koodali

Sunday, March 18, 2018

ఓం,

ఓం,

దైవానికి  అనేక  వందనములు,సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన  పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.అందరికి శ్రీ  విళంబి  నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.వసంత  నవరాత్రులు  ప్రారంభమయ్యాయి.మహారాష్ట్రీయులు  ఏ  శుభకార్యక్రమము  ప్రారంభించిన  ప్రప్రధమమున  శ్రీ  గణపతి దేవునితో  సహా  నవగ్రహాలు, ముఖ్యముగా  శనేశ్వరుణ్ణి  పూజించటము  అనాదిగా  వస్తున్న  సుసంప్రదాయము. చైత్రశుద్ధ  ప్రతిపాదా  (  గుడిపాడువ  )   అంటే  ఉగాది  పర్వదినమున శని శింగణాపూర్  లో  విశేష  ఉత్సవాలు  జరుగుతాయట.నూతన  సంవత్సరములో  ఆటంకాలు, అవరోధాలు,  కష్టనష్టాలు తొలగించి  సుఖశాంతులు  ప్రసాదించుమని  ఆ  కరుణాలవాలను భక్త  సముదాయము  శిరోధార్యులై  వేడుకుంటారట. అందరికి   శ్రీ  విళంబి  నామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలండి.
***************

( 2014 సంవత్సరములో వ్రాసిన ఉగాది పోస్టులోని విషయములతో..  ఇప్పటి తెలుగు సంవత్సరము   పేరు  వేసి  పోస్ట్ చేయడమైనది.)

Friday, March 16, 2018

న్యాయస్థానాల ద్వారా న్యాయం .....


ఇక, తెగతెంపులు చేసుకోవటం  మినహా వేరే దారిలేని పరిస్థితి  వచ్చింది.
*********

చట్టసభలో  ప్రకటించిన హామీలను అమలుపరచడానికి ప్రజలు ఉద్యమాలు చేయవలసి రావటం, దీక్షలు చేయవలసి రావటం బాధాకరం .  

 రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీలను  అమలుపరచం..అనటం అన్యాయం.

సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగిందన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. 


మరి,  ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించకూడదో తెలియటం లేదు.


 న్యాయంగా రావలసిన హక్కుల కోసం కేంద్రాన్ని ప్రాధేయపడవలసిరావటం   బాధాకరం. 

 అవిశ్వాసం ద్వారా దేశంలోని ఇతర పార్టీలను  ప్రాధేయపడవలసిరావటం  కూడా  బాధాకరం.  అయితే, అవిశ్వాసం... తప్పని పరిస్థితి ఏర్పడింది.  


 ఏది ఏమైనా  ఇలాంటి  గందరగోళ  పరిస్థితులు ఏర్పడటం  అత్యంత బాధాకరం. 


* ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరగటం బాగుంటుంది.


***************

రాష్ట్రాలలో  ఎన్నో పార్టీలు.. ప్రజలు పార్టీల వారీ విడిపోయి గొడవలు పడటం..ఇదే ఇప్పటి రాజకీయం... . విభజించి పాలించు అనే సిద్ధాంతం.

తమిళనాడు  రాజకీయం  గందరగోళ పరిస్థితిలో ఉంది. ఏపీలో  అలాంటి పరిస్థితి రాకూడదు.  ఇక, ఇలాంటి పరిస్థితిలో  కర్నాటకలో ఎన్నికల ఫలితం  ఏమవుతుందో చూడాలి. 

******************

ఇక, ప్రత్యేక హోదా  విషయానికొస్తే,

  విభజన సందర్భగా..  చట్టసభ సభలో.. ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

 ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. కేంద్రంలో ఎవరున్నా ఇవ్వవలసి ఉంటుంది.

 కేంద్రంలో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి. 
అయితే అలా చేయలేదు. ఇస్తాం.. పరిశీలిస్తున్నాం..అంటూ చాలాకాలం తాత్సారం చేసారు.

 ఆ తరువాత చాలాకాలానికి హోదా ఇవ్వలేం ..ప్యాకేజ్ ఇస్తాం ..అంటూ తేల్చేసారు. 

అప్పటికే విభజన తో అయోమయంలో ఉన్న ఏపీ ప్రజలు ఇక చేసేదేమీలేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తారని నమ్మి ఒప్పుకున్నారు....


బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్యాకేజీకి మీరు ఒప్పుకున్నారు కదా ! అంటూ మాట్లాడుతున్నారు. .

ప్రత్యేక హోదా ఇవ్వము.. అని చెప్పినప్పుడు ప్యాకేజీకి ఒప్పుకోక ఏం చేయాలి ?

