధర్మమే... పురాణములు ఎంతో గొప్పవి... ఏడవ భాగం....

ఓం.

శ్రీ
ఆంజనేయ స్వామికి నమస్కారములు.

రామాయణము , మహా భారతము ఎంతో గొప్ప గ్రంధములు. మన పురాణములు, ఇతిహాసముల ద్వారా మనము ఎన్నోవిషయములను నేర్చుకోవచ్చును. విష్ణుమూర్తి ధరించిన అవతారముల ద్వారా సృష్టి యొక్క పరిణామక్రమము , దానియొక్క లక్షణములను కూడా తెలుసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.


ఉదాహరణకు మత్శ్యావతారము ............ భూమిపైన మొదటి దశ అయిన నీరు మాత్రమే ఉన్న దశకు, కూర్మావతారము ..... కూర్మము నీటిలోను, నేలమీదజీవించే జీవి కాబట్టి ,అలాంటి దశకు సంకేతముగాను ఇలా చెప్పవచ్చునట. రామాయణములో ఎన్నో సామాజికసందేశాలున్నాయి.


ఇక సీతా రాములు అంత అవతార మూర్తులైనా ఎందుకు ఇన్ని కష్టములను అనుభవించారో అనిమనకు అనిపిస్తుంది.

ఒకసారి దేవతలకు, రాక్షసులకు మద్య యుధ్ధం జరిగిందట. అప్పుడు కొంతమంది రాక్షసులు భృగుమహర్షి యొక్క భార్యను శరణు వేడారట. అప్పుడు ఆమె వారికి అభయాన్ని ఇచ్చిందట. ఆ సమయములో లోకహితంకోసం శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు భృగు పత్నిని సంహరించి ఆ తరువాత రాక్షసులను సంహరించవలసి వచ్చింది. . .


ఆతరువాత భృగు మహర్షి భార్యను తన తపశ్శక్తితో బ్రతికించి ఆ కోపములో శ్రీ మహావిష్ణువును శపించారు. కొంతకాలంభార్యా వియోగం అనుభవించాలని. అప్పుడు విష్ణుమూర్తి త్రేతాయుగములో అది జరుగగలదని తెలియచేసారట.


ఆ విధముగా సీతాపహరణం.. ద్వారా ఆ శాపాన్ని వారు అనుభవించారు. లోక క్షేమంకొరకు సీతారాములు ఆ కష్టములను భరించారు.


అసలు రావణాసురుడు కూడా వైకుంఠములోని ద్వారపాలకులయినజయవిజయులలో ఒకరే . గొప్ప విష్ణు భక్తులు. శాపవశాత్తు వారు రావణునిగా జన్మించారు.


సీతాదేవిని రక్షించేక్రమములో రాముల వారు ఎంతోమంది రాక్షసులను సం హరించారు. అప్పుడు జరిగిన యుధ్ధం వల్లనే రావణాసురునితోపాటు ఆయన అనుచరులయిన ఎంతోమంది రాక్షసులను చంపివేయగలిగారు.


సీతాదేవిని అన్వేషించే కాలంలోఎంతోమంది భక్తులను, మంచివారిని కూడా ఉధ్ధరించారు.. ఉదాహరణకు అహల్యాశాపం విషయములో .......... భవిష్యత్తులో విష్ణుమూర్తి అవతారం ధరించివచ్చిన పిమ్మట ఆమెకు శాపవిమోచనం కలుగుతుందని తెలపడం ద్వారా ఈ సంఘటనలన్నీ ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరుపబడ్డాయని మనము తెలుసుకోవచ్చు. .



ఇక ... ఆంజనేయస్వామిఆయన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంత గొప్ప పాత్ర ఆయనది. ఆయన ద్వారా దాస్యభక్తి, ఇంకా ఇలాంటిఎన్నో గొప్ప విషయములు మనము తెలుసుకోవచ్చు. గొప్ప భక్తి వల్ల భగవంతుని దయ పొందవచ్చని శబరి పాత్ర ద్వారామనము తెలుసుకోవచ్చు.జటాయువు ఇలా ఎన్నో గొప్ప పాత్రలు........