 నా విషయానికి వస్తే, ప్యాకేజ్ ప్రకటన నాకు బాగానే అనిపించింది. .. 


ఎందుకంటే, మనకు హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలలో కూడా హోదా గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది.   దేశంలో అలజడులు మొదలవ్వటం ఎందుకు ? ఎలాగూ  హోదా కు తగ్గని విధంగా  ప్యాకేజ్ ఇస్తామన్నారు కదా ! అనిపించింది.

అయితే,  ప్యాకేజ్  ద్వారా ఇచ్చేవి కూడా   సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల ...ఇప్పుడు తిరిగి అభిప్రాయం మార్చుకోవలసి వస్తోంది. 


హోదాతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఉంటాయని కొందరంటున్నారు. కొందరేమో ప్రత్యేక రాయితీతో పాటు  పన్ను రాయితీలు ఇవ్వరు ..అంటున్నారు. 

పన్నురాయితీలు లేని హోదా వల్ల పెద్ద లాభం ఉండదు కాబట్టి ..హోదా  అడిగే విషయంలో  ఇప్పుడయినా స్పష్టత  అవసరం. 


మొత్తానికి,  ఆంధ్రప్రదేశ్ రాష్టృ విభజన వల్ల  జరిగిన పరిణామాల వల్ల ఇకపై ఏ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నం  చేయకపోవచ్చు.
దేశంలో చాలా అవినీతి .....
ఇక అవినీతి విషయానికొస్తే,
దేశంలో చాలా అవినీతి జరుగుతోందన్నది నిజం.అవినీతి ఎక్కడ జరుగుతున్నా వ్యతిరేకించవలసిందే.
స్వాతంత్ర్యం వచ్చి చాలాకాలం గడిచినా కూడా దేశంలో పేదరికం ఎందుకు ఉంది?  


బ్యాంకుల సొమ్మును ఎగ్గొట్టి  విదేశాలకు పారిపోతున్న వారిపై ముందే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?  


 విదేశాలలో దాచబడిన  నల్లడబ్బును ఎంతవరకూ తిరిగి రప్పించారు ? దేశాన్ని ఎంతవరకూ స్వచ్ఛంగా మార్చారు? 


 గంగా నది ప్రవహించే రాష్ట్రాల పొడుగునా ఎన్నో వ్యర్ధాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి..అలా వ్యర్ధాలు, మురుగు..వంటివి గంగానదిలో కలవకుండా తీసుకునే చర్యలు ఎంతవరకూ వచ్చాయి?


 ఇతర నదులను శుభ్రం చేసే పని ఎంతవరకూ జరిగింది?
దేశంలో ప్రజలకు ఎంతవరకు పరిశుభ్రమైన త్రాగు నీటిని అందిస్తున్నారు? ఇలా ఇన్నో సమస్యలున్నాయి.


 అన్నిసమస్యలకూ..ప్రజలు,అధికారులు,ప్రభుత్వాలు... ఇలా అందరూ కారణం.

  ప్రజలు,అధికారులు, ప్రభుత్వాలు ..ఎవరి పనిని వారు సక్రమంగా,చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే దేశం దానికదే బాగుపడుతుంది.


  సమాజ పరిస్థితిలో మార్పులు రావాలంటే అందరిలో మార్పు రావాలి. అందరిలో నైతికత పెరగాలి.
****************


ఇక,ఎన్నికలలో ఎవరికి ఓట్లు వేస్తారనే విషయంలో కొన్నిసార్లు  ప్రజల పద్ధతి ఆశ్చర్యంగా ఉంటుంది.

  ఉదా..జయప్రకాష్ నారాయణ గారు నిజాయితీపరులని అందరికీ తెలుసు.
మరి,వారు పార్టీ పెట్టి ఎన్నికలలో నిలబడితే,వారి పార్టీని ప్రజలు గెలిపించలేదు కదా!   


 ************


కొన్నిసార్లు  కొన్ని  రాజకీయ  పార్టీల వల్ల  కూడా ప్రజలు  నిరాశ చెందవలసి వస్తుంది. 


ఉదా..ఆం ఆద్మీ పార్టీ ఆశయాలను విని ఎందరో సంతోషించారు. అయితే, ఆ పార్టీలో చేరిన కొందరి వల్ల పార్టీ పరిస్థితి అయోమయంగా అయింది.


 నేత నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు.సహచరులు కూడా సరైన వారై ఉండాలి. 


కొందరు సహచరులు ముందు నిజాయితీగా ఉండి, అధికారం వచ్చాక మారిపోతారు.


***************


సాధారణ ప్రజలు, అధికారులు, రాజకీయులు అందరూ ప్రజలే.
ఈ రోజుల్లో ఎన్నో సమస్యలకు కారణం ప్రజలలో నైతికవిలువలు  తగ్గటమే.


సహజసంపదను దోచేసేవారు కొందరైతే,  నల్లడబ్బు విదేశాల్లో దాచేవారు కొందరు.


రాజకీయుల్లో కొందరు అవినీతి చేస్తున్నారు.
అధికారుల్లో కూడా కొందరు చేసిన వందలకోట్ల అవినీతి వివరాలు బయటకు వస్తున్నాయి.
సాధారణప్రజలలో కూడా కొందరు  బాధ్యత లేకుండా స్వార్ధంగా ప్రవర్తిస్తున్నారు.
సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. కల్తీలు,  లంచాలు,  సంపద దోపిడీ..ఇలాంటి  విషయాల్లో  ఎవరికి దోచినంత వారు దోచుకుంటున్నారు.

............................

అయితే, సమాజంలో  ఎందరో  నిజాయితీపరులు  కూడా  ఉన్నారు.

 సమాజం మారాలంటే రాజకీయులు, అధికారులు, సాధారణ ప్రజలు అందరిలో నిజాయితీ ఉండాలి.
అయితే, ఎక్కువగా  ఇప్పుడు పరిస్థితి ఎలాఉందంటే ...సాధారణ ప్రజలు, అధికారులు,  ప్రభుత్వాలు అందరూ అందరే అన్నట్లుంది.


 ఇలాంటి పరిస్థితిలో సమాజాన్ని మార్చాలనుకోవటం  చాలా కష్టం. అన్నింటికీ దైవమే దిక్కు.


చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి. ....

 ఇప్పుడు  మాకు హోదానే కావాలని  చెబుతున్న ప్రజలు..

కేంద్రం వాళ్లు హోదా ఇవ్వము....ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించినప్పుడు... మాకు  ప్యాకేజ్ వద్దు , హోదానే కావాలని  గట్టిగా ఎందుకు చెప్పలేదు ? ఉద్యమాలు చేయలేదెందుకు? 


ఎందుకంటే హోదా ద్వారా కలిగే ప్రయోజనాలను ప్యాకేజ్ ద్వారా ఇస్తామని కేంద్రం వాళ్లు నమ్మకంగా చెప్పారు కాబట్టి , ప్రజలు నమ్మి ఊరుకున్నారు.


ఇప్పుడు  సరైన న్యాయం జరగటం లేదని గ్రహించి హోదా కావాలంటున్నారు.

***********

కేంద్రం హోదా  ఇవ్వము అని చెప్తున్నప్పుడు...మరి  ఏపీ ప్రజలు హోదా ఎలా సాధించాలనుకుంటున్నారు?


తెలంగాణా వాళ్లు కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే,  చివరకు వాళ్లకు హైదరాబాద్ తో కూడిన తెలంగాణా వచ్చి ఇప్పుడు సంపన్నరాష్ట్రం గా ఉన్నారు.


మరి  ఏపీ వాళ్ళు  హోదాకోసం  ఇప్పటినుంచి కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే ఎప్పటికో హోదా వచ్చినా ఏం లాభం? 

 కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే  రాష్టృ అభివృద్ధి  ఆగిపోవచ్చు. ఉద్యమాల వల్ల కొందరి  ప్రాణాలు  పోయే  పరిస్థితి కూడా ఉండవచ్చు. మరి ఏపీ ప్రజలు వీటన్నింటికీ సిద్ధంగా ఉన్నారా?  


***********************

అయినా   ఏపీ వాళ్ళ అభిప్రాయాలను  ఏ మాత్రం  పట్టించుకోకుండా  ఎవరి  ఇష్టప్రకారం వాళ్లు  రాష్ట్రాన్ని  విభజించటమే అన్యాయం.

 విభజన తర్వాత  ఆస్తుల పంపకాలలోనూ ఏపీకి అన్యాయం చేస్తున్నారు. హోదా వంటి వాగ్ధానాల విషయంలోనూ అన్యాయంగా మాట్లాడుతున్నారు.

*******************

 పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం విచ్చలవిడిగా హామీలిస్తుంటారు.

ఇక్కడ గమనించవలసిన  ఒక  విషయం ఏమిటంటే,

 ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు హామీలను ఇచ్చేటప్పుడు, కొన్నిసార్లు    కొందరికి ఎక్కువలాభం జరగగా... కొందరికి అన్యాయం జరుగుతోంది. 

 కొందరికి  లాభం జరగటం కోసం కొందరు ఎందుకు నష్టపోవాలి.  ఎవరికీ అన్యాయం జరగకూడదు. 