లోకంలో ఉండే రకరకముల వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగేసంఘటనలు, పరిణామములు ...... ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములు పెద్దలు మనకుపురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు...


.రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తానురాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు. సీతారాములు ఆదర్శ దంపతులు.
వారు అంత ధర్మమూర్తులు కాబట్టే వారి కుమారులు లవకుశులు చక్కగా రాజ్యాన్ని పాలించారు.

మరి రావణుని సంతానం అలా అయ్యారు.


శ్రీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట. సరే


సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ  ? సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?


ధర్మం అధర్మం పై విజయాన్ని సాధించిన కధ ఇది. .......

రామతత్వం..రావణతత్వం పై విజయాన్ని సాధించిన కధ ఇది......

అందుకే రామాయణ పారాయణం ఎంతో శుభకరమని పెద్దలుతెలిపారు......


 ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ఆత్మహత్యలకు పాల్పడటం, లేక అధర్మాన్నిఆశ్రయించటం ఇలాంటి పనులు చేయకుండా ఈ కధలను గుర్తు తెచ్చుకుని అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలుఅనుభవించారు మనమెంత అని ధైర్యము తెచ్చుకోవాలి.


వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలాసాధించారో మనమూ నేర్చుకోవాలి. ఎక్కడయినా, ఎప్పటికయినా ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవచ్చు. . .
. . . అంతా భగవంతుని దయ.



Friday, July 16, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు......అంతటా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి ఆరవ భాగం...........

 

ఓం, శ్రీ మహా విష్ణువుకు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి బ్రహ్మ దేవునికి సకల దేవతలకు నమస్కారములు.

ఇప్పుడు సీతారాముల కధలోని విషయములు కొన్ని చెప్పుకుందామండి. రామాయణం లోని పాత్రలు, వారి అవతార విశేషాలు, వారి పూర్వ కర్మ విశేషములు, శాపములు ఇవన్నీ చాలా పెద్ద కధ . ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని పెద్దలు చెబుతున్నారు కదండి. అదంతా పెద్ద కధ.


ఇక్కడ మనం సీతమ్మ వారి అగ్ని పరీక్ష, రాములువారు ఆమెను అడవులకు పంపించటం ఇదంతా అధర్మం అని కొంతమంది అంటుంటారు కదా ఆ విషయం గురించి నాకు తెలిసిన అభిప్రాయములు చెప్పుకుంటానండి .


.ఇంతకుముందు హరిశ్చంద్రుల వారి కధలో చెప్పుకున్నట్లు వారు తమ ప్రజలకు ధర్మం యొక్క విలువను తెలుపుటకు తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు , శ్రీ మహావిష్ణువు లోకపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి.... లోకంలోని ప్రజలను అధర్మం నుండి రక్షించుటకు ఎన్నో అవతారములు ధరించి ,ఎన్నో కష్టములు సహించి లోకములను రక్షించారు. అందుకోసం మత్స్యావతారం, కూర్మావతారం వంటి అవతారములను కూడా ధరించారు. శ్రీ రామావతారములో శ్రీ లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవితో కలసి ఎన్నో కష్టములను అనుభవించి లోకులని రాక్షసులు బారి నుండి కాపాడారు. సీతారాములు ఆదర్శ దంపతులు.


రాములువారు ఏమి తప్పు చేశారు? తన భార్య కష్టముల పాలైనప్పుడు ఆమెకోసం ఎంతో ఆరాటపడి, రక్షించుకున్న మంచి భర్త. ఆ సందర్భములో ఎంతోమంది రాక్షసులను కూడా సం హరించారు.. రాములవారికి తాను విష్ణుమూర్తి అవతారమని తెలుసు. సీతమ్మ వారి జాడ తెలియని సందర్భములో ఆమె కోసం ఎంతో విలపించారు. దేవతలకు కూడా సుఖః, దుఃఖములు ఉంటాయి కదా!