ఉదాహరణకు ..రాష్ట్ర విభజన  అనే తెలంగాణా సెంటిమెంటును గౌరవించారు.

విభజన వద్దన్న   ఆంధ్రప్రదేశ్  సెంటిమెంటును పట్టించుకోలేదు.  విభజన సమయంలో ఇచ్చిన హామీలనూ  సరిగ్గా  పట్టించుకోవటం లేదు.  


 ఇక్కడ గమనించవలసిన  ఇంకొక  విషయం ఏమిటంటే... రాజకీయపార్టీలు  ఎన్నికలప్పుడు  ఇష్టం వచ్చినట్లు  హామీలను ఇస్తారు. 

 వాగ్ధానాలు చేసి ,  గెలిచిన తరువాత , తాము  ఇచ్చిన న్యాయమైన  హామీలను  పట్టించుకోని  పార్టీలపై  చర్యలు తీసుకునే  పరిస్థితి ఉండాలి. 


Wednesday, March 14, 2018

కొన్ని విషయములు....ఈ మధ్య మేము ఊరు వెళ్ళి వచ్చాము. 

******************

స్వాతంత్య్రం  వచ్చి చాలా  సంవత్సరాలు గడచినా  కూడా  .... సమాజంలో నిత్యావసరాలు తీరని వారు ఎందరో ఉన్నారు. ఆహారం,ఆవాసం, వైద్యం..వంటి నిత్యావసరాలు తీరటం ఎంతో ముఖ్యం.


 పేదవారికి తక్కువ ధరలకే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని క్యాంటీన్ల ద్వారా అందిస్తే బాగుంటుంది. 


మన పెద్దవాళ్లు కూడా అన్నదానం ఎంతో గొప్పదని తెలియజేసారు. 

ఉచితంగా కాకపోయినా , తక్కువధరకు ఆహారాన్ని అందించగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 

..................


ఇక , ఉండటానికి  నిలువనీడలేక ఫుట్ పాత్లపై కాలం గడుపుతున్నవారూ ఎందరో ఉన్నారు.ఇలాంటి వారికి ఆవాసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.  కొన్ని నగరాలలో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటారు. ఇలాంటి చోట్ల నామమాత్రము రుసుము తీసుకుని  ముఖ్యంగా రాత్రి సమయంలో ఉండటానికి  ఏర్పాటు ఉందట.


 ఈ విధానాన్ని మెరుగుపరిచి కొన్ని మార్పులుచేర్పులు చేసి పేదవారికి కొంత నీడను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.


 ఇలాంటి చోట్ల ఉచిత వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
...................

ఇవన్నీ చేయటానికి  బోలెడు డబ్బు ఖర్చు అవదు. ఒకవేళ డబ్బు ఖర్చు అయినా కూడా ఫరవాలేదు. 

  ఎన్నో పధకాలు ఉన్నాకూడా,  దేశంలో  పేదరికం ఇంకా  పోలేదు . ఇందుకు  ఎందరో బాధ్యులు. 


పేదలు అగచాట్లు పడకుండా ఆహారం, ఆవాసం, వైద్యం...ఏర్పాటు చేస్తే  పేద వాళ్లు కూడా ఉన్నత స్థానానికి ఎదగటానికి ఉపయోగపడుతుంది.

(Friday, July 3, 2015


నిత్యావసరాలు తీరటం ముఖ్యం...)

 ****************

భారతదేశం ఇలా కావడానికి చాలామంది బాధ్యులు. రాజకీయులు, అధికారులు, ప్రజలు వీళ్ళలో మంచి వాళ్లు ఉన్నారు కానీ ,  స్వార్ధపరులు చాలామందే ఉన్నారు.  

 చాలామందిలో  స్వార్ధం పెరిగిపోయిన ఈ రోజుల్లో దేశం ఇలా కాకుండా ఎలా ఉంటుంది.


 

Tuesday, March 6, 2018

రోడ్ల మధ్యలో డివైడర్......

కొన్ని చోట్ల రోడ్లను వెడల్పు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడానికి చాలా వెడల్పు గా స్థలం వదులుతున్నారు.


  డివైడర్ కొరకు వదిలిన స్థలంలో  తారు రోడ్డు  పైనే మట్టి పోసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మొక్కలు నాటినా   సరిగ్గా పెరగవు. 


డివైడర్  కొరకు వదిలిన  స్థలం లో ఉన్న  కంకర రోడ్డు తవ్వి , మట్టి  పోస్తే మొక్కలు పెంచడానికి బాగుంటుంది. అంతేకానీ,   తారురోడ్డుపైనే మట్టి  పోయడం  ఎందుకో తెలియటం లేదు. 