ఇక సీతమ్మవారి అగ్ని పరీక్ష గురించి అంటే రాముల వారికి తమ అవతార రహస్యం గురించి తెలుసునట. సీతమ్మ మహాసాధ్వి అనీ తెలుసు. ఆమెకు ఏమీ కాదనీ తెలుసు. అందుకే అలా చేసిఉంటారు. లోకుల సంగతి ఆయనకు ముందే తెలుసు.


ఈ కలికాలంలోనే దైవభక్తి కలవారు ఎంతో మంది , ధ్యానం, తపస్సు, యోగా చేసేవారు ఎన్నో మహత్తులు చూపిస్తున్నారు.
ఒక యోగి ఆత్మకధలో ఎంతో మంది ఈ నాటి యోగుల గురించిన ఎన్నో మహత్యములను గురించి తెలుసుకున్నాము. మరి సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారమయిన సీతమ్మ వారికి అగ్నిపరీక్ష వల్ల ఏ ఆపదా రాదని రాముల వారికి తెలుసు.


శ్రీ షిరిడి సాయిబాబా వారి కధలో కూడా ఆయనకు ఖండ యోగం అనే మహాధ్భుత విద్య తెలుసునని చెప్పబడింది.
అంటే ఖండయోగమనగా శరీరావయవములన్నియు విడదీసి తిరిగి కలుపుట. ఇలాంటి మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్, టి.వి ఇలాంటివి తెలియని మారుమూల తెగల ప్రజలకు వాటి గురించి చెబితే అస్సలు నమ్మరు. అలాగే ఇవి కూడా.మనకు తెలియక వాటి గురించి నమ్మలేకపోతున్నాము.



సరే అలా సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడండి.........వారిని ఒక పామరుడు తప్పుపట్టాడు. ఇది ఏమి న్యాయము? ఇలాంటి కొంతమంది గురించి ఆలోచించే రాముల వారు సీతమ్మవారి అగ్నిపరీక్షకు ఒప్పుకుని ఉంటారు.


.సీతమ్మవారు కూడా మరి తాను వనవాసం చెయ్యవలసిన అవసరం లేకపోయినా రాజభోగాలు అన్నీవదలి భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. కష్టాలు అనుభవించారు. ఆమె ఎంతో ఉత్తమ ఇల్లాలు.


ఇక సీతమ్మను అడవులకు పంపించటం. ......... ఇక్కడ గమనించవలసినది ఏమంటే ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు. అప్పటి పాలకులు చాలా సెన్సిటివ్ గా ఉండేవారు మరి.


ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...


అసలు అప్పుడు కూడా రాములవారు ఆమె గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారంట.
వాల్మీకి మహర్షి వద్ద ఆమె సురక్షితముగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశారట. అడవులకు పంపించటానికి ముందే వ్యాసులవారికి ఈ విషయం రాములు వారు తెలిపారట. అప్పట్లో ఒకరితో ఒకరు మనసు ద్వారా విషయములు తెలుసుకోవటం అనేవి ఉండేవంట. తపశ్శక్తి ద్వారా ఇది సాధ్యమట. ఇప్పుడు టెలిపతి అనే దానికి దగ్గరగా అర్ధం వస్తుందేమో. ...... సరే ముందే విషయం తెలియటం వల్ల వాల్మీకి మహర్షి వచ్చి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్ళారని పెద్దలు చెబుతున్నారు.


రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి. సీతారాములు ఆదర్శ దంపతులు. .

భగవంతుని దయ. .... 

 

Wednesday, July 14, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు ....అంతా ధర్మమే..... పురాణములు ఎంతో గొప్పవి .... ఐదవ భాగము.........

ఓం శ్రీ సాయి.

హరిశ్చంద్రుల వారి కధ నుండి నాకు తోచిన ఇంకొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ కాలం వాళ్ళు కొంతమంది అనుకుంటారు..... సత్యవాక్పరిపాలన ఇంత గట్టిగా పాటించాలా అని ....

 ఆ కధలో .... కాశీ పండితులవారు తన భార్య సుకుమారి కాబట్టి, పిల్లలతో... పని అంతా చేసుకోలేకపోతోంది అని చెప్పి హరిశ్చందులవారి భార్యను, కుమారుని పరిచారకులుగా కొనుక్కున్నారు గదా..... భార్యను, కుమారుని అలా అమ్మటం చాలా దారుణమైన విషయమని హరిశ్చంద్రుల వారికీ తెలుసు. దానికి వారు ఎంతో బాధపడ్డారని కూడా మనం చెప్పుకున్నాం.


అయితే రాజంతటి వారే మాట తప్పితే ఇక ప్రజలు సత్యం అన్నది పాటించరని ........ ఇక ప్రజలందరు రోజూ అబధ్ధాలే చెబుతూ ఒక అబధ్ధం కప్పిపుచ్చటానికి ఇంకో అబధ్ధం ....... ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఇక ధర్మం నిలబడదు. అంతా అధర్మం, అవినీతి మయం అయిపోతుంది. ఇన్ని ఆలోచించి ఆయన ప్రజలనందరిని పాపాత్ములను చేయకుండా ఉండటానికే తన కుటుంబం అష్టకష్టాలు పడినా భరించారు. అప్పటి పాలకులు ప్రజలను అలా చూసుకునేవారు.


ఇంకో విషయమండి. ప్రజలు చేసే పాపంలో పాలకులకు ఇంతని వాటా వస్తుందట. ఆ ప్రజలు చేసే పాపం పాలకులను పరలోకంలో కూడా పట్టి పీడిస్తుందట. . అందుకే అప్పటి మంచి పాలకులు ప్రజలు పాపపు పనులు చెయ్యకుండా పనికట్టుకుని చూసుకునేవారట. ఇది పెద్దలు చెప్పిన విషయం. 


 ఇంకోటి ,అసలు హరిశ్చంద్రులవారు విశ్వామిత్రుల వారికి కావాలని రాజ్యాన్ని దానం చెయ్యలేదు.


ఒకప్పుడు హరిశ్చంద్రుల వారు ఆపదలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు మారు వేషములో ఆయనను రక్షించారు. ఆ సంతోషములో ఆయన ఏదైనా కోరుకో ఇస్తానని అంటే విశ్వామిత్రుల వారు ఇంత పెద్ద కోరిక కోరుకున్నారు. దానికి వేరే కారణాలున్నాయని మనకి తెలుసు కదా....అది ఇంకో కధ.


హరిశ్చంద్రుడు ఆ తపస్వి ఏదో సాధారణ దానం అడుగుతారని అనుకున్నారు గాని ఇదంతా ఊహించలేదు. ఒకోసారి అంతే. ఇలాగే జరుగుతుంది. అయితే విశ్వామిత్రుల వారి వల్ల హరిశ్చంద్రునికి మంచే జరిగింది. వారి పేరు ఈ నాటికి మనము చెప్పుకుంటున్నాము.

అందుకే అందరూ మంచిపనులు చేస్తూ దైవాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ మనము రక్షించబడతాము.. 


Monday, July 12, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు అంతా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి నాలుగవ భాగం ........ ...

ఇవాళ ఇంకో విషయం చెప్పుకుందామండి.

ఓం నమః శివాయః దుర్గాదేవికి నమస్కారములు..

కొంతమంది ఇలా అంటుంటారు. ఒకాయన తన మాట కోసం ఆలిని అమ్మేసాడు, ఒకాయన ఆలిని అగ్ని పరీక్షకు గురిచేశాడు అని , ఒకాయన జూదం లో ఆలిని పణంగా పెట్టాడు అని.....దీని గురించి కొంచెం చెప్పుకుందామండి.


హరిశ్చంద్రుడు
ఉన్నారు. ఒకానొక సందర్భములో ఆయన సత్యవాక్పరిపాలన కోసం విశ్వామిత్రులవారికి తన రాజ్యాన్నిఇచ్చివేయాల్సి వచ్చింది. దక్షిణ కోసం కొన్ని బారువుల బంగారాన్నీ ఇవ్వటం మిగిలింది. దానికోసం ఆయన తనభార్యను, కుమారుని అమ్మిన మాట వాస్తవమే.