ఇలా చేయడానికి ఏమైనా కారణాలున్నాయేమో తెలియదు  కానీ, 

ఎలాగూ ఇంత కష్టపడి రోడ్లు వెడల్పు చేయటం,  డివైడర్లు  ఏర్పాటు  చేస్తునప్పుడు ... డివైడర్ స్థలంలో మొక్కలు  పెరగాలంటే క్రింద ఉన్న కంకరను తవ్వి మట్టి  పోస్తే ,  వేర్లు భూమిలోకి వెళ్లి  మొక్కలు  చక్కగా పెరుగుతాయి కదా ! అనిపించింది. 
*****************

రోడ్డు ప్రక్కన అటూఇటూ  చెట్లు పెంచితే ఎన్నో లాభాలున్నాయి. నీరు  కావాలంటే   మురుగునీటిని శుద్ధి చేసి  ఆ   చెట్లకు పోయవచ్చు. 

అయితే, వైజాగ్లో  హుద్ హుద్ వల్ల  పడిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు పెంచారట. 

 క్రొత్తగా పెంచినవి  ఏవో కొత్త  రకాల చెట్లట. వాటివల్ల  రోడ్లపై వెళ్ళే వారికి శ్వాసకోశవ్యాధుల వంటివి వస్తున్నట్లు  అనుమానంగా ఉందనీ, అందువల్ల నాటిన వాటిని తొలగించాలన్నట్లుగా  కొన్ని వార్తలు వచ్చాయి. 

కొత్తగా మొక్కలు నాటేటప్పుడు మనకు   తెలియని క్రొత్త రకాలను నాటడం కన్నా,  మనకు  పాతకాలం నుంచి తెలిసిన   ఆరోగ్యకరమైన రకాలను  నాటడం మంచిది.

 

 


Monday, February 26, 2018

అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి....


ఈ రోజులలో  సరైన  ఉపాధి అవకాశాలు  లేక ఎందరో ప్రజలు   ఇతర రాష్ట్రాలకు ,  విదేశాలకు వెళ్లి అక్కడ ..ఇబ్బందులు  పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.  


అందువల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు  అభివృద్ధి చెందాలి. ఎక్కడికక్కడ   విద్య మరియు   ఉపాధి లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 


స్థానికంగా మా ఉద్యోగాలు మాకే  కావాలి.... అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న  పరిస్థితిలో .. ఎక్కడివారికి అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించటం  తప్పనిసరి.
 

మనవాళ్ళు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించాలి.  రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే  సంస్థలు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. 


*******

పరిశ్రమలతో పాటు వ్యవసాయరంగం కూడా అభివృద్ధి చెందాలి. 


సారవంతమైన నేలలు,  ఎన్నో నదులు,  శ్రమించే వ్యక్తులు ఉండి కూడా ..ఇప్పటికీ  భారతదేశం   పప్పుదినుసులను ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండటం  స్వయంకృతాపరాధం.

 పండించిన పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక  పండిన పంటలు పాడైపోతున్నాయి .  పండించిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలను కల్పిస్తే , ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఎంతో ధనం వృధా కాకుండా ఉంటుంది. 

 ఆహారపదార్ధాల తయారీ సంస్థల ద్వారా కూడా ఎందరికో  ఉపాధి  లభిస్తోంది.


ఇప్పటి యాంత్రిక కాలంలో కొన్ని  పెద్దపెద్ద  పరిశ్రమలవాళ్ళు కూడా ...20 వేలమందికి ఉపాధి కల్పిస్తామని   సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది.


అయితే, కడియం తోటల పై ఆధారపడి సుమారు 20 వేలమందికి ఉపాధి లభిస్తున్నదని వార్తల ద్వారా తెలుస్తోంది.


**************


పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలనూ ప్రోత్సహించాలి...


 పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా  ఎన్నో దేశాలు  చాలా ఆదాయాన్ని పొందుతున్నారు. ఎంతో మందికి ఉపాధి  అభిస్తోంది. 


*************


దేశంలో పేదరికం పోవాలన్నా, అందరికీ ఉపాధి లభించాలన్నా,  ఆర్ధిక అసమానతలు తగ్గాలన్నా  మనుషుల్లో స్వార్ధం పోవాలి...  నల్లడబ్బు, అవినీతి వంటివి ఉండకూడదు. 


 సంపద కొందరి వద్దే పోగయ్యే పరిస్థితి పోయి , అందరికీ  సంపద పంచబడే పరిస్థితి ఉన్నప్పుడు పేదరికం ఉండదు.