ఇది కొంచెం విచారించదగ్గ విషయమే, కానీ అప్పటి ప్రత్యేకమయిన సందర్భములో ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అప్పటికి తమకు తోచిన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు... ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అన్ని కష్టాలను అనుభవించారు..



అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. వివాహ సందర్భములో భార్యాభర్తలు తాము జీవితములో కష్టసుఖాలనుకలసి పంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు కదా.....ఉదాహరణకు సంపదలు బాగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అందరూసుఖభోగాలను అనుభవిస్తారుగదా! అలాగే ఆపదలలో వచ్చే కష్టాలను అందరూఎదుర్కోవాలి కదా.....



.అలాగే హరిశ్చంద్రుడు కష్టములో ఉన్నప్పుడు భార్యగా చంద్రమతీ దేవి హరిశ్చంద్రునితో తానే సలహా చెప్పటం జరిగింది ....తననిపరిచారికగా ఎవరికయినా ఇచ్చి వచ్చే సొమ్ముతో రుణం తీర్చమని... నిజంగా ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలు.
తానుపుట్టింటికి పోయి భర్త యొక్క పరిస్థితి చక్కబడ్డాక రావచ్చులే అని ఆమె అనుకోలేదు .. . సందర్భములో వారు ఎంతోబాధపడ్డారు. అయినా కూడా దంపతులు ధర్మాన్ని వీడలేదు.



కాశీలోని ఒక పండితునికి బార్యాబిడ్డలను అమ్మిన సందర్భములో హరిశ్చంద్రుడు పడ్డ బాధ వర్ణనాతీతం తన వలనసుకుమారులయిన తన భార్యాబిడ్డలు ఇంత కష్ట పడుతున్నారుగదా అని ఎంతగానో విలపించారు. తరువాతఆయనేమీ వారిమానాన వారిని వదిలేసి తాను రాజభోగాలను అనుభవించలేదు. ఇచ్చిన మాటకోసం తానుకూడాచండాలుని రూపంలో ఉన్న యమధర్మరాజుకు కాటికాపరిగా అమ్ముడుపోయారు.. .

 

 ఆతరువాత కొంతకాలానికి వారికుమారుడు పాముకాటుతో చనిపోవటంతో అందరూ శ్మశానములో కలుసుకున్నప్పుడు విరక్తితో శరీర త్యాగం చేసుకోబోతుంటే వారి సత్యవాక్పరిపాలనకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమయ్యి వారి కుమారుని బ్రతికించి అందరినిఅనుగ్రహించారు.



రోజుల్లో మరి సత్యం అంటే అంత గౌరవంతో పాటు మాట తప్పితే అందరికి కష్టాలు వస్తాయని కూడా నాటి వారుభావించేవారు. .. .... ఇంతటి సత్యవాక్పరిపాలన , త్యాగం రోజుల్లో మనవల్ల కానిపని .... కానీ ఇందులో కొద్దిగాపాటించినా చాలు లోకం ఎంతో బాగుపడుతుంది.


రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలకే హత్యలు, ఆత్మహత్యలు తరువాత పిల్లలు అనాధలవటం ఇలాంటివితగ్గుతాయి. అనాధలు ఎక్కువ కావటానికి తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా ఒక కారణమని నా అభిప్రాయం....



.ఇందులో మనము అయ్యో హరిశ్చంద్రుడు భార్యను ఎంత ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా .... భార్యాభర్తలుసంపదలలోనే కాదు,....ఆపదలు వచ్చినప్పుడు కూడా అంతే ఐకమత్యముగా ఉండాలని.. పెద్దలు మనకు చెప్పారనిఅనుకోవచ్చు కదా...............

అయితే ఇది కలికాలం కాబట్టి అమ్ముడుపోవటం లాంటి సాహసాలు ఏమీ ఆడవాళ్ళు చెయ్యక్కర్లేదు కానీ భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు.

 

Friday, July 9, 2010

పురాణములు ఎంతో గొప్పవి ....మూడవ భాగం...... ....

 

పురాణములలోని కధలనుంచి మనము ఎన్నెన్నో విషయములు నేర్చుకోవచ్చు.

శ్రీ వల్లీ శ్రీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారములు..



ఉదాహరణకు రామాయణం విషయములో చూస్తే శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించటం, రావణాసురుణ్ణి సం హరించటం ఇదంతా ముందే ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాము. జయ,విజయుల శాపం కధ కూడా మనకు తెలిసిందే.


అయితే పురాణములద్వారా మనము జీవితములో ఎలా ప్రవర్తించాలి , ఎలా ప్రవర్తించకూడదు అన్నది కూడా తెలుసుకోవచ్చు అని నా ఉద్దేశ్యము. రామాయణములో చూడండి. ....సీతారాములు ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా ధర్మాన్ని వీడలేదు. ధర్మం కోసం వారు ఆ కష్టాలను తట్టుకున్నారు. అందుకే వారి సంతానము చక్కగా ఉండి రాజ్యమును పాలించారు.


అదే రావణాసురుడు మంచి దైవ భక్తుడే ,........ కొంతకాలం సుఖములను అనుభవించినా కూడా ......... తరువాత తన అధర్మ ప్రవర్తన ,, అత్యాశ ఇలాంటి కారణాల వల్ల తాను నాశనం అవటమేకాక తనతోపాటు తన బంధువులు, సంతానము ఇలా అందరి నాశనానికి కారకుడయ్యాడు. ధర్మమును అనుసరించిన విభీషణుడు రాజ్యాన్ని పాలించాడు. .



దీనివల్ల నాకు ఏమనిపిస్తుందంటేనండి......మనము జీవితములో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టే మన తరువాతి తరాల వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్ని చెడ్డ పనులు చేసినా పరవాలేదు. కొన్ని మంచిపనులు చేస్తే ఆ పాపం కొట్టుకుపోతుందిలే అని. మరి రావణాసురుడు అంత భక్తుడయినా కూడా .... ఆయన చేసిన పాపం కొట్టుకుపోలేదు. పాప,పుణ్యాలలో దేని లెక్క దానిదే ........


భగవంతుడు కరుణామయుడే ...... కానీ ఎంత చెప్పినా వినకుండా అధర్మంగా ప్రవర్తించేవాళ్ళను ఎంతవరకు సహించాలి?.


రావణాసురుడు మారటానికి ఆ దైవం ఎన్నో అవకాశములు కల్పించి , ఎంతోకాలం గడువిచ్చినా కూడా , ........ ఆయన తన ప్రవర్తన మార్చుకోలేదు కాబట్టే ఆ దైవం ఆయనను శిక్షించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది తమ అంతులేని కోరికలకోసం అత్యాశతో ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారు. నైతిక విలువలను కూడా పాటించుట లేదు .


ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ నాటి మానవులు చాలామంది తమకు ఏమి కావాలో సరిగ్గా తెలుసుకోలేక ఏదో తాపత్రయముతో తమ సుఖం కోసమని ప్రపంచాన్ని, అందులోని ఇతర జంతుజాలాన్ని నాశనం చేస్తున్నారు. ఈ ప్రపంచం పైన సర్వ హక్కులు తమవే అని ఈ నాటి మానవులు అనుకుంటున్నారు. ప్రపంచాన్నీ అల్లకల్లోఅలం చేస్తున్నారు. ఇంతచేసినా ఎవరికీ మనశ్శాంతి లేనేలేదు.


కొంత కాలం తరువాత మనముండము. కాని ఆ విషతుల్యమయిన ఫలితాలను అనుభవించాల్సింది మన సంతానమయిన మన పిల్లలే..........
.. ఏమో ఇప్పుడు అధర్మంగా ప్రవర్తించిన వారే పాప ఫలం అనుభవించటానికి తరువాతి తరంలో పుట్టొచ్చు కూడా .......ఇదంతా ఎందుకు లెండి .......

అంతా భగవంతుని దయ .

 

Wednesday, July 7, 2010

పురాణములు ఎంతో గొప్పవి....రెండవ భాగము....

 

ఆంజనేయస్వామికి నమస్కారములు.
వేదములు, పురాణములు వీటిగురించి మనము పూర్తిగా తెలుసుకోవటం అసాధ్యం కదండి ......... అలాంటప్పుడు మనము త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదని నా అభిప్రాయమండి. వేదములు పరమాత్మ ప్రసాదములు ( ప్రసాదితములు ). అందుకనే మనము వేదములను గౌరవించాలి . .....  

పరమాత్మ (శ్రీ మన్మహాదేవి,శ్రీ మన్మహాదేవుడు) దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పరమాత్మకు నమస్కారములు.


పురాణములు వాటిలోని కధలను మనము చిన్నతనములో చదివినప్పుడు ఒక అర్ధం లో గోచరించవచ్చు. అదే మనకు వయస్సు పెరిగి బుధ్ధి పరిపక్వత చెందేకొద్దీ సత్యం కొంచెం కొంచెముగా అర్ధమవుతూ ఉంటుంది. అందుకని త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదు. అందుకే తరాలు మారినా అందులోని అర్ధములు అనంతములు. పురాణములలో చాలా లోతైన గొప్ప విషయాలుంటాయి. అవి పండితులకు మాత్రమే అర్ధమవుతాయి. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు, నాకు అవి అర్ధం కావు కాబట్టి. నాకు తెలిసిన సామాన్య విషయాలే రాయటం బాగుంటుంది లెండి .


ఇప్పుడు ....... బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తారు కదా. సృష్టి రచనకు విజ్ఞానం అవసరం. అందుకే వారికి భార్యగా చదువుల తల్లి సరస్వతీ దేవి ఉండటం ,......మరి మహా విష్ణువు పాలన చేస్తారు. అందుకే వారికి సంపదలనిచ్చే తల్లి మహాలక్ష్మీ దేవి భార్యగా ఉండటం., ...... అలాగే పరమశివుడు సం హారాన్ని చేస్తారు గదా... అందుకే వారికి శక్తి స్వరూపిణి తల్లి పార్వతీ దేవి భార్యగా ఉండటం ......... ఇవన్నీ ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో గదా.
అంటే సృష్టి రచనకు అగ్ని దేవుని భార్య స్వాహా దేవి పేరు కూడా అలాగే బాగుంది కదండి.


ఇక పురాణములలో సృష్టి ఎలా జరిగింది, ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట. నవగ్రహములు వాటిగురించి రామాయణము కాలంలోనే మనవారికి తెలుసు. ఒక్కొక్క గ్రహం వాటి విశేషాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి, ఇవన్నీ మన ప్రాచీన కాలం నాటి పెద్దలు చెప్పారుకదా. ఈ నవగ్రహముల లక్షణములు , ఇంకా నక్షత్రములు, వాటి ఆకారాన్ని బట్టి రాశులు, పంచాంగం ఇలా ఏర్పరిచారుగదా... పంచాంగం ప్రకారమే గ్రహణములు, గ్రహసంచారము ..... అంటే ఏ గ్రహము ఆకాశములో ఎక్కడ ఉంటుందన్నది, ఇలాంటివి ఎంతో ముందు చెప్పగలుగుతున్నారు.


ఇంకా పురాణములలో పాత్రల ద్వారా పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని కూడా తెలియచేశారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తారు ..... ఇలాంటివన్నీ మనము ఆ కధల ద్వారా తెలుసుకోవచ్చు.


ఇలాంటి గొప్ప గ్రంధములు వారసత్వముగా కలిగినందుకు మనము గర్వపడాలి గాని చాదస్తం అనుకోవటం తప్పు కదండి..

 

Monday, July 5, 2010

పురాణములు ఎంతో గొప్పవి........ ...

 
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ విష్వక్శేనాయ నమః.


మన వేదములు ,పురాణములు చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ అని నా అభిప్రాయము. వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు, సామాన్య విషయాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.

కధలతోపాటు వాటిని మన మన ప్రాచీనకాలపు పెద్దలు సంకేతరూపములో మనకు అందించారని ఈ నాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. అందులోని విషయాలను గురించి పెద్దలు చెప్పేవి వింటుంటే చాలా ఆశ్చర్యముగా ఉంటుంది. అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు చాలా బాధగా ఉంటుంది.


ఆ దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు(బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిలోని మానవులం మనమెంత... మన బ్రతుకెంత. ...... ......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము. సారి అండి ఇలా అంటున్నందుకు. ..


ఇలాంటి పెద్ద విషయముల గురించి నాకు అస్సలు పాండిత్యము లేదు. కాని నా సామాన్య బుధ్ధికి తోచిన విషయాలు మీకు చెప్పుకోవాలని నా తాపత్రయం. నా భాష కూడా సామాన్యుల భాషే. సరిగ్గా తెలియని విషయాలు రాయటానికి భయంగానే ఉంది గాని తప్పులను భగవంతుడు క్షమిస్తారులే అన్న ధైర్యముతో ఇలా చెప్పుకుంటున్నాను.


. ఉదాహరణకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు విఘ్నాధిపతి కదా. . వీరిని ఆరాధిస్తే మనకు వచ్చే విఘ్నముల నుంచి మనలను కాపాడుతారు. .. వారి భార్యల పేర్లు శ్రీ సిధ్ధి అమ్మవారు, శ్రీ బుధ్ధి అమ్మవారు అని పెద్దలు చెపుతున్నారు. . అసలు ఆ పేర్లు చూడండి ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో. మనము వీరందరిని ఆరాధిస్తే అన్ని విషయములలో విఘ్నములు తొలగి వారి అనుగ్రహముతో మనకు మంచి బుధ్ధి, కార్య సిధ్ధి కలుగుతుంది అన్నమాట.. . ......(   .. అష్ట  సిద్ధులు  వంటివి  కూడా  కలిగే  అవకాశముంది అనుకోవచ్చేమో...)


శ్రీ గణేశుల వారి గురించి ఎంతోమంది ఎన్నెన్నో విధములుగా గొప్పగా వర్ణించారు. అందులో కొద్దిగా కూడా నాకు రాదు కానీ , ఆ స్వామి గురించి నాకు అనిపించిన భావాలలో ఒకటి .......... మనము ఈ విధంగా కూడా భావించవచ్చు కదా అనిపించి ఇలా ...............



Friday, July 2, 2010

జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం..........

 
ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.

ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.


*****
బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}


శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...


ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలి. ఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి. అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి.


 ఆ...మర్చిపోయానండి ....ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.ఇలా రోజూ ఉదయమే ఒకగ్లాస్ త్రాగాలి. ఒక  వారం  రోజులు త్రాగాలి.

ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.


..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు. సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.


కొంతమందికి
జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా,  వారం రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.

అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి  వారం  రోజులు వాడితే మంచిది. రోజుల్లో స్వైన్ ఫ్లూ ఇలాంటి వాటి వల్ల జలుబు అవి లేకుండా చూసుకోవాల్సివస్తోంది కదా...


.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు ,దగ్గుతో చాలా బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ కూడా బాగా పనిచేస్తుందండి..


ఈ రోజుల్లో కొంతమందిపేరెంట్స్ పిల్లలను ఒకటవ తరగతి నుండే హాస్టల్ లో వేసేస్తున్నారు. {అది వారి మంచి కోసమేనట?} మరి అక్కడ ఇలాచేసి ఇవ్వటం కుదరదు కదా.......ఎందుకులెండి...టాపిక్ మార్చటం బాగుండదు మళ్ళీ.......................


************

ఈ కషాయం నెలకు 5 లేక 6 లేక 7  రోజులు వాడాలి. ఎక్కువరోజులు వాడితే వేడి చేస్తుంది.  

ధనియాలు, పసుపు, అల్లం, వెల్లుల్లి..వంటివి తగు మోతాదులో వాడుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఎక్కువమోతాదులో వాడితే అనారోగ్యం కలుగుతుంది. 

మందు అంటే తగుమోతాదులో మాత్రమే వాడాలి.

( నాకు తెలిసినంతలో రాసాను. ఎంతకాలం వాడాలనే విషయం గురించి  మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే  ఆయుర్వేదవైద్యులను సంప్రదించవచ్చు.